తమిళనాడులో కుల దురహంకార హత్యలు: ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను కాళ్లూ చేతులూ కట్టేసి కావేరీ నదిలో పడేశారు

నందీశ్, స్వాతి

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో.. కులాంతర వివాహం చేసుకున్న యువదంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇది కుల దురహంకార హత్యే అని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

హోసూరులో దళిత యువకుడు నందీశ్, బీసీ కులానికి చెందిన స్వాతిలు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి తల్లిదండ్రులు నిరాకరించటంతో.. పెద్దలను ఎదిరించి ఆగస్టు 15న పెళ్లి చేసుకున్నారు.

అయితే, నందీశ్ కనిపించటం లేదని అతడి సోదరుడు నవంబర్ 14న హోసూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో కావేరీ నదిలో నందీశ్, స్వాతిల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి కాళ్లూ చేతులూ కట్టేసి ఉన్నాయి. శరీరాలపై చాలా గాయాలూ ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, తమిళనాడు: కాళ్లూ చేతులూ కట్టేసి నదిలో పడేశారు

నందీశ్ శరీరం మీద ఉన్న చొక్కా మీద అంబేడ్కర్ ఫొటో ముద్రించి ఉంది. వీరి హత్య కులదురహంకార హత్య అని భావిస్తున్నారు.

ఈ దారుణానికి సంబంధించి పోలీసులు స్వాతి బంధువులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

2016లో తమిళనాడులోని ఉడుమలైపట్టైలో దళిత యువకుడు శంకర్‌ను పట్టపగలే కిరాతకంగా హత్య చేశారు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌: మరో యువ జంటపై ‘కుల అహంకార’ దాడి

ఇటీవల తెలంగాణలోనూ కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు ప్రణయ్‌ని.. అతడి భార్య అమృత తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించిన ఘటన పెను సంచలనం సృష్టించింది.

కులదురహంకార హత్యలకు గురైన వారిలో 80 శాతం మంది మహిళలు ఉంటే.. 20 శాతం మంది పురుషులు ఉన్నారని సామాజిక కార్యకర్త కథీర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)