కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచమంతటా కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు... సెన్సెక్స్ 1300 పాయింట్లు పతనం

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్‌ ప్రపంచాన్ని చుట్టుముడుతున్న భయాలతో శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం శుక్రవారం ఉదయం భారీ స్థాయిలో పతనమయ్యాయి.

భారతదేశానికి చెందిన నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ సుమారు 2.5 శాతం మేరకు పడిపోయాయి. మొత్తంగా ఈ వారంలో దాదాపు ఆరు శాతం పతనమయ్యాయి. 2016 ఫిబ్రవరి తర్వాత అత్యంత దారుణ స్థితికి దిగజారే దిశగా పయనిస్తున్నాయి.

అడ్డగీత
News image
అడ్డగీత

బ్రిటన్, యూరప్‌లలో గురువారం స్టాక్ మార్కెట్లు పతనమవటంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి.

అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లకు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం ఇప్పుడు మళ్లీ అత్యంత బలమైన దెబ్బ తగులుతోంది.

రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి

శుక్రవారం నాడు ప్రారంభం నుంచే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ భారీ నష్టాలతో ప్రారంభమైంది.

కరోనావైరస్ మహమ్మారి భయం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా మదుపరులు భారీ నష్టాలను చవిచూశారు. దాదాపు రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి సెన్సెక్స్ 1215 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 360 పాయింట్లను కోల్పోయింది.

అమెరికా స్టాక్ మార్కెట్
ఫొటో క్యాప్షన్, అమెరికా స్టాక్ మార్కెట్ గత 30 రోజుల పరిస్థితి
బ్రిటన్ స్టాక్‌మార్కెట్
ఫొటో క్యాప్షన్, బ్రిటన్ స్టాక్‌మార్కెట్ 30 రోజుల పరిస్థితి

అమెరికా డో జోన్స్ చరిత్రాత్మక పతనం

అమెరికాలోని డో జోన్స్ ఇండెక్స్ గురువారం దాదాపు 1,200 పాయింట్లు పడిపోయింది. ఇది ఈ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద పతనం.

దీంతో ఆసియా వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. జపాన్, ఆస్ట్రేలియా, కొరియా, చైనా మార్కెట్లు పెద్ద ఎత్తున కుదేలయ్యాయి.

జపాన్ షేర్ మార్కెట్ నిక్కీ 225 సూచీ శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో మూడు శాతం పడిపోయింది. ఈ వారంలో మొత్తంగా 9 శాతం దిగజారింది.

ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్200 సూచీ సైతం శుక్రవారం ఉదయం 3.5 శాతానికి పైగా దిగజారింది. 2008 తర్వాత అతి పెద్ద పతనం దిశగా పయనిస్తోంది.

''భయం, అనిశ్చితి నెలకొన్నపుడు మార్కెట్లు వేగంగా స్పందిస్తాయి. ఆ రెండూ ఇప్పుడు చాలా తీవ్రంగా ఉన్నాయి'' అని బ్యాంక్‌రేట్.కామ్ చీఫ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ గ్రెగ్ మెక్‌బ్రైడ్ పేర్కొన్నారు.

చైనాలో కరోనావైరస్ మొదట విజృంభించినపుడు ఆసియా మార్కెట్లు ఆటుపోట్లకు గురైనా ఆ తర్వాత సర్దుకున్నాయి. అయితే వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండటం, అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో ఆసియా మార్కెట్లూ పతనమయ్యాయి.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

మరిన్ని దేశాలకు విస్తరిస్తున్న కరోనావైరస్

ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాలకు కరోనావైరస్ విస్తరిస్తుండటంతో ఈ వైరస్ విజృంభణ 'నిర్ణయాత్మక దశ'కు చేరుకుందని, ఇది ''మహమ్మారిగా మారే అవకాశం'' ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి పేర్కొన్నారు.

సహారా దిగువ ఆఫ్రికాలో.. నైజీరియాలోని లాగోస్ రాష్ట్రంలో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది.

న్యూజీలాండ్ కూడా తమ దేశంలో తొలి కరోనావైరస్‌ కేసును నిర్ధరించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్ వెల్లడించారు. ఇటీవల ఇరాన్ నుంచి తిరిగివచ్చిన వ్యక్తికి ఆ వైరస్ సోకింది.

బెలారస్ సైతం తమ దేశంలో తొలి కరోనావైరస్‌ కేసును గుర్తించినట్లు ప్రకటించింది. ఇరాన్ నుంచి ఇటీవల తిరిగి వచ్చిన విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్పిందని రష్యా టాస్ వార్తా సంస్థ తెలిపింది.

దక్షిణ కొరియాలో కరోనావైరస్ చికిత్స

ఫొటో సోర్స్, Korea National Medical Centre

వైరస్ యూరప్ వ్యాప్తంగా విస్తరిస్తుండటంతో లిథువేనియాలోనూ తొలి కేసు నమోదైంది. ఇటీవల ఇటలీలోని వెరోనా నగరం నుంచి తిరిగివచ్చిన ఒక మహిళకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.

నెదర్లాండ్స్‌లోనూ తొలి కోవిడ్-19 కేసు నమోదైంది. ఇటీవల ఉత్తర ఇటలీ ప్రాంతానికి వెళ్లి వచ్చిన ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకిందని అధికారులు చెప్పారు.

చైనాలో మరో 327 కొత్త కేసులు, 44 తాజా మరణాలు సంభవించినట్లు ఆ దేశం ప్రకటించింది. ఇవన్నీ ఎక్కువగా హుబే ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి.

థాయ్‌లాండ్‌లోనూ కరోనావైరస్ కేసుల సంఖ్య 41కి పెరిగింది.

ఉత్తర కొరియా డాల్ఫినేరియం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాలో డాల్ఫినేరియం సహా పలు పర్యాటక కేంద్రాలను మూసివేశారు

ఉత్తర కొరియాకూ కరోనా భయం...

కరోనావైరస్ పుట్టిన చైనాకు, చైనా వెలుపల ఆ వైరస్ అత్యధికంగా ప్రబలిన దక్షిణ కొరియాకు పొరుగున ఉన్న ఉత్తర కొరియాలో ఇప్పటివరకూ ఈ వైరస్ కేసు ఏదీ నిర్ధరణ కాలేదు.

అయితే ఆ వైరస్ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశంలోని పలు బహిరంగ కేంద్రాలను ప్రభుత్వం మూసివేసిందని, కొత్తగా నిర్మించిన హాట్ స్ప్రింగ్స్ రిసార్ట్‌తో పాటు డాల్ఫినేరియం తదితర పర్యటక కేంద్రాలు కూడా వీటిలో ఉన్నాయని ఎన్‌కే న్యూస్ తెలిపింది.

ఉత్తర కొరియాకు వైద్య పరికరాలను పంపించటానికి వీలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు.

జపాన్ స్టాక్ మార్కెట్
ఫొటో క్యాప్షన్, జపాన్ స్టాక్ మార్కెట్ 30 రోజుల పరిస్థితి
హాంగ్ కాంగ్ స్టాక్ మార్కెట్ 30 రోజుల పరిస్థితి
ఫొటో క్యాప్షన్, హాంగ్ కాంగ్ స్టాక్ మార్కెట్ 30 రోజుల పరిస్థితి

హ్యుందాయ్ కార్ల తయారీ ఫ్యాక్టరీ మూసివేత

దక్షిణ కొరియాలో కొత్తగా 265 కేసులను నిర్ధరించారు. దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 2,000 దాటింది.

కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దక్షిణ కొరియాలోని తమ ఫ్యాక్టరీలో పనులను నిలిపివేసింది. దాదాపు 4,000 మందికి పైగా కార్మికులను ఇళ్లకు పంపించింది.

దేశంలో అతిపెద్ద సినిమా హాళ్ల సంస్థ సీజే సీజీవీ.. డేగు ప్రాంతంలో తమ సినిమా థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు జపాన్‌లో రెండు డిస్నీ థీమ్ పార్కులను రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

కాలిఫోర్నియాలో వచ్చే మే నెలలో నిర్వహించాల్సిన డెవలపర్స్ సదస్సును కరోనావైరస్ భయంతో ఫేస్‌బుక్ రద్దుచేసింది.

మీరావిజ్లియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మెక్సికో తీరంలో నిలిచిన మీరావిజ్లియా నౌకలో ఆరువేల మంది ప్రయాణికులు ఉన్నారు

నౌకలో 6,000 మంది ప్రయాణికులు దిగ్బంధం...

ఒక నౌకలోని దాదాపు 6,000 మందిలో ఒకరికి సీజనల్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధరించటంతో జమైకా, కేమాన్ ఐలాండ్లు తిప్పి పంపించాయి. ఆ నౌకను ఇప్పుడు మెక్సికో రేవులో నిలపటానికి అనుమతించారు.

ఆరోగ్యం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధరించిన ప్రయాణికులు ఆ నౌక నుంచి బయటకు రావటానికి అనుమతిస్తామని దేశ అధ్యక్షుడు ఆండ్రియాస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రాడర్ చెప్పారు.

నౌకలో ఉన్న వేలాది మందిని ఉటంకిస్తూ తాము అమానవీయంగా ప్రవర్తించలేమని ఆయన పేర్కొన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)