జెరూసలేం: అల్-అక్సా... మందిరం ఒక్కటే... ముస్లింలు, యూదులకు పవిత్ర స్థలం ఎలా అయింది

అల్ అక్వా కాంప్లెక్స్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మంత్రి ఇత్మార్ బెన్ గివిర్, జెరూసలేంలోని అల్-అక్సాను సందర్శించడం వివాదానికి దారితీసింది.

దీన్ని ‘రెచ్చగొట్టే చర్య’గా పాలెస్తీనా అథారిటీ పేర్కొంది.

జెరూసలెం ప్రాంతాన్ని ముస్లింలు, యూదులు, క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. మక్కా, మదీనా తర్వాత మూడో పవిత్ర స్థలంగా అల్-అక్సాను ముస్లింలు పరిగణిస్తారు.

అల్-అక్సాను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా యూదులు కూడా చూస్తారు.

మసీదు ప్రాంగణంలోకి యూదులు ప్రవేశించొచ్చు. కానీ అక్కడ వారు ప్రార్థనలు చేయడం నిషేధం.

మరి ఇజ్రాయెల్ మంత్రి అల్-అక్సా మసీదు ప్రాంగణాన్ని సందర్శించడం వివాదాస్పదంగా ఎందుకు మారింది?

అల్ అక్వా

ఫొటో సోర్స్, AFP

అల్-అక్సా మసీదు ఎందుకంత ముఖ్యం?

తూర్పు జెరూసలేంలో ఉన్న అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ యూదులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. యూదులు 'టెంపుల్ మౌంట్', ముస్లింలు 'అల్-హరమ్ అల్-షరీఫ్' అని పిలిచే పవిత్ర స్థలంలో 'అల్-అక్సా మసీదు', 'డోమ్ ఆఫ్ ది రాక్'లు కూడా భాగం .

'డోమ్ ఆఫ్ ది రాక్' ను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా యూదులు భావించినట్లే... మహమ్మద్ ప్రవక్తతో ఉన్న అనుబంధం కారణంగా ముస్లింలు కూడా 'డోమ్ ఆఫ్ ది రాక్'ను పవిత్ర ప్రదేశంగా భావిస్తారు.

అయితే ఈ స్థలంలో ముస్లింలు కాని వారు ప్రార్థనలు చేయడాన్ని నిషేధించారు. అల్-అక్సా అనేది 35 ఎకరాల కాంప్లెక్స్‌లో ఉన్న గుండ్రని గోపురం గల మసీదు. ముస్లింలు దీనిని ‘అల్-హరమ్-అల్ షరీఫ్’ అని కూడా పిలుస్తారు. యూదులు దీనిని ‘టెంపుల్ టౌన్’ అంటారు.

ఈ సముదాయం జెరూసలేంలోని ఓల్డ్ ఏరియాలో ఉంది. దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా కూడా ఉంది.

అల్ అక్వా

ఫొటో సోర్స్, Getty Images

అల్-అక్సా చరిత్ర ఏంటి?

1967లో వెస్ట్ బ్యాంక్, గాజాలోని కొంతభాగం, ఓల్డ్ సిటీతో సహా తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నప్పటి నుంచి అల్-అక్సా మరింత వివాదాస్పద ప్రాంతంగా మారింది.

ఇజ్రాయెల్ రావడానికి ముందు నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. 1947లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పాలెస్తీనా కోసం విభజన ప్రణాళికను రూపొందించింది. ఆ సమయంలో పాలెస్తీనా బ్రిటిష్ ఆక్రమణలో ఉంది.

ఈ ప్రణాళిక ప్రకారం రెండు దేశాలు ఏర్పడతాయి. ఒకటి ఐరోపా నుంచి వచ్చిన యూదుల కోసం, మరొకటి పాలెస్తీనా ప్రజల కోసం. యూదులకు 55 శాతం భూమిని, మిగిలిన 45 శాతాన్ని పాలెస్తీనాకు ఇవ్వాలని ఆ ప్రణాళిక చెబుతోంది.

అల్-అక్సా కాంప్లెక్స్ ఉన్న జెరూసలేంను మాత్రం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ స్థాయి పర్యవేక్షణలోనే ఉంచాలని ప్రకటించింది. కానీ 1948లో వెస్ట్ బ్యాంక్, గాజా ప్రాంతం సహా 72 శాతం భూమిని ఇజ్రాయెల్ ఆక్రమించింది. తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.

వాస్తవానికి 1967లో రెండో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తరువాత తూర్పు జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా అక్కడి ఓల్డ్ ఏరియాలో ఉన్న అల్-అక్సా కాంప్లెక్స్ కూడా దాని నియంత్రణలోకి వచ్చింది.

జోర్డాన్ నుంచి దాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. కానీ, పవిత్ర స్థలాల నియంత్రణపై వివాదం తలెత్తడంతో అక్కడ యథాతథ స్థితి కొనసాగించడానికి ఒక వ్యవస్థ రూపొందించారు.

దీని ప్రకారం ఈ స్థలం సంరక్షణ బాధ్యత (కస్టోడియన్)ను జోర్డాన్‌కు అప్పగించారు. సెక్యూరిటీ బాధ్యతను ఇజ్రాయెల్ చూస్తోంది. కానీ, నమాజ్ చేయడానికి ముస్లింలకు మాత్రమే అనుమతి ఉంది. యూదులు ఇక్కడికి రావచ్చు, కానీ వారు అక్కడ ప్రార్థన చేయడాన్ని నిషేధించారు.

అల్ అక్వా

ఫొటో సోర్స్, EPA

మహ్మద్ ప్రవక్తకు సంబంధమేంటి?

ఏడో శతాబ్దంలో నిర్మించిన అల్-అక్సా మసీదు, 'డోమ్ ఆఫ్ ది రాక్' రెండూ కూడా ముస్లింల పవిత్ర స్థలాలు. మహమ్మద్ ప్రవక్త ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్లారని ముస్లింలు నమ్ముతారు.

బైబిల్‌ ప్రస్తావించిన యూదుల దేవాలయాలు ఇక్కడే ఉన్నాయని యూదులు నమ్ముతారు. ఈ కాంప్లెక్స్ పశ్చిమ గోడను 'వైలింగ్ వాల్' (శోక గోడ) అని పిలుస్తారు. ఇది యూదుల ఆలయంలో భాగమని నమ్ముతారు. ముస్లింలు దీనిని అల్-బురాక్ గోడ అని పిలుస్తారు.

ఇక్కడ మహమ్మద్ ప్రవక్త అల్-బురాక్ అనే జంతువును కట్టివేసినట్లు నమ్ముతారు. దీని కారణంగా ఆయన స్వర్గానికి వెళ్లి అక్కడ అల్లాతో మాట్లాడారని విశ్వసిస్తారు.

తెరపైకి కొత్త డిమాండ్లు

అల్-అక్సా కాంప్లెక్స్‌కు సంబంధించి ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్య 1967లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జోర్డాన్ వక్ఫ్ బోర్డు మసీదు లోపల నిర్వహణ బాధ్యత పొందింది. ఇజ్రాయెల్‌కు బయటి భద్రత చూసే బాధ్యత ఉంది.

అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ లోపలకు యూదులు వెళ్లకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని టెంపుల్ మౌంట్‌ను విశ్వసించే టెంపుల్ ఇన్‌స్టిట్యూట్ ఒత్తిడి చేస్తోంది. ఆ ప్రాంగణంలో మూడో యూదు ఆలయాన్ని నిర్మించాలని వారు భావిస్తున్నారు.

యథాతథ స్థితిని కొనసాగించాలని చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ ప్రభుత్వం టెంపుల్ ఇన్‌స్టిట్యూట్ వంటి గ్రూపులకు డబ్బు ఇస్తోందని న్యూస్ వెబ్‌సైట్ అల్-జజీరా తన కథనంలో పేర్కొంది.

కానీ క్రమంగా ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా ప్రాంతాల్లో స్థిరపడిన యూదులను అక్కడికి వెళ్లేందుకు అనుమతిస్తూనే ఉన్నారు.

యూదులు లోపలకు వెళ్లడానికి ఇజ్రాయెల్ పోలీసులు, సైన్యం రక్షణ ఇస్తున్నట్లుగా అల్-జజీరా తెలిపింది. దీంతో అల్-అక్సా ఇజ్రాయెల్ అధీనంలోకి వెళ్తుందనే భయాన్ని పాలెస్తీనా వ్యక్తం చేస్తోంది.

అల్-జజీరా కథనం ప్రకారం 1999లో 'డోమ్ ఆఫ్ ది రాక్' స్థానంలో మూడో ఆలయానికి పునాది రాయి వేస్తామని టెంపుల్ టౌన్‌ను విశ్వసించేవాళ్లు ప్రకటించారు.

దీని తరువాత ఆ ప్రాంతంలో పాలెస్తీనియన్లు, ఇజ్రాయెల్ సైనికుల మధ్య రక్తపాతం జరిగింది. ఇందులో 20 మంది పాలస్తీనియన్లు మరణించారని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)