సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్: మనిషి గుండెను మరిచిపోయిన విమానం... మళ్ళీ వెనక్కి వచ్చింది

విమానం గుండె సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో అవయవ మార్పిడికి ఉద్దేశించిన ఒక గుండెను ప్యాసింజర్ విమానంలో మరిచిపోయారు. సియాటిల్ నుంచి డల్లాస్‌కు వెళుతున్న ఈ విమానాన్ని కొద్ది గంటల్లోనే వెనక్కి రప్పించారు.

కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రి నుంచి సియాటిల్‌కు ఆ అవయవాన్ని తీసుకొచ్చారని సౌత్‌వెస్ట్ ఏయిర్‌లైన్స్ తెలిపింది.

ఈ గుండెను ప్రత్యేకంగా ఒక రోగి కోసం తీసుకెళ్లడం లేదని, ఆసుపత్రిలో భవిష్యత్తు అవసరాల కోసం తరలిస్తున్నట్లు తెలిసింది.

విమానం డల్లాస్‌కు సగం దూరం వెళ్లిన తర్వాత కూడా సిబ్బంది ఈ విషయం గమనించలేదు. విమానం వెనుతిరుగుతోందని పైలట్ చెప్పిన వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యామని ప్రయాణికులు తెలిపారు.

కొంతమంది ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి ఒక మనిషి నుంచి తొలగించిన గుండెను మరో మనిషికి అమర్చేలోపు అది ఎంతకాలం పనిచేస్తుందో తెలుసుకోడానికి ప్రయత్నించారు.

నిపుణుల ప్రకారం మనిషి నుంచి తొలగించిన గుండె నాలుగు నుంచి ఆరు గంటల వరకు పనిచేస్తుంది.

ప్రయాణికుల్లో ఒక డాక్టర్ కూడా ఉన్నారు. ఈ అవయవ తరలింపులో ఆయన ప్రమేయం లేకపోయినప్పటికీ సియాటిల్ టైమ్స్ పేపర్‌తో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు.

విమానం తిరిగి సియాటిల్‌కు రావడంతో అందులో నుంచి గుండెను తరలించారు. అనుకున్న సమయంలోనే ఆ గుండె తిరిగి గమ్యస్థానానికి చేరిందని సియాటిల్ టైమ్స్ తెలిపింది.

‘మా కార్గో వినియోదారుడు సూచించిన సమయంలోనే గుండె గమ్యస్థానానికి చేరింది’ అని సౌత్‌వెస్ట్ ఏయిర్‌లైన్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

తరలింపులో ఆలస్యం జరిగినట్లు దాత కుటుంబం గుర్తించిందని సియోర్రా అవయవదాన సేవాసంస్థ ప్రతినిధి మౌనికా జాన్సన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)