ఇజ్రాయెల్-గాజా: హమాస్ అంటే ఏంటి? కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రఫీ బర్గ్
- హోదా, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్ మిడిల్ ఈస్ట్ ఎడిటర్
ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులకు దిగింది. ఒకేసారి వేలకొద్దీ రాకెట్లను ప్రయోగించింది.
అదే సమయంలో సాయుధులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించి పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. కొంతమందిని బందీలుగా తీసుకుని వెళ్తున్నారు.
అయితే, ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య ఘర్షణ ఇప్పుడు మొదలైంది కాదు. కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Reuters
హమాస్ అంటే ఏమిటి?
గాజాను పరిపాలిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్. ఇజ్రాయెల్‌ను ఆక్రమించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ. 2007 నుంచి గాజాలో పరిపాలన కొనసాగిస్తోంది.
అప్పటి నుంచి ఇతర మిలిటెంట్ సంస్థలతో కలిసి ఇజ్రాయెల్‌పై వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ కూడా అందుకు గట్టిగానే బదులిస్తోంది.
హమాస్ పాలన మొదలైన సమయంలోనే భద్రతా కారణాల దృష్ట్యా ఈజిప్టుతో కలిసి గాజా సరిహద్దును మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.
ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే వంటి దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. అయితే హమాస్‌కు నిధులు, ఆయుధాలు ఇరాన్ నుంచి అందుతున్నాయి.
గాజా స్ట్రిప్ అంటే?
మధ్యధరా సముద్ర తీరాన ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల మధ్యన ఉన్న ప్రాంతం గాజా. 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ 23 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంగా పేరుంది.
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం గాజాలో 80 శాతం మంది ప్రజలు అంతర్జాతీయ సహాయంపై ఆధారపడి ఉన్నారు. పది లక్షల మందికి రోజువారీ ఆహార సహాయంపై ఆధారపడ్డారు.

హమాస్ ఇజ్రాయెల్‌లు ఎందుకు ఘర్షణ పడుతున్నాయి?
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అయితే, శనివారం హమాస్ హెచ్చరికలు కూడా చేయకుండా వేలకొద్దీ రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. హమాస్ మిలిటెంట్లు ట్రక్కుల్లో ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. పౌరులపై దాడులు చేస్తున్నారు. బందీలుగా పట్టుకుని వెళ్తున్నారు.
ఇజ్రాయెల్ వెంటనే ప్రతిదాడి మొదలుపెట్టింది. గాజాలోని మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించినట్లు స్థానిక అధికారులు అంటున్నారు.
పాలస్తీనా ప్రాంతం ఎక్కడుంది?
రోమన్ల కాలం నుంచి వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేం, ఇజ్రాయెల్ ప్రాంతాలను కలిపి పాలస్తీనాగా పిలిచేవారు. పాలస్తీనా యూదుల మాతృభూమిగా పిలుస్తారు. బైబిల్‌లో ఈ ప్రాంతాలు యూదుల రాజ్యాలని పేర్కొన్నారు.
1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. అయితే దీనిపై వ్యతిరేకత వచ్చింది. పాలస్తీనీయులు మాత్రం ఇజ్రాయెల్‌ను గుర్తించలేదు. వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేం ప్రాంతాలను కలిపి పాలస్తీనా అని కూడా వ్యవహరిస్తున్నారు.














