ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్‌‌కు 193 కోట్ల జరిమానా

ఐఫోన్

ఫొటో సోర్స్, Getty Images

పాత ఐఫోన్ మోడళ్లు వేగాన్ని వినియోగదారులకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తోందన్న ఆరోపణలతో యాపిల్ సంస్థకు 2.5 కోట్ల యూరోల (సుమారు రూ. 193 కోట్లు) జరిమానా విధించారు.

ఫ్రాన్స్‌కు చెందిన కాంపిటీషన్, ఫ్రాడ్ వాచ్‌ డాగ్ డీజీసీసీఆర్‌ఎఫ్ ఈ జరిమానా విధించింది. వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండానే యాపిల్ ఈ పని చేస్తోందని డీజీసీసీఆర్‌ఎఫ్ చెబుతోంది.

కొన్ని పాత మోడల్ ఐఫోన్ల వేగాన్ని తగ్గించినట్లు 2017లో యాపిల్ సంస్థ అంగీకరించింది. అయితే, వాటి జీవితకాలం పెంచడానికే అలా చేసినట్లు అప్పట్లో ఆ సంస్థ చెప్పింది.

డీజీసీసీఆర్‌ఎఫ్‌ లేవెనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో అన్ని సమస్యలనూ పరిష్కరించుకున్నట్లు యాపిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అడ్డగీత
News image
అడ్డగీత

పాత మోడళ్ల వేగం ఎందుకు తగ్గిస్తోంది?

యాపిల్ కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడంతా తన పాత మోడళ్ల వేగాన్ని తగ్గిస్తోందని వాటిని వాడే వినియోగదారులు కొందరు చాలాకాలంగా అనుమానిస్తున్నారు. వినియోగదారులు కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్‌ కావాలన్న ఉద్దేశంతో యాపిల్ ఆ పనిచేస్తున్నట్లు వారంతా అనుమానిస్తుంటారు.

అయితే, యాపిల్ సంస్థ 2017లో దీనిపై వివరణ ఇస్తూ పాత మోడళ్ల వేగాన్ని తగ్గించిన మాట వాస్తవమే అయినప్పటికీ వాటిని అప్‌గ్రేడ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కాదని తెలిపింది.

డివైస్‌‌ పాతబడే కొద్దీ దానికి సరిపడా విద్యుత్ అందించే శక్తి అందులోని లిథియం అయాన్ బ్యాటరీకి తగ్గిపోతుంటుందని, దానివల్ల కొన్నాళ్లకు ఫోన్ హఠాత్తుగా ఆగిపోవడం వంటివి జరుగుతుంటాయని, ఆ పరిస్థితిని నివారించడానికి బ్యాటరీ పనితీరు పెరిగేలా ఫోన్ వేగం తగ్గిస్తూ ఐఫోన్ 6, 6 ఎస్, ఐఫోన్ ఎస్ఈ మోడళ్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.

యాపిల్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

డీజీసీసీఆర్‌ఎఫ్‌ ఏమంటోంది?

ఐఓఎస్ 10.2.1, 11.2 అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫోన్ వేగం తగ్గుతుందన్న సంగతిని యాపిల్ సంస్థ వినియోగదారులకు చెప్పలేదని డీజీసీసీఆర్ఎఫ్ అంటోంది.

ఒప్పందం ప్రకారం యాపిల్ ఫ్రెంచ్ భాషలో ఉన్న తన వెబ్‌ పేజీలో కనీసం నెల రోజుల పాటు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంచాలని, కానీ, ఆ సంస్థ అలా చేయలేదని డీజీసీసీఆర్ఎఫ్ చెప్పింది.

''యాపిల్ మోసపూరిత వాణిజ్య పద్ధతిలో నేరానికి పాల్పడింద''ని పేర్కొంటూ డీసీసీసీఆర్ఎఫ్ ఆ సంస్థకు జరిమానా విధించింది.

పాత ఐఫోన్ల వేగాన్ని యాపిల్ ఇంకా తగ్గిస్తోందా?

అవును.. 2017లో యాపిల్ ఈ విషయాన్ని అంగీకరించినప్పటి నుంచి మరికొన్ని మోడళ్ల ఐఫోన్లకూ ఇలాగే చేసింది.

* ఐఫోన్ 6, 6 ప్లస్, 6ఎస్, 6ఎస్ ప్లస్

* ఐఫోన్ ఎస్ఈ

* ఐఫోన్ 7, 7 ప్లస్

* ఐఓఎస్ 12.1, ఆ తరువాత వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఐఫోన్ 8, 8ప్లస్

* ఐఓఎస్ 12.1, ఆ తరువాత వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఐఫోన్ ఎక్స్

* ఐఓఎస్ 13.1, ఆ తరువాత వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఎక్స్ఎస్‌ మ్యాక్స్, ఎక్స్ఆర్

అయితే, బ్యాటరీ డీగ్రేడ్ కావడం ప్రారంభమైన తరువాత కొత్త సెట్టింగ్స్ మారుతాయి. ఇప్పుడు ఇలాంటి అప్‌డేట్స్ ఇస్తున్నప్పుడు యాపిల్ వినియోగదారులకు ఆ విషయం స్పష్టం చేస్తోంది.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)