Ashraf Ghani: ‘నేను దేశం విడిచి ఎలా పారిపోయానంటే’ - నాలుగు నెలల తరువాత గుట్టు విప్పిన అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు

అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

అఫ్గానిస్తాన్ నుంచి 2021 ఆగస్ట్‌లో అంతర్జాతీయ సేనలు వైదొలగడం మొదలుపెట్టిన మరుక్షణం నుంచే తాలిబాన్లు దేశంలో అనేక ప్రాంతాలను నెమ్మది నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు.

అదే సమయంలో అప్పటి అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచిపెట్టి పారిపోయారు.

దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో దేశం వదిలిపెట్టి పారిపోవడాన్ని ఆయన సమర్థించుకుంటున్నారు. కాబుల్ వినాశనం అవ్వకుండా కాపాడేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

తాలిబాన్‌లు ఆగస్టులో కాబుల్‌ను స్వాధీనం చేసుకుని అధికారం చేజిక్కించుకున్నారు.

ఆగస్ట్ 15న నిద్ర లేచేసరికి ఆ రోజు దేశం విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుందనే ఆలోచన కూడా లేదని అష్రఫ్ ఘనీ బీబీసీ రేడియో 4 కార్యక్రమంలో చెప్పారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన యూకే మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ నిక్ కార్టర్‌తో సంభాషణలో ఆయన పాల్గొన్నారు.

ఘనీ దేశం విడిచిపెట్టి పారిపోవడంతో చాలా మంది తీవ్రంగా విమర్శించి ఆరోపణలు కూడా చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నారు.

ఆ రోజు, తాలిబాన్లు కాబుల్‌లో అడుగు పెట్టకుండా ఉండేందుకు అంగీకరించినట్లు చెప్పారు. కానీ, మరో రెండు గంటల్లో మొత్తం పరిస్థితే మారిపోయిందని ఆ రోజు జరిగిన సంఘటనలను ఘనీ గుర్తు చేసుకున్నారు.

"తాలిబాన్లలో రెండు వేర్వేరు వర్గాలకు చెందిన వారు రెండు వేర్వేరు దిక్కుల నుంచి కాబుల్‌ను చుట్టుముట్టారు" అని ఘనీ వివరించారు.

‘‘ఆ రెండు వర్గాల మధ్యలో చెలరేగే భారీ పోరాటం 50 లక్షల మంది నివసిస్తున్న కాబుల్ నగరాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు" అని ఘనీ చెప్పారు.

అఫ్ఘాన్ అధ్యక్ష భవనంలో తాలిబాన్లు

ఫొటో సోర్స్, AP Images

ఫొటో క్యాప్షన్, అఫ్ఘాన్ అధ్యక్ష భవనంలో తాలిబాన్లు

ఘనీ తొలుత తన భార్యను, జాతీయ భద్రతా సలహాదారును దేశం నుంచి బయటపడేందుకు అనుమతించారు. ఆ తర్వాత తాను రక్షణ మంత్రిత్వ శాఖ భవనానికి వెళ్లేందుకు కారు కోసం ఎదురు చూశారు.

కానీ, ఆ కారు ఎప్పటికీ రాలేదు. ఇంతలో అధ్యక్షుడి భద్రత మొత్తం చూసుకునే అధికారి వచ్చి తాలిబాన్‌ల సందేశాన్ని తీసుకొచ్చారు.

‘‘ఘనీ తాలిబాన్లకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, మొత్తం అందరినీ చంపేస్తాం’’ అని తాలిబాన్లు చెప్పారంటూ ఆ అధికారి వణికిపోతూ ఘనీకి చెప్పారు.

"ఆయన నాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు" అని ఘనీ చెప్పారు.

"నన్ను ఖోస్ట్ నగరానికి వెళ్లమని సూచించారు. కానీ, అప్పటికే ఖోస్ట్, జలాలాబాద్ కూడా తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి".

"ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. నేను అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అఫ్గానిస్తాన్ విడిచిపెట్టి వెళ్తున్నానని అర్థమైంది. ఇదంతా అకస్మాత్తుగా జరిగిపోయింది" అని చెప్పారు.

ఘనీ అఫ్గానిస్తాన్ విడిచిపెట్టి పారిపోవడం చాలా అగౌరవంగా ఉందని అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలేహ్ విమర్శించారు.

ఘనీ పారిపోతూ తన వెంట భారీగా ధనాన్ని కూడా పట్టుకుని వెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆ ఆరోపణలను ఘనీ పూర్తిగా ఖండించారు. ఈ ఆరోపణలపై అంతర్జాతీయ విచారణ చేపడితే మంచిదని అన్నారు.

"నేను దేశం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్లలేదని కచ్చితంగా చెబుతున్నాను. నా జీవన శైలి అందరికీ తెలుసు. డబ్బుతో నేనేం చేసుకుంటాను" అని ప్రశ్నించారు.

కొన్ని తప్పులు జరిగాయని ఘనీ అంగీకరించారు. అంతర్జాతీయ సమాజం మరి కాస్త సహనం వహిస్తుందని ఊహించినట్లు చెప్పారు.

అయితే, తాలిబాన్లకు, మాజీ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు మధ్య జరిగిన ఒప్పందమే ఆగస్టు 15 వరకు చోటు చేసుకున్న పరిస్థితులకు దారి తీసిందని అన్నారు.

"శాంతియుత ఒప్పందానికి బదులు, సేనలు వైదొలిగేందుకు ఒప్పందం చేసుకున్నారు" అని ఘనీ అన్నారు. ఆ ఒప్పందం జరిగిన తీరు మమ్మల్ని తుడిచిపెట్టేసింది" అని అన్నారు.

ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా , మిత్ర దేశాల సేనలను తగ్గించేందుకు అంగీకారం కుదిరింది. అలాగే, జైలులో ఉన్న తాలిబాన్ ఖైదీల విడుదలకు అంగీకరిస్తే, అఫ్ఘాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాలిబాన్లు అంగీకరించారు.

అయితే, ఆ చర్చలు సఫలం కాలేదు. 2021 వేసవి నాటికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబరు 11 నాటికి అమెరికాతో సహా మిత్ర దేశాల సేనలను ఉపసంహరణ చేస్తామని ప్రకటించారు. అప్పటికే, తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ఆక్రమించడం మొదలుపెట్టారు.

"చివరకు ఏమైంది? అదొక రాజకీయ ఒప్పందంలా, ప్రజలు పాల్గొన్న రాజకీయ ప్రక్రియలా కాకుండా ఒక హింసాత్మక తిరుగుబాటుగా పరిణమించింది" అని అన్నారు.

తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న రోజే ఘనీ కాబుల్ వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి దేశం ఒక ఆర్ధిక, మానవీయ సంక్షోభంలో కూరుకుపోయింది. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత అంతర్జాతీయ సహకారం కూడా లేకపోవడంతో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి.

కాబుల్ పతనానికి దారి తీసిన కొన్ని సంఘటనలకు తన తప్పులు కూడా కొన్ని ఉన్నాయని మూడు నెలల తర్వాత ఘనీ అంగీకరిస్తున్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని నమ్మడమే తాము చేసిన తప్పని ఆయన అంటున్నారు.

Analysis box by Lyse Doucet, chief international correspondent

విశ్లేషణ: లైస్ డౌసెట్, బీబీసీ అంతర్జాతీయ ప్రతినిధి

తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకోవడం ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదు. కానీ, తాలిబాన్లకు మార్గం సుగమం చేయడం కోసం ఒప్పందం కుదుర్చుకుని అష్రఫ్ ఘనీ అకస్మాత్తుగా, రహస్యంగా ఆగస్టు 15న దేశం విడిచిపెట్టి వెళ్లారని చాలా మంది అంటారు.

ఏదైమనప్పటికీ, తాలిబాన్లు ఆధిపత్యం చెలాయిస్తుంటారు. కానీ, ప్రాణం ఉన్నంత వరకూ దేశం కోసం పోరాడతానని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి మిగిల్చిన ఖాళీ మాత్రం మరింత అయోమయంలోకి నెట్టేసింది. ఆయన గతంలో ఎన్నడూ ప్రవర్తించని విధంగా ఆగస్టు 15న ప్రవర్తించారని చాలా మంది విమర్శిస్తారు.

అమెరికా ఆయనకు చేయూతనివ్వకపోవడం నిజమే అయినప్పటికీ, ఆయన కూడా ఆ పరిస్థితిలో సరిగ్గా వ్యవహరించలేకపోయారు.

ఆయనను ఒక రాజకీయవేత్తగా కంటే అమెరికా రాజకీయాలను , క్షేత్ర స్థాయిలో అంచనా వేయలేని రీతిలో క్షణక్షణానికి కొత్త మలుపులు తిరిగిన పరిస్థితిని తప్పుగా అధ్యయనం చేసిన ఒక ప్రొఫెసర్ మాదిరిగా చూస్తున్నారు.

ఆయన ప్రస్తుతం మాట్లాడిన సంభాషణను మరింత గుచ్చిగుచ్చి చూసి చర్చించి, కొట్టి పారేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)