స్పూన్లు వంచి, గడియారం ముళ్లను పరుగులు పెట్టించి భయపెట్టిన మాంత్రికుడి కథ

యూరీ గెల్లర్
ఫొటో క్యాప్షన్, యూరీ గెల్లర్
    • రచయిత, యొలాండె నెల్
    • హోదా, బీబీసీ న్యూస్, జాప్ఫా

ఇజ్రాయెల్‌లోని జాప్ఫాలో సముద్రానికి అభిముఖంగా ఉంటుంది కొత్త యూరీ గెల్లర్ మ్యూజియం. దాని ప్రవేశద్వారం దగ్గర ఒక టీ స్పూన్ ఉంది. అది ప్రపంచంలోనే అతి పెద్ద టీ స్పూన్. మొత్తం 16.18 మీటర్ల (53.1 అడుగులు) పొడవు ఉంటుందా టీ స్పూన్.

మ్యూజియం లోపల కూడా కొన్ని వందల స్పూన్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకూ వంగిపోయి ఉంటాయి - తాను సైకిక్‌నని ప్రకటించుకున్న యూరీ గెల్లర్ విశిష్ట నైపుణ్యాలకు సాక్ష్యాలుగా.

ఐదు దశాబ్దాల పాప్ సంస్కృతిలో సాగిన అసాధారణ జీవితం, కెరీర్ కథను కూడా ఈ మ్యూజియం చెప్తుంది.

‘‘నాది పేద కుటుంబ నేపథ్యం. ఓ సైకిక్ సూపర్‌స్టార్‌ను కావాలనేది నా కోరిక. ఆ కోరికతోనే నేను వెలుగులోకి వచ్చాను’’ అని గెల్లర్ నాతో చెప్పారు.

‘‘నాకున్నది, మిగతావారికి లేనిది.. ఇజ్రాయెలీ పొగరు. ఆ దుడుకుతనం. ఎల్టన్ జాన్ దగ్గరకెళ్లి.. ‘నీతో ఫొటో దిగొచ్చా? నిన్ను కలవొచ్చా?’ అని అడిగే దమ్ము నాకుండింది’’ అంటారాయన.

యూరీ గెల్లర్

‘‘ప్రముఖులు నా గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ‘ఓయ్, నేనిప్పుడే యూరి గెల్లర్ అనే వాడ్ని కలిశాను. అతడు నా కళ్ల ముందే స్పూన్‌ను వంచేశాడు. తెలుసా’ అని చెప్పేవాళ్లు. అలా నేను విజయం మెట్లు ఎక్కటం ప్రారంభమైంది’’ అని వివరించారు.

ఆకర్షణీయమైన ఈ ప్రదర్శకుడికి ఈ నెలలో 75 ఏళ్లు నిండాయి. ఆయన తన సంపన్నమైన జ్ఞాపకాలను నాతో పంచుకున్నారు.

ఈ మ్యూజియంలో పాప్ జ్ఞాపికలతో పాటు అనేక ఆసక్తికరమైన వస్తువులున్నాయి. అందులో సాల్వడార్ డాలి ఇచ్చిన క్రిస్టల్ బాల్ ఒకటి. అది వాస్తవంగా లియొనార్డో ద వించీకి చెందిన బాల్ అని చెప్తారు. లిబియా నియంత మువామర్ గడాఫీ ఇచ్చిన ఒక నమూనా విమానం కూడా ఉంది. ఇక గ్రహాంతర వాసుల నుంచి వచ్చిందని జాన్ లెనన్ చెప్పిన ఓ బంగారు గుడ్డు కూడా ఉంది.

యూరీ గెల్లర్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, యూరీ గెల్లర్

కీర్తి శిఖరాలకు...

మ్యూజియం గోడ మీద ఉన్న ఓ బ్లాక్-అండ్-వైట్ ఫొటోలో.. టెల్ అవీవ్‌లోని గెల్లర్ చిన్ననాటి ఇల్లు కనిపిస్తుంది.

ఆయన 1946లో అప్పటి బ్రిటిష్ మాండేట్ పాలస్తీనాలో పుట్టారు. ఐదేళ్ల వయసులో ఒక గిన్నెలో సూప్ తాగుతూ.. మొట్టమొదటిసారి ఒక స్పూన్‌ను ఎలా వంచానో, తన మానవాతీతశక్తుల్లా కనిపించే తన టాలెంట్‌ను స్కూల్‌లో ఎలా ప్రదర్శించానో వివరించారు.

‘‘మా టీచర్లకు దిమ్మతిరిగిపోయింది. గోడ మీద గడియారం వైపు చూసి, నా మనోశక్తితో ఆ గడియారం ముళ్లను కదిలించేవాడిని. వారు భయపడిపోయేవారు’’ అని చెప్పారాయన.

ఆ తర్వాత కొంత కాలం సైప్రస్‌లో నివసించారు గెల్లర్. అక్కడ ఇంగ్లిష్ నేర్చుకున్నారు. మళ్లీ ఇజ్రాయెల్‌కు తిరిగొచ్చి, పారాట్రూపర్స్ బ్రిగేడ్‌లో చేరారు. 1967 మిడిల్ ఈస్ట్ వార్‌లో సైనికుడిగా పోరాడారు.

వయసు 20ల తొలినాళ్లలో ప్రదర్శకుడిగా పనిచేయటం మొదలుపెట్టారు. సైకోకైనెసిస్, టెలీపతీలతో స్పూన్లు, తాళంచెవులను వంచటం, గడియారాలను ఆపేయటం, ముళ్లు వేగంగా పరుగులు తీసేలా చేయటం, దాచిపెట్టిన డ్రాయింగ్స్‌ను వర్ణించి చెప్పటం.. ప్రేక్షకులను అబ్బురపరిచేవి.

ఒక ప్రైవేటు కార్యక్రమంలో నాటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గోల్డా మేర్‌ను ఆయన మెప్పించారు. గోల్డా ప్రోత్సాహంతో తాను జాతీయ స్థాయిలో ప్రముఖుడిగా ఎదిగానని గెల్లర్ చెప్తారు.

అనతికాలంలోనే అంతర్జాతీయ నిఘా సంస్థల దృష్టి ఆయన మీద పడింది.

‘‘ఈ ప్రయోగ కాలంలో గెల్లర్ విజయం ఫలితంగా.. ఆయన తన పారానార్మల్ (సైన్స్‌కు అందని) ఇంద్రియగోచర సామర్థ్యాన్ని.. ఒప్పించేలా విస్పష్ట రీతిలో ప్రదర్శించారు’’ అని చెప్తున్న నాటి సీఐఏ నివేదిక.. మ్యూజియం గోడ మీద గర్వంగా వేలాడుతోంది.

యూరీ గెల్లర్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, యూరీ గెల్లర్

‘అప్పుడు నా కథ ముగిసి పోయిందనుకున్నా’

కానీ అందరూ అంత సులభంగా అంగీకరించలేదు. ఆయన అమెరికాలో ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించిన వెంటనే, 1973లో జానీ కార్సన్ నిర్వహించే పాపులర్ ప్రోగ్రామ్ ‘ద టునైట్ షో’లో చాలా అవమానానికి గురయ్యారు.

కార్యక్రమ నిర్వాహకుడు ఒక టేబుల్ మీద స్పూన్లు అవీ ఉంచారు. వాటిని గెల్లర్ తన మనోశక్తులతో వంచలేకపోయారు. దానికి అక్కడ తనకున్న శత్రుపూరిత వాతావరణమే కారణమని గెల్లర్ తప్పుపడతారు.

‘‘నా కథ ముగిసింది.. అనుకున్నాను. నేను హోటల్‌కు తిరిగివెళ్లి, ఇజ్రాయెల్ వెళ్లిపోవటానికి సర్దుకోవటం మొదలుపెట్టాను. ఎందుకంటే నేను నాశనమైపోయాను’’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.

కానీ ఆ మరుసటి రోజు ఉదయం.. కార్సన్ ప్రత్యర్థి ఒకరు ఫోన్ చేశారు. తన టీవీ షోలో పాల్గొనాలని గెల్లర్‌ను కోరారు. ఆ అనుభవం ఈ ‘సైకిక్‌’కు ఒక పాఠంలా పనిచేసింది. ఆ తర్వాత ఆయన అనేక రకాల పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయితే తన విమర్శకులను స్వాగతించటం తాను నేర్చుకున్నానని గెల్లర్ చెప్తారు.

మార్వెల్ కామిక్స్ ముఖచిత్రంపై కూడా కనిపించిన యూరీ గెల్లర్
ఫొటో క్యాప్షన్, మార్వెల్ కామిక్స్ ముఖచిత్రంపై కూడా కనిపించిన యూరీ గెల్లర్

‘‘నా చుట్టూ చాలా వివాదం ఉంది. అది నిజమా? కాదా? అదంతా కనికట్టేనా? అనే సందేహాలున్నాయి’’ అని తెలిపారు.

‘‘ఆస్కార్ వైల్డ్ చెప్పిన.. ‘మన గురించి జనం మాట్లాడుకోటం కన్నా హీనమైనది జీవితంలో ఒకే ఒక్కటుంది.. అది- మన గురించి జనం మాట్లాడుకోకపోవటం’ అనే మాటను నేను అనుసరించాలి’’ అంటారాయన.

అయితే ప్రదర్శనా రంగంలో పనిచేయటం వల్ల గల నష్టం గురించి ఆయన నిజాయితీగా మాట్లాడారు.

‘‘నాకు గర్వం ఎంతగా పెరిగిపోయిందంటే.. నాకు బులిమియా, అనోరెక్సియా నెర్వోసా (మానసిక అనారోగ్యాలు: అతిగా తినటం, వాంతులు చేసుకోవటం) జబ్బులు వచ్చాయి. ఆ కీర్తిని, ఒత్తిడిని, అనుమానాలను నేను తట్టుకోలేకపోయాను’’ అని న్యూయార్క్‌లో తాను నివసించిన దశాబ్దం గురించి గుర్తుచేసుకున్నారు.

ఒక ఏడాది పాటు తన కుటుంబంతో కలిసి జపాన్‌లో గడపటం వల్ల తన జీవితం మళ్లీ మామూలు స్థితికి వచ్చిందని ఆయన నమ్ముతారు. తర్వాత వారు బ్రిటన్‌కు వచ్చి బర్క్‌షైర్‌లోని సానింగ్-ఆన్-థేమ్స్ గ్రామంలో 35 ఏళ్ల పాటు నివసించారు.

1970లో టీవీలో తన శక్తులు ప్రదర్శించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1970లో టీవీలో తన శక్తులు ప్రదర్శించారు

తారల కానుకలు...

మ్యూజియంను సందర్శిస్తుండగా గెల్లర్ చాలా విషయాలు మాట్లాడారు. సైకోఎనాలసిస్ వ్యవస్థాపకుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు తన తల్లి తరఫు నుంచి తాను దూరపుబంధువునని ఆ వరుస గురించి ఆయన నాకు వివరించారు.

మ్యూజియంలో ఒక కాడిలాక్‌కు 2,600 స్పూన్లు అతికించి ఉన్నాయి. వాటిలో చాలావరకూ.. విన్‌స్టన్ చర్చిల్ మొదలుకుని జాన్ ఎఫ్ కెన్నడీ వరకూ.. ఎంతో మంది ప్రముఖులకు చెందిన స్పూన్లు.

ముహమ్మద్ అలీ బాక్సింగ్ గ్లవ్స్, డీగో మారడోనాకు చెందిన ఫుట్‌బాల్ టాప్, అధివాస్తవిక చిత్రకారుడు డాలీ ఇచ్చిన కానుకలు ఇలా ఎన్నో ఉన్నాయి.

గెల్లర్ న్యూయార్క్‌లో గడాఫీని కలిసిన తర్వాత.. ఆయన పంపిన ఒక నమూనా విమానంలో ఓ సందేశం ఉంది. 1973లో ఇజ్రాయెల్ వైమానిక దళం కూల్చేసిన లిబియాకు చెందిన అరబ్ ఎయిర్‌లైన్స్ విమానం నమూనా అది. తన ఆగ్రహాన్ని ఇజ్రాయెల్‌కు తెలియజేయటానికి గడాఫీ తనను ఒక మార్గంగా భావించినట్లు గెల్లర్ నమ్ముతారు.

రిటైర్ అయ్యే ప్లాన్స్ లేవని గెల్లర్ అంటున్నారు
ఫొటో క్యాప్షన్, రిటైర్ అయ్యే ప్లాన్స్ లేవని గెల్లర్ అంటున్నారు

ఇక అంతుచిక్కని గుడ్డు ఒకటి ఉంది.

‘‘ఆ గుడ్డును జాన్ లెనన్ నాకు ఇచ్చారు. ఓ గ్రహాంతరవాసి నుంచి అది తనకు వచ్చిందని లెనన్ చెప్పారు. ‘ఏ మత్తులో జోగుతున్నావ్?’ అని అడిగాను. కానీ తాను చెప్పిందని నిజమని ఆయన ఒట్టేసి చెప్పారు’’ అని గెల్లర్ వివరించారు.

ఇక 80, 90 దశకాలకు చెందిన కొన్ని వస్తువులు మైఖేల్ జాక్సన్‌వి. అప్పట్లో గెల్లర్‌కు జాక్సన్ సన్నిహిత మిత్రుడు.

పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ మరణం తర్వాత.. ఆయన మీద వచ్చిన లైంగిక అత్యాచారాల ఆరోపణలు నేపథ్యంలో ఆయన వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శించటం ఏమిటని కొందరు సందర్శకులు నాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. అయితే.. జాక్సన్ నిర్దోషి అని గెల్లర్ చెప్తున్నారు.

ప్రముఖులతో గెల్లర్

ఫొటో సోర్స్, URI GELLER

‘నా వంటి వారెవరూ లేరు’

గెల్లర్ తన భార్య హన్నాతో కలిసి ఆరేళ్ల కిందట ఇజ్రాయెల్ తిరిగివచ్చారు. వారి పిల్లలు పెద్దవాళ్లయ్యారు. లండన్, లాస్ ఏంజెలెస్‌లలో నివసిస్తున్నారు.

‘‘ప్రతి ఇజ్రాయెలీ గుండెల్లో తమ మాతృభూమికి తిరిగిరావాలని ఓ విధమైన ఆధ్యాత్మిక కాంక్ష రగులుతూ ఉంటుంది. నాకిది చాలా చాలా ముఖ్యమైన విషయం’’ అని చెప్పారాయన.

గెల్లర్ వ్యక్తిగత సంపదలో చాలా వరకూ.. చమురు, ఖనిజాల కంపెనీలకు తన మనోశక్తితో భూమిలో దాగివున్న నిక్షేపాలను కనిపెట్టే పనిచేయటంతో పాటు వినోదప్రదర్శనలు ఇవ్వటం ద్వారా సంపాదించినదే. అయితే ఆయన రిటైర్మెంట్ గురించి ఆలోచించటం లేదు.

బ్రిటిష్ మీడియాకు ఆయన ఇప్పటికీ ఫేవరేట్‌గానే ఉన్నారు. ఫుట్‌బాల్ పోటీల్లో జట్ల స్కోర్లపై జోస్యం చెప్పటం, బ్రెగ్జిట్‌ను ఆపేస్తానని బెదిరించటం, సూయిజ్ కాలువలో చిక్కుకుపోయిన భారీ నౌకను తానే టెలీపతి ద్వారా కదిలించానని చెప్పటం.. ఇటీవలి పతాక శీర్షికల్లో కనిపిస్తాయి.

యూరీ గెల్లర్

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పటి ఆటోమన్ శకానికి చెందిన సోప్ ఫ్యాక్టరీలో మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన.. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను అనుకోకుండా కలిసినపుడు వచ్చింది. ఆ ఏజెంట్ పాత జాప్ఫాలోని ఈ ఖాళీ ఆస్తిని గెల్లర్‌కు చూపించారు.

‘‘ఆ మరుక్షణంలోనే.. సానింగ్-ఆన్-థేమ్స్‌లో నా దగ్గర ఉన్నవాటన్నిటినీ ఇక్కడికి తెచ్చేయబోతున్నానని నాకు తెలిసిపోయింది. నా దగ్గర ఇన్ని వస్తువులున్నాయని నాకు తెలీదు. అక్కడ నా ఇల్లంతా చిందరవందరగా పడివున్నాయి. షెడ్లు, సూట్‌కేసుల్లో దాచేసి ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.

గోడల మీద పోస్టర్లు, పర్సనల్ టూర్ల ఫొటోలు.. స్పూన్ బెండింగ్ ప్రదర్శనలతో ఈ మ్యూజియం గుర్తుండిపోయే విశిష్టతను సంతరించుకుంది.

‘‘సందర్శకులు వచ్చి వెళుతుంటే నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. ‘మీకిది బాగుందా?’ అని నేను అడుగుతాను. ‘అద్భుతంగా ఉంది’ అని వారు చెప్తారు’’ అంటారు గెల్లర్.

‘‘ఇది ఓ అసాధారణ మ్యూజియం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అంతా చూపించటానికి నాలాంటి గైడ్ కూడా మరెక్కడా దొరకడు’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.