గాజా ప్రజలను కాపాడండి: ఐక్యరాజ్య సమితిలో కన్నీరు పెట్టుకున్న పాలస్తీనా ప్రతినిధి

ఫొటో సోర్స్, UN
శనివారం జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ కీలక సమావేశంలో ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రతినిధులు ముఖాముఖి తారసపడ్డారు. ఎవరికి వారు తమ వాదనను గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు.
పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాడుతోందని, ఈ పోరాటంలో అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌కు సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రతినిధి కార్మెలీ అన్నారు.
అయితే, గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతోందని పాలస్తీనా ప్రతినిధి సహర్ సలేం ఆరోపించారు. ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున పాలస్తీనియన్లపై విధ్వంసానికి, మారణహోమానికి దిగిందని అన్నారు.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై గురించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ సమావేశంలో చర్చించారు.
గాజా ఆసుపత్రిపై బాంబు దాడి, పాలస్తీనా పౌరులను వారి ఇళ్ల నుండి బలవంతంగా తరలించడాన్ని మానవ హక్కుల కమిటీ విమర్శించింది. పాలస్తీనాకు ప్రపంచం నుంచి అందుతున్న సాయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడం అత్యవసరమని కమిటీ అన్నది.

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనా ప్రతినిధి ఏం చెప్పారు?
పాలస్తీనా ప్రతినిధిగా సహర్ సలేం మానవ హక్కుల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
'గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ఎలాంటి విధ్వంసానికి పాల్పడిందో గత 11 రోజులుగా ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇజ్రాయెల్ 3 వేలమందిని చంపింది. వారిలో వెయ్యిమంది పిల్లలు ఉన్నారు" అంటూ ఆమె ఉద్వేగం నిండిన గొంతుతో అన్నారు.
అయితే, పాలస్తీనా అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 4,300 దాటింది.
"హింసించకుండా గాజాలో ఒక్క కుటుంబాన్ని కూడా ఇజ్రాయెల్ వదల్లేదు. చనిపోని వారు గాయపడ్డారు. గాయపడని వారు ఇళ్ల నుండి బలవంతంగా బయటకు వెళ్లిపోయారు. అల్-అహ్లీ ఆసుపత్రి సురక్షితం అనుకుంటే అక్కడా ఊచకోత కోశారు’’ అని ఆమె ఆరోపించారు.
"ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉందా? షరతులు లేకుండా ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడానికి ఈ మరణాలు సరిపోతాయా?" అని ఆమె ప్రశ్నించారు.
గాజాలో ప్రజలు తమ ఇళ్లలో ఉన్నప్పుడు, సురక్షితమైన ప్రాంతం కోసం వెతుకుతున్నప్పుడు ఇజ్రాయెల్ వారిపై బాంబులు వేసిందని పాలస్తీనా ప్రతినిధి ఆరోపించారు.
"గాజాను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించింది. వేలమంది ప్రజలు సురక్షిత ప్రాంతం కోసం వెతుకుతున్నారు. అప్పుడే వారిపై బాంబులు వేశారు. వాళ్లకు ఇక సురక్షిత ప్రాంతం ఎక్కడుంది’’ అని సహర్ సలేం ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
గాజా పరిస్థితి
పాలస్తీనా ప్రతినిధి సహర్ సలేం మాట్లాడుతూ "గాజా ప్రజలందరినీ ఇజ్రాయెల్ చట్టవిరుద్ధంగా శిక్షించింది. వారు ఉద్దేశపూర్వకంగా గాజాకు ఆహారం, నీరు, విద్యుత్ సరఫరా అందకుండా చేసింది. గాజాకు సహాయం అందే మార్గాలను ఇజ్రాయెలీ అధికారులు అడ్డుకున్నారు. నివాస ప్రాంతాలను ధ్వంసం చేశారు. ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులపై నేరుగా వైమానిక దాడులు చేశారు. నిత్యం బాంబు దాడుల మధ్య సహాయాన్ని అందించడం కష్టంగా మారింది" అని సలేం అన్నారు.
"గాజాలో కరెంటు లేదు, నీరు లేదు, వైద్య పరికరాలు లేవు, ఆహారం లేదు, ఆసుపత్రులు లేవు, మందులు లేవు. శ్మశానాలు మృతదేహాలతో నిండి ఉన్నాయి, ఖాళీ స్థలం లేదు. శవాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు." అని ఆమె అన్నారు.
"గాజాలోని 22 ఆసుపత్రులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఉత్తర్వును జబ్బుపడిన, గాయపడిన వారికి మరణశిక్షగా అభివర్ణించింది. గాజాలో 2 మిలియన్ల మంది నివసిస్తున్నారు. వారిలో సగం మంది పిల్లలు ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం గాజాలో ప్రజలు లేరంటూ అక్కడ బాంబులు వేస్తోంది. ఇక్కడ ప్రతి ఒక్కరినీ చంపాలని చూస్తోంది.’’ అని పాలస్తీనా ప్రతినిధి ఆరోపించారు.
ఇజ్రాయెల్ నేరాలకు వ్యతిరేకంగా, పాలస్తీనియన్లపై మారణహోమానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి నిలబడాలని సహర్ సలేం విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్ ప్రతినిధి ఏం చెప్పారు?
ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ యువ ప్రతినిధి కార్మెలీ ఈ సమావేశంలో ముందుగా మాట్లాడారు. గాజా సరిహద్దులో ఉన్న కెరెమ్ షాలోమ్ కిబ్బుట్జ్‌లోని తన గ్రామ పరిస్థితిని ఆమె గుర్తు చేసుకున్నారు. తన జీవితానుభవాలతో చర్చను ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
తన జీవితమంతా భద్రత గురించి ఆలోచించడం, వాటికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంతోనే గడిచిందని ఆమె అన్నారు. భయంతో కూడిన వాతావరణంలో జీవితాన్ని గడపకూడదని తాను నమ్ముతానని కార్మెలీ చెప్పారు.
"హీబ్రూలో భాషలో కెరెమ్ షాలోమ్ అంటే శాంతిని కాపాడేవారు అని అర్థం. కానీ మా జీవితంలో శాంతి కంటే ప్రమాదాలే ఎక్కువ" అని ఆమె అన్నారు.
"నా ఇల్లు గాజాకు చాలా దగ్గరగా ఉంది. నా పడకగది బాంబు షెల్టర్‌లో ఉంది" అని ఆమె అన్నారు.
"గాజా నుండి భారీ రాకెట్ షెల్లింగ్ జరిగినప్పుడు, సైరన్లు మోగినప్పుడు, మేము సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకోవడానికి కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉంది. గత 18 సంవత్సరాలుగా, ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఇలాంటి పరిణామాలు చాలా కామన్. గాజా స్ట్రిప్ సరిహద్దులో ఉంది కాబట్టి జీవితం అలా సాగుతూనే ఉంటుంది. ప్రమాదాలు ఉన్నప్పటికీ నేను అదే కమ్యూనిటీలో నివసించాలని నిర్ణయించుకున్నాను.’’ అన్నారామె.
"మాకు జీవితం కావాలి. భయం వద్దు. కానీ అక్టోబర్ 7న మేం మా పండగ జరుపుకుంటున్నప్పుడు హమాస్ ఉగ్రవాదులు మాపై దాడి చేశారు." అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'హమాస్‌పైనే ఇజ్రాయెల్ యుద్ధం'
‘‘వాళ్లు ఆయుధాలతో వచ్చారు. మాపై దాడి చేశారు. జనాన్ని చంపేశారు. 200 మందికి పైగా బందీలుగా చేశారు. విధ్వంసం సృష్టించారు. ఎవరిపైనా కనికరం చూపలేదు’’అని ఇజ్రాయెల్ ప్రతినిధి కార్మెలీ అన్నారు.
"వృద్ధులు, పిల్లలు, మహిళలు, వికలాంగులపై వారు పాల్పడిన అఘాయిత్యాలను మాటల్లో వర్ణించలేము. హమాస్ అనే ఉగ్రవాద సంస్థతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇది సామాన్య పౌరులకు, కొన్ని కమ్యూనిటీలకు వ్యతిరేకం కాదు’’ అని అన్నారామె.
"హమాస్ 200 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలను కిడ్నాప్ చేసి బందీలుగా చేసింది. ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే. వారిలో చాలామందికి వైద్య సహాయం కావాలి." అని స్పష్టం చేశారామె.
హమాస్‌ను అత్యంత ఘాటైన పదజాలంతో ఖండించాలని' హమాస్ బందీలందరినీ విడుదల చేయడంలో సహాయపడాలని, తనను తాను రక్షించుకునే హక్కు విషయంలో ఇజ్రాయెల్‌కు మద్ధతివ్వాలని అంతర్జాతీయ సమాజానికి ఆమె విజ్జప్తి చేశారు. అదే జరగకపోతే అది హమాస్ లక్ష్యాలను నెరవేర్చినట్లు అవుతుందని, ఉగ్రవాదంపై పోరాటానికి హాని కలిగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ మొదటి వరుసలో నిలుస్తోందని, దానికి అంతర్జాతీయ సమాజం సహకరించాల్సిన అవసరం ఉందని కార్మెలీ ఉద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి
- పాయింట్ నెమో: అంతరిక్ష నౌకల శ్మశాన వాటిక అని దీనిని ఎందుకు అంటారు?
- టెన్నిస్ ఆటగాళ్ల చేతి ఎముక మిగతా వారికంటే ఎందుకు పొడవు ఉంటుంది?
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















