అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి యాదవుల బంగారం, వజ్రాలు, వెయ్యి మణుగుల వెండి దోచుకున్నారా? ఈ కోట రక్షణకు బాహుబలి తరహా సెటప్ ఉండేదా?

- రచయిత, సిద్ధాంత్ గను
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతంపై దండెత్తారు. దేవగిరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అది మాత్రమే కాదు, దేవగిరిని స్వాధీనం చేసుకున్న తర్వాత, బంగారం, వజ్రాలు, ముత్యాలతో పాటు ఇంకా విలువైన వస్తువులను కొల్లగొట్టిన కథ మీరు వినే ఉంటారు.
అల్లావుద్దీన్ ఖిల్జీ క్రూర చరిత్ర గురించి ఎన్నో కథలు, ఇతిహాసాలు ఉన్నప్పటికీ, ఖిల్జీ దేవగిరిని కొల్లగొట్టి భారీ సంపదను దోచుకున్న కథ కేవలం పుకారు మాత్రమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
మధ్యయుగాల నుంచి మారుతూ వస్తోన్న మహారాష్ట్రకు సాక్ష్యంగా నిలిచిన ఒక కోట ఈ దేవగిరి లేదా దౌల్తాబాద్. మమ్మద్ బిన్ తుగ్లక్‌కు దేవగిరి కోట నుంచి పరిపాలన చేయాలని అనిపించేలా చాలా రాజవంశాలు ఇక్కడి నుంచి పరిపాలన సాగించాయి. అసలీ కోట కథేంటి?
యాదవ వంశానికి చెందిన పాలకుడు ఐదవ భిల్లం తన రాజధానిని దేవగిరికి మార్చారు. అంతకుముందే ఈ కోట ఉన్నప్పటికీ యాదవుల కాలం తర్వాత ఈ కోటకు చారిత్రక ప్రాధాన్యం చేకూరింది.
యాదవ, ఖిల్జీ, తుగ్లక్, బహమనీ, నిజాంషాహీ, మొఘల్, మరాఠా, అసఫ్జాహీ రాజ్యాల జెండాలు ఎగిరిన ఈ కోట, చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
దేవగిరి కోట చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థ ఉండేది. వాటిని 'కోట్స్'గా పిలిచేవారు. కోట చుట్టూ మూడు రక్షణ వలయాలుగా ఎత్తైన గోడలు ఉండేవి. మొదటి రక్షణ వలయాన్ని అంబర్ కోట్‌గా పిలిచేవారు. ఇది నిజాంషాహీల పాలనలో వాజీర్‌గా వ్యవహరించిన మాలిక్ అంబర్ నిర్మించారు. అందువల్ల దీన్ని అంబర్‌కోట్‌గా పిలిచేవారు. ప్రస్తుత దౌల్తాబాద్ నగరం ఈ అంబర్‌కోట్ పరిధిలోనే ఉంది.
రెండోది మహాకోట్. మూడో రక్షణ వలయం కాలాకోట్. ఈ మూడో రక్షణ వలయం దాటిన తర్వాత ప్రధాన కోట అయిన దేవగిరి కోటలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు ఉన్నాయి.
సుమారు 200 మీటర్ల ఎత్తైన ఈ మట్టి కోట.. చుట్టూ కందకాలు, ప్రాకారాలతో శత్రుదుర్బేధ్యంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ కోట చాలా దాడులను ఎదుర్కొంది. దిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి గురించి ప్రధానంగా చెప్పుకుంటారు.

అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి, దోపిడీ
చరిత్రకారుడు మొహమ్మద్ ఖాసిం ఫరిష్టా రాసిన పుస్తకం 'తారిఖ్-ఇ-ఫరిష్టా'లో అల్లావుద్దీన్ ఖిల్జీ, రామచంద్ర రాయ్ మధ్య జరిగిన యుద్ధం, ఆ తర్వాత దేవగిరి సంపద దోపిడీ గురించిన ప్రస్తావన ఉంది.
యాదవ రాజవంశానికి చెందిన రామచంద్ర రాయ్ 1271లో సింహాసనాన్ని అధిష్టించారు. రామచంద్ర రాయ్ ఏలుబడిలో యాదవ సామ్రాజ్యం, దేవగిరి శక్తిమంతంగా ఎదిగింది.
దక్షిణాదిలోని ప్రత్యర్థి రాజులపై కన్నేసి ఉంచిన రామచంద్ర రాయ్ 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీతో తలపడ్డారు. ఆ సమయంలో రామచంద్ర రాయ్ ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాగా పిలిచే ఔరంగాబాద్ లేదా లాసూర్ సమీపంలో ఉన్నారు.
ఆ దాడి తర్వాత కంగారుపడిన రామచంద్ర రాయ్ దేవగిరికి వచ్చి తలదాచుకున్నారు. అయితే, ఉత్తరం వైపు నుంచి మరో 20 వేల మంది సైన్యం వస్తున్నట్లు ఖిల్జీ సైన్యం పుకార్లు వ్యాపింపజేసింది.
ఆ తర్వాత రామచంద్ర రాయ్, ఖిల్జీ మధ్య అయిష్టంగానే ఒప్పందం కుదిరింది. 6 మణుగుల (మణుగు అంటే సుమారు 40 కిలోలు) బంగారం, 7 మణుగుల ముత్యాలు, 2 మణుగుల వజ్రాలు, కెంపులు, పచ్చలు, విలువైన రాళ్లు, వెయ్యి మణుగుల వెండి, వెయ్యి గజాల పట్టు వస్త్రాలు ఇచ్చేలా ఆ ఒప్పందం జరిగినట్లు చెబుతారు.
ఈ కథ చదువుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో కళ్లముందు కనిపిస్తోంది. అయితే, ఈ వర్ణనలన్నీ ఫరిష్టా పుస్తకంలో మాత్రమే ఉన్నాయి. ఖిల్జీ కాలంనాటి కవి, చరిత్రకారుడు అమీర్ ఖస్రో లేదా అతని తర్వాతి కాలానికి చెందిన అబ్దుల్ మాలిక్ ఇసామి దేవగిరి దాడుల గురించి చేసిన వివరణాత్మక వర్ణనల్లోనూ ఎక్కడా ఈ దోపిడీ గురించిన ప్రస్తావన లేదు. అందువల్ల చాలా మంది చరిత్రకారులు ఈ దోపిడీ ఘటన విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.
ఫరిష్టా 17వ శతాబ్దానికి చెందినవారు. కాబట్టి 13వ శతాబ్దంలో జరిగిన సంఘటనల గురించి ఆయన పుస్తకంలో దేవగిరి దోపిడీ ప్రస్తావన చారిత్రకంగా ఎంతవరకూ నిజం, ఎంతవరకూ ఊహాజనితమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సీనియర్ చరిత్రకారులు డాక్టర్ బ్రహ్మానంద్ దేశ్‌పాండే కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించిన దేవగిరి దోపిడీపై సందేహాలు వ్యక్తం చేశారు. ఖిల్జీ ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ స్వయంగా దేవగిరికి వెళ్లకపోయి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.

దేవగిరి చీకటి దారులు
దేవగిరి రాజ్య స్థాపన, యుద్ధాల గురించి తెలుసుకునే క్రమంలో ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న పురాతన గాథల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.
దేవగిరి ప్రధాన కోటలోకి ప్రవేశ ద్వారం ప్రారంభంలో ఉండే సొరంగ మార్గం చిమ్మచీకటిగా, ఎత్తైన మెట్లతో దుర్బేధ్యంగా ఉంటుందని, కోటపై దాడి చేసేందుకు దగ్గరగా వచ్చిన శత్రువులను కోట చుట్టూ ఉన్న కందకాల్లో పడేసేవారని పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
చీకటిమయంగా ఉండే ఆ దారి వంపులు తిరిగి ఉంటుందని, ఆ దారిలోని మెట్ల ఎత్తు, ఆకారం అసాధారణంగా ఉంటాయని చెబుతారు. అంటే, ఎవరైనా బలవంతంగా లోపలికి చొరబడాలని ప్రయత్నిస్తే అక్కడే అంతం అయిపోయేట్టుగా వాటిని మలిచారన్న వాదనలు ఉన్నాయి. ఆ చీకటి దారిలోనే సైనికులు పహారా కాసే నిర్మాణాలు కూడా ఉండేవని చెబుతారు.
చివరగా, ఇనుముతో చేసిన తలుపు ఒకటి ఉంటుందని, దానిని దాటి వచ్చినా ఆ తర్వాత మంటలు, పొగలు వచ్చేలా ఏర్పాట్లు ఉండేవని చెబుతారు.
ఆ సొరంగ మార్గం రాతి గోడల మధ్య గాలి వచ్చేందుకు వీలుగా ఖాళీలు ఉండేవి. ఒక ఇనుప జాలీలో బొగ్గును మండించి, గోడల మధ్య ఉన్న ఖాళీల గుండా దట్టమైన పొగ వ్యాపించేలా ఏర్పాట్లు ఉండేవి. ఆ చిమ్మచీకట్లో, దట్టమైన పొగ, వేడిని దాటుకుని రావడం దాదాపు అసాధ్యం.
క్రీస్తు పూర్వం 189వ సంవత్సరంలో రోమన్ సైన్యం అంబార్షియాపై దాడి చేసినప్పుడు కూడా ఇదే పథకం అమలు చేశారని గ్రీకు చరిత్రకారుడు పాలిబియస్ రాశారు.
''కొన్ని ప్రాంతాల్లో ఈ చీకటి దారులకు పైభాగంలో మంటలు అంటించినట్లు చెబుతారు. అయితే, పైనుంచి మంటలు అంటిస్తే అంతలా పొగ వ్యాపించే ఆస్కారం లేదు. కాలక్రమేణా పైన ఉంచిన మూత లేదా తలుపు కూడా ఉండాల్సిన ఎత్తు కంటే ఇంకా పైకి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చీకటి దారిలోకి దట్టమైన పొగ వ్యాపింపజేసే ప్రణాళిక ఇక్కడ సాధ్యం కాదు'' అని భారతీయ కోటల గురించి సిడ్నీ టొయే తన పుస్తకం ''స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ఇండియా''లో రాశారు.
ఈ సొరంగం గుండా వెళ్లేందుకు మూడు దారులు ఉన్నాయి. అందులో ఒక మార్గంలో వెళ్తే అకస్మాత్తుగా వెలుగు వచ్చి ఏం జరిగిందో తెలుసుకునేలోపే గుంతలో పడిపోతారు. రెండో మార్గం భారీ కందకానికి దారితీస్తుంది. మూడోది కోట వైపు ముందుకు తీసుకెళ్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
విశాల్ ఖందక్, మాలిక్ అంబర్
దేవగిరి కోట కొండపై ఉండేది. దాని చుట్టూ రక్షణ గోడ(ప్రాకారం) ఉండేది. ఈ కోట రక్షణలో ప్రధానమైనది కోట చుట్టూ ఉన్న భారీ కందకం. ఈ కందకం యాదవుల కాలంలో లేదు.
మీరు మొదట్లో చదివిన వర్ణనలోనూ ఈ కందకం ఊసు లేదు. ఈ కందకం గురించి మూలాలను వెతుక్కుంటూ వెళ్తే నిజాంషాహీ పాలనలో వాజీర్‌గా పనిచేసిన మాలిక్ అంబర్ వద్దకు చేరుకుంటారు.
మాలిక్ అంబర్ ఒక ఆఫ్రికన్ బానిస. అయితే, అతను భారతదేశానికి వచ్చిన తర్వాత తన తెలివితేటలు, నైపుణ్యంతో నిజాంషాహీ పాలనలో వాజీర్‌గా ఎదిగాడు.
నిజాంషాహీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు మాలిక్ అహ్మద్ 1490లో దేవగిరిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 1610 ప్రాంతంలో ముర్తజా నిజాంషాహీ పాలనలో ఉంది. ముర్తజా నిషాంషాహీ వద్ద మాలిక్ అంబర్ వాజీర్‌గా ఉండేవాడు. 1636లో నిజాంషాహీలను ఔరంగజేబు ఓడించి దక్కన్ ప్రాంతాన్ని తన రాజ్యంలో కలిపేసుకున్నారు.

బాహుబలి తరహా వ్యవస్థ?
ఆ కాలంలోనే మాలిక్ అంబర్ దేవగిరి చుట్టూ కందకం ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ అతిపెద్ద కందకంలో ప్రతి 200 మీటర్ల వద్ద ఆనకట్ట లాంటి నిర్మాణాలు ఉండేవి. క్రమంగా వాటి లోతు పెంచుతూ పోయారు. శత్రువులు కోట ప్రాకారాలు దాటి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే ఆ కందకాల్లో పడేయాలన్నది వారి ప్రణాళిక.
ప్ర.కే. ఘానేకర్ తన పుస్తకం ''యాదవాంచ దేవగిరి'' పుస్తకంలో ఈ కందకం గురించి వివరాలు రాశారు. ఆ కందకంపై ఒక వంతెన ఉండేదనే వాదనలు ఉన్నాయి. అయితే, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు.
బాహుబలి సినిమాలో చూపించిన ఆనకట్టల తరహా సెటప్ ఇక్కడ ఉండేదేమోనని నిపుణులు చెబుతున్నారు.
''రెండు ఆనకట్టల వంటి నిర్మాణాల మధ్య ఈ కందకాలు ఉండేవి. శత్రువులతో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఒక ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేసేవారు. రెండో ఆనకట్టను మూసేసేవారు.
ఆ కందకం మీదుగా కోటలోకి ప్రవేశించే వంతెన తక్కువ ఎత్తులో ఉండడం వల్ల నీరు విడుదల చేసినప్పుడు అది మునిగిపోయే ప్రమాదం ఉండేది. దాని వల్ల శత్రవులు ఆ కందకాన్ని దాటలేరు.
అదే ప్రాంతంలో 1952లో ఇనుమ వంతెనను నిర్మించారు. ఒక కందకాన్ని సృష్టించి, దానిలో నీటి మట్టాన్ని నియంత్రించడం ద్వారా కోట రక్షణకు మాలిక్ అంబర్ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు'' అని నిపుణులు చెబుతున్నారు.

దేవగిరికి తుగ్లక్ రాజధాని
సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం దిల్లీలో కొద్దిగా గందరగోళం నెలకొంది. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు కుత్బుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ సింహాసనాన్ని అధిష్టించారు. ఆ తర్వాత ఖిల్జీల స్థానంలో తుగ్లక్‌ల శకం ప్రారంభమైంది.
దేవగిరిని మొదట కుత్బాబాద్‌గా పేరు మార్చారు. ఆ తర్వాత కువాత్ ఉల్ ఇస్లాంగా మారింది. ఆ తర్వాత దేవగిరి పేరు మళ్లీ మార్చాల్సి వచ్చింది.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక అసాధారణ రాజుగా చరిత్రకెక్కారు. ఆయన దిల్లీ నుంచి తన రాజధానిని దేవగిరికి మార్చాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దేవగిరి దౌల్తాబాద్‌గా మారింది.
రాజధానిని దిల్లీ నుంచి దౌల్తాబాద్‌కి మార్చాలని 1327లో తుగ్లక్ ఉత్తర్వులు జారీ చేశాడు. దీంతో రాజధాని ఉత్తరాది నుంచి దక్కన్ ప్రాంతానికి వచ్చింది.
అయితే తుగ్లక్ రాజధానిగా దౌల్తాబాద్ కొద్దికాలం మాత్రమే ఉంది. 1334లో రాజధానిని తిరిగి దిల్లీకి మార్చాలని తుగ్లక్ నిర్ణయించుకున్నాడు. దీంతో పరిపాలన మళ్లీ ఉత్తరాదికి చేరింది. రాజధానిగా ఉన్న కొద్దికాలంలోనే దౌల్తాబాద్‌కి భౌగోళిక రాజకీయ పరంగా ప్రాధాన్యం పెరిగింది. దేవగిరి లేదా దౌల్తాబాద్ కోట దక్కన్ ప్రాంతంలో ముఖ్యమైన అధికార కేంద్రంగా గుర్తింపు పొందింది.
తుగ్లక్ ఇక్కడి నుంచి తరలిపోయే నాటికి పరిసర ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు చేశాడు. మార్కెట్లు, మసీదులు, బావులు, సత్రాలు వంటి తుగ్లక్ కాలం నాటి నిర్మాణాల ఆనవాళ్లు నేటికీ అక్కడ కనిపిస్తాయి.

కోటలో గుహలు, మసీదు
దేవగిరి కొండల్లో కొన్ని గుహలు కూడా కనిపిస్తాయి. కాలా కోట్ లోపల మూడు, నాలుగు గుహలు ఉంటాయి. వాటిలో మధ్య గుహ పెద్దది. అందులో మూడు గదుల వంటి నిర్మాణం ఉంటుంది. ఈ గుహకు ఎదురుగా 24 గూళ్లు తవ్విన మరో విశాలమైన గుహ ఉంది. గతంలో ఆ గూళ్లలో 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలు ఉండేవని విశ్వసిస్తారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి విగ్రహాలూ లేవు. అయితే, ఈ గుహలను చేరుకోవడం అంత సులభం కాదు.
కోట లోపల ఉండే మసీదు మరో ఆసక్తికరమైన విషయం. దేవగిరిని ఖిల్జీలు స్వాధీనం చేసుకున్న తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు ఖుత్బుద్దీన్ ముబారక్ ఆ కోటలో ఒక మసీదు నిర్మించారు. అదే జామీ మసీదు. పడమర వైపు 126 స్తంభాలతో ఒక ప్రార్థనా మండపం కూడా నిర్మించి ఉంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిజాం నవాబు తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు అంగీకరించలేదు. దీంతో హైదరాబాద్‌ను విముక్తి చేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ పోలో చేపట్టి నిజాం పాలనను అంతమొందించింది. ఆ సమయంలో దేవగిరి కోటలో ఉన్న మసీదులో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్టించి భరతమాత మందిరంగా మార్చారు.
భావార్థదీపికలో యోగదుర్గ అనే కోట గురించి స్వామీజీ జ్ఞానేశ్వర్ రాశారు. దేవగిరి కోట గురించే జ్ఞానేశ్వర్ రాశారని చెబుతుంటారు.
మరాఠీ సాహిత్య ప్రముఖులు, ప్రొఫెసర్ ఎం.వా. ధోండ్, అలాగే ఆగాశే ఈ కోట గురించి విపులంగా రాశారు. అయితే చరిత్ర, పురావస్తు నిపుణులు ఎం.శ్రీ మాటే మాత్రం ఆ వాదనలను తోసిపుచ్చుతున్నారు.
జ్ఞానేశ్వర్ చెప్పినట్టుగా యోగదుర్గం అనేది దౌల్తాబాద్/దేవగిరి కోట కాదని పురావస్తు తవ్వకాలు, చారిత్రక ఆధారాలను ప్రస్తావిస్తూ ఆయన 1995లో ''యోగదుర్గం అండ్ దేవగిరి'' అనే వివరణాత్మక వ్యాసం రాశారు.
మధ్యయుగాల నాటి నుంచి నేటి వరకూ ఎన్నో చరిత్రలకు సాక్ష్యంగా నిలిచిందీ కోట. ఆ కాలంనాటి వాస్తుశిల్పాలు, రాజ్య విస్తరణ, ప్రధాన రాజకీయ ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన దేవగిరి కోట ఇప్పటికీ కోట ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అనడంలో ఎలాంటి ఆశ్యర్యమూ లేదు.
ఇవి కూడా చదవండి:
- హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'
- యూదుల ఊచకోతకు నాజీలు పన్నిన కుట్రల గురించి పోప్‌కు ముందే తెలుసా... 1942 నాటి రహస్య లేఖలో ఏముంది?
- 'సనాతన ధర్మమే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చింద'న్న మోదీ మాటల్లో నిజమెంత?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- మొఘల్ చక్రవర్తి అక్బర్‌పై బీజేపీ విధానం మారిందా, ప్రశంసల వెనక ఆంతర్యం అదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














