దిల్లీ హింస: అల్లర్లు చెలరేగిన వీధుల్లో ఐదు గంటల ప్రత్యక్ష అనుభవం ఇది...

దిల్లీ అల్లర్లు
    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈశాన్య దిల్లీలోని బ్రిజ్‌పుర ప్రాంతాన్ని బుధవారం మధ్నాహ్నం ఓ వింత మౌనం ఆవహించింది. ఈశాన్య దిల్లీ అల్లర్లకు అది మూడో రోజు.

అక్కడ పోలీసు వాహనాల సైరన్లు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. వీధుల్లో మంటల్లో కాలిపోయిన మోటారు సైకిళ్లు, కార్లే కనిపిస్తున్నాయి.

ఓ ఇరుకైన వీధిలో నడుస్తున్న నన్ను అక్కడున్న కొందరు యువకులు, వృద్ధులు ప్రశ్నిస్తున్నట్లుగా చూస్తున్నారు.

అడ్డగీత
News image
అడ్డగీత

ఇక్కడ మోహరించిన పోలీసులను చూస్తుంటే, రెండు రోజుల క్రితం ఇలాంటి చర్య తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదుగా అనిపిస్తోంది.

ఈ మౌనం మధ్యలోనే ఓ అరుపు వినిపించడం మొదలైంది. దాని దిశగా కదులుతూ వెళ్లా. ఇరుకు వీధుల్లో నుంచి ముందుకు వెళ్తూ ఉన్నా. పోలీసులు నిలబడ్డ చోటుకు ఇది కొన్ని మీటర్ల దూరంలో ఉంది.

ఐదో నెంబర్ వీధికి చేరుకున్నా. కుమందీ ఆనే ఆవిడ ఇక్కడున్నారు. ఆమె కళ్ల ముందే ఆమె కొడుకును అల్లరిమూక లాక్కెళ్లింది.

మెహతాబ్ తల్లి
ఫొటో క్యాప్షన్, మెహతాబ్ తల్లి

22 ఏళ్ల మెహతాబ్‌కు మానసిక వ్యాధి ఉంది. మంగళవారం సాయంత్రం 3-4 గంటల సమయంలో పాలు కొనేందుకు ఆయన బయటకు వెళ్లారు. ఇక తిరిగి ఇంటికి రాలేదు.

మెహతాబ్ వదిన యాస్మిన్.. గురుతేగ్ బహాదూర్ హాస్పిటల్‌లో ఇంకా ఆయన శవం కోసం వెతుకుతూ ఉన్నారు.

మెహతాబ్ తల్లి కన్నీరుమున్నీరవుతూ ఉన్నారు.

''వాడు పిల్లాడు. బయటకు వెళ్లొద్దని చెప్పా. కానీ, చాయ్ తాగుతానని పట్టుపట్టి, నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లాడు. ఒక్కసారిగా పెద్ద చప్పుడు వినిపించడంతో అందరం భయపడ్డాం. వీధి గేటుకు తాళాలు వేశారు. నా కొడుకు బయటే ఉండిపోయాడు. ఎవరూ గేట్ తెరవలేదు. నేను వాడితో మాట్లాడుతూనే ఉన్నా. ముందుండే ఇంకో వీధి నుంచి రమ్మని చెబుతూ ఉన్నా. కానీ, ఇంతలోనే హెల్మెట్లు పెట్టుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న ఓ అల్లరిమూక వచ్చేసింది. నా కొడుకుని పట్టుకుని వెళ్లిపోయింది'' అని ఆమె చెప్పారు.

బ్రిజ్‌పుర ప్రాంతం
ఫొటో క్యాప్షన్, బ్రిజ్‌పుర ప్రాంతం

ఇంతలోనే మెహతాబ్‌ అక్క షాజియాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.

''మా అన్నకు నిప్పు పెట్టారని వాళ్లు ఫోన్‌లో చెప్పారు. ఆ తర్వాత ఇంకో నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మదీనా క్లినిక్‌లో అతడు ఉన్నాడని చెప్పారు'' అని షాజియా అన్నారు.

మెహతాబ్‌ను మొదట కర్రలతో కొట్టారని, ఆ తర్వాత పదునైన ఆయుధాలతో దాడి చేసి, బతికుండానే నిప్పు పెట్టారని ఆయన వదిన యాస్మిన్ అంటున్నారు.

చివరికి పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడంతో సోమవారం, మంగళవారం పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. కానీ, బాధితులకు జరిగిన అన్యాయం.. అజిత్ డోభాల్ పర్యటనతోనో, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతోనో సరైపోదు.

దిల్లీ అల్లర్లు

ఈ వీధికి కొన్ని అడుగుల దూరంలో అల్ హుదా ఫరూఖియా మదర్సా ఉంది. ఇప్పుడది కాలిపోయింది. దాని లోపల మంటల వేడి ఇంకా చల్లారలేదు. చిన్న పిల్లల చెప్పులు, పుస్తకాలున్న సంచులు, ఖురాన్ పేజీలు అంతటా పడి ఉన్నాయి. ఉర్దూ పుస్తకాలు కొన్ని సగం కాలిపోయి కనిపించాయి.

ఓ బిస్కెట్ ప్యాకెట్ కూడా పడి ఉంది. ఓ చిన్నారికి వాళ్ల అమ్మ ఇచ్చింది కావొచ్చు. మా అమ్మ కూడా నాకూ అలాగే ఇంట్లో వండినవి ప్యాక్ చేసి ఇస్తూ ఉంటుంది. ఈ మదర్సా మౌల్వీ, ఇక్కడుండే పిల్లల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు.

అలర్లలో అమానుషత్వం పేట్రేగిపోతుంది. మీరు చేసే పని, మీ పద్ధతులు దానికి అక్కర్లేదు. మీరు బతికుండాలా, వద్దా అన్నది నిర్ణయించడానికి మీ పేరు ఒక్కటి చాలు.

కాలిపోయిన ఆ పుస్తకాలను చూస్తుండగానే వెనుక నుంచి 'డోంట్ టచ్ ఎనీథింగ్ హియర్' అంటూ నాకో గొంతు వినిపించింది. ఆ గొంతు అతుల్ లోకేది.

ఆయన న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నేను ఆయన్ను చూసి ఓ చిరునవ్వు నవ్వా. ఇంతకుముందు ఇక్కడికి వేరే జర్నలిస్ట్‌లు కూడా వచ్చారు.

దిల్లీ అల్లర్లు

అక్కడి నుంచి భాగీరథీ విహార్ వైపు బయల్దేరా. ఇక్కడి జనాభాలోనూ హిందువులు, ముస్లింలు కలగలిసి ఉంటారు. ఇక్కడ ఆరో వీధిలోని 94వ నెంబర్ ఇంటికి వెళ్లా. రామ్ ఆధార్ అనే ఆయన కుటుంబం ఈ ఇంట్లో ఉంటుంది.

30 ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, అభద్రతాభావం తమలో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు.

విద్వేషపు జ్వాలలు ఎగిసిపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మాటలు వింటుంటే మనసుకు కొంచెం సాంత్వన కలుగుతుంది.

భాగీరథీ విహార్‌
ఫొటో క్యాప్షన్, భాగీరథీ విహార్‌

సాయంత్రం ఐదు గంటలైంది. గడిచిన ఐదు గంటలుగా ఈ ప్రాంతంలోని అనేక వీధుల్లో తిరిగా. భాగీరథీ విహార్‌లోని ఓ వీధిలో కొంచెం హంగామా నడుస్తోంది. నేను ఈ వీధిలోకి వెళ్లినప్పుడు... బయటి నుంచి వచ్చిన కొందరు ముస్లింలు తమపై ఎలా దాడి చేశారో అక్కడి వారు నాకు చెప్పారు.

కొందరు మహిళలు కూడా ముందుకు వచ్చి తమకు తగిలిన గాయాలు చూపించారు. మంగళవారం హింసలో వాళ్లు గాయపడ్డారు.

''వాళ్ల (ముస్లింలు)కు పదేసి మంది పిల్లలు ఉంటారు. చంపమని పంపుతారు. మాకు ఉన్న ఒక్కరూ చనిపోతే...'' అని ఓ మహిళ అంది.

''ఒక్కరైనా, పది మందైనా.. బిడ్డను పోగొట్టుకున్న దు:ఖం తక్కువ ఎలా అవుతుంది?'' అని నేను ప్రశ్నించా.

అంతే, నా పట్ల వారి తీరు మారిపోయింది. నా ఐడీ కార్డు అడగటం మొదలుపెట్టారు. నా పేరు అడిగారు.

వెనక్కి తిరిగి చూస్తే, నా చుట్టూ జనం ఉన్నారు. నా ఫొటోలు తీయడం మొదలుపెట్టారు.

భాగీరథీ విహార్‌లో ఓ హిందూ కుటుంబం
ఫొటో క్యాప్షన్, భాగీరథీ విహార్‌లో ఓ హిందూ కుటుంబం

''మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఐడీ కార్డు చూపించండి''... ఇవే ప్రశ్నలు.

నా పేరు చెప్పకుండా వాళ్లు నన్ను వెళ్లనివ్వరని నాకు అర్థమైంది. నేను పేరు చెప్పా.

వెంటనే ఓ కుర్రాడు ఫేస్‌బుక్‌లో నా పేరు వెతికి, 'ఈ అకౌంట్ మీదేనా?' అని అడిగాడు.

నేను ఔనన్నా. ఆ కుర్రాడు మాట్లాడటం ఆపేశాడు. ''మీరెవరో తెలుసుకుందాం అనుకున్నాం. అంతే'' అని అక్కడున్న మహిళలు అన్నారు.

నా పేరు ప్రభావం వెంటనే ఇలా కనిపించడం బహుశా జీవితంలో నాకు ఇదే మొదటిసారి. ఆ వీధిలో నుంచి నన్ను వెళ్లనిచ్చారు.

ప్రపంచంలోని ఏ ఫైటింగ్‌ క్లాస్‌లకు వెళ్లినా, ఎంతటి ట్రైనింగ్ తీసుకున్నా ఈ మూక దాడుల నుంచి బయటపడగలమా అనే సందేహం నాకు కలిగింది. అలా ఆలోచించుకుంటూనే నా కార్ వైపు కదిలా.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.