మనిషికి, కుక్కకు మధ్య మంచు యుగంలోనే స్నేహం.. ఎలా సాధ్యమైంది? శునకాల డీఎన్ఏ ఏం చెప్తోంది?

గ్రేట్ డేన్ మీద నిల్చున్న చిహువావా

ఫొటో సోర్స్, Getty Images

జంతు ప్రపంచంలో మనిషికి అత్యంత ఆప్త మిత్రులైన శునకాలే.. మనకు అత్యంత పురాతన మిత్రులు కూడా అని కుక్కలపై జరిపిన ఒక డీఎన్ఏ అధ్యయనం చెప్తోంది.

మనిషి కుక్కలను పెంచడం మంచుయుగం అంతమైనప్పటి నుంచీ.. అంటే గత 11,000 సంవత్సరాల నుంచీ ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

దీనిని బట్టి మనిషి మరే ఇతర జంతువులను పెంచుకోక ముందు నుంచే కుక్కలను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆ కాలం నాటికి శునకాలు ఉత్తరార్థగోళంలో విస్తారంగా వ్యాపించటమే కాదు.. అప్పటికే ఐదు విభిన్న జాతులుగా చీలాయి కూడా.

వలస పాలనల కాలంలో యూరోపియన్ జాతికి చెందిన కుక్కలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. నేటికీ, ఈ జాతులు కొన్ని అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియాలలో కనిపిస్తాయి.

మనిషికి ఇంత దగ్గరగా మసిలే కుక్కల చరిత్ర గురించి ఈ పరిశోధన కాస్త వివరిస్తోంది.

"మనిషి జంతువులను వేటాడి చంపి తినే ఆదిమ యుగం నుంచి ఒక మాంసాహార జంతువును పెంపుడు జంతువుగా చేసుకోవడం కొంత విలక్షణంగానే ఉంటుంది. కానీ, తోడేళ్ళు ప్రపంచంలో భయపెట్టే జంతువులుగా ఉండేవి" అని లండన్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్లో ఏన్షియెంట్ జెనోమిక్స్ లాబొరేటరీ బృంద నాయకుడు, అధ్యయన సహ రచయత డాక్టర్ పోన్టస్ స్కోగ్లండ్ చెప్పారు.

అయితే, అలాంటి భయంకరమైన జంతువులను మనిషులు ఎందుకు పెంచుకోవడం మొదలుపెట్టారనే ఆసక్తికరమైన విషయం గురించి తమ బృందం పరిశీలించినట్లు ఆయన చెప్పారు.

New Guinea singing dog న్యూ గినియా సింగింగ్ డాగ్

ఫొటో సోర్స్, SPL

ఫొటో క్యాప్షన్, ఆసియా, ఓషియానియాల్లో కనిపించే కుక్కల జాతికి ఒక ప్రతినిధి న్యూ గినియా సింగింగ్ డాగ్

మానవులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలసలకు వెళ్ళినప్పుడు తమతో పాటు ఉండే కొన్ని పెంపుడు జంతువులను తీసుకుని వెళ్లడం వలన కొంత వరకు కుక్కల జన్యు తీరు కూడా మనుషులను పోలి ఉంటుంది. కానీ, వీటిలో కూడా కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.

ఉదాహరణకు యూరోపియన్ జాతికి చెందిన కుక్కలు మొదట్లో తూర్పు జాతి, సైబీరియా జాతి లక్షణాలు కలిగి కొంత విభిన్నంగా ఉండేవి. కానీ, కాంస్య యుగం వచ్చేసరికి ఒకే ఒక్క జాతికి చెందిన కుక్కలు ప్రపంచమంతా విస్తరించి మిగిలిన జాతులన్నిటి స్థానాన్ని ఆక్రమించేశాయి.

" కుక్కల జాతుల విషయానికి వస్తే 4000, 5000 సంవత్సరాల క్రితం యూరోప్ ని ఒక విభిన్నమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న యూరోప్ లో కుక్కలు రక రకాల రూపాలు , ఆకారాలలో ఉన్నప్పటికీ జన్యుపరంగా వాటి మూలాలు మాత్రం పరిమితమయిన జాతుల నుంచే వచ్చాయని చెప్పుకోవచ్చు" అని క్రిక్ పరిశోధకులు, ఈ అధ్యయన ముఖ్య రచయత ఆండర్స్ బెర్గ్స్ట్రోమ్ చెప్పారు.

27 రకాల పురాతనమైన శునక జాతులకు సంబంధించిన వివిధ రకాల పురాతత్వ అవశేషాల నుంచి సేకరించిన జన్యువులను ఒక అంతర్జాతీయ బృందం పరిశీలించింది. వీటిని ఆధునిక శునకాల జన్యువులతో పోల్చి పరిశీలించారు.

దక్షిణ ఆఫ్రికాలో రొడీషియన్ రిడ్జ్ బ్యాక్, మెక్సికోలో ఛిహువాహువా లాంటి జాతుల్లో ఆ ప్రాంతపు దేశీయ జాతి జన్యువులు ఇంకా ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడించాయి.

అయితే, తూర్పు ఆసియాలో ఈ కుక్కల వంశపారంపర్యత కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. చైనా జాతి కుక్కలు కొంత వరకు తమ వారసత్వాన్ని ఆస్ట్రేలియా డింగో న్యూ గినియా సింగింగ్ డాగ్ నుంచి పొందినట్లు కనిపిస్తుంది. కొన్ని రకాలు యూరోప్ నుంచి , రష్యా స్టెప్ జాతి నుంచి పొందినవి ఉంటాయి.

న్యూ గినియా సింగింగ్ డాగ్ అరిచేటప్పుడు పాటలా మొదలయి, క్రమంగా వాటి గొంతు పై స్థాయికి పెరగడం వలన వాటికి ఆ పేరు వచ్చినట్లు చెబుతారు.

రోడీసియన్ రిడ్జ్‌బ్యాక్
ఫొటో క్యాప్షన్, పురాతన ఆఫ్రికా శునక వారసత్వం రోడీసియన్ రిడ్జ్‌బ్యాక్ కుక్కలో కొనసాగుతోంది

"కుక్కలు మనిషికి అత్యంత సన్నిహితంగా , అతి చిర కాలంగా మనిషితో కలిసి జీవిస్తున్న జంతువులు" అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయన సహ రచయత గ్రెగర్ లార్సన్ చెప్పారు. పురాతనమైన శునకాల డిఎన్ఏ ని చూసినప్పుడు మనిషి శునకాలు కలిసి చరిత్రను ఎంత వరకు కలిసి పంచుకున్నాయో అర్ధమవుతుందని అన్నారు. దీనిని బట్టి వీరి మధ్య సంబంధం ఎలా మొదలయిందో తెలుసుకోవచ్చని అన్నారు.

"కుక్కలు తోడేళ్ళ జాతి నుంచి పుట్టి క్రమంగా ఆహారం కోసం వెతుక్కుంటూ మనుష్యులలోకి వచ్చి చేరి ఉండవచ్చు. వాటిని మనుషులు పెంచడం మొదలు పెట్టడంతో మనుష్యులకు వేటకి వెళ్ళేటప్పుడు లేదా కాపలాగా ఉంటూ మనిషితో పాటు ఉండటం మొదలయి ఉండవచ్చు".

చాలా వరకు శునకాలన్నీ అంతమైపోయిన తోడేలు జాతి నుంచే పుట్టి ఉంటాయని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ప్రపంచంలో తరువాత పుట్టిన జాతుల డి ఎన్ ఏ లో అంతగా వీటి వారసత్వం అంతగా ఉండకపోవచ్చు.

కుక్కలను పెంచుకోవడం ఎక్కడ మొదలయింది అనే విషయం పై మాత్రం స్పష్టత లేదని డాక్టర్ స్కోగ్లండ్ చెప్పారు.

"ఈ కుక్కల చరిత్ర చాలా చలనశీలతతో కూడి ఉండటంతో ఇది సరిగ్గా ఎప్పుడు మొదలయింది అనేది అంచనా వేయడం సాధ్యం కాదని అన్నారు.

"మనిషి వ్యవసాయం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి అంటే సుమారు 6000 సంవత్సరాల నుంచీ పిల్లులు లాంటివి ఉండి ఉండవచ్చని అన్నారు. పంటలను నాశనం చేసే ఎలుకలను చంపడానికి పిల్లులు ఉపయోగపడటంతో వాటిని పెంచడం మొదలయి ఉండవచ్చు".

"కుక్కలు మాత్రం అత్యంత శీతల ప్రాంతమైన సైబీరియా, ఉష్ణ ప్రాంతమైన తూర్పు ఆసియాలలో కూడా ఉన్నాయి" అని స్కోగ్లండ్ వివరించారు.

ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ సైన్స్‌లో ప్రచురితమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)