గజ తుపాను: నెలసరి సమయంలో ఇంటికి దూరంగా ఒక గుడిసెలో ఉన్న బాలిక మృతి.. ‘ఆచారం పేరుతో ఆమెను శాశ్వతంగా దూరం’ చేసుకున్న తల్లి వ్యథ

- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత వారం గజ తుపాను తమిళనాడును కుదిపేసినప్పుడు ఒక కొబ్బరి చెట్టు కూలడంతో తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల విజయలక్ష్మి తల్లి భానుమతితో "అమ్మా నేను బతకను" అని చెప్పింది.
అప్పుడు ఆ బాలిక తంజావూరు జిల్లాలోని అనిక్కాడులో కొబ్బరిమట్టలు కప్పిన ఒక గుడిసెలో ఉంది. బాలిక వయసుకు రావడంతో గ్రామంలోని పురాతన ఆచారం ప్రకారం ఆ ఇంట్లో వాళ్లు బాలికను తమ ఇంటికి దూరంగా ఆ గుడిసెలో ఉంచారు, ఆ సమయంలో బాలిక పక్కనే నిద్రపోతున్న తల్లి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి సమయంలో మహిళలను ఇంట్లో దూరంగా ఉంచుతారు. ఏ పనీ చేయకుండా నిషేధం విధిస్తారు.
గజ తుపాను వల్ల తమిళనాడులో 46 మంది వరకూ మృతి చెందారు.

ఫొటో సోర్స్, Pramila Krishnan/BBC
"తుపాను గాలులు వీచినపుడు భానుమతి(40), ఆమె కూతురు విజయలక్ష్మి కొబ్బరితోట మధ్యలో ఉన్న గుడిసెలో ఇరుక్కుపోయారు. పైకప్పుపై కూలిన ఒక పెద్ద కొబ్బరి చెట్టు లోపలున్న బాలిక చాతీపైన పడింది. తల్లికి కాలి ఎముక విరిగింది" అని కుటుంబ సభ్యులు చెప్పారు.
"కొన్ని నిమిషాల్లో చనిపోబోతున్నానని తను నాకు చెప్పింది. కళ్ల ముందే ప్రాణాలు పోతుంటే చూస్తుండిపోయా. నా కాలు విరగడంతో కదలలేకపోయా. బలమంతా కూడగట్టుకుని సాయం కోసం అరిచాను. కానీ మా ఇంట్లో వాళ్లు వచ్చేటప్పటికే, పాప చనిపోయింది. చివరగా తన నోట్లోంచి రక్తం వచ్చింది. అక్కడ చూసింది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను" అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి బీబీసీకి చెప్పారు.

చివరి చూపు కూడా దక్కలేదు
ఇప్పటికీ భయంలో ఉన్న ఆమె తనతో మాట్లాడుతున్న వారి కళ్లలోకి నేరుగా చూడలేకపోతున్నారు. కూతురిని తలుచుకుని భానుమతి ఏడుస్తున్నప్పుడల్లా ఆస్పత్రిలోని మిగతా మహిళా రోగులు ఆమెను ఓదారుస్తున్నారు. షాక్ నుంచి ఇంకా బయటపడని భానుమతితో ఆమె సోదరి బలవంతంగా ఆహారం తినిపించి, మందులు మింగిస్తున్నారు.
"నన్ను నా కూతురితోపాటు గుడిసెలోంచి బయటికి తీసినప్పుడు స్పృహలో లేనని మా చెల్లెలు చెప్పింది. తర్వాత నన్ను ఇక్కడ చేర్పించారు. నా బిడ్డ ఇక లేదనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. తన చివరిచూపు కూడా దక్కలేదు. ఇది నా జీవితాంతం గుర్తుండిపోతుంది" అన్నారు భానుమతి
కన్నీళ్లు ఆపుకోలేకపోతున్న భానుమతి "మా పాపంటే నాకు చాలా ఇష్టం. ప్రతి తల్లీ కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే కూతురుంటే బాగుణ్ణు అనుకుంటుంది. కానీ నన్ను చూడండి. నేను బతికున్నా, కానీ నా ప్రాణమైన నా ఒక్కగానొక్క బిడ్డ లేకుండా పోయింది. తను పెద్దయ్యాక మంచి జీవితం గడుపుతుంది అనుకున్నా, కానీ నా కలలన్నీ ముక్కలైపోయాయి" అని ఆ తల్లి చెప్పారు.
"వయసుకు వచ్చినపుడు, నెలసరి సమయంలో బాలికలను ఇంటికి దూరంగా ఉంచడం మా గ్రామాల్లో మామూలే. బాలిక రజస్వల అయినప్పుడు ఆమెను 16 రోజుల వరకూ ఇంటికి దూరంగా వేరే ప్రాంతంలో ఉంచుతాం. 16వ రోజు వేడుక చేశాక ఆమెను మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు. మేం ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. నాకు కూడా అలాగే చేశారు. ఆ ఆచారం ప్రకారం నేను పాపను ఇంట్లోకి తీసుకురాలేను. కానీ దానివల్లే నేను నా బిడ్డను పోగొట్టుకున్నా. ఈ ఆచారం నా బిడ్డనే దూరం చేసిందని తెలుసుకున్నా" అన్నారు భానుమతి.

ఫొటో సోర్స్, BBC TAMIL
నిండు ప్రాణం తీసిన ఆచారం
వారి ఇంట్లో ఉన్న బాలిక తాతయ్య-బామ్మలను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు.
గుడిసెపై చెట్టును చూడగానే, మేం ఆశలు వదులుకున్నాం. చెట్టును తీయడానికి గుడిసెలోంచి పాపను బయటికి తీయడానికి గ్రామస్తులను పిలిచాం. వెంటనే పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు అని మీనాక్షి చెప్పారు.
‘‘పాపను వేరే చోటుకు తీసుకెళ్దామని నేను వాళ్లకు చెప్పాను. కానీ కొన్ని గంటల్లోనే తుపాను మా ఊరిని చుట్టేసింది. మేం ఎక్కడకూ వెళ్లలేకపోయాం. ఈ తోటలోకి రావడం తప్ప వేరే దారిలేకుండా పోయింది. మేం ఇక్కడ చాలా ఏళ్ల నుంచీ పనిచేస్తున్నాం’’ అన్నారు.
నెలసరి సమయంలో పిల్లలకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారని అడిగినప్పుడు నెలసరి అనేది అపవిత్రం కాదని జనాలను ఒప్పించడం చాలా కష్టమని తమిళనాడు బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్, ఎంపీ నిర్మల తెలిపారు.
"ఆ వార్త విని షాకయ్యాం. జనం ఇలాంటి వాటిని నమ్మి, తమ పిల్లలను ఒంటరిగా ఎందుకు వదిలేస్తారో తెలీదు. పెరంబలూర్ జిల్లాలో కూడా నేను ఇలాంటి కేసుల గురించి విన్నా. మనం ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి. రుతుక్రమం గురించి ఉన్న అపోహలపై పోరాటం చేయాలి. కానీ అది చాలా కష్టం" అన్నారు నిర్మల

12 జిల్లాల్లో తీవ్రంగా నష్టం
డబ్బున్నవారు, పేదలు అందరూ అదే ఆచారం అనుసరిస్తారని, ఇంట్లో బాలికలకు నెలసరి వచ్చినపుడు వారిని బలవంతంగా తమకు దూరంగా ఉంచుతారని వీరసేన అనే స్థానిక సామాజిక కార్యకర్త చెప్పారు.
అధికారుల లెక్కల ప్రకారం గజ తుపాను ప్రభావంతో వీచిన బలమైన గాలుల వల్ల చాలా చెట్లు కూలిపోయాయి. 12 జిల్లాల్లో 80 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది.
ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా చేపల వేట, కొబ్బరి, చింత లాంటి వాణిజ్య పంటలపై ఆధారపడతారు. ఈ రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీర ప్రాంతంలో ఉన్న చాలా గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. చేపల పడవలు ధ్వంసమయ్యాయి.
కొన్ని జిల్లాల్లో గ్రామస్తులు ఆందోళనలు కూడా చేశారు. ప్రభుత్వం నీళ్లు, ఆహారం లాంటి కనీస అవసరాలు కూడా అందించలేకపోయిందని ఆరోపించారు.
స్థానిక అధికారులు మాత్రం 493 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, నీళ్లు, దుప్పట్లు అందించామని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
- అభిప్రాయం: సుష్మా స్వరాజ్ రాజకీయ జీవితం ముగిసినట్లేనా?
- కంచుకోటలోనూ కమ్యూనిస్టులు ఎందుకు తడబడుతున్నారంటే..
- మధ్యప్రదేశ్లో వరుసగా మూడు దఫాలుగా బీజేపీ ఎలా గెలిచిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








