కర్నాటక: ఆ ప్రసాదంలో ఎవరో కావాలనే విషం కలిపారు- పోలీసులు, వైద్యులు

కాకులు

ఫొటో సోర్స్, ANURAG BASAVARAJ

ఫొటో క్యాప్షన్, ప్రసాదం తిని చనిపోయిన కాకులు
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్నాటకలోని ఒక ఆలయంలో పూజ అనంతరం ప్రసాదం తిని 11 మంది చనిపోయారు. మరో 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆహారంలో విషం కలపడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు, వైద్యులు వెల్లడించారు.

చామరాజనగర్ జిల్లాలోని సులవది గ్రామంలో మారమ్మ ఆలయంలో శుక్రవారం ప్రసాదం తిని 11 మంది చనిపోయిన ఘటనకు సంబంధించి స్థానిక వైద్యులు, పోలీసులతో బీబీసీ మాట్లాడింది.

ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రసాదంలో విషం కలిపి ఉంటారని, దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలున్నాయని వారు తెలిపారు.

bbc

చామరాజనగర్ జిల్లా వైద్యాధికారి కేహెచ్ ప్రసాద్ బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఆహారం కలుషితం కావడం లేదా విషంగా మారినపుడు చనిపోయేవారితో పోల్చితే తాజా ఘటనలో ప్రసాదం తిన్నవారు చాలా త్వరగా చనిపోయారని వివరించారు.

''అవును. బాధితులు అర్ధగంట లేదా.. గంటలో చనిపోతే అది కచ్చితంగా విషమై ఉంటుంది. అది ఆర్గానో పాస్ఫరస్ కాంపౌండ్ అయి ఉండొచ్చు. అలాగే చాలా మంది చనిపోయారంటే ఈ కాంపౌండ్‌ను పెద్ద మొత్తంలో కలిపారని అర్థం చేసుకోవాలి’’ అని వివరించారు.

ప్రసాదం, ఇతర నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపామని, ఇది ఉడికించిన ఆహారం కనుక స్పష్టమైన ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టొచ్చని ఆయన వివరించారు.

ప్రసాద్ ఒక్కరే కాదు, మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా ఈ ఘటన వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

bbc

ప్రసాదంలో నేరుగా విషం కలిపి ఉంటారని వారు అక్కడకు వచ్చిన మాజీ సీఎం సిద్ధరామయ్యకు వివరించారు.

అనంతరం సిద్ధరామయ్య విలేఖర్లతో మాట్లాడుతూ ఎవరో కుట్రపూరితంగా విషం కలిపి ఉంటారని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు.

ఆలయ కమిటీలో కొన్ని వివాదాలున్నాయని.. అయితే దీనికి కారణం ఏమై ఉంటుందన్నదానిపై తాను ఏమీ మాట్లాడలేమని స్థానిక టీచర్ సగైరాజ్ చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలన్నారు.

ఈ ఘటనపై తాము ఇప్పటికే అయిదుగురిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక ఎస్పీ ధర్మేంద్ర కుమార్ మీనా తెలిపారు. వీరిలో ముగ్గురు ఆలయ కమిటీ సభ్యులున్నారని వివరించారు.

ఆలయం

''మాకు ప్రసాదంగా టొమాటో రైస్ ఇచ్చారు. అది చెడు వాసన వచ్చింది'' అని ఆ పూజా కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మీడియాకు తెలిపారు.

''ఆ ప్రసాదం తినకుండా పారేసిన వారందరూ బాగున్నారు. దానిని తిన్న వారికి వాంతులు మొదలయ్యాయి. కడుపులో నొప్పి వచ్చింది'' అని వివరించారు.

గ్రామంలోని కిచుకుట్టి మారమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొనటానికి చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారని.. వారు తిరిగి వెళ్లేటపుడు వారికి ఈ టొమాటో అన్నాన్ని ప్రసాదంగా ఇచ్చారని మరొక ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

ఆలయంలో సోదాలు

ఫొటో సోర్స్, BBC'

చనిపోయిన 11 మందిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు మైసూరు ఐజీపీ హెచ్.సి.శరత్‌చంద్ర బీబీసీకి తెలిపారు.

అస్వస్థతకు గురైన వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మైసూరు ఆస్పత్రిలో పరామర్శించారు.

పారేసిన ప్రసాదాన్ని తిన్న కాకులు అక్కడికక్కడే చనిపోయాయి.

(ఫొటోలు: బసవరాజ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)