పల్నాటి యుద్ధం: బ్రహ్మనాయుడి పందెంకోడి ‘చిట్టిమల్లు’.. ఇప్పటి అసీల్ రకం కోడి జాతి ఒకటేనా

ఫొటో సోర్స్, Telugu Veeragadha kavitvam/Prof. T.V. Subba Rao
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
సంక్రాంతి పండుగ వినోదాల్లో కోడిపందేలు ముఖ్యమైనవి. వీటికి ఎంతో చరిత్ర ఉంది. మహాభారతంతో పోల్చే ‘‘పల్నాటి యుద్ధం’’ కథలోనూ కోడిపందేల ప్రస్తావన ఉంది.
సుమారు 850 ఏళ్ల కిందట జరిగిందని చెప్పే ‘‘పల్నాటి యుద్ధం’’ కథలో బ్రహ్మనాయుడుకు చెందిన ‘చిట్టిమల్లు’ అనే కోడి పందెంలో ఓడిపోవడంతో వారు వనవాసం చేయాల్సి వస్తుంది.
చారిత్రక కథనాల ప్రకారం, బ్రహ్మనాయుడు, నాగమ్మల నాయకత్వంలో మాచర్ల, గురజాల రాజ్యాల మధ్య కోడిపందెం జరిగింది.
నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఉన్న కారంపూడి వద్ద క్రీ.శ.1178-1182 మధ్య కాలంలో పల్నాటి యుద్ధం జరిగినట్టుగా పరిశోధకులు పండిత అక్కిరాజు ఉమాకాంతం తన రచన ‘‘పల్నాటి వీరచరిత్ర’’లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC
'యుద్ధానికి దారితీసిన పందెం'
ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం... దాయాదులైన మలిదేవుడు, నలగామ రాజు మధ్య పంపకాల్లో మాచర్ల, గురజాల రాజ్యాలుగా పల్నాడు విడిపోతుంది. మాచర్లకు బ్రహ్మనాయుడు, గురజాల రాజ్యానికి నాగమ్మ మంత్రులు అవుతారు.
మలిదేవరాజు వివాహవేడుకల కానుకలు ఇవ్వడానికి బ్రహ్మనాయుడు గురజాలకు వెళ్తారు. అప్పుడు నాగమ్మ, బ్రహ్మనాయుడు మధ్య తలెత్తిన కవ్వింపు చర్యలు రెండు రాజ్యాల మధ్య కోడిపందేనికి దారితీస్తాయి.
బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ తంగిరాల వెంకటసుబ్బారావు సిద్ధాంత గ్రంథం(పీహెచ్డీ థీసిస్) ‘తెలుగు వీరగాథ కవిత్వం’లో పేర్కొన్న వివరాల ప్రకారం, మాచర్ల సైన్యాధ్యక్షుడు ‘కన్నమనీడు’ మాచర్ల పైకి వచ్చిన దొంగలను తరుముతూ గురజాలకు రాగా, అతన్ని నాగమ్మ రెచ్చగొట్టడంతో రెండు రాజ్యాల మధ్య కోడిపందేనికి దారితీసింది.
గురజాల, మాచర్ల మధ్య ఉన్న గోలివాగు ప్రాంతంలో కోడేరుగుట్టల వద్ద ఈ కోడిపోరు జరిగినట్టుగా చారిత్రక రచనల్లో ప్రస్తావన ఉంది.
మాచర్ల, గురజాల మధ్య జరిగిన కోడిపందెంలో బ్రహ్మనాయుడు తరఫున ‘చిట్టిమల్లు’ పోరులో నిలిచింది. ఆ పోరులో ‘చిట్టిమల్లు’ ఓడిపోవడంతో మలిదేవరాజు ఏడేళ్లు వనవాసం చేయాల్సి వస్తుంది. ఆ తరువాత రాజ్యంలో వాటా కోసం పల్నాటి యుద్ధం జరుగుతుంది.
‘‘రాజ్యం చిన్నదే, ఒక జిల్లా అంత విస్తీర్ణమే, కానీ ఈ యుద్ధంలో అన్ని ప్రాంతాల వారూ పాల్గొన్నారు’’ అని బీబీసీతో మాట్లాడుతూ చరిత్ర పరిశోధకులు డాక్టర్ మలయశ్రీ అన్నారు.

చిట్టిమల్లు ఎక్కడిది?
బ్రహ్మనాయుడు పందేనికి ఎంచుకున్న చిట్టిమల్లు అనే జాతి కోడి చుట్టూ అనేక జానపద కథలు వ్యాప్తిలో ఉన్నాయి.
అందులో ఒక కథనం ప్రకారం... మాచర్ల చుట్టుపక్కల కోళ్లన్నంటినీ నాగమ్మ కొనేయడంతో బలమైన పందెం కోడికోసం బ్రహ్మనాయుడు వెతుకుతుంటారు. అప్పుడు, గతంలో తానొక యుద్ధం నుంచి తిరిగి వస్తూ పానగల్ సమీపంలో ఒక రాతి చట్టు (Stone slab) కింద మహిమగల ఒక విచిత్రమైన కోడిపుంజును చూశానని, దానిపేరు ‘‘అర్దనాల చిట్టిమల్లుడు’’ అని, దానిని తీసుకురావాలని బ్రహ్మనాయుడి సోదరుడు బాదన్న సూచిస్తాడు.
ప్రొఫెసర్ తంగిరాల వెంకట సుబ్బారావు ‘‘తెలుగు వీరగాథ కవిత్వం’’లో( పేజీ నెంబర్ 257-259) చిట్టిమల్లుకు సంబంధించిన మరికొన్ని విశేషాలు ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బాదన్న చెప్పిన ప్రకారం బ్రహ్మనాయుడు ‘‘రాయ వీర పడాలు’’ అనే బంటును పానగల్లుకు పంపుతారు. అతను కృష్ణానదిని దాటి పానగల్లు చేరుకుని అక్కడ బేతాళున్ని, అడ్డగించిన ఇతరులను చంపి చిట్టిమల్లును తీసుకుని మాచర్లకు చేరుతాడు.
చిట్టిమల్లుకు ఒక పూర్వజన్మ కథ కూడా ఉంది.

ఫొటో సోర్స్, Telugu Veeragadha kavitvam/Prof. T.V. Subba Rao
చిట్టిమల్లు పూర్వజన్మ వృత్తాంతం ప్రకారం, పూర్వం ఫలదుడు అనే మహర్షి శాపంతో ముగ్గురు దాస్యులు కోడిగుడ్లుగా పుడతారు. వాటిని నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన ఒక చెంచు జాతి వ్యక్తి తన వెంట తీసుకెళ్లగా, వాటిలో ఒక గుడ్డు కుళ్లిపోయిందని, మరొక గుడ్డు పెట్టగా మారి వెంటనే చనిపోయిందని, మిగిలిన గుడ్డు పుంజుగా పెరిగి పెద్దవుతుందని, అదే చిట్టిమల్లుడు అనే కథనం ముదిగొండ వీరభద్ర కవి రచనలో ఉందని తంగిరాల వెంకట సుబ్బారావు తన గ్రంథంలో తెలిపారు.
కొంతకాలానికి నల్లమలకు వేటకు వచ్చిన 66 మంది పానుగంటి రాజపుత్రులను చిట్టిమల్లు చంపుతుంది. దీంతో చెంచు జాతి వ్యక్తి చిట్టిమల్లు చేష్టలకు భయపడి దాన్ని ఒక ఇనుప పెట్టెలో పెట్టి, పానుగల్లు కోట బయట భూస్థాపితం చేస్తాడు. ఆ తర్వాత అది భూగర్భంలో తవ్వుతూ వెళ్లి ఒక రాతి చట్టు కిందకు చేరుతుంది.
మరో జానపద రచనలో.. తన భార్య అహల్యను పొందేందుకు మాయావేషంలో వచ్చిన ఇంద్రునికి సహాయం చేసిన బృహస్పతిని, గౌతమముని శాపించడంతో అతను కోడిగా పుట్టాడని, అతనే చిట్టిమల్లుడు అని ఉందని తంగిరాల వెంకట సుబ్బారావు తన రచనలో ప్రస్తావించారు.
పల్నాటి కోడి పోరులో భాగంగా జరిగిన మొదటి పందెంలో బ్రహ్మనాయుడు తరఫున చిట్టిమల్లుతో తలపడిన నాగమ్మ పందెం కోడి ‘నల్లమల్లు’ నేలకొరుగుతుంది. రెండో పందెంలో నాగమ్మకే చెందిన రెండో పందెం కోడి ‘సివంగి డేగ’ చేతిలో చిట్టిమల్లు చనిపోతుంది.

ఫొటో సోర్స్, @Venkat Reddy
'పానగల్ కోడి'
చిట్టిమల్లు నల్గొండ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న పానగల్ (పానుగల్లు) ప్రాంతానికి చెందిన ఒక రకం కోడి జాతి అని తెలంగాణ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ డి.సూర్యకుమార్ గతంలో ఒక పరిశోధనాత్మక వ్యాసం ప్రచురించారు.
‘‘12వ శతాబ్దానికి పూర్వమే తెలంగాణ పాడి పంటలతో విలసిల్లుతూ, బలమైన పశు సంపదకు ఆలవాలంగా నిలిచిందన్నది చారిత్రక వాస్తవం. కృష్ణా నదికి ఉత్తరాన ఉన్న నల్గొండ సుసంపన్న క్షేత్రం. కోతలకు సిద్ధంగా ఉండి తలలు వేలాడేసిన వరి మళ్లు బంగారం కరిగించి పోసిన అచ్చుల్లా ఉన్నాయని అప్పటి శాసనాల్లో వివరించారు.
వ్యవసాయం సుసంపన్నమైతే బలవర్ధకమైన పశుసంపద ఉంటుంది. బహుశా అలా బలమైనదే చిట్టిమల్లు పానుగల్లు కోడి’’ అని డి.సూర్య కుమార్ తన వ్యాసంలో ప్రస్తావించారు.
రాయలసీమ ప్రాంత ప్రముఖ రంగస్థల కళాకారుడు, రచయిత గుర్రం చెన్నారెడ్డి తన ‘పలనాటి చరిత్ర’ గ్రంథంలో చిట్టిమల్లు నల్గొండ సమీపంలోని పానగల్లు ప్రాంతానిదే అని నిర్ధరించారు.
అయితే, తెలుగు నేలలో ‘పానగల్’ పేరుతో మూడు పట్టణాలు ఉండటంతో (చిత్తూరు జిల్లా పానగల్, మహబూబ్ నగర్ జిల్లా పానగల్, నల్గొండ జిల్లా పానగల్) జానపద గాథల్లో ప్రస్తావించిన పానగల్ నల్గొండ సమీపంలోనిదేనా అన్న అంశంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి.
‘‘ప్రాంతీయ కథలకు ఆధారం దొరకడం కష్టం. మహబూబ్ నగర్‌లో సంస్థానాల కల్చర్ ఉంది. సంస్థానాధీశులు వినోదాల కోసం కోడిపందేలు ఆడారు. అది బహుశా ఇటు వైపు వచ్చి ఉండవచ్చునేమో’’ అని కొత్తతెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ సందేహం వ్యక్తం చేశారు.
‘‘చిట్టిమల్లును వెతుకుతూ బయల్దేరిన రాయవీర పడాలు ముదిమాణిక్యం-చిట్టేల సమీపంలో కృష్ణానదిని దాటి పానగల్ చేరినట్టుగా చారిత్రక రచనల్లో ప్రస్తావన ఉంది. చిట్టేల కృష్ణాతీర ప్రాంతంలోని రవాణా రేవుగా బ్రిటిష్ రికార్డుల్లో ఉంది. ఈ ప్రాంతంలో కృష్ణా నది చిన్నగా పారుతుంది కాబట్టి సులభంగా దాటే అవకాశం ఉంది. కాబట్టి నల్గొండ సమీపంలోని పానగల్ అని’’ చరిత్రకారులు డి.సూర్యకుమార్ నిర్ధరణకు వచ్చారు.

ఫొటో సోర్స్, @PRAVEEN SHUBHAM
చిట్టిమల్లు రకం కోడి ఇప్పటికీ ఉందా?
చారిత్రక ప్రాధాన్యత పొందిన చిట్టిమల్లు అనేది కోళ్లలో ఒక జాతా లేదా బ్రహ్మనాయుడు తన పందెంకోడికి పెట్టుకున్న ముద్దుపేరా అన్న సంశయాలు ఉన్నాయి.
పూర్వం రాజులు యుద్ధాలకు వెళ్లేప్పుడు తమ గుర్రాలు, ఏనుగులకు పేర్లు పెట్టుకునే వారు. బహుశా చిట్టిమల్లు పేరు అలాంటిదే కావొచ్చు అని పశువైద్యాధికారి కిరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై బీబీసీ తెలంగాణ కు చెందిన కొంతమంది పశుసంవర్థక శాఖ శాస్త్రవేత్తలతో మాట్లాడింది.
‘’చిట్టిమల్లు అనే ప్రత్యేక బ్రీడ్ పేరు వినలేదు. అయితే, అది తెలుగు ప్రాంతాలకు చెందిన ‘అసిల్’(Aseel) రకం కోడి కావొచ్చు. ఇవి మామూలు కోళ్లతో పోలిస్తే ఎక్కువ ఎత్తు, పొడవైన మెడ, కాళ్లతో చాలా చురుకుగా ఉంటాయి. వీటికి శిక్షణ ఇచ్చి పందెం కోళ్లుగా వాడటం ఉంది’’ అని పశు ఉత్పత్తి, నిర్వహణ విభాగం శాస్త్రవేత్త , మామునూరు(వరంగల్) కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు రాజన్న బీబీసీతో చెప్పారు.
చిట్టిమల్లు అసిల్ జాతి కోడిపుంజు అన్న అభిప్రాయంతో కరీంనగర్ వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ ఏకీభవిస్తున్నారు. అసిల్ జాతి పందెంకోళ్లు చురుగ్గా, ఆకర్షణీయంగా, వివిధ రంగుల్లో ఉంటాయని అన్నారు.
తెలంగాణలోని ఖమ్మం, ఒడిశాలోని కోరాపుట్, ఛత్తీస్‌గడ్‌లోని బస్తర్ వంటి ప్రాంతాల నేటివ్ బ్రీడ్‌గా అసిల్ జాతి ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్( ICAR) ఆధ్వర్యంలోని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ యానిమస్ సైన్సెస్’ ప్రచురించింది.
అసిల్ జాతిలో పీలా, నూరి, చీత, కవ్వల్ ఇలా వివిధ రకాల పేర్లతో వివిధ రంగులు, శారీరక లక్షణాలతో 13 రకాలు ఉన్నట్టుగా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- తెలుగు భాషా దినోత్సవం: గిడుగు వెంకటరామమూర్తి తెలుగు వాడుక భాష కోసం ఎలా కృషి చేశారంటే...
- సర్వాయి పాపన్న: విప్లవకారుడా, బందిపోటా... ఆయనపై ఔరంగజేబుకు ఫిర్యాదు చేసిన తర్వాత ఏమైంది?
- ఆంధ్రప్రదేశ్: తోలుబొమ్మలాట మొగలుల దండయాత్ర వల్లే తెలుగు నేలకు చేరిందా?
- రాజ సంస్థానాలు: భారత్‌లో విలీనానికి హైదరాబాద్ నిరాకరించినప్పుడు ఏం జరిగింది... పటేల్-వీపీ మేనన్ ఒప్పందాలతో రాచరిక వారసులకు అన్యాయం జరిగిందా?
- నాయకురాలు నాగమ్మ పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు... ఆమె పుట్టింది తెలంగాణలోనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














