ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి?

- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
''విస్కీ ఉండేది తాగడానికి.. నీళ్లు ఉండేది గొడవలు పెట్టడానికి''ఇవి ప్రఖ్యాత అమెరికా రచయిత మార్క్ ట్వైన్ చెప్పిన మాటలు. నేటి జల వివాదాలకు ఈ వ్యాఖ్యలు అచ్చంగా సరిపోతాయి.
కావేరీ, నర్మద, మహానది, పెరియార్, మహాదాయి ఇలా చెప్పుకుంటూ పోతే వివాదాల్లో చిక్కుకున్న నదుల జాబితా చాలా పెద్దది.
తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జల వివాదాల్లో ముందున్నాయి. కృష్ణ, గోదావరి, వంశధార తదితర నదీ జలాల కోసం ఎప్పటికప్పుడే ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ పదునైన వ్యాఖ్యలు చేస్తున్నాయి.
రెండు రాష్ట్రాలకూ జీవనాధారమైన కృష్ణ, గోదావరి జలాల వివాదంపై కేంద్ర జల శక్తి మంత్రి నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల చర్చించారు. ఈ నేపథ్యంలో అసలు వివాదాలు ఏమిటి? ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.
నలుగురి మధ్య నలిగిపోతున్న కృష్ణ..
మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో ఈ నది జన్మిస్తుంది. తూర్పు వైపుగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా ప్రవహించి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. హైదరాబాద్, మైసూర్ సంస్థానాల కాలం నుంచీ ఈ నదీ జలాలు వివాదాస్పదమే. ఆ తర్వాత ఏర్పడిన ప్రస్తుత నాలుగు రాష్ట్రాలూ నదీ జలాల కోసం ఎప్పటికప్పుడు వివాదాలకు దిగుతున్నాయి.
ఈ వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా అంతర్రాష్ట్రాల నదీ జలాల వివాదాల చట్టం-1956 కింద 1969లో కృష్ణ నదీ జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్(కేడబ్ల్యూడీటీ)ని ఏర్పాటుచేశారు. 1976లో ఈ ట్రైబ్యునల్ (బచావత్) తమ నివేదికను సమర్పించింది.
అప్పటికీ 2060 టీఎంసీలుగా ఉండే కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలకు పంచారు. 75 శాతం జలాలను అందుబాటులో ఉండే జలాలు(డిపెండబిలిటీ)గా గుర్తించి, వీటిలో 560 టీఎంసీలను మహారాష్ట్రకు, 700 టీఎంసీలను కర్ణాటకకు, 800 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మే 31, 2000లో ఈ తీర్పును సమీక్షిస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, Telangana CMO
మిగులు జలాలు కూడా..
కొత్త వివాదాలు తలెత్తడంతో మళ్లీ 2004లో రెండో కేడబ్ల్యూడీటీ ఏర్పాటుచేశారు. 2010లో ఈ ట్రైబ్యునల్(బ్రిజేష్ కుమార్) తమ నివేదికను సమర్పించింది. అందుబాటులో ఉండే జలాలను 65 శాతంగా గుర్తించి, మిగులు జలాలను 81 టీఎంసీలు మహారాష్ట్రకు, 177 టీఎంసీలు కర్ణాటకకు, 190 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
ప్రధాన కేటాయింపుల విషయానికొస్తే.. మహారాష్ట్ర(666 టీఎంసీ), కర్ణాటక (911), ఆంధ్రప్రదేశ్ (1001)గా మార్చారు. ఈ తీర్పును 2050కి సమీక్షిస్తారు.
అయితే, కేటాయింపులతో విభేదిస్తూ సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేసింది. ఇదిలా ఉండగానే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.
ప్రస్తుతం కొత్త ఏర్పడిన తమ రాష్ట్రాన్ని కూడా చేర్చి మళ్లీ కేటాయింపులు జరపాలని తెలంగాణ కోరుతోంది. అయితే దీన్ని మహారాష్ట్ర, కర్ణాటక వ్యతిరేకిస్తున్నాయి. 2019 అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప దీనిపై ఓ తీర్మానం కూడా చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులను విభజించాలి. నీటి విడుదలకూ ప్రొటోకాల్స్ సిద్ధం చేయాలి. దీని కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఒక ఎపెక్స్ కమిటీని వేయాలి. ప్రస్తుతం ఈ కమిటీనే రెండోసారి భేటీ అయ్యింది.

గోదావరి పరిస్థితి వేరు..
మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో గోదావరి జన్మిస్తుంది. దీని బేసిన్ పరిధిలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటక కూడా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటకల మధ్య వివాదాల పరిష్కారానికి 1969లో జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేంద్రం ఓ ట్రైబ్యునల్ ఏర్పాటుచేసింది.
1980లో బచావత్ ట్రైబ్యునల్ తమ నివేదికను సమర్పించింది. అంతర్రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఈ ట్రైబ్యునల్ పరిగణలోకి తీసుకుంది. ఉదాహరణకు మహారాష్ట్రలోని పైఠాన్ వరకు లభ్యతలో ఉండే నీటికి మహారాష్ట్ర, ఆ దిగువన ఉండే నీటిని ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం లాంటి ఒప్పందాలు.
80టీఎంసీల సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ట్రైబ్యునల్ అనుమతించింది. అయితే నీటిలో 45 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవాలి. మిగతా 35 టీఎంసీలను కర్ణాటక, మహారాష్ట్రలకు ఇవ్వాలి.
అయితే, ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లబ్ధి పొందుతుండగా.. ముంపు గ్రామాలు మాత్రం తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఉన్నాయి. దీంతో ఆ మూడు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. అప్పుడు కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. అభ్యంతరాల నడుమ రెండు, మూడు సార్లు పోలవరం డిజైన్‌ను మార్చారు. దీనికి కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుగానూ హోదా కల్పించారు. అయితే ఇప్పటివరకూ ఇది పూర్తికాలేదు.

తాజా వివాదాలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా తాజా జల వివాదాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ సభ్యులుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఛైర్మన్‌గా ఏర్పాటైన అపెక్స్ కమిటీ ఆక్టోబరు 6న సమావేశమైంది. దీనిలో జరిగిన చర్చలపై సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అంశాలు..
- రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరుకు నీటి సరఫరా లక్ష్యంగా ''రాయలసీమ ఎత్తిపోతల'' ప్రాజెక్టును తప్పనిసరిగా నిర్మించాలి. తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం శ్రీశైలం ఆనకట్టలో 800 అడుగుల నుంచీ నీటిని తీసుకోవచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు ఆ వెసులుబాటు లేదు. అందుకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నాం.
- గోదావరి, కృష్ణా వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఏపీకే హక్కులుండాలి. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలి.
- పాలమూరు రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టులతో తెలంగాణలో కొత్తగా పంట పొలాలకు నీరందిస్తున్నారు. ఇవి రెండు కొత్త పథకాలు. వీటిని ఆపాలని అభ్యర్థిస్తున్నా ఫలితం లేదు. మరోవైపు కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ సామర్థ్యాలను కూడా పెంచుతున్నారు. మొత్తం అన్ని ప్రాజెక్టుల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లు కేంద్రానికి సమర్పించాలి.
- శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని తెలంగాణ దిగువకు వదిలేయడం వల్ల నీటిమట్టాల నిర్వహణ కష్టమవుతోంది.
- కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని తక్షణమే నోటిఫై చేయాలి. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణ నిర్వహిస్తున్నట్లే నాగార్జునసాగర్ కుడికాలువ ఆఫ్‌టేక్‌ను ఏపీ నిర్వహించుకునేలా అనుమతినివ్వాలి.
- నీటి వినియోగంపై 2015 జూన్‌లో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది. దీన్ని కృష్ణా బోర్డు అమలుచేయాలి.

తెలంగాణ ఏమంటోంది..
- రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు నీటి మళ్లింపు ప్రాజెక్టులపై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని వెంటనే వీటిని ఆపేయాలి. అక్రమంగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులనూ చేపట్టకూడదు.
- నాగార్జున సాగర్‌తోపాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తెలంగాణకు అప్పగించాలి. తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి చేపడుతున్నవే. దీనిలో కొత్తవేమీ లేవు. అందుకే డీపీఆర్‌లు సమర్పించాల్సిన అవసరం లేదు.
- బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆధారంగా బోర్డు పరిధులు ఉండాలి. అంతేకానీ కొత్తగా పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదు.
- కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తోందని కేసీఆర్ ఆరోపించారు.
కేంద్రం ఏమంటోంది?
అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విలేకరులతో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందించాలని రెండు తెలుగు రాష్ట్రాలనూ కేంద్రం కోరింది. రాష్ట్ర విభజన అనంతరం మొదలైన ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం.. హంద్రి-నీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులు అవుతాయని నీటి పారుదల రంగ నిపుణుడు శివ రాచర్ల చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులకు మాత్రం డీపీఆర్‌లు సబ్మిట్‌చేసి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. బోర్డుల అనుమతి లేకుండా ముందుకు వెళ్లొద్దని కేంద్రం స్పష్టంచేసినట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Twitter/Nara Lokesh
మరోవైపు కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడకు తరలించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకారం కుదిరింది.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ప్రకటించడానికి రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. నీటి పంపిణీ మీద ఈ బోర్డులకు ఇక పూర్తి అధికారం ఉంటుంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డు ఇంకా కోర్టు ఎదుట పెండింగ్‌లో ఉంది కాబట్టి.. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల ఆధారంగా కృష్ణా బోర్డు ముందుకు వెళ్తుందని శివ రాచర్ల చెప్పారు. కోర్టు తీర్పు అనంతరం బ్రిజేష్ కుమార్ కేటాయింపులను బోర్డులు అమలు చేస్తాయని వివరించారు.
ఏ కమిటీ అయినా, బోర్డులయినా ట్రైబ్యునల్ పంపీణీలకు అనుగుణంగా ముందుకు వెళ్తుందని కేంద్రం స్పష్టీకరించింది. మరోవైపు కృష్ణా జలాల పున:పంపిణీలపై తెలంగాణ వేసిన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. కాబట్టి దీనిపై ఎపెక్స్ కమిటీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

ఫొటో సోర్స్, NAlle sivakumar
సంప్రదింపులతోనే పరిష్కారం
తాజా సమావేశంతో అన్ని సమస్యలూ పరిష్కారం అయ్యాయని చెప్పలేమని నీటి పారుదల రంగ నిపుణుడు మాకిరెడ్డి పురుషోత్తం అన్నారు.
''గుండ్రేవుల ప్రాజెక్టు సహా చాలా అంశాలపై చర్చ జరగలేదు. 2014 విభజన తర్వాత ఏర్పడిన అపెక్స్ కమిటీ తొలి సమావేశం 2016లో జరిగింది. వివాదాల నడుమ, నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు రెండో సమావేశం జరిగింది. తర్వాత సమావేశం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం''
''రెండు రాష్ట్రాలూ వాస్తవిక దృష్టితో వివాదాలు పరిష్కరించుకోవడం మంచిది. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులకు డీపీఆర్ సబ్మిట్ చేసి అనుమతి తెచ్చుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అంతే.. అందుకే చర్చలు, అంతర్రాష్ట ఒప్పందాలతో రెండు రాష్ట్రాలూ ముందుకు వెళ్లాలి''
ఇవి కూడా చదవండి:
- సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి ఇది..
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. వాటి వల్ల రైతులకు లాభమా, నష్టమా?
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందా? Fact Check
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారతదేశంలో అసలు కరోనావైరస్ కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోయిందా?
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








