అఫ్గానిస్తాన్: తాలిబాన్లకు భయపడి మౌనంగా ఉండేదే లేదన్న అయిదుగురు మహిళలు

- రచయిత, క్వెంటిన్ సోమర్‌విల్లే
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది మంచుతో చేసిన స్నోమాన్ బొమ్మ. ఆకలి బాధలు పడుతున్న అఫ్గాన్ ప్రజలను శీతాకాలం చల్లగా తాకింది. విపరీతంగా మంచు పడడంతో కాబూల్‌కు ఓ కొసన ఉన్న ఆ ప్రాంతంలో ఆనందం వెల్లివిరిసింది.
స్నోమాన్ పక్కన నిలబడి ఫొటోలు తీసుకోవడానికి కొంతమంది యువతులు అక్కడకు చేరారు. నవ్వుతూ, ఫోన్ల వైపు చూస్తున్న వాళ్లకు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు.
అప్పుడే, ముగ్గురు తాలిబాన్ మిలిటెంట్లు వాళ్లను చూశారు. వాళ్లు దగ్గరకొచ్చేలోపు ఆ యువతులు పారిపోయారు.
మిలిటెంట్లలో ఒకరు స్నోమాన్‌ను సమీపించారు. ఆ బొమ్మ ఇస్లాంకు విరుద్ధమని వాళ్లు భావించి ఉండవచ్చు. బొమ్మకు కర్రతో పెట్టిన చేతులు విరిచేశారు. జాగ్రత్తగా కళ్లు, ముక్కు పీకేశారు. చివరిగా, తల విరగ్గొట్టారు.
పదేళ్ల తరువాత నేను కాబూల్‌లో అడుగుపెట్టాను. అఫ్గానిస్తాన్ సంస్కృతిపై నాకు అవగాహన లేకపోవడం గురించి అప్పటికే ఒక తాలిబాన్ సభ్యుడు నాకు లెక్చర్లు దంచారు.
అఫ్గాన్ మహిళలకు ఏది మంచిదో ఆయనకు తెలుసన్నట్టు మాట్లాడారు. "నీలి కళ్ల దెయ్యాలు" (పాశ్చాత్యులు) దేశాన్ని భ్రష్టు పట్టించాయన్నది ఆయన ఉద్దేశం.
ఆయన చెప్పిన మాటలు కాకుండా, అసలు అఫ్గాన్ మహిళలు ఏమనుకుంటున్నారో వినాలనుకున్నా.
చాలామంది అజ్ఞాతంలో ఉన్నారు. భవిష్యత్తు గురించి అందరూ భయపడుతున్నారు. కొందరు తమ జీవితాల గురించే భయపడుతున్నారు.
కాబూల్ వీధుల్లో అక్కడక్కడా మహిళలు కనిపిస్తున్నారు. కొంతమంది పాశ్చాత్య దుస్తులు ధరిస్తున్నారు కూడా. కానీ, వారి స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. చదువు, ఉద్యోగం చేసే స్వేచ్ఛ, హాయిగా తిరగగలిగే, స్వతంత్రంగా బతకగలిగే స్వేచ్ఛకి హాని కలుగుతోంది.
అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకున్న కొందరు మహిళలతో నేను మాట్లాడాను. ఎంతో రిస్క్ తీసుకుని వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఫాతిమా తప్ప మిగతా మహిళలంతా తమ వివరాలను గోప్యంగా ఉంచమన్నారు. ఆమె మాత్రం తన ముఖాన్ని చూపించడానికే సిద్ధపడ్డారు.

ఫాతిమా, 44
మంత్రసాని (మిడ్‌వైఫ్)
తాలిబాన్లు రెండుసార్లు ఫాతిమా జీవితంతో ఆడుకున్నారు. 1990లలో వాళ్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్నప్పుడు, 14 ఏళ్లకే ఫాతిమాకు బలవంతంగా పెళ్లి చేసేశారు. ఆమె చదువు మధ్యలోనే ఆగిపోయింది.
ఈసారి, 44 ఏళ్ల ఫాతిమాకు చేతిలో ఉద్యోగం ఉందిగానీ, రోజువారీ జీవితం దిగజారిపోయింది.
ఆమె చాలా కష్టపడి చదువుకుని, ఉద్యోగం సంపాదించుకున్నారు. పెళ్లితో ఆమె చదువు ఆగిపోయింది. మళ్లీ 32 ఏళ్లు వచ్చేవరకు చదువుకునే అవకాశం రాలేదు. అప్పటికి తాలిబాన్లు అధికారంలో లేరు కానీ, కొత్త రిపబ్లిక్ ఆఫ్ అఫ్గాన్ పాలనలోకూడా చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం అంత సులువు కాలేదు.
కొద్ది కాలంలోనే ఆమె అనేక కోర్సులు చేశారు. అయితే, కొన్నిసార్లు ఆమెకు అవకాశాలు రాలేదు.
"నా ఐడీ కార్డు చూసి నా వయసు ఎక్కువని, మిగతా విద్యార్థులతో కలిసి కూర్చోలేవని అనేవారు’’అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
చివరికి, రెండేళ్ల క్రితం ఫాతిమా డిగ్రీ పూర్తిచేశారు. కానీ, మళ్లీ అడ్డంకి ఎదురైంది.
"అఫ్గానిస్తాన్‌లో ఒక అమ్మాయికి చదువుకోవడమే కష్టం. అలాంటిది, వయసుమీరిన, పెళ్లయిన మహిళకు ఉద్యోగం రావడమెంత కష్టమో ఊహించుకోండి."
కానీ, ఆమె విజయం సాధించారు. మెటర్నరీ ఆస్పత్రిలో నర్స్‌గా ఉద్యోగం వచ్చింది. ఆమె చేతుల మీదుగా ఎంతో మంది పిల్లలు ఈ భూమి మీదకొచ్చారు.

"ఇతర మహిళలకు శిక్షణ ఇవ్వగలిగే ఉద్యోగం చేయాలనుకున్నాను. స్త్రీలు చదువుకుంటే ఆరోగ్యమైన, తెలివైన పిల్లలను ఈ సమాజానికి అందించగలుగుతారు. అలాంటి పిల్లలే సమాజంలో మార్పులు తీసుకురాగలరు."
తాలిబాన్ నియంత్రణ శాశ్వతమని ఫాతిమా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఈసారి వారి పాలన భిన్నంగా ఉంటుందని ఆమె ఆశిస్తున్నారు.
"మహిళల విద్య, ఉపాధి హక్కుల్లో జోక్యం చేసుకోవద్దని తాలిబాన్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలా చేస్తే సమాజానికి ఒక చేయి నరికేసినట్టే. పురుషులు, స్త్రీలు అనే రెండు పునాదులపై ఈ సమాజం నిర్మించబడింది. ఒంటి చేత్తో సమాజం ఎలా నడుస్తుంది?" అని ఫాతిమా అన్నారు.
"నేను ఆస్పత్రిలో పనిచేయకుండా తాలిబాన్లు ఆపలేరు. ఎందుకంటే నేను చేస్తున్న పని ఎంత అవరసమో వారికి బాగా తెలుసు."

అయితే, చాలా నెలలుగా ఆమెకు జీతం రావట్లేదు. అందుకు కారణం పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలేనని ఆమె అంటున్నారు.
"అమెరికా అంతర్జాతీయ సమాజం కలిసి అఫ్గానిస్తాన్ డబ్బును బ్లాక్ చేశాయి. తాలిబాన్లు మా హక్కులను లాగేసుకోవడం కంటే వేగంగా తాలిబాన్లపై పశ్చిమ దేశాల ఆంక్షలు మమ్మల్ని చంపేస్తాయి. ఆకలితో ఒక పాప చనిపోతోంది. ఒక తల్లి తన బిడ్డను అంగడిలో అమ్మేస్తోంది. ఆకలితో చనిపోతుంటే అక్షరాస్యత, చదువు ఇవన్నీ నిరర్థకం" అంటూ ఫాతిమా వాపోయారు.
దిగులుతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానని, గత కొన్నినెలలుగా చాలా ఒత్తిడిగా ఉంటోందని ఆమె అన్నారు.
ఫాతిమా దుస్తులపై బొమ్మలు కుడతారు. గత కొన్నాళ్లుగా అఫ్గానిస్తాన్‌లో వచ్చిన మార్పులను ఆమె చిత్రీకరిస్తున్నారు.
ఈ కళను ఆమె ఇతర మహిళలకు కూడా నేర్పించేవారు. వాళ్లు దీని ద్వారా డబ్బు సంపాదించేవారు. కానీ, ఇది ఇస్లాం వ్యతిరేకమని తాలిబాన్లు భావిస్తున్నారు. దాంతో, వారంతా ఇళ్లకే పరిమితమైపోయారు.
స్నేహితులను కలవడం కుదరట్లేదని, బ్యూటీ పార్లర్‌లలోని పోస్టర్లపై ఉన్న మహిళల ముఖాలకు తాలిబాన్లు నల్లరంగు పూశారని, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉందని ఫాతిమా చెప్పారు.

అమీనా, 29
ఇంటెలిజెన్స్ ఆఫీసర్
బ్యూటీ పార్లర్ల మాట అటుంచి, బతుకే భయంగా మారిందని 29 ఏళ్ల అమీనా అంటున్నారు. అఫ్గాన్ గూఢచార సంస్థ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్)లో పనిచేస్తున్నారామె.
ఒకదాని తరువాత ఒకటిగా తాలిబాన్లు మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకుంటుంటే, ఒక సురక్షితమైన ప్రాంతానికి మహిళా ఏజెంట్లను తరలిస్తూ ఆమె అనేక పగళ్లు, రాత్రులు గడిపారు. వారి ఖర్చులు భరించి, వారికి కొంత డబ్బు ఇచ్చి, ఎన్‌డీఎస్ హెడ్‌కార్టర్స్‌కు వెళ్లారు.
"సుమారు 100 మంది ఎన్‌డీఎస్ ఏజెంట్లను కాపాడగలిగాను. తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకుంటారని అసలు ఊహించలేదు. ఆగస్టు 15న ఆఫీసుకు వెళ్లగానే అందరూ విచారంగా కనిపించారు. 'మేడం ఆఫీసు నుంచి వెళ్లిపోండి. తాలిబాన్లు వస్తున్నారు' అని వాళ్లంతా చెప్పారు."
తన కార్యాలయంలో సిబ్బంది మొత్తం తరలివెళ్లిపోయారు. ఆరోజు మధ్యాహ్నమే ఆమె ఎస్కార్ట్ సాయంతో ఇంటికి వెళ్లిపోయారు. ఆమె మళ్లీ ఎన్‌డీఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లే అవకాశం లేదు.

అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోయారని, తాలిబాన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న వార్తలను ఆమె టీవీలో చూశారు.
ఘనీ అలా దేశాన్ని విడిచిపెట్టినందుకు ఆమెకు ఇప్పటికీ కోపంగానే ఉంది.
"చివరి వరకూ దేశం కోసం పోరాడడం ఆయన బాధ్యత" అని ఆమె అంటారు.
ఆ తరువాత రోజులు పీడకలల్లాంటివి. తాలిబాన్లు ఆమె ఇంటిని వెతికారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి పారిపోయారు. ఆమె వాహనాన్ని, గన్‌ను తీసుకున్నారు.
"మిలిటరీ వ్యక్తులకు వారి ఆయుధాలే గర్వకారణం. వాటిని ఎవరైన హరిస్తే చాలా బాధగా ఉంటుంది."
అఫ్గాన్ దళాలు ఎన్నో ప్రాణాలను కోల్పోయాయని, వారి సాహసాలు, త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని అమీనా అన్నారు.
పశ్చిమ దేశాలు మళ్లీ అఫ్గాన్‌కు సహాయం అందిస్తాయని ఆమె ఆశిస్తున్నారు.

మీనా, 22
యూనివర్సిటీ విద్యార్థి
మీనా మాత్రం పశ్చిమ దేశాలకు ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నారు.
"మమ్మల్ని వదిలిపెట్టండి"
20 ఏళ్ల పాటు పశ్చిమ దేశ దళాలు అఫ్గానిస్తాన్‌లో ఉన్నా, మహిళా హక్కులకు ముప్పు తప్పలేదని, తాలిబాన్లు రాక ముందే వారి హక్కులకు భంగం కలిగిందని ఆమె అన్నారు.
మీనా చాలా తెలివైన విద్యార్థి, అఫ్గాన్ జాతీయ స్థాయి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించారు. నాలుగేళ్ల చదువు ముగియనుంది. ఒక్క నెలలో డిగ్రీ చేతికొస్తుందనగా తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
"కొద్ది గంటల్లోనే నా భవిష్యత్తు మొత్తం మారిపోయిందని" ఆమె అన్నారు. ఇక యూనివర్సిటీ డిప్లమా ఉండదు. ఈ డిగ్రీ పూర్తి చేశాక విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఆమె కలలు కన్నారు.
"చదువు లేకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి? భవిష్యత్తు గొప్పగా ఏం కనిపించడం లేదు" అని ఆమె అన్నారు.

తాలిబాన్లు రాక ముందు నుంచీ అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కులకు భంగం కలుగుతూనే ఉందని మీనా అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ రిపబ్లిక్ పాలనలో ఉన్నప్పుడు కూడా ప్రతీ విషయానికి పోరాడవలసి వచ్చిందని తెలిపారు.
మీనా లాంటి ఎందరో యువతులకు తమ కష్టమంతా క్షణాల్లో వృధా అయిపోయింది.
అయితే, తాలిబాన్ల రాకతో రోడ్లపై వేధింపులు తగ్గాయని మీనా అంటున్నారు. తప్పు చేస్తే తాలిబాన్లు ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసు కాబట్టి మహిళలపై వేధింపులు తగ్గాయంటున్నారామె.
కానీ, మహిళలు బయటకు వెళితే కొన్ని రకాల వేధింపులు తప్పవు. తాలిబాన్లు చెక్‌పోస్టుల దగ్గర ఆపి ముఖం పూర్తిగా కప్పుకోలేదని, మగ తోడు లేదని ప్రశ్నిస్తారు. మహిళల మొబైల్ ఫోన్లు చెక్ చేస్తారు.
"నా దేశానికి సేవ చేయాలని, జెండర్ హక్కుల కోసం పోరాడాలన్నది నా కోరిక" అని ఫాతిమా చెప్పారు.

జాహ్రా & సమీరా, 34 36
పోలీసు అధికారులు
జాహ్రా, సమీరా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. ఇద్దరూ పోలీసు అధికారులయ్యారు.
అమెరికా ఇచ్చిన నిధుల వలన అఫ్గాన్ పోలీసు దళాల్లో మహిళల సంఖ్య పెరిగింది. కానీ, అమెరికా సైన్యం ఆ దేశం నుంచి తరలివెళ్లిన వెంటనే ఆ డబ్బూ మాయమైపోయింది.
కాబూల్‌కు తూర్పున ఉన్న లాగ్‌మాన్ ప్రావిన్స్ పతనం వరకు జాహ్రా తన పదవిలో కొనసాగారు. తాలిబాన్లు వారి బలగాలను ఓడించినప్పుడు, ఆమె తన ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు.
"మేం మా దేశంలోనే ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా అని సందేహంగా ఉంది. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఊపిరి ఆడుతున్నట్టు లేదు. మా పిల్లలు స్కూళ్లకి, యూనివర్సిటీలకు వెళ్లేవారు. ఇప్పుడు అదేమీ లేదు" అని జాహ్రా చెప్పారు.
ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయని, ఉద్యోగాలు లేక ఆదాయం లేక అవస్థపడుతున్నామని ఆమె చెప్పారు.
"ఒకప్పుడు జీవితంలో పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించాను. నా దగ్గర డబ్బు, అధికారం అన్నీ ఉండేవి. అవన్నీ ఇప్పుడు పోయాయి. ఇప్పుడు నాకేమీ గుర్తింపు లేదు" అని సమీరా అన్నారు.
తాలిబాన్లు ఆక్రమించుకున్నాక "తెల్ల కాగితంపై నల్లరంగు పోసినట్లయిపోయిందని" ఆమె అన్నారు.

ఆ మహిళలిద్దరూ చాలా భయపడుతున్నారు. చుట్టుపక్కలకు కొత్త వ్యక్తులు వస్తే అనుమానపడుతున్నారు.
గత ప్రభుత్వంలో పనిచేసినవారికి క్షమాభిక్ష పెట్టినట్లు తాలిబాన్ ప్రకటించింది. కానీ, గత ప్రభుత్వంలో పనిచేసిన సుమారు 100 మంది అధికారులను తాలిబాన్లు చంపేశారన్న సమాచారం తమకు అందిందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
పోలీసు ఆఫీసరు, మహిళా జైలు అధికారి అయిన అలియా అజీజీ గత నాలుగు నెలలుగా కనిపించడం లేదు. తాలిబాన్ అధికారులు ఆమెను ఆఫీసుకుని రమ్మని పిలిచినప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. సోషల్ మీడియాలో 'ఫ్రీఅలియాజీజ్' అనే హాష్‌ట్యాగ్ నడుస్తోంది.
కొన్ని నెలల కిందట మహిళా హక్కుల కోసం చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న నలుగురు మహిళలు అదృశ్యమైపోయారు. వారిని ఈ వారం విడుదల చేశారు. అయితే, వారెవ్వరినీ తాము నిర్బంధించలేదని తాలిబాన్లు చెబుతున్నారు.
"మా అమ్మ భద్రతా దళాల్లో పనిచేసి ఉండకపోతే బాగుండును అని మా పిల్లలు అనుకుంటున్నారు" అని జాహ్రా చెప్పారు.
"ఈ ఉద్యోగాల్లోకి వెళ్లేందుకు అమెరికా, నాటోలు మమ్మల్ని ప్రోత్సహించాయి. అమెరికా, కెనడా, జర్మనీ, హాలండ్ మొదలైన దేశాల నుంచి వచ్చిన మహిళలు మాకు శిక్షణ ఇచ్చారు. వాళ్లంతా మా పక్కనే నిల్చునేవారు. ఇప్పుడు అందరూ మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు" అని ఆమె అన్నారు.
(ఫాతిమా తప్ప మిగిలిన మహిళల పేర్లు మార్చాం.)

ఇవి కూడా చదవండి:
- పాన్ కార్డు స్కాం: సన్నీ లియోనికి తెలియకుండానే ఆమె పాన్ కార్డుపై లోను ఎలా తీసుకున్నారు?
- వేప చెట్లకు వింత వ్యాధి, ఎండాకాలంలో వేప చెట్టు నీడ ఉండదా... 10 ప్రశ్నలు
- ఉత్తర్‌ప్రదేశ్: యోగి ఆదిత్యనాథ్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో రైతులు బాగుపడ్డారా? BBC Reality Check
- అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్ష విధించిన కోర్టు.. 56 మంది మృతికి కారణమైన ఆ రోజు ఏం జరిగింది?
- రంగారెడ్డి జిల్లాలో ‘వితంతువుల తండా’: ‘మా ఊరిలో శుభకార్యాలకు ముత్తైదువలు లేరు.. పక్క ఊళ్ల నుంచి పిలిపిస్తున్నాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











