పెథాయ్ : వేగం పుంజుకున్న తుపాను

ఫొటో సోర్స్, Imd
- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఇది ఇప్పుడు వేగం పుంజుకుని గంటకు 28 కిలోమీటర్ల చొప్పున తీరంవైపు వస్తోంది.
ఇది ఇప్పుడు శ్రీహరికోటకు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తెలిపింది.
తుపాను తీరం దాటే సమయంలో దాని వేగం గంటకు 80 కిలోమీటర్ల దాకా ఉంటుందని వివరించింది.
మరి కొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

తుపాను ప్రభావంతో ఇప్పటికే ఏపీ తీర ప్రాంతంలో వర్షాలు మొదలయ్యాయి. ఈదురుగాలుల ఉద్ధృతి కనిపిస్తోంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అనేక చోట్ల తీరం కోతకు గురవుతోంది.
ప్రకాశం జిల్లా చీరాల, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైనివాని లంక తదితర ప్రాంతాల్లో సముద్రం చొచ్చుకు రావడంతో తీర ప్రాంతం తల్లడిల్లిపోతోంది.

ఫొటో సోర్స్, Sankar
కోస్తాంధ్ర, పుదుచ్చేరిలోని యానాం జిల్లాలో ఆదివారం అత్యధిక చోట్ల వానలు పడతాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కోస్తాంధ్రలోని అత్యధిక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
తూర్పు గోదావరి, పశ్చి మ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో, పుదుచ్చేరిలోని యానాం జిల్లాలో కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం నమోదు కావొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Imd
ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
పెథాయ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో చేపడుతున్న ముందస్తు చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన చెప్పారు. హుద్ హుద్, తిత్లీ అనుభవాల రీత్యా బాగా పనిచేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. తాజా సమాచారాన్ని విశ్లేషించి, వెంటనే ప్రజలకు అందించాల్సి ఉందని తెలిపారు.
శాస్త్రీయ దృక్పథంతో సహాయ పునరావాస కార్యక్రమాలు, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. పునరుద్ధరణ చర్యల్లో స్థానిక ప్రజలను భాగస్వాములని చేయాలని సూచించారు.
అధికారులకు సెలవులు రద్దు.. పాఠశాలలకు సెలవు
ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోస్తా జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంకు నలుగురు ఐఏఎస్ అధికారులను పంపారు.
సహాయ చర్యల కోసం 25 డ్రోన్ బృందాలను ఏర్పాటు చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత మండలాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో పరిసర ప్రాంతాల నివాసితులు భయాందోళనలు చెందుతున్నారు. జిల్లాలో ముందస్తుగా 50కి పైగా పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Sankar
పశ్చిమ గోదావారి జిల్లా మొగల్తూరు, నరసాపురం, ఆచంట, యలమంచిలి మండలాల్లో అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆదివారం సాయంత్రానికి అనేకచోట్ల విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.
కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పాపికొండలకు విహారయాత్రను అధికారులు నిలిపివేశారు.

ఫొటో సోర్స్, Sankar
తాజా పరిస్థితిపై కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో ఏపీ ఉపముఖ్యమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమీక్ష నిర్వహించారు.
పెథాయ్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చినరాజప్ప బీబీసీకి తెలిపారు. 1996 తుపాను సమయంలో సమాచార, రవాణా వ్యవస్థలు సక్రమంగా లేకపోవడంతో అపార నష్టం సంభవించిందన్నారు. ప్రస్తుతం విద్యుత్, కమ్యూనికేషన్స్ రంగాలపై పూర్తిగా దృష్టి పెట్టామని తెలిపారు. తీర ప్రాంతంలోని సబ్ స్టేషన్ల వద్ద డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తుపాను తీరం దాటే సమయంలో సుమారు గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సెల్ టవర్లకు కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, దాంతో కమ్యూనికేషన్స్ విషయంలో ఆటంకం రాకుండా చూసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా జనరేటర్లు సిద్ధం చేసుకోవాలని సెల్ టవర్ల ఆపరేటర్లకు ఆదేశాలిచ్చామని మంత్రులు తెలిపారు.
ఆ 50 మంది మత్స్యకారులు సురక్షితం
ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన 50 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లభించడం లేదనే సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమయ్యింది. మత్స్యశాఖ, పోలీస్ అధికారులు సమన్వయంతో చేసిన ప్రయత్నంతో వారి ఆచూకీ లభించిందని ప్రకాశం జిల్లా మత్స్యశాఖ జేడీ బలరాం బీబీసీకి చెప్పారు.
మత్స్యకారులంతా సురక్షితంగా ఉన్నారని, వారితో మాట్లాడినట్టు వివరించారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో సమాచారం సమస్యలు వచ్చినట్టు వివరించారు. వారిని స్వగ్రామాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఫొటో సోర్స్, Sankar
ప్రజలు సహకరించాలి
సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, తుపాను తీరం దాటే సమయంలో విపత్తు ముంచుకొస్తున్న వేళ ప్రజలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. తాగునీరు అందుబాటులో ఉంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సముద్రంలో తుపాను కారణంగా బీచ్‌లన్నీ వెలవెలబోతున్నాయి. పర్యటకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కాకినాడ, పేరుపాలెం, మంగినపూడి సహా అన్ని బీచ్‌లలో పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.
ఈ తుపాను ప్రభావం కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందనే అంచనాలో వాతావరణ శాఖ ఉంది. దానికి తగ్గట్టుగా సిబ్బందికి సెలవులు రద్దు చేసి, ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కోనసీమ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆక్వాసాగు చేస్తున్న రైతులకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యవసాయదారులు కూడా సాధ్యమైనంత మేర తమ పంటను పరిరక్షించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. దానికి తగ్గట్టుగా ధాన్యం సేకరణ కేంద్రాలు 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల శాఖాధికారి రమేష్ తెలిపారు.
చెట్లకు సమీపంలో ఎవరూ ఉండవద్దని, పశువులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ అధికారులు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Imd
కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్
శనివారం ఆంధ్రప్రదేశ్, యానాంలకు భారత వాతవారణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ మెసేజ్ హెచ్చరిక కొనసాగుతోంది.
భారీ విపత్తు సంభవించే అవకాశం ఉన్నపుడు ఈ హెచ్చరిక జారీ చేస్తారు. ఈ అలర్ట్ జారీ చేస్తే విపత్తుకు అన్ని విధాలుగా ముందుగానే సన్నద్ధంగా ఉండాలి.
దీని తదుపరి దశ రెడ్ అలర్ట్. ఇది జారీ చేస్తే భద్రత, పునరావాస చర్యలు మొదలవుతాయి.
ఇవి కూడా చదవండి:
- "బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉంటే, పిల్లల పెంపకంపై ప్రకటనలు చూపిస్తారా?"
- ఎండోమెట్రియాసిస్: లక్షణాలు ఏంటి.. ఎంత ప్రమాదకరం?
- ఫేస్‌బుక్ చాట్‌తో పాకిస్తాన్ వెళ్లి జైలుపాలైన ముంబయి యువకుడు... నేడు విడుదల
- 'ఆ ప్రసాదంలో ఎవరో కావాలనే విషం కలిపారు'
- లబ్ డబ్బు: నోట్లు ముద్రించడంతో పాటు ఆర్బీఐ ఇంకా ఏం చేస్తుంది?
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- 'మహాత్ముడిపై అకారణ ఆరోపణలు చేస్తున్నారు' -గాంధీజీ ముని మనుమడు తుషార్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








