దిల్లీ హింస: 'నా బిడ్డను చంపేశారని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను' - అంకిత్ శర్మ తల్లి

ఫొటో సోర్స్, ANI
ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేద్దాం అనుకుంటూ ఉండగానే కుమారుడు దిల్లీ అల్లర్లలో దారుణంగా హత్యకు గురికావడం ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అంకిత్ శర్మ శవమై కనిపించడంతో ఆ కుటుంబం పూర్తిగా విషాదంలో కూరుకుపోయింది.
ఈశాన్య దిల్లీలోని ఖజూరీ ఖాస్ ప్రాంతంలో నివసించే అంకిత్ శర్మ ఫిబ్రవరి 25న విధుల నుంచి వస్తూ కనిపించకుండా పోయారు.
తర్వాత రోజు ఆయన మృతదేహం చాంద్‌బాగ్ కల్వర్ట్ దగ్గరున్న మురుగు కాలువలో ఉన్నట్టు కాలనీ వారి ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది.
మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడం చూసి అంకిత శర్మ కుటుంబం, బంధువులు షాక్ అయ్యారు.

26 ఏళ్ల అంకిత్ శర్మ నిఘా విభాగం(ఐబీ)లో పనిచేస్తున్నారు. 2017లో ఈ ఉద్యోగంలో చేరిన ఆయన దిల్లీ చాణక్యపురిలో ఉన్న హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.
హింసకు పాల్పడుతున్న వారికి నచ్చజెప్పేందుకు వెళ్లి ఆయన ప్రాణాలు కోల్పోయాడని అంకిత్ శర్మ సోదరుడు అంకుర్ శర్మ బీబీసీకి చెప్పారు.
"అంకిత్ డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు దారిలో ఒక గుంపు ఆయన్న పట్టుకుంది. ఆయన ఆ ప్రాంతంలో హింస జరుగుతోందని తెలిసి, వారికి సర్ది చెప్పేందుకు వెళ్లారు. హింసను చల్లార్చే ప్రయత్నం చేశారు. కానీ అది మరింత పెద్దదైంది" అన్నారు.

అంకిత్ తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి. సోదరుడు అంకుర్ ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నారు. అంకిత్ సోదరి ఇంకా చదువుకుంటున్నారు.
వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడిన అంకిత్ తండ్రి రవిందర్ శర్మ "ఒక భవనం నుంచి వచ్చిన కొందరు అతడిని లాక్కుని వెళ్లారు. కొందరు విడిపించడానికి వెళ్తే వాళ్లపై కాల్పులు జరిపారు. పెట్రోల్ బాంబులు వేశారు. తనను చాంద్ బాగ్ కల్వర్ట్ దగ్గరున్న మసీదు దగ్గరకు లాక్కెళ్లారు. దాదాపు పది మంది భవనం పైనుంచి కాల్వలో పడేశారు. మరో ఇద్దరు అతడి మీద రాళ్లు వేశారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Ani
"అంకిత్ ఇంటికి రాకపోవడంతో భయపడ్డాం. మరుసటి రోజు కాల్వలో శవం కనిపించిందని ఎవరో వచ్చి చెప్పారు" అని అంకిత్ శర్మ తల్లి గుర్తు చేసుకున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని బీబీసీకి చెప్పి కన్నీళ్లు పెట్టారు.
"మేం మొదట ఖజూరీ ఖాస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, అది గోకుల్ పురి పరిధిలోకి వస్తుంది అక్కడ కేసు పెట్టమన్నారు. వాళ్లేమో మీరు ఖజూరీ ఖాస్ స్టేషన్‌కు వెళ్లండి అన్నారు. వారికి చేతులు జోడించి నేను అక్కడి నుంచే వచ్చాను. దయచేసి నా రిపోర్టు రాసుకోండని అన్నాను" అని అంకిత్ తల్లి చెప్పారు.
నాలాలో దొరికిన అంకిత్ శవాన్ని తర్వాత జీటీబీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అతడి శరీరంపై వందల గాయాలు ఉన్నాయని పోస్ట్‌మాస్టమ్ రిపోర్టులో తేలిందని పోలీసులు చెప్పారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.

కుటుంబ సభ్యులు అంకిత్ శర్మ మృతికి ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ బాధ్యుడని అతని సోదరుడు అంకుర్ శర్మ ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ భవనం నుంచి వచ్చిన గుంపే తన సోదరుడిని ఆ భవనం లోపలికి తీసుకెళ్లిందని, వాళ్ళే చంపేసి కాలువలో పడేశారని అంకుర్ శర్మ చెప్పారు. అంకిత్ ముఖాన్ని ఛిద్రం చేశారని, శరీరం అంతటా గాయాలు చేశారని కూడా ఆయన చెప్పారు.
ఈ ఆరోపణలకు ఆప్ ఎమ్మెల్యే తాహిర్ హుస్సేన్ ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. పోలీసులు ఇంకా అంకిత్ కేసు దర్యాప్తు చేస్తున్నారని, ప్రస్తుతానికి తనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు.

అంకిత్ హత్యలో తన ప్రమేయం లేదని చెప్పిన తాహిర్ హుస్సేన్, ఆరోజు నేను నా భవనం ఎక్కకుండా జనాలను ఆపడానికి ప్రయత్నించా. ఫిబ్రవరి 25న సాయంత్రం 4 గంటల వరకూ తన భవనంలో పోలీసులు ఉన్నారని. ఆరోజు వారు తన భవనంలో తనిఖీలు నిర్వహించారని చెప్పారు.
ఫిబ్రవరి 27న ఐపీసీ సెక్షన్ 302 కింద దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుసేన్ పేరు రాశారు.
అదే రోజున ఆప్ పార్టీ తాహిర్ హుస్సేన్ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత రోజు (ఫిబ్రవరి) 28న దిల్లీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ సిబ్బంది చాంద్‌బాగ్‌లో ఉన్న తాహిర్ హుస్సేన్ ఇంటి నుంచి ఆధారాలను సేకరించింది.
ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు లాయర్ అలఖ్ అలోక్ శ్రీవాస్తవ్ తాహిర్ హుస్సేన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి:
- దిల్లీ హింస: సరిహద్దులు దాటి.. అల్లరి మూకను ఎదిరించి.. ఎన్నో ప్రాణాలు కాపాడిన పోలీస్ హీరో నీరజ్ జాదౌన్
- బంగారం నిక్షేపాల వల్లే 'సోన్‌భద్ర'కు ఆ పేరొచ్చిందా?
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









