విరాట్ కోహ్లీ మరో అయిదారేళ్లు ఆడితే... ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి: కపిల్ దేవ్

ఫొటో సోర్స్, BORIS STREUBEL
- రచయిత, విదిత్ మెహ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
"వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి మనం సుదీర్ఘ కాలం ఆడాల్సుంటుంది. విరాట్ మరో అయిదారేళ్లు పిచ్ మీద ఉంటే, ఇలాగే తన సత్తా కొనసాగిస్తే ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టగలడు".
భారత్‌కు 1983 వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ కపిల్ దేవ్ ఈ మాట అన్నారు. బీబీసీ వరల్డ్ న్యూస్ గోల్ఫ్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరైన కపిల్ దేవ్‌తో బీబీసీ మాట్లాడింది.
ఈ సందర్బంగా ఆయన భారత క్రికెట్ జట్టు తొలి ప్రపంచ కప్ గెల్చుకున్నప్పటి అనుభవాలను, ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్ళపై తన అభిప్రాయాలను బీబీసీతో పంచుకున్నారు. ఆయనతో చేసిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.

ఫొటో సోర్స్, ASHLEY ALLEN
విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడు
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మా ప్రశ్నల పరంపర మొదలైంది. బ్యాట్‌తో సంచలనాలు సృష్టించి, మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేసే సామర్థ్యం ఉన్న ఈ శతాబ్దపు గొప్ప ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అందరి కంటే టాప్‌లో ఉంటారా?
సమాధానంగా కపిల్ "చూడండి కోహ్లీ తన సామర్థ్యం ఏంటో చూపించాడు. ఇప్పుడు అతడు ఇంకా చాలా దూరం వెళ్లాలి. ఒక బ్యాట్స్‌మెన్‌లో ఉండాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయి. ఆట గురించి తన ప్యాషన్, ఫిట్‌నెస్ చాలా అద్భుతంగా ఉంది. విరాట్ తన ఫామ్ కొనసాగిస్తాడనే ఆశిస్తున్నాను" అన్నారు.
"వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి మనం సుదీర్ఘ కాలం ఆడాల్సి వస్తుంది. విరాట్ మరో ఐదారేళ్లు పిచ్‌పై ఉంటే, ఇదే సత్తా కొనసాగిస్తే అతడు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టగలడు"

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR
జట్టులో ధోనీ లోటు ఉందా?
క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీతోపాటూ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా చాలా ఇష్టపడతారు.
2014లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీతో గత ఏడాది బీసీసీఐ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.
ధోనీ పిచ్‌పై కనిపించకపోవడంతో తన ఫాన్స్ అతడిని మిస్ అవుతున్నారు.
భారత జట్టులో సుదీర్ఘ కాలం వికెట్ల వెనుక తన జోరు చూపించిన ధోనీ లేని లోటు నుంచి టీమిండియా ఎలా కోలుకోగలదు?
ఈ ప్రశ్నకు కపిల్ దేవ్ "మొదట్లో మనం గావస్కర్ లేకుంటే జట్టు ఏమవుతుందని ఆలోచించాం. తర్వాత టెండుల్కర్ లేకుండా టీమ్ ఏమవుతుందో అనుకున్నాం. కానీ, జట్టు ఆ వ్యక్తుల కంటే చాలా పెద్దదని మనం గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తి మైదానంలో లేకుంటే మనం కచ్చితంగా మిస్ అవుతాం. కానీ ధోనీ దేశానికి ఎంత చేయాలో, అంత చేశాడు. అదే తలుచుకుంటూ దిగులు పడుతుంటే, మనం ముందుకు వెళ్లలేం" అన్నారు.

విమర్శకులకు గట్టి జవాబు
ప్రస్తుత భారత జట్టు గురించి మాట్లాడిన కపిల్ "జట్టు మంచి ఫాంలో ఉంది. ఇప్పటివరకూ అత్యంత అద్భుతమైన భారత క్రికెట్ జట్లలో ఇది ఒకటి" అన్నారు.
కానీ, టీమిండియా విదేశీ పర్యటనలపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు కూడా కపిల్ విమర్శకులపై బౌన్సర్ విసిరారు.
"వాళ్లు ప్రతిసారీ రన్స్ చేయాలని మనం ఆశలు పెట్టుకోకూడదు. గత పదేళ్ల నుంచీ టీమిండియా చాలా మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. దానికి మనం వారిని గౌరవించాలి. విమర్శకుల పని విమర్శించడమే కదా?" అన్నారు.

ఫొటో సోర్స్, BAGUS INDAHONO
మహిళా ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు
భారత్‌లో 80, 90వ దశకంతో పోలిస్తే ఇప్పుడు జనాలకు మహిళా క్రీడాకారుల పేర్లు తెలుస్తున్నాయి. ఎందుకంటే వారు దేశానికి పేరు తెస్తున్నారు. ఏటా ప్రపంచ స్థాయి పోటీల్లో విజయాలు సాధిస్తున్నారు.
కానీ, స్వయంగా ఒక ఆటగాడైన కపిల్ భారత్‌లో మహిళా క్రీడాకారుల భవిష్యత్తు, వారికి లభిస్తున్న అవకాశాల గురించి ఏం చెప్పారు?

"మహిళల భవిష్యత్ చాలా ఉజ్వలంగా ఉంది. అది బ్యాడ్మింటన్ అయినా, టెన్నిస్ అయినా, అథ్లెటిక్స్ అయినా.. అన్నిటిలో మహిళలు పురుషుల కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారు. వారికి ఆడేందుకు అవకాశాలు కల్పించడం అనేది మన బాధ్యత".
"ఆ పిల్లలు ఆడడానికి కాస్త చోటు, సౌకర్యాలు కల్పించి, మిగతాదంతా వారికే వదిలేయడం చాలా అవసరం" అని కపిల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్‌బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










