ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి చమురు ధరలు పెరగడానికి సంబంధం ఏంటి... ఆయిల్ రేట్లు ఇంకా పెరుగుతాయా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, అన్నాబెల్లె లియాంగ్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
ఇజ్రాయెల్, గాజాలలో నెలకొన్న అనూహ్య పరిణామాలు పశ్చిమాసియా దేశాలలో ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయనే ఆందోళనలతో చమురు ధరలు పెరిగాయి.
అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.25 డాలర్లకు పైగా పెరిగి బ్యారల్ 86.90 డాలర్లకు ఎగిసింది. అమెరికాలో కూడా చమురు ధరలు బాగా పెరిగాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనాలు చమురు ఉత్పత్తి దేశాలు కావు. కానీ, ప్రపంచ చమురు సరఫరాలో మూడో వంతు పశ్చిమాసియా దేశాల నుంచే జరుగుతోంది.
దశాబ్దాలుగా ఇరు పక్షాల మధ్య సాగుతోన్న ఘర్షణల్లో శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి అతిపెద్దది.
పశ్చిమ దేశాలన్ని కూడా ఈ దాడులను ఖండించాయి.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అధికార ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, ఈ చర్యకు ఇరాన్ నుంచి తమకు ప్రత్యక్ష మద్దతు ఉందని తెలిపారు.
ఇరాన్ ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటి.
అయితే, ఇరాన్ మాత్రం ఈ దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రిపోర్టు చేసింది.
కానీ, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ దాడికి మద్దతును ప్రకటించారు.
ఈ హింసాత్మక దాడుల తర్వాత తమ దేశ ఉత్తర తీర ప్రాంతంలో ఉన్న తమర్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్‌లో అమెరికా ఆయిల్ దిగ్గజం చెవ్రాన్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఇజ్రాయెల్ ఆదేశించింది.
ఆందోళనలు నెలకొన్నప్పుడు అంతకుముందు కాలాల్లో కూడా ఈ ఫీల్డ్‌లో చమురు ఉత్పత్తిని నిలిపివేశారు.

ఫొటో సోర్స్, Morningstar
ఇజ్రాయెల్ ఇంధన అవసరాలకు ఇతర వనరుల నుంచి సరిపడ చమురు అందుబాటులో ఉందని ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్‌లో అతిపెద్ద ఆఫ్‌షోర్ గ్యాస్ ఫీల్డ్ లెవియథాన్ కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతాయని చెవ్రాన్ చెప్పింది.
సరిహద్దులో ఉన్న ఇరాన్, సౌదీ అరేబియా లాంటి అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశాలకు ఈ దాడులు విస్తరిస్తాయేమోనని ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నట్లు ఎనర్జీ అనలిస్ట్ సౌల్ కవోనిక్ బీబీసీకి తెలిపారు.
అమెరికా బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియేట్ క్రూడ్ ధర సోమవారం 2.50 డాలర్లు పెరిగి బ్యారల్ 85.30 డాలర్లకు చేరుకుంది.
‘‘హమాస్ దాడులకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇరాన్‌కు ఈ ఉద్రిక్తతలు వ్యాపిస్తే, ప్రపంచ చమురు సరఫరాలో 3 శాతం వరకు ప్రమాదంలో పడుతుంది’’ అని కవోనిక్ తెలిపారు.
అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ ఈ ఏడాది చమురు ఉత్పత్తిని పెంచుతోందని బీబీసీ టుడే ప్రొగ్రామ్‌కి క్యాపిటల్ ఎకనామిక్స్ చీఫ్ కమోడిటీస్ ఎకనామిస్ట్ కరోలిన్ బైన్ చెప్పారు.
‘‘ఇరాన్ ఉత్పత్తిని స్థిరంగా పెంచడంపై అమెరికా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుంది. ఇది మున్ముందు అమెరికాకు మరింత ప్రమాదకరంగా మారనుంది’’ అని ఆమె చెప్పారు.
మొత్తంగా ఈ ఏడాది చివరి మూడు నెలలు సరఫరాను మించి చమురు డిమాండ్ నెలకొంటోందని క్యాపిటల్ ఎకనామిక్స్ అంచనావేస్తుందని బైన్ తెలిపారు.
దీని వల్ల ధరలు పెరగనున్నాయన్నారు.

ఫొటో సోర్స్, Reuters
రాబోయే రోజుల్లో నెలకొనే అనిశ్చితి పరిణామాలు కూడా అమెరికా ట్రెజరీ బాండ్లు, డాలర్లలో పెట్టుబడులను ప్రభావితం చేయనున్నాయని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు జేమ్స్ చెయో చెప్పారు.
సాధారణంగా ఈ ఇన్వెస్టర్లు సంక్షోభ సమయంలో కొనుగోలు చేస్తూ ఉంటారు..
మార్కెట్లను శాంతపరిచేందుకు 30 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీని అమ్మనున్నట్లు ఇజ్రాయెల్ కేంద్ర బ్యాంకు తెలిపింది.
ఇది భారీగా పడిపోతున్న ఆ దేశ కరెన్సీ షెకెల్‌కు సహకరించనుందని అన్నారు.
‘‘ఈ సమయంలో మార్కెట్‌లో కాస్త ఒడిదుడుకులుంటాయి. ఇన్వెస్టర్లు మరింత స్పష్టతను కోరుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక డేటా విషయంలో, భౌగోళిక రాజకీయ అనిశ్చితి అంశాల విషయాల్లో స్పష్టత కోసం చూస్తారు’’ అని చెయో అన్నారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత, చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.
కిందటి ఏడాది జూన్‌లో బ్యారల్ చమురు ధర 120 డాలర్లకు పైగా ఎగిసింది.
ఆ తర్వాత ఈ ఏడాది మే నాటికి బ్యారల్ 70 డాలర్లకు దిగొచ్చింది.
ఆ తర్వాత పడిపోతున్న మార్కెట్‌కు మద్దతు ఇచ్చేందుకు ఉత్పత్తిని కట్టుదిట్టం చేసేందుకు చమురు ఉత్పత్తి దేశాలు ప్రయత్నించాయి. దీంతో ధరలు స్థిరంగా పెరిగాయి.
ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమైన సౌదీ అరేబియా జూలైలో రోజుకు 10 లక్షల బ్యారళ్ల ఉత్పత్తికి కోత పెట్టనున్నట్లు ప్రకటించింది.
చమురు ఉత్పత్తి దేశాల గ్రూప్ ఓపెక్ ప్లస్‌లోని ఇతర సభ్య దేశాలు కూడా పడిపోతున్న ధరలను పెంచేందుకు ఉత్పత్తి కోతను కొనసాగించేందుకు అంగీకరించాయి.
ప్రపంచ చమురు ఉత్పత్తిలో సుమారు 40 శాతం ఓపెక్ ప్లస్ దేశాలివే. ఈ దేశాల నిర్ణయాలు చమురు ధరలపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతాయి.
ఇవి కూడా చదవండి:
- స్పై డెత్స్: మజ్జోరే సరస్సు పడవ మునకలో గూఢచారుల మరణాలపై అనేక సందేహాలు
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















