పాలస్తీనా ఖైదీతో ఇజ్రాయెల్ మహిళా సైనికుల సెక్స్‌ ఆరోపణలు, ప్రభుత్వం ఏం చేసింది?

ఇజ్రాయెల్ జైలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, యోలాండే నెల్, అలెక్స్ బిన్లే
    • హోదా, బీబీసీ కోసం

పాలస్తీనా ఖైదీతో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ మహిళా సైనికులు కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైళ్లలో గార్డులుగా పని చెయ్యకుండా నిషేధించారు.

ఇజ్రాయెల్ పౌరులపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు ఒప్పుకొన్న పాలస్తీనా వ్యక్తితో ఒక సైనికురాలు శారీరక సంబంధం పెట్టుకున్నారని, ఈ విషయాన్ని ఆమె అంగీకరించారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

ఇజ్రాయెల్‌లో నిర్బంధ సైనిక శిక్షణలో భాగంగా, ఎంపికైన సదరు మహిళ జైలులో గార్డుగా విధులు నిర్వహించారు.

ఇజ్రాయెల్‌లో స్త్రీలు కనీసం రెండేళ్లు, పురుషులు 32 నెలలు సైన్యంలో పని చేయాలి.

జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆ పాలస్తీనా ఖైదీ, అతడితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఇజ్రాయెల్ సైనికురాలి పేరు వెల్లడించలేదు.

జైలు స్థలంతో పాటు ఇతర వివరాలను వెల్లడించరాదని ఈ కేసును విచారించిన కోర్టు ఆదేశించింది.

అదే ఖైదీతో ఆ మహిళా సైనికురాలితోపాటు మరో నలుగురు మహిళా సైనికులు కూడా శారీరక సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో తేలిందని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇజ్రాయెల్ జాతీయ భద్రత శాఖ మంత్రి ఇటామర్ బెన్ గ్విర్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైళ్లలో మహిళా సైనికులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ జాతీయ భద్రత శాఖ మంత్రి ఇటామర్ బెన్ గ్విర్

సదరు మహిళా సైనికులను ప్రశ్నించడానికి ముందు పాలస్తీనా ఖైదీని అతడి సెల్ నుంచి ఏకాంతవాసానికి బదిలీ చేసినట్లు ఇజ్రాయెల్ జైళ్ల విభాగం తెలిపింది.

‘‘పాలస్తీనా టెర్రరిస్టుల్ని’’ ఉంచిన హై సెక్యూరిటీ జైళ్లలో మహిళల్ని గార్డులుగా నియమించడంపై నిషేధం విధించినట్లు ఇజ్రాయెల్ జైళ్ల శాఖ అధ్యక్షురాలు కేటీ పెర్రీ, జాతీయ భద్రత శాఖ మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ ప్రకటించారు.

2025 మధ్య నాటికి "హై సెక్యూరిటీ ఖైదీలున్న జైళ్లలో ఒక్క మహిళా సోల్జర్ కూడా ఉండరు” అని బెన్ గ్విర్ చెప్పినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

వీడియో క్యాప్షన్, లెబనాన్: జైలు ఖైదీలకూ ఆహారం కరవు

పటిష్ఠ భద్రత ఉన్న జైళ్లలో విధుల నుంచి మహిళా సైనికుల్ని తప్పించాలని డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ జైళ్లలో తగినంత మంది సిబ్బంది లేకపోవంతో వీలు కాలేదు.

నిరుడు ఓ జైలులో పాలస్తీనా ఖైదీలు గార్డుగా పని చేస్తున్న మహిళా సైనికురాలిపై అత్యాచారం చేశారని, జైలులో కొంత మంది సీనియర్ అధికారులు మహిళా గార్డుల్ని లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇజ్రాయెల్ మంత్రులు దర్యాప్తుకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)