యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో యాపిల్ మొట్టమొదటి స్టోర్లను 2021లో ప్రారంభిస్తామని, ఈ ఏడాదిలో భారతదేశంలో ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభిస్తామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ చెప్పారు.
యాపిల్ సంస్థ స్థానిక భాగస్వామి లేకుండా భారతదేశంలో సొంత స్టోర్‌ను ప్రారంభించటానికి భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి వచ్చింది.
సంస్థ వాటాదారుల వార్షిక సమావేశంలో టిమ్ కుక్ ఈ ప్రకటన చేశారు.
యాపిల్ మార్కెట్‌ప్లేస్ నుంచి యాప్‌లను తొలగించాలని ప్రభుత్వాలు కోరినపుడు సంస్థ స్పందించే విధానాన్ని మార్చాలన్న ప్రతిపాదన మీద కూడా ఈ సమావేశంలో వాటాదారులు ఓటువేశారు. ఈ ప్రతిపాదన స్వల్ప తేడాతో వీగిపోయింది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంలో యాపిల్ తన సొంత స్టోర్లను తెరుస్తామని కొంత కాలంగా చెప్తోంది. అయితే.. ఆ స్టోర్లను ఎప్పుడు ప్రారంభించేదీ తేదీ ప్రకటించటం ఇదే మొదటిసారి.
విదేశీ బ్రాండ్లు భారతదేశంలో తమవైన సింగిల్ బ్రాండ్ స్టోర్లను తెరవకుండా నిషేధించే చట్టాలను భారత ప్రభుత్వం 2018లో సవరించింది. అయినప్పటికీ.. ఒక భారతీయ భాగస్వామితో కలిసి స్టోర్ ఏర్పాటు చేయాలని భారత్ కోరిందని టిమ్ కుక్ చెప్పారు.
అయితే.. యాపిల్ 'మంచి భాగస్వామి' అవుతుందని తాను భావించలేదని ఆయన వాటాదారులతో వ్యాఖ్యానించారు.
''మేం మా పద్ధతిలో పనులు చేయటానికే ఇష్టపడతాం'' అన్నారు.
యాపిల్ ప్రస్తుతం తన ఉత్పత్తులను భారతదేశంలో థర్డ్ పార్టీ స్టోర్ల ద్వారా విక్రయిస్తోంది. కానీ దీని విక్రయాలు పోటీదారులైన సాంసంగ్, హువావేల కన్నా వెనుకబడి ఉన్నాయి.
యాపిల్ ఉత్పత్తులకు చైనాలో కరోనావైరస్ విజృంభణ కన్నా ముందు నుంచే డిమాండ్ మందగిస్తుండటంతో.. ఇండియా వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లతో తన వృద్ధిని పెంచుకోవచ్చునని యాపిల్ ఆశిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మానవ హక్కుల అంశం
యాపిల్ యాప్ స్టోర్ నుంచి కొన్ని అప్లికేషన్లను తొలగించాలంటే ప్రభుత్వాలు కోరినపుడు.. వాటి మీద స్పందించే విధానాన్ని మార్చటానికి ఉద్దేశించిన ప్రతిపాదన మీద కూడా యాపిల్ వాటాదారులు ఓటు వేశారు.
ఆ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే.. ''భావప్రకటనా స్వేచ్ఛను ఒక మానవ హక్కు''గా గౌరవిస్తూ యాపిల్ సంస్థ బహిరంగంగా కట్టుబడేలా చేసి ఉండేది.
చైనా ఇంటర్నెట్ ఆంక్షలను అధిగమించటానికి హాంగ్ కాంగ్ నిరసనకారులకు ఉపయోగపడిన ఒక యాప్ సహా పలు యాప్‌లను.. చైనా ప్రభుత్వం కోరికమేరకు యాప్ స్టోర్ నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటువంటి యాప్‌లను తొలగించాలన్న విజ్ఞప్తులకు తలవంచటం ద్వారా.. చైనా మానవ హక్కుల ఉల్లంఘనల్లో యాపిల్ భాగస్వామిగా మారిందని ఈ ప్రతిపాదన మద్దతుదారులు విమర్శిస్తున్నారు.
ప్రతిపాదన వీగిపోయినప్పటికీ.. దీనికి అనుకూలంగా 40 శాతం ఓట్లు లభించాయి.
గతంలోనూ ఇదే తరహా చర్యలు ప్రతిపాదనకు వచ్చినా.. వాటికి ఎన్నడూ ఈ స్థాయి మద్దతు లభించలేదు.
కరోనావైరస్ ఆందోళనలు
యాపిల్ ఆపరేషన్ల మీద కరోనావైరస్ చూపుతున్న ప్రభావం గురించి కూడా టిమ్ కుక్ ప్రస్తావించారు.
కరోనావైరస్ విజృంభణ కారణంగా త్రైమాసిక ఆదాయ అంచనాలను అందుకోలేకపోవచ్చునని యాపిల్ ఈ నెల ఆరంభంలో తన వాటాదారులను హెచ్చరించింది.
యాపిల్ ఉత్పత్తులకు విడిభాగాలను తయారుచేసే చాలా చైనా కర్మాగారాలను.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో భాగంగా మూసివేయటమో, పరిమితంగా కార్యకలాపాలు నిర్వహించటమో జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- దిల్లీ హింస: అశోక్ నగర్లో మసీదుపై జాతీయ జెండా, కాషాయ జెండా ఎగరేసింది ఎవరు? - గ్రౌండ్ రిపోర్ట్
- దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్
- దిల్లీ హింస: తుపాకీ పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్న ఈ వ్యక్తి ఎవరు?
- బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








