అఫ్గానిస్తాన్: 'దేవుడు మాకు చదువుకునే హక్కు ఇచ్చాడు, మమ్మల్ని చదువుకోనివ్వండి' - ఖురాన్‌లోని ఒకే ఒక్క పదంతో తాలిబాన్లపై మహిళల పోరాటం

యూనివర్సిటీ ఎదుట అదేలా నిరసన

ఫొటో సోర్స్, ADELA

ఫొటో క్యాప్షన్, కాబూల్ యూనివర్సిటీ ఎదుట అదేలా ఒంటరిగా నిరసనకు దిగారు
    • రచయిత, నూర్ గుల్ షఫాఖ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

‘‘నాకు ఎలాంటి భయమూ లేదు. ఎందుకంటే నా డిమాండ్ న్యాయమైనదని నేను నమ్ముతున్నా’’ అంటూ ఓ 18 ఏళ్ల అఫ్గాన్ మహిళ ధిక్కార స్వరం వినిపించారు. యూనివర్సిటీలో డిగ్రీ చేయాలన్న ఆమె కల.. ఉన్నత విద్యలో మహిళల ప్రవేశాన్ని తాలిబాన్లు నిషేధించటంతో కల్లగా మారింది.

అదేలా అనే ఆ మహిళ (ఆమె భద్రత రీత్యా ఆమె పేరును మార్చి రాస్తున్నాం) తన భవిష్యత్తు అంధకారంగా మారటం పట్ల ఆగ్రహించారు. కాబూల్ యూనివర్సిటీ ఎదుట అసాధారణంగా ఒంటరిగా నిరసనకు దిగారు. ఖురాన్‌లోని పదాలను ప్రదర్శిస్తూ ఆమె ఈ నిరసన చేపట్టారు.

డిసెంబర్ 25వ తేదీ ఆదివారం నాడు.. వర్సిటీ ప్రవేశద్వారం ముందు ఒక బోర్డు పట్టుకుని నిలుచున్నారు. ఆ బోర్డు మీద అరబిక్ భాషలో ‘ఇక్రా’ అనే పదం రాసి ఉంది. ముహమ్మద్ ప్రవక్తకు దేవుడు వెల్లడించిన మొట్టమొదటి పదం అదేనని ముస్లింలు విశ్వసిస్తారు. ఆ పదానికి అర్థం ‘చదువు’ అని.

‘‘దేవుడు మాకు చదువుకునే హక్కు ఇచ్చారు. మేం దేవుడికి భయపడాలి. మా హక్కులను హరించాలని భావించే తాలిబాన్లకు కాదు’’ అని ఆమె బీబీసీ అఫ్గాన్ సర్వీస్‌తో చెప్పారు.

‘‘నిరసనకారులను వారు చాలా దారుణంగా వేధిస్తారని నాకు తెలుసు. కొడతారని, హింసిస్తారని, ఆయుధాలు ఉపయోగిస్తారని తెలుసు. నిరసనకారుల మీద వాళ్లు టీజర్లు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినాకానీ నేను వారి ముందు నిలబడ్డాను’’ అన్నారామె.

అదేలా నిరసన

ఫొటో సోర్స్, ADELA

ఫొటో క్యాప్షన్, మహిళల విద్యా హక్కు కోసం పోరాటంలో పురుషులు కూడా కలిసి రావాలని అదేలా కోరుతున్నారు

‘‘మొదట వాళ్లు నన్ను పట్టించుకోలేదు. ఆ తర్వాత గన్‌మన్‌లో ఒకరు వచ్చి నన్ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు’’ అని తెలిపారు.

అదేలా తొలుత అక్కడి నుంచి కదలటానికి నిరాకరించారు. కదలకుండా నిలుచున్నారు. ఆమె చుట్టూ ఉన్న సాయుధ గార్డుల దృష్టి.. ఆమె చేతిలో పట్టుకున్న పేపర్ బోర్డు మీదకు మళ్లింది.

ఆ బోర్డును చేతుల్లో గట్టిగా పట్టుకున్న అదేలా.. ఒక తాలిబాన్ సభ్యుడితో సంవాదానికి దిగారు.

‘‘నేను ఏం రాశానో మీరు చదవలేరా?’ అని నేను అతడిని అడిగాను’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.

అతడు బదులివ్వలేదు. అదేలా మళ్లీ అడిగారు: ‘‘దేవుడి మాటను మీరు చదవలేరా?’’

అదేలా ప్రదర్శించిన ప్లకార్డు

ఫొటో సోర్స్, ADELA

ఫొటో క్యాప్షన్, ముహమ్మద్ ప్రవక్తకు దేవుడు వెల్లడించిన మొట్టమొదటి పదం ‘ఇక్రా’ అని ముస్లింలు విశ్వసిస్తారు.. ఆ పదానికి అర్థం ‘చదువు’ అని

‘‘అతడికి కోపం వచ్చింది. నన్ను బెదిరించాడు’’ అని ఆమె తెలిపారు.

ఆమె చేతిలోని ప్లకార్డును లాక్కున్నారు. ఆమె 15 నిమిషాల పాటు ఒంటరిగా నిరసన తెలిపిన తర్వాత అక్కడి నుంచి ఆమెను బలవంతంగా పంపించేశారు.

అదేలా అక్కడ నిరసన తెలుపుతున్నపుడు, ఆమె అక్క ఆ సమీపంలోనే ఒక ట్యాక్సీలో కూర్చిని.. అదేలా నిరసనను ఫొటోలు తీస్తూ, వీడియో రికార్డ్ చేశారు.

‘‘ఆ ట్యాక్సీ డ్రైవర్ చాలా భయపడిపోయాడు. వీడియో తీయటం ఆపండని మా అక్కను ప్రాధేయపడ్డాడు. తాలిబాన్లతో సమస్యలు వస్తాయనే ఆందోళనతో.. మా అక్కను కారు దిగిపొమ్మని చెప్పాడు’’ అని అదేలా వివరించారు.

అఫ్గాన్ మహిళల నిరసన

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మహిళల యూనివర్సిటీ విద్యపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అఫ్గాన్ మహిళలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు

మహిళలపై పెరుగుతున్న ఆంక్షలు

అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ బలగాలు అఫ్గానిస్తాన్ నుంచి హడావుడిగా వైదొలగటంతో.. 2021 ఆగస్టులో తాలిబాన్లు ఈ దేశంలో తిరిగి అధికారంలోకి వచ్చారు.

మొదట బాలికలు సెకండరీ స్కూలుకు వెళ్లి చదువుకోవటాన్ని వాళ్లు నిషేధించారు. ఈ ఏడాది (2022) సెప్టెంబర్‌లో.. బాలికలు కొన్ని సబ్జెక్టులు చదవటానికి వీల్లేదని నిషేధించారు. వాళ్లు తాము నివసించే ప్రావిన్సుల్లోని యూనివర్సిటీల్లో మాత్రమే చేరవచ్చునని ఆంక్షలు పెట్టారు.

ఇక డిసెంబర్ 20వ తేదీన.. మహిళలు అసలు యూనివర్సిటీలకు హాజరు కావటానికే వీల్లేదని నిషేధించారు. దీనిపై అంతర్జాతీయంగా ఖండనలు వచ్చాయి. ఆపైన ఇంకొన్ని రోజులకు.. మహిళలు స్థానిక లేదా అంతర్జాతీయ ఎన్‌జీఓల్లో పనిచేయరాదంటూ తాలిబాన్లు నిషేధించారు.

బాలికలు, మహిళలు చదువుకోవటాన్ని నిషేధించటం పట్ల మహిళలు, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థినులు అప్పటి నుంచీ నిరసనలు తెలుపుతున్నారు.

కొందరు ‘‘మహిళలు, జీవితం, స్వాతంత్ర్యం’’ అనే నినాదాన్ని ఉపయోగించారు. ఇటీవల ఇరాన్‌ నిరసనలతో ఆ నినాదం ముమ్మరంగా ప్రచారమైంది.

కాబూల్ యూనివర్సిటీలో ప్రస్తుతం నాలుగు పాఠ్య విభాగాలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మహిళా ప్రొఫెసర్లను కూడా క్యాంపస్‌లో ప్రవేశించటానికి అనుమతించటం లేదని ఆ వర్సిటీ అధికారులు బీబీసీకి చెప్పారు.

తాలిబాన్ మిలిటెంట్లు

ఫొటో సోర్స్, SWAMINATHAN NATARAJAN

ఫొటో క్యాప్షన్, స్నైపర్ రైఫిళ్లు, అసాల్ట్ రైఫిళ్లు చేతపట్టుకున్న తాలిబాన్ మిలిటెంట్లు.. మహిళలు యూనివర్సిటీల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు

పురుషులకు పిలుపు

తాలిబాన్లకు వ్యతిరేకంగా నిరసనలు తెలపటం అదేలా వంటి మహిళలకు సులభం కాదు. పురుషులు ఇలాంటి ధైర్యం ప్రదర్శించాలని ఆమె కోరుతున్నారు. కానీ వారు అలా చేస్తే అందుకు మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

‘‘నేను నిరసన తెలుపుతున్నపుడు ఒక యువకుడు నా నిరసన వీడియో తీసి నాకు మద్దతునివ్వాలని భావించాడు. కానీ తాలిబాన్లు అతడిని గట్టిగా కొట్టారు’’ అని అదేలా తెలిపారు.

ఒక పురుష ప్రొఫెసర్.. తన నిరసన తెలపటానికి లైవ్ టీవీ షోలో తన విద్యా పత్రాలను చింపివేశాడు. అలాగే 50 మందికి పైగా యూనివర్సిటీ టీచర్లు తమ నిరసన తెలిపారని సంబంధిత వర్గాలు బీబీసీకి తెలిపాయి.

ఒక టీచర్ తన ఉద్యోగం వదిలేశారు. కానీ తాలిబాన్లు తనను తీవ్రంగా కొట్టటంతో తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ఆయన చెప్పారు.

అయితే అఫ్గాన్ పురుషులు ఈ పోరాటంలో చేరటం చాలా కీలకమని అదేలా నమ్ముతున్నారు.

‘‘అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తున్న పురుషులు చాలా తక్కువగా ఉన్నారు. ఇరాన్‌లో పురుషులు తమ అక్కచెల్లెళ్లకు తోడుగా.. మహిళల హక్కులకు మద్దతుగా నిలుస్తున్నారు. మేం కూడా విద్యా హక్కు కోసం కలిసి నిలబడితే మేం నూరుపాళ్లు విజయం సాధిస్తాం’’ అన్నారామె.

తాలిబాన్ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాలిబాన్లు అధికారంలోకి తిరిగివచ్చినప్పటి నుంచీ అఫ్గాన్‌లో మహిళల హక్కులు హరించుకుపోయాయి

కొనసాగుతున్న ధిక్కారం

తాలిబాన్ల మీద బయటి నుంచి కూడా ఒత్తిడి ఉంది. బాలికలు, మహిళల చదువుపై నిషేధం.. ‘‘మానవ హక్కులు, ప్రాధమిక స్వాతంత్ర్యాల పట్ల గౌరవం అంతకంతకూ తరగిపోతోందనటానికి నిదర్శనం’’ అంటూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి మంగళవారం నాడు ఖండించింది.

కానీ తాలిబాన్ నేతలు చలించినట్లు కనిపించటం లేదు. ‘‘మా మీద అణు బాంబు వేసినా కూడా’’ ఈ నిర్ణయాలను వెనక్కుతీసుకునేది లేదని విద్యా మంత్రి నీదా మొహమ్మద్ నదీం చెప్పినట్లు ‘ది గార్డియన్’ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

అదేలాలో కూడా అదే దృఢచిత్తం కనిపిస్తోంది.

‘‘నేను ఎగరలేకపోతే పరిగెడతా. పరిగెట్టలేకపోతే నెమ్మదిగా అడుగులు వేస్తా. అది కూడా చేయలేకపోతే.. పాకుతా. కానీ నా పోరాటం ఆపను. నా ప్రతిఘటన ఆపను’’ అంటున్నారామె.

తన స్నేహితుల మద్దతు, సంఘీభావం తనకు ఉంటుందని ఆమె చెప్పారు. ‘‘నువ్వు చాలా ధీశాలివి. మేమంతా నీతో ఉన్నాం’’ అని వాళ్లు ఆమెకు చెప్పారు.

గత తరాల వారికన్నా కానీ, నేటి అఫ్గానిస్తాన్‌లోని మహిళలు ఈ పోరాటం గెలిచే పరిస్థితి ఎక్కువగా ఉందని కూడా అదేలా నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి: