మ్యాక్స్‌వెల్: భరించలేని నొప్పితో పరుగెత్తలేకపోతున్నా అతడికి 'రన్నర్‌' ఎందుకు రాలేదు?

గ్లెన్ మ్యాక్స్‌వెల్

ఫొటో సోర్స్, Reuters

ఓటమి అంచుల దాకా వెళ్లిన ఆస్ట్రేలియాను వీరోచిత ఒంటరి పోరాటంతో గెలిపించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.

ప్రపంచ కప్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ తొడ కండరాల నొప్పి భరించలేనంతగా వేధిస్తున్నా, దానిని పంటి బిగువున నొక్కి పెడుతూ బ్యాటింగ్ కొనసాగించాడు.

128 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, ‘ప్లేయర్ ఆఫ ద మ్యాచ్’గా ఎంపికైన అతడిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

కండరాలు పట్టేసి మైదానంలోనే కిందపడిపోయి, సరిగా నిలబడలేని, పరుగెత్తలేని స్థితిలో ఉన్న మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ అలాగే ఎందుకు కొననసాగించాడు? అత్యధిక పరుగులను ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే సాధిస్తున్నా, అవసరమైనప్పుడు సింగిల్స్ తీయడానికి కూడా అతడు ఎందుకు అంత నొప్పిని అలాగే భరించాల్సి వచ్చింది? అతడికి రన్నర్‌(బైరన్నర్) ఎందుకు రాలేదు? - ఇలాంటి ప్రశ్నలు చాలా మంది ప్రేక్షకుల్లో మెదిలాయి. వీటికి సమాధానాలు ఈ కథనంలో చూద్దాం.

మ్యాక్స్‌‌వెల్

ఫొటో సోర్స్, Getty Images

మైదానంలో పడిపోయిన మ్యాక్స్‌‌వెల్

అఫ్గాన్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ పెవిలియన్‌కు చేరింది. 8.2 ఓవర్ల వద్ద 49 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగాడు. కానీ, కొద్దిసేపటికే లబుషేన్ రనౌట్ అయ్యాడు.

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన స్టాయినిస్, స్టార్క్‌లు కూడా నిలబడలేదు. అంటే 91 పరుగులకే ఏడు వికెట్లు పడిపోయాయి. ఈ స్థితిలో మ్యాక్స్‌వెల్ మ్యాచ్‌ను మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇన్నింగ్స్‌ను క్రమంగా చక్కదిద్దడం మొదలుపెట్టాడు.

అయితే, ఇన్నింగ్స్‌లో 147వ రన్ వద్ద, తన 35వ సింగిల్ తీసే సమయంలో హామ్‌స్ట్రింగ్‌ నొప్పి (తుంటి భాగం నుంచి తొడ వెనుకగా మోకాలి కింద వరకూ ఉండే కండరాలు పట్టేసి భరించలేని నొప్పి) వల్ల మ్యాక్స్‌వెల్ పరుగులు తీయలేక మైదానంలో పడిపోయాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్నట్లు అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.

మ్యాక్స్‌వెల్

ఫొటో సోర్స్, Reuters

అతడి స్థానంలో బ్యాటింగ్‌కు సిద్ధమైన ఆడమ్ జంపా

మ్యాక్స్‌వెల్ ఒక దశలో మైదానంలోనే కింద పడిపోయాడు. ఆ వెంటనే ఆస్ట్రేలియా ఫిజియోథెరపిస్ట్ నిక్ జోన్స్ మైదానంలోకి వచ్చి మ్యాక్స్‌వెల్‌కు ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించారు.

ఇక మ్యాక్స్‌వెల్‌ వికెట్ల మధ్య పరిగెత్తడం కష్టమని ఆస్ట్రేలియా జట్టు భావించిన తరుణంలో అతడి స్థానంలో మరో బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చేందుకు ఆడమ్ జంపా సిద్ధమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ మెట్లు దిగి, మైదానం దగ్గరకు వచ్చాడు. అయితే మ్యాక్స్‌వెల్ ‘రిటైర్డ్ హర్ట్‌’గా క్రీజు వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు.

ఈ పరిస్థితుల్లో మ్యాక్స్‌వెల్‌‌‌కు (బై)రన్నర్‌ వస్తే సరిపోతుంది కదా అని ఐసీసీ నిబంధనల గురించి తెలియని చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు.

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అది వీలు కాదు. ఎందుకంటే, బ్యాటర్లు గాయాలపాలైనా, పరుగు తీసేందుకు ఇబ్బంది ఎదురైనా, రన్నర్‌ను పెట్టుకునే వెసులుబాటును ఐసీసీ గతంలోనే ఎత్తివేసింది.

వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 128 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మ్యాక్స్‌వెల్

ఐసీసీ నిబంధన ఏమిటి? సునీల్ గావాస్కర్ ఏమన్నారు?

అంతర్జాతీయ క్రికెట్‌లో రన్నర్ విధానాన్ని ఎత్తేయాలని ఐసీసీ ఎగ్జిక్యూటివ్స్ ‌కౌన్సిల్ 2011లో నిర్ణయించింది.

ఆట మధ్యలో ఫీల్డ్‌లో అడ్డంకులు రాకుండా చూసేందుకు తీసుకొన్న నిర్ణయమని ఐసీసీ చెప్పింది. 2011 అక్టోబర్ 1 నుంచి ఈ వెసులుబాటు లేకుండా పోయింది.

ఇది క్రికెట్ నిబంధనలను మార్చడం ఏమాత్రం కాదని క్రికెట్ నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యగా అభివర్ణించింది.

రన్నర్‌ను అనుమతించకపోవడమనే నిబంధన కేవలం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుందని ఎంసీసీ తెలిపింది. దేశవాళీ క్రికెట్‌లో రన్నర్‌ను తీసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పింది.

2011లో ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావాస్కర్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టారు.

అలా అయితే, బౌలర్లకు బౌండరీ వద్ద మంచినీళ్లు ఇవ్వడం కూడా ఆపేయాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక ఓవర్ వేసిన తర్వాత బౌలర్ల కోసం బౌండరీ వద్ద ఎనర్జీ డ్రింక్స్ వెయిట్ చేస్తూ ఉంటాయని అప్పట్లో ఆయన ఎన్డీటీవీతో అన్నారు.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరుగెత్తడానికి శరీరం సహకరించకపోవడంతో స్ట్రైకింగ్‌లో ఉంటూ సిక్సులు, ఫోర్లు సాధించాడు మ్యాక్స్‌వెల్

ఇషాన్ కిషన్ తర్వాత మ్యాక్స్‌‌వెల్

ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్, ఆ తర్వాత బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ కావడం చూసిన ప్రేక్షకులు, ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ మరో చాంపియన్‌ను ఓడించబోతోందనే భావించారు. అయితే, అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ మ్యాక్స్‌వెల్ ఆట సాగింది. ఫోర్లు, సిక్సులతో అఫ్గాన్ బౌలర్లపై అతడు విరుచుకుపడ్డాడు.

292 పరుగుల లక్ష్యాన్ని మ్యాక్స్‌వెల్ అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలోనే ఛేదించింది. సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాకు ఇదో అపూర్వ విజయం.

వన్డే క్రికెట్‌లో ఓపెనింగ్‌కు దిగకపోయినా డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు డబుల్ సెంచరీలు చేసిన రికార్డులు ఓపెనర్లపైనే ఉన్నాయి.

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాటర్‌ కూడా మ్యాక్స్‌వెలే.

అతడు రెండు బంతుల తేడాతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ప్రపంచ రికార్డును చేజార్చుకున్నాడు.

ఈ రికార్డు భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ పేరు మీద ఉంది. అతడు 126 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

మ్యాక్స్‌వెల్ 128 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

మ్యాక్స్‌వెల్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాక్స్‌వెల్ ఏమన్నారు?

బ్యాటింగ్‌ సమయంలో తనను కండరాల నొప్పి వేధించడం, తాను అలాగే బ్యాటింగ్ కొనసాగించి, జట్టును గెలిపించడంపై మ్యాక్స్‌వెల్ ఇలా స్పందించాడు.

“మే ఫీల్డింగ్‌లోకి దిగే సమయానికే ఎండ ఎక్కువగా ఉంది. వేడివాతావరణాన్ని తట్టుకునేలా నేను తగినంత వ్యాయామం చేయలేదు కూడా. ఆ ప్రభావం నాపై పడింది. మా బ్యాటింగ్ వ్యూహానికి అనుగుణంగానే బరిలోకి దిగాం. కానీ, పరిస్థితులు మారిపోయాయి. నేను సానుకూల ధృక్పథంతోనే ఆట కొనసాగించాను. అఫ్గాన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూనే పరుగులు సాధించేందుకు ప్రయత్నించాను. ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్ తర్వాత, నేను మరింత దూకుడుగా ఆడాలని నాకు అర్థమైంది. మీరు నా ఇన్నింగ్స్‌లో తేడాను గమనించే ఉంటారు. అఫ్గాన్ బౌలర్లు బాగా బౌలింగ్ చేసి, మమ్మల్ని మొదట్లోనే ఒత్తిడిలోకి నెట్టేశారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో ఆడే అవకాశం వచ్చినా నేను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఇప్పుడు చివరి వరకు క్రీజులో ఉండి, నా జట్టును గెలిపించడం నాకు చాలా గర్వంగా ఉంది” అన్నాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందిస్తూ, “నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. అద్భుతమైన విజయం ఇది. ఇదివరకెన్నడూ చూడనిది. మ్యాక్స్‌వెల్‌కు ఇన్నింగ్స్ ఆసాంతం ఒక ప్రణాళిక ఉంది. లక్ష్యానికి 200 పరుగులు దూరంలో ఉన్నా, మేం ఇలాంటి విజయాన్ని సాధించగలగడం చాలా ప్రత్యేకం” అన్నారు.

వీడియో క్యాప్షన్, మ్యాక్స్‌వెల్: భరించలేని నొప్పితో పరుగెత్తలేకపోతున్నా అతడికి 'రన్నర్‌' ఎందుకు రాలేదు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)