దుమ్ము తుపాన్లు గతంలోనూ వచ్చాయి. కానీ ఇప్పుడే ఎందుకింత నష్టం జరిగింది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, నవీన్ సింగ్ ఖాడ్క
- హోదా, పర్యావరణ ప్రతినిధి
భీకర దుమ్ము తుపానుతో ఉత్తరాదిన 125 మంది చనిపోయారు.
ఉత్తరాదిన వేసవిలో దుమ్ము తుపాన్లు సాధారణం. గతంలోనూ వచ్చాయి.
కానీ ఎప్పుడూ ఇంత భీకరంగా విరుచుకుపడలేదు.
మరి, గతంలో వచ్చిన దుమ్ము తుపాన్లకు ప్రస్తుత రాకాసి గాలి దుమారానికి తేడా ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
దుమ్ము తుపాను విరుచుకుపడిన సమయం
దుమ్ము తుపాను వల్ల ఇంత మంది ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం అదొచ్చిన సమయమేనని అధికారులు చెబుతున్నారు.
రాత్రి పూట ప్రజలందరూ ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో పెను గాలులు ఉప్పెనలా ఊరి మీద పడ్డాయని వారు తెలిపారు. ఇళ్లు కూలి, భవనాల శిథిలాలు మీద పడి చనిపోయిన వారి సంఖ్యే చనిపోయిన వారిలో ఎక్కువగా ఉంది.
అయితే, వాతావరణ శాఖ అధికారులు మరొక కారణం కూడా ఉందంటున్నారు. గాలి వీచిన దిశ కూడా మరణాల సంఖ్య పెరిగేందుకు కారణమని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
టోర్నడోల మాదిరిగా గాలి చుట్టేసింది!
గాలి వీచిన దిశ దుమ్ము తుపాను తీవ్రతను మరింత పెంచింది.
సాధారణంగా గాలి సమాంతరంగా వీస్తుంది. కానీ ఈసారి దుమ్ము తుపాను టోర్నడోల మాదిరిగా నిలువుగా వచ్చి నేలను చుట్టేసిందని అధికారులు తెలిపారు. నేలపై ఉన్న వస్తువులు, ఇళ్లను కబళించేసింది.
అర్థరాత్రి కావడంతో మృత్యు కౌగిలి నుంచి తప్పించుకునే అవకాశం ప్రజలకు లేకపోయింది.

ఫొటో సోర్స్, PTI
తీవ్రమైన ఎండలూ కారణమే!
దుమ్ము తుపాను బీభత్సంలో ఎండల పాత్ర కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉత్తరాదిన తీవ్రమైన ఎండల తర్వాత దుమ్ము తుపాను విరుచుకుపడింది. భారత వాయవ్య దిశలోని ఎడారి ప్రాంతం నుంచి దుమ్ము తుపాను పశ్చిమ దిశగా కదిలి ఉత్తరాదిని కమ్మేసింది.
కానీ అది కేవలం దుమ్ము తుపానుగా మాత్రమే లేదు.

ఫొటో సోర్స్, Getty Images
గాలి దుమారంతో పాటు కుండపోత వానలు
రాజస్థాన్ నుంచి పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ మీదగా ఉత్తరాదికి వ్యాపించే సమయంలో దుమ్ము తుపాను కాస్త ఉరుములు మెరుపులతో కూడిన గాలి వానగా మారింది.
తూర్పు దిశగా ఉన్న బంగాళాఖాతం నుంచి తేమను మోసుకొచ్చిన గాలులు పశ్చిమ దిశ నుంచి వచ్చిన విధ్వంసక దుమ్ము తుపానుతో కలిశాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఇంకోవైపు తేమ, మరోవైపు, ఆందోళనకర వాతావరణ పరిస్థితులు... అన్నీ కలిసి దుమ్ము తుపాను మృత్యుతుపానుగా మారడానికి కారణమయ్యాయని వారు వివరించారు.
దుమ్ము తుపాను సృష్టించిన విధ్వంసం గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణం మరింత ఆందోళనకరంగా ఉంటుందని, ఉత్తరాదిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Venugopal Bollampalli
ఎడారులుగా మారుతున్న రాష్ట్రాలు!
అసాధారణ దుమ్ము, అకాల భారీ వర్షాలు భారత దేశంలో ఎడారీకరణ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. పలు రాష్ట్రాలు వేగంగా ఎడారులుగా మారుతున్నాయన్న ఆందోళన పెరుగుతోంది. దేశంలోని పావు శాతం భూమి ఎడారిగా మారుతోందని భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కానీ ఈ సంఖ్య అంతకు మించే ఉంటుందని స్వతంత్ర నిపుణులు అంటున్నారు.
ఎడారీకరణ పెరుగుతోందంటే రాబోయే రోజుల్లో మరింత విధ్వంసక, భయానక దుమ్ము తుపాన్లు విరుచుకుపడతాయని అర్థం. వాతావరణ మార్పుల కారణంగా దక్షిణాసియాలో తీవ్రమైన కరవు కాటకాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడొచ్చిన దుమ్ము తుపానుల్లాంటివి భవిష్యత్‌లో మరిన్ని వస్తాయని, మరింత తీవ్రంగా వస్తాయని వారు అంచనా వేస్తున్నారు.
వాయవ్య భారతదేశంలో వేసవి కాలంలో దుమ్ము తుపాన్లు సహజమే. కానీ గత రెండురోజులుగా ఈ ప్రాంతంలో జరిగిన నష్టం అపారం.
ఇవి కూడా చదవండి.
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








