టైమ్డ్ అవుట్: అప్పీల్ వెనక్కి తీసుకోనన్న షకీబ్, ఇది కామన్‌సెన్స్‌కు సంబంధించిన అంశమన్న మాథ్యూస్

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ అవుట్’ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘టైమ్డ్ అవుట్’ అయ్యి పెవిలియన్ చేరిన తొలి క్రికెటర్ అతడే.
ఏంజెలో మాథ్యూస్ హెల్మెట్ సరిగా లేకపోవడంతో ఇదంతా జరిగింది.
సోమవారం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది.
క్రీజులో గార్డ్ ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో టైమ్డ్ అవుట్ ఇవ్వాలని షకీబ్ అప్పీల్ చేయడం, అంపైర్ అవుటివ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి.
నీ పరిస్థితి నాకర్థమైంది కానీ, నా అప్పీల్‌ను వెనక్కి తీసుకోను అని షకీబ్ వ్యాఖ్యానించగా, ఇది కామన్ సెన్స్‌కు సంబంధించిన విషయమంటూ మాథ్యూస్ కామెంట్ చేశాడు.
దీనిపై క్రీడాలోకంలో కూడా భిన్న స్పందనలు వినిపించాయి.

అసలేం జరిగిందంటే...
వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 24.2 ఓవర్లలో 135 పరుగుల వద్ద సదీర సమర విక్రమ వికెట్‌ను కోల్పోయింది.
అప్పుడు శ్రీలంక స్కోరు 24.2 ఓవర్లలో 135/4.
సమరవిక్రమ స్థానంలో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడంటూ బంగ్లాదేశ్ అప్పీలు చేయడంతో అతడిని టైమ్డ్ అవుట్(Timed Out)గా అంపైర్లు ప్రకటించారు.
ఇలా అతడు ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అవుట్ అయ్యి, పెవిలియన్ చేరాల్సి వచ్చింది. జట్టు స్కోరు 24.2 ఓవర్లలో 135/5గా మారింది.
పురుషుల లేదా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అయితే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరుసార్లు టైమ్డ్ అవుట్ ఘటనలు జరిగాయి.
‘టైమ్డ్ అవుట్’ తర్వాత మాథ్యూస్, బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ పేర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.
సమరవిక్రమ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన మాథ్యూస్, షకీబుల్ హసన్ వేసే బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాడు.
తలపై హెల్మెట్‌ను సరిచేసుకుంటుండగా హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.
వెంటనే మరో హెల్మెట్ కావాలని అడగడంతో చమీర కరుణరత్నె అతనికి ఇంకో హెల్మెట్‌ను అందించాడు.
ఈ సమయంలో అక్కడే ఉన్న అంపైర్ మరాయిస్ ఎరాస్మస్‌తో షకీబుల్ హసన్ నవ్వుతూ ఏదో మాట్లాడుతూ కనిపించాడు.
ఆ తర్వాత, మాథ్యూస్ క్రీజులోకి వచ్చిన రెండు నిమిషాల్లో తొలి బంతిని ఎదుర్కోవడంలో విఫలమైనందున టైమ్డ్ అవుట్‌గా ప్రకటిస్తున్నట్లు అంపైర్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అప్పటికీ సమర విక్రమ అవుటై 3 నిమిషాల 20 సెకన్లు అయ్యింది.
తొలుత అంపైర్ జోక్ చేస్తున్నాడని భావించిన మాథ్యూస్.. ఎరాస్మస్, స్క్వేర్ లెగ్ అంపైర్ రిచర్డ్ మధ్య సుదీర్ఘ చర్చ జరుగడంతో షాక్ అయ్యాడు.
క్రీజులోకి వచ్చాక హెల్మెట్ స్ట్రాప్ తెగిపోవడంతో ఎక్కువ సమయం అవసరమైందని తన వాదనలను అంపైర్‌కు వినిపించాడు మాథ్యూస్.
తర్వాత షకీబుల్ హసన్‌తో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ, అతడు తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు.
దీంతో మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో మాథ్యూస్‌తోపాటు శ్రీలంక జట్టు బాగా నిరాశ చెందింది.
మైదానం నుంచి వెనక్కి తిరిగి వస్తూ, బౌండరీ లైన్ దాటాక, మాథ్యూస్ అసంతృప్తితో హెల్మెట్‌ను విసిరేశాడు.
బంగ్లాదేశ్ కోచ్, శ్రీలంక మాజీ ఆటగాడు చండిక హతురుసింఘేతో హెల్మెట్‌లో లోపం గురించి శ్రీలంక ప్లేయర్ మెండిస్ మాట్లాడుతూ కనిపించాడు.

ఫొటో సోర్స్, Getty Images
‘టైమ్డ్ అవుట్’ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
క్రికెట్ నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నియమావళి ప్రకారం, ఒక బ్యాటర్‌ను కింది కారణాలతో టైమ్డ్ అవుట్‌గా ప్రకటించవచ్చు.
వికెట్ పడిన తర్వాత లేదా ఒక బ్యాటర్ ఏదైనా కారణంతో క్రీజు నుంచి రిటైర్ అయితే, తర్వాత వచ్చే కొత్త బ్యాటర్ మూడు నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవ్వాలి. లేకపోతే టైమ్డ్ అవుట్‌గా ప్రకటిస్తారు.
అయితే వరల్డ్ కప్-2023 నిబంధనల ప్రకారం, ఈ టోర్నీలో బ్యాటర్ 2 నిమిషాల్లోపే బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.
‘‘వికెట్ పడిన తర్వాత లేదా రిటైర్‌మెంట్ తర్వాత క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ రెండు నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఇలా చేయని పక్షంలో కొత్త బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటించవచ్చు’’ అని వరల్డ్ కప్ నిబంధనల్లో పేర్కొన్నారు.
మాథ్యూస్ నిర్దేశిత రెండు నిమిషాల్లో క్రీజులోకి వచ్చినట్లుగా కనిపించాడు. కానీ, హెల్మెట్‌లో లోపం కారణంగా తర్వాత ఆలస్యం జరిగింది. ఫలితంగా మాథ్యూస్ నిర్దేశిత 2 నిమిషాల్లో స్ట్రయిక్ తీసుకోలేకపోయాడు.
దీంతో బంగ్లాదేశ్ అప్పీలుకు వెళ్లి, అతన్ని టైమ్డ్ అవుట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
షకీబుల్ హసన్ అప్పీల్ చేశాడన్న రిజర్వ్ అంపైర్
టైమ్డ్ అవుట్ గురించి స్టాండింగ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్‌కు ఫీల్డింగ్ కెప్టెన్ అప్పీల్ చేసినట్లు బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రిజర్వ్ అంపైర్ అడ్రియాన్ హోల్డ్ స్టాక్ చెప్పినట్లు క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది.
హెల్మెట్ స్ట్రాప్ సమస్య తలెత్తడానికి ముందే సమరవిక్రమ అవుటై రెండు నిమిషాలు గడిచిపోయాయని హోల్డ్ స్టాక్ అన్నట్లు క్రిక్ ఇన్ఫో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆటకు మంచిది కాదన్న కామెంటేటర్
మైదానంలో ఇదంతా జరుగుతుండగా కామెంటరీ బాక్సులో ఉన్న వకార్ యూనిస్ మాట్లాడుతూ, ‘‘ఇది ఆటకు మంచిది కాదు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’’ అన్నారు.
‘‘ఈ ఘటన శ్రీలంకను కాస్త ఆవేశంగా, కొంచెం కోపంతో ఆడేలా చేస్తుంది’’ అంటూ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు.
ఇది సరైనది కాదు అంటూ దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో కూడా కొందరు బంగ్లాదేశ్‌కు, షకీబుల్ హసన్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇది ‘మన్కడింగ్’ కంటే దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్, బంతి వేయక ముందే క్రీజు వదిలి ముందుకు వెళ్లినప్పుడు, బౌలర్ ఆ ఎండ్‌లో ఉన్న వికెట్లను బాల్‌తో కొట్టి ఔట్ చేయడాన్ని ‘మన్కడింగ్‘ అంటారు. గతంలో భారత క్రికెటర్ వినూ మన్కడ్ ఒక బ్యాటర్‌ను ఇలా అవుట్ చేసినప్పటి నుంచి దీనిని మన్కడింగ్ అంటున్నారు.
మరికొందరు సోషల్ మీడియా యూజర్లేమో- షకీబుల్ హసన్‌ను సమర్థిస్తున్నారు. నిబంధనలు అందరికీ వర్తిస్తాయంటూ వారు బంగ్లాదేశ్‌కు మద్దతుగా స్పందిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
షకీబుల్ హసన్‌ను ఉడికించిన మాథ్యూస్
శ్రీలంక ఈ మ్యాచ్‌లో 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చరిత్ అసలంక 108 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
280 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగింది.
నజ్ముల్ హొసన్ (90), షకీబుల్ హసన్ (82) జంట క్రీజులో పాతుకుపోయింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 169 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మాథ్యూస్ బౌలింగ్‌లోనే షకీబుల్ హసన్ అవుటయ్యాడు.
అప్పుడు, ‘టైమ్ టు గో’ అనే అర్థం వచ్చేలా మాథ్యూస్ తన చేతి గడియారాన్ని చూస్తున్నట్లుగా సంజ్ఞ చేస్తూ షకీబుల్ హసన్‌ను సాగనంపాడు.
41.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 282 పరుగులు చేసి, విజయం సాధించింది.
కుసాల్ మెండిస్, సమరవిక్రమ వికెట్లను తీయడంతోపాటు 65 బంతుల్లో 82 పరుగులు చేసిన షకీబుల్ హసన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
మ్యాచ్ తర్వాత కూడా ఈ వివాదం కొనసాగింది. నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ వ్యాఖ్యానించాడు.
అయితే, ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించి అంశమని ఏంజెలో మాథ్యూస్ బదులిచ్చాడు.

ఫొటో సోర్స్, ANI
‘‘నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను.. కానీ అప్పీల్‌ను వెనక్కి తీసుకోను’’: షకీబ్
టైమ్డ్ అవుట్ అప్పీల్ గురించి మ్యాచ్ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో షకీబ్ వివరించాడు.
మాథ్యూస్‌ను నిబంధనల ప్రకారం అవుట్ చేయవచ్చని తమ ఫీల్డర్లలో ఒకరు సలహా ఇచ్చిన తర్వాత తాను అప్పీల్ చేసినట్లు షకీబ్ చెప్పాడు.
‘‘మా ఫీల్డర్ ఒకరు నా దగ్గరకు వచ్చి, ‘ఒకవేళ నువ్వు ఇప్పుడు అప్పీల్ చేస్తే నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయంలోగా గార్డ్ తీసుకోలేకపోయాడు కాబట్టి మాథ్యూస్ అవుట్ అవుతాడని’ చెప్పారు.
అప్పుడు నేను అంపైర్లకు అప్పీల్ చేశాను. అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటారా? అని అంపైర్లు నన్ను అడిగారు. కానీ, నేను లేదని చెప్పాను.
మాథ్యూస్, నేను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాం. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు.
అందుకే మాథ్యూస్ నా దగ్గరికి వచ్చి అప్పీల్‌ను వెనక్కి తీసుకోగలవా? లేదా? అని అడిగాడు.
‘‘నీ పరిస్థితి నాకు అర్థం అయింది. ఇది దురదృష్టకరం. కానీ, నేను అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకోవట్లేదు’’ అని మాథ్యూస్‌కు చెప్పాను.
బ్యాట్స్‌మన్ నిర్దేశిత సమయంలోగా క్రీజులోకి రావాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, మాథ్యూస్ అలా చేయలేకపోయాడు’’ అని షకీబ్ వివరించాడు.

ఫొటో సోర్స్, @Angelo69Mathews
‘‘హెల్మెట్ లోపం అనే ఇంగిత జ్ఞానం ఎక్కడికి పోయిందో’’: ఏంజెలో మాథ్యూస్
షకీబ్ వ్యాఖ్యలను ఏంజెలో మాథ్యూస్ ఖండించాడు. నిర్దేశిత సమయం లోగానే క్రీజులోకి వచ్చినట్లు మాథ్యూస్ చెప్పాడు.
‘‘రెండు నిమిషాల్లోగా క్రీజులోకి రావాలి. బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నేను అదే పని చేశాను.
తర్వాత హెల్మెట్ పాడైంది. ఈ విషయంలో వారి ఇంగిత జ్ఞానం ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావట్లేదు. బంగ్లాదేశ్, షకీబ్ చేసింది సరైనది కాదు.
నా హెల్మెట్ పాడైన తర్వాత కూడా 5 సెకండ్ల టైమ్ మిగిలే ఉంది. నేను ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వృథా చేసేందుకు ప్రయత్నించలేదు. అలా చేసి ఏదో ప్రయోజనం పొందాలని చూడలేదు. ఇది కేవలం హెల్మెట్‌లో లోపం వల్ల జరిగింది. ఆటగాళ్ల భద్రత ముఖ్యం’’ అని వివరించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ ప్లేయర్లకు శ్రీలంక ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడం గురించి మాట్లాడుతూ, ‘‘మనల్ని గౌరవించే వ్యక్తులనే మనం గౌరవించాలి’’ అని అన్నారు.
తనకు ఇంకా 5 సెకండ్ల సమయం ఉందంటూ మాథ్యూస్ ట్విటర్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇవి కూడా చదవండి:
- ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష.. అసలేం జరిగింది?
- పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఎందుకు మారలేదు? 4 ప్రధాన కారణాలు ఇవే...
- ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధానికి దిగుతుందా?
- ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ ఏనాటిది, ఎలా మొదలైంది? 9 పదాల్లో సంక్లిష్ట చరిత్ర
- గాజా ప్రజలను కాపాడండి: ఐక్యరాజ్య సమితిలో కన్నీరు పెట్టుకున్న పాలస్తీనా ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














