కశ్మీర్‌ జర్నలిస్టులు రోజు కూలీకి వెళ్తున్నారు... ఎందుకో తెలుసా?

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR/BBC

    • రచయిత, ప్రియాంక దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
News image

కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఆ రోజు అంతా మంచు కప్పేసి ఉంది. రాజధాని శ్రీనగర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతనాగ్‌ నగరంలో లాల్‌చౌక్ దగ్గర మాకు 29 ఏళ్ల మునీబ్ ఉల్ ఇస్లాం ఎదురయ్యాడు.

కశ్మీర్‌లో అందరూ ధరించే ఫిరాన్ వేసుకున్న మునీబ్ మందంగా ఉన్న కార్గో పాంట్, ఉన్న్ టోపీ ధరించి ఉన్నాడు. గత ఏడేళ్ల నుంచి అతడు దక్షిణ కశ్మీర్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత ఆర్నెల్లుగా అతడి పని దాదాపు ఆగిపోయింది. కానీ, ఒక ఫొటో జర్నలిస్ట్ లాగే బలమైన గ్రిప్ ఉన్న బూట్లు, ఫీల్ట్ దుస్తుల్లో సిద్ధంగా ఉండే పాత అలవాటును అతడు ఇప్పటికీ వదల్లేదు.

పక్కన కరిగిన మంచు బురదగా మారిన వీధుల్లో నుంచి మునీబ్ మమ్మల్ని మార్కెట్ చివర్లో ఉన్న ఒక షాపు దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఉర్దూ డైలీకి వార్తలు రాసే ఆయన స్నేహితుడు తన ల్యాప్‌టాప్‌లో ఏదో టైప్ చేస్తున్నారు. మమ్మల్ని చూడగానే, "రాసినా ఏం లాభం, ఎక్కడికి పంపించాలి. ఇంటర్నెట్ లేకుంటే ఈ కంప్యూటర్ కూడా పనికిరాని మెషినే కదా" అన్నాడు.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR/BBC

300 జర్నలిస్టుల పరిస్థితి ఇంతే

ఒక యాక్టివ్ ఫొటో జర్నలిస్టు నుంచి రోజు కూలీగా మారేవరకూ తన ప్రయాణం గురించి చెబుతున్న మునీబ్‌ను విషాధం కమ్మేసింది. అయితే వృత్తిలో తన తొలి రోజులు గుర్తు చేసుకోగానే అతడి కళ్లలో ఒక మెరుపు కనిపించింది.

"నేను నా కుటుంబం కోసం ఏదైనా చేయాలనే తపనతో ఈ వృత్తిలోకి వచ్చాను. 2012లో అనంతనాగ్‌లో ఫ్రీలాన్సర్‌గా పనిచేశాను. 2013లో ఎన్నో పత్రికల్లో పనిచేసి, ఫొటోలు తీశాను. 2015లో మళ్లీ ఫ్రీలాన్సర్‌ అయ్యాను. క్వింట్, టెలిగ్రాఫ్, ద గార్డియన్, థాంప్సన్ రాయిటర్స్ ట్రస్ట్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి వాటిలో నా ఫొటోలు ప్రచురించారు. 2012 నుంచి 2019 వరకూ అనంతనాగ్, చుట్టుపక్కల దక్షిణ కశ్మీర్‌లో చాలా కవర్ చేశాను. ఎన్నో ఫొటోలు వచ్చాయి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతా ఆగిపోయింది" అని మునీబ్ అన్నారు.

కశ్మీర్ జర్నలిస్టులు

ఆగస్టు 5న ఇంటర్నెట్‌పై నిషేధం విధించిన తర్వాత కశ్మీర్‌ లోయలో ఉన్న 300 మంది జర్నలిస్టుల పరిస్థితి దాదాపు ఇలాగే అయ్యింది.

370 రద్దు చేసినప్పటి పరిస్థితులు గుర్తు చేసుకున్న మునీబ్ "ఆగస్టు 4న అనంతనాగ్ అంతా మూసేశారు. 5న ఎలాగోలా కలెక్టరేట్ దగ్గరికి చేరుకున్నా. అక్కడ పాలవాళ్లకు, ఇంకా చాలామందికి కర్ఫ్యూ పాస్ ఇచ్చారు. కానీ మాకు ఇచ్చేదిలేదని స్పష్టంగా చెప్పేశారు. దాంతో చాలా రోజులవరకూ ఇలాగే ఉండిపోయాం" అన్నారు.

సెప్టెంబర్‌లో ఫోన్ లైన్లు ప్రారంభమయ్యాక తను మళ్లీ ఒక స్టోరీ చేయాలని ప్రయత్నించాడు. కానీ దానికి తన సంపాదనలోంచి చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది. "దిల్లీలోని ఒక న్యూస్ వెబ్‌సైట్ కోసం అక్రోట్స్ పండించే రైతులపై 370 రద్దు ప్రభావంపై ఒక స్టోరీ చేస్తానని నేను ప్రతిపాదన పంపించా. వాళ్లు ఆ స్టోరీ కూడా కమిషన్ చేశారు. కానీ అదంతా చేయడానికి, వాళ్లకు మెయిల్స్ పంపించడానికి రెండుసార్లు శ్రీనగర్ వెళ్లాల్సి వచ్చింది. బండికి పెట్రోల్, శ్రీనగర్ వరకూ వెళ్లి రావడం అంతా కలిపి 5-6 వేలు ఖర్చైంది. స్టోరీ పబ్లిష్ అయితే అంత డబ్బు కూడా రాదు. అంత నష్టం వచ్చినా ఏం మాట్లాడలేకపోయాను" అన్నారు.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR/BBC

తప్పనిసరి పరిస్థితుల్లో కూలికి వెళ్తున్నా

నాలుగు నెలల తర్వాత డిసెంబర్ నుంచి మునీబ్ మెల్లమెల్లగా పనులు చేయడం మొదలెట్టాడు. కానీ మధ్యలో పనిచేయక అతడి ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అయ్యింది. దాంతో కెమెరా పట్టిన చేతులతో మునీబ్ మట్టి పనులకు వెళ్లాల్సి వచ్చింది.

"గత ఏడాదే నాకు పెళ్లైంది. ఇంటి ఖర్చులన్నీ మా తమ్ముడు చూసుకుంటున్నాడు. కానీ నా భార్య అనారోగ్యానికి గురైతే, తనను డబ్బు అడగలేను కదా. ఏం అర్థం కాలేదు. డబ్బుల అవసరం పెరిగిపోయింది. దాంతో నేను కూలి పనులకు వెళ్లడం మొదలెట్టా".

"కెమెరా ఇంట్లోనే ఉండేది. మా ఇంటి దగ్గరే కడుతున్న ఒక భవనంలో కూలీగా పనికి కుదిరాను. రోజంతా పని చేస్తే 500 రూపాయలు ఇచ్చేవారు. ఆ సమయంలో ఎలాగైనా డబ్బు సంపాదించి నా భార్యకు మందులు కొనాలి అనుకున్నా అంతే" అంటారు మునీబ్.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

మునీబ్ లాగే అనంతనాగ్‌లో పనిచేసే జర్నలిస్ట్ రుబాయత్ ఖాన్ కూడా జర్నలిజం వదిలేశారు. ఇప్పుడు రాష్ట్ర 'ఎంటర్‌ప్రిన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌'లో డైరీ ఫాం ప్రారంభించడానికి శిక్షణ తీసుకుంటున్నారు. లోయలో జర్నలిస్టుల పరిస్థితిపై ఆయన చాలా విచారం వ్యక్తం చేశారు.

నగరానికి కాస్త దూరంలో బీబీసీతో మాట్లాడిన ఆయన "జర్నలిజంలో పనిచేయడం అంటే పోగొట్టుకోవడమే అని అర్థం. కష్టాలు మొదటి నుంచీ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఆగిపోయింది. కశ్మీర్‌ ఒక కాన్‌ఫ్లిక్ట్ జోన్. ఇక్కడ రిపోర్టింగ్ చేసే ప్రతి క్షణం ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. నేను నాలుగేళ్లు కులగామ్, అనంతనాగ్‌లో రిపోర్టింగ్ చేశాను. ఆ సమయంలో నా కళ్ల ముందే ఎంతోమంది చనిపోవడం చూశాను" అన్నారు.

"జీతం కూడా చాలా తక్కువ. ఇన్ని భరించినా చాలాసార్లు స్థానికులు మమ్మల్ని ప్రభుత్వ ఏజెంట్ అనుకుంటారు. ఇక్కడ జర్నలిస్టులకు ఎలాంటి గౌరవం లేదు. అందుకే రిపోర్టింగ్ వదిలేశాను. అయితే జర్నలిజం అంటే ఇప్పటికీ నాలో ఆసక్తి తగ్గలేదు. కానీ ఇక నావల్ల కాదు" అంటారు రుబాయత్ ఖాన్.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR/BBC

ఇంటర్నెట్ ఉపయోగించే కారణం చెప్పాలి

2019 డిసెంబర్లో జిల్లాలోని జాతీయ సమాచార కేంద్రం లేదా ఎన్ఐసీ కొన్ని కంప్యూటర్లతో పరిమిత ఇంటర్నెట్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, మునీబ్, రుబాయత్ లాంటి స్థానిక జర్నలిస్టులకు కష్టాలు తగ్గలేదు.

"మొదట శ్రీనగర్‌లో ఉండే మీడియా సెంటర్‌లా ఇది జర్నలిస్టుల కోసమే కాదని తెలుసుకోవాలి. ఇక్కడ 4 కంప్యూటర్లే ఉన్నాయి. వాటిలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పనులూ జరుగుతుంటాయి. జనం ఉద్యోగాల అప్లికేషన్లు, విద్యార్థుల అడ్మిషన్ ఫాంలు కూడా ఇక్కడి నుంచే నింపుతారు. అందుకే ఇక్కడ ఎప్పుడూ రద్దీ ఉంటుంది. స్పీడ్ విషయానికి వస్తే, జీ మెయిల్ ఓపెన్ చేస్తే, వేరే ఏవీ ఓపెన్ కావు. మనం టైప్ చేసిన పేజీ కూడా ఓపెన్ కాదు" అని మునీబ్ చెప్పారు.

ఇటు, రుబాయత్ కూడా "అక్కడ వార్తాపత్రికలకు ఏ ఫొటోలు పంపుతున్నాం, ఎందుకు అనేది కూడా చూపించాల్సి ఉంటుంది. అయినా చాలాసార్లు ఇంటర్నెట్ దొరకడం చాలా కష్టం అవుతుంది" అన్నారు.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR/BBC

కథనాలు రాసేవారే కథగా మారారు

మంచు కప్పేసిన అనంతనాగ్‌లోని మెహిందీ పూల్ దాటి మేం నగరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ జిల్లాకు వెళ్లాం. అక్కడ ప్రధాన మార్కెట్ పక్కనే ఉన్న ఒక సన్నటి సందులో ఒక ఇంట్లో కాసిం, రఫీక్‌ను కలిశాం.

కుల్గామ్‌లో పనిచేస్తున్న స్థానిక జర్నలిస్టులు పరిస్థితి లోయలో మిగతా జిల్లాలకంటే భిన్నంగా ఏం లేదు. గత ఐదేళ్లలో ఎన్నో వార్తాపత్రికలకు, టీవీ చానళ్లకు కుల్గామ్ నుంచి రిపోర్టింగ్ చేసిన కాసిం దగ్గర ఇప్పుడు తన మోటార్ సైకిల్లో పెట్రోల్ నింపడానికి కూడా డబ్బుల్లేవు.

బీబీసీతో మాట్లాడిన కాసిం "గత ఆర్నెల్లుగా పని పూర్తిగా ఆగిపోయింది. ఫోన్ లైన్లు ప్రారంభించిన తర్వాత నేను ఒకటి రెండు సార్లు ఫోన్లో వార్తలు చెప్పి రాయించాలనుకున్నా. కానీ ఇప్పుడు అంత తీరిక ఏ ఆఫీసులో ఉన్న వాళ్లకు ఉంటుంది. మన వార్తను మనమే రాసి పంపాలి. కానీ ఎలా. ఇంటర్నెట్ లేక మా చేతులు కట్టేసినట్టైంది" అన్నారు.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR/BBC

ఆయన పక్కనే ఉన్న రఫీక్ జర్నలిస్టులకు మిగతావారితో తెగిపోతున్న సామాజిక బంధాల గురించి చెబుతూ "సరే, మేం 370 గురించి ఏదీ రాయం. కానీ, కనీసం మిగతా వార్తలనైనా ఫైల్ చేయనివ్వండి. అంటే, మంచు వల్ల హైవే మూతపడడం, ఆపిల్ పంట ధ్వంసం కావడం, అక్రోట్, మిగతా వ్యాపారాల్లో నష్టాలు.. ఇలా చాలా వార్తలు బయటికి తెలీడం లేదు. కానీ, ఇంటర్నెట్ లేక మేం అవేవీ రాయలేకపోతున్నాం" అన్నారు.

"అలాంటప్పుడు మమ్మల్ని ఇన్ని నెలలు ఎవరు ఉద్యోగంలో పెట్టుకుంటారు. పనిలేకపోతే ఆర్థికంగా జరిగే నష్టం ఎటూ ఉంటుంది. అది కాకుండా మనం కష్టపడి ఏర్పరుచుకున్న కమ్యూనికేషన్ కూడా పాడవుతాయి. ప్రజలతో ఉండే కమ్యూనికేషన్ ఒక జర్నలిస్టుకు పెట్టుబడి లాంటిది. చాలా కాలం నుంచీ ఫీల్డులో లేకపోవడంతో మా వాళ్లతో ఆ కమ్యూనికేషన్ తెగిపోయే స్థితికి చేరుకుంది" అని రఫీక్ చెప్పారు.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR/BBC

ఫొటో క్యాప్షన్, 'కశ్మీర్ ఇమేజెస్' పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ బషీర్ మంజర్

న్యూయార్క్ గురించి తెలుసు, సోపోర్ గురించి తెలీదు

కుల్గామ్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని శ్రీనగర్‌లో ఇంగ్లీష్ డైలీ 'కశ్మీర్ ఇమేజెస్' వ్యవస్థాపక ఎడిటర్ బషీర్ మంజర్ తన పత్రికను గత ఆర్నెల్లుగా కేవలం పేరుకే ముద్రిస్తున్నానని చెప్పారు.

"వార్తాపత్రిక లైసెన్స్ సజీవంగా ఉంచడానికి, నేను ప్రతి నెలా కొన్ని కాపీలు వేయాల్స వస్తోంది. లేదంటే మిగతా స్టాఫ్ ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయి. కానీ ఇంటర్నెట్ ఆగిపోయాక నేను వెంటనే 'ముందు ముందు జరిగే ఘటనల గురించి మీరు ఎంత అజ్ఞానంలో ఉంటారో, మేం కూడా అలాగే ఉండబోతున్నాం' అంటూ ఒక ఎడిటోరియల్ రాశాను" అని బషీర్ చెప్పారు.

"మా పత్రికకు పాలిటిక్స్, బిజినెస్ లాంటి విషయాల మీదా వార్తలు రాసేవారు ఇప్పుడు అవి పంపించలేకపోతున్నారు. పాఠకులు ఆన్‌లైన్ పత్రిక చదవలేకపోతున్నారు. మా రిపోర్టర్లు జిల్లాల నుంచి వార్తలు పంపలేకపోతున్నారు. టీవీలో ఈరోజు నేను న్యూయార్కులో ఏం జరిగిందో తెలుసుకోగలను. కానీ మాకు పక్కనే ఉన్న సోపోర్‌లో ఏం జరుగుతోందో తెలీదు. అలాంటప్పుడు పత్రికను ఎలా నడపగలం" అన్నారు.

లోయలో ఇంటర్నెట్ నిషేధం చివరికి దేశంలో ప్రజాస్వామ్యానికే హాని కలిగించేదిగా బషీర్ వర్ణించారు. "మన చుట్టూ ఏ జరుగుతోంది అనేది తెలుసుకునే హక్కు, అవగాహన కల్పించడంతోపాటు ప్రజాస్వామ్యంను కూడా బలోపేతం చేస్తుంది. ఆర్నెల్లుగా లోయలో ఇంటర్నెట్ ఆపేయడం వల్ల, ఆ చెడు ప్రభావం చివరికి ప్రజాస్వామ్యం మీదే పడుతుంది" అన్నారు.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, AFP

ఇంటర్నెట్ సేవల కోసం ఫలించని విజ్ఞప్తులు

"కనీసం మా పత్రిక ఆఫీసులో బ్రాడ్‌బాండ్ సేవలనైనా పునరుద్ధించాలని కోరాను. వాటిపై సులభంగా నిఘా పెట్టవచ్చు. దానికోసం మేం సిద్ధం కూడా. ఈ సేవల కోసం కశ్మీర్‌లోని జర్నలిస్టులతో కలిసి ప్రభుత్వానికి ఎన్నోసార్లు అప్లికేషన్లు ఇచ్చాం. కానీ ఇప్పటివరకూ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని బషీర్ చెప్పారు.

దీనిపై ప్రభుత్వ వాదన తెలుసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధి, ఉన్నతాధికారులు అందరికీ బీబీసీ ప్రశ్నలు పంపింది. కానీ వారం తర్వాత కూడా వాటికి ఎలాంటి సమాధానం లభించలేదు.

రాజధాని శ్రీనగర్ మీడియా సెంటర్‌లో 300 మంది జర్నలిస్టులకు ఇప్పటికీ రెండు డజన్ల కంప్యూటర్లే ఉన్నాయి. ఒక్కోసారి స్పీడు తగ్గితే, ఇంకోసారి జనంతో ఇబ్బందిపడుతున్న రిపోర్టర్లు తరచూ వై-ఫై పాస్‌వర్డ్ కోసం దీనంగా అడుగుతుండడం కనిపిస్తుంది.

కశ్మీర్ జర్నలిస్టులు

ఫొటో సోర్స్, EPA

కానీ, రాజధాని బయట జిల్లాల్లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.

కశ్మీర్ లోయలో కాన్‌ఫ్లిక్ట్ జోన్‌లో పనిచేసే రఫీక్ తన అనుభవం చెబుతూ "మిలిటెంట్లు మేం ప్రభుత్వ ఇన్‌ఫార్మర్లమేమో అనుకుంటారు. సైన్యానికి మేం మిలిటెంట్ల ఇన్‌ఫార్మర్లని అనిపిస్తుంది. ప్రజలు వారికి మనసులో ఏది అనిపిస్తే అలా అనుకుంటారు. అంటే, వారు సైన్యానికి అనుకూలం అయితే, వారికి మేం మిలిటెంట్ల కోసం వార్తలు రాస్తున్నట్లు అనిపిస్తుంది" అన్నారు.

"ఆఫీస్ నుంచి మాకు ఎలాంటి అండ ఉండదు. డబ్బులు కూడా ఇవ్వదు. ప్రతిరోజూ ఇంటి నుంచి బయటికొచ్చాక తిరిగి వెళ్తామో, లేదో కూడా తెలీదు. అన్ని కష్టాలు ఎదురైనా నిజాలు అందరికీ చెప్పాలనే ఒక ప్యాషన్ మాతో ఈ పని చేయిస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆపేయడంతో దాన్ని మానుంచి దూరం చేసినట్టైంది" అంటారు రఫీక్.

రఫీక్ బాధ అతడి ముఖంలో కనిపిస్తుంది. అదే బాధ లోయలోని ప్రతి జర్నలిస్టు ముఖంలో కనిపిస్తుంది. ఆరు నెలల సుదీర్ఘ కాలంపాటు ఇంటర్నెట్‌పై నిషేధంతో ఇక్కడి జర్నలిస్టులకు వారి ప్యాషన్ దూరమైంది.

తిరిగి దిల్లీ బయల్దేరిన నాకు అక్కడ బయటపడుతున్న మంచు నగరంతోపాటూ, కీబోర్డుపై టకటకలాడే జర్నలిస్టుల వేళ్లు కూడా గడ్డకట్టుకుపోయేలా చేసినట్లు అనిపించింది.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)