పాకిస్తాన్‌తో యుద్ధం చేసేందుకు భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందా? BBC Fact Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మహమ్మద్ శాహిద్
- హోదా, బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం
సంఖ్యాబలం ప్రకారం చూస్తే, భారత్‌ది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యం. ప్రస్తుతం ఇందులో 12 లక్షలకుపైగా మంది క్రియాశీల దళాల్లో ఉండగా, దాదాపు 10 లక్షల మంది రిజర్వు దళాల్లో ఉన్నారు.
భారత సైన్యంలో ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ కోర్‌తోపాటుగా వందల సంఖ్యలో వివిధ రెజిమెంట్లు ఉన్నాయి. ఈ రెజిమెంట్లలో కొన్ని ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్లను మనం ఏటా గణతంత్ర దినోత్సవం రోజున రాజ్‌పథ్‌లో జరిగే కవాతులో చూస్తుంటాం. సాయుధ పదాతిసైనికులను ఇన్‌ఫాంట్రీ అని పిలుస్తారు.
భారత సైన్యంలో సిక్కు, గఢ్వాల్, కుమావూ, జాట్, మహార్, గోర్ఖా, రాజ్‌పూత్ సహా 31 రెజిమెంట్లు ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రెజిమెంట్ గురించి బాగా చర్చ జరుగుతోంది. అందుకే, ఈ వివరాలన్నీ ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చింది.
1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పోరాడేందుకు భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఈ పరిణామం తర్వాత ముస్లిం సైనికుల నుంచి సైన్యం ఆయుధాలను తీసేసుకుందని, ఆ రెజిమెంట్‌ను కూడా రద్దు చేసిందని కూడా పోస్టులు పెట్టారు.

ఫొటో సోర్స్, Twitter

ఫొటో సోర్స్, Twitter

ఫొటో సోర్స్, Twitter
ఇది నిజమేనా?
భారత సైన్యంలో ఎప్పుడూ ముస్లిం రెజిమెంట్ అనే పేరుతో రెజిమెంటే లేదని మేజర్ జనరల్ (రిటైర్డ్) శశి అస్థానా అన్నారు.
జాతుల పేర్లతో రెజిమెంట్లు బ్రిటీష్ పాలన సమయంలో ఏర్పడ్డాయని, జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ లాంటి కొన్ని రెజిమెంట్లు భారత్‌లో సంస్థానాల విలీనం వల్ల సైన్యంలో భాగమయ్యాయని ఆయన చెప్పారు.
‘‘భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక ఈ రెజిమెంట్లకు అవే పేర్లు ఉంచారు. దీని అర్థం సైన్యం జాతి, మత భేదాలను పోషిస్తుందని కాదు. చరిత్రను పరిరక్షించేందుకే సైన్యం వాటిని అలా ఉంచేసింది’’ అని అన్నారు.
సైన్యంలోని ప్రతి రెజిమెంట్‌కూ ఓ చరిత్ర ఉంటుంది. భారత సైన్యంలో మద్రాస్ రెజిమెంట్ 200 ఏళ్ల కన్నా ముందు నుంచీ ఉంది. కుమావు రెజిమెంట్ రెండు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొంది.
ముస్లిం రెజిమెంట్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సైయద్ అతా హస్నైన్ అన్నారు. గత 200 ఏళ్లలో భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ అనేది ఎప్పుడూ లేదని ఆయన కూడా స్పష్టం చేశారు.
‘‘బ్రిటీష్ ఇండియా సైన్యంగా ఉన్నప్పుడు సిక్కు, పంజాబ్, గఢ్వాల్ లాంటి రెజిమెంట్లతోపాటు బలూచ్, ఫ్రంటియర్ ఫోర్స్ రెజిమెంట్లు ఉండేవి. దేశ విభజన తర్వాత బలూచ్, ఫ్రంటియర్ రెజిమెంట్లు పాకిస్తాన్ సైన్యంలో భాగమయ్యాయి. పంజాబ్ రెజిమెంట్ రెండు దేశాల్లోనూ ఉంది’’ అని హస్నైన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సైన్యంలో ముస్లింలు
భారత సైన్యంలో మొత్తం ఎంత మంది ముస్లింలు ఉన్నారన్న విషయమై అధికారిక గణాంకాలు లేవు. కానీ, 2014లో డిప్లొమాట్ అనే పత్రిక భారత సైన్యంలో దాదాపు మూడు శాతం వరకూ ముస్లింలు ఉన్నారని, జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీలో వారి శాతం 50 వరకూ ఉందని రాసింది.
సైన్యం నియామకాల్లో మతాన్ని పరిగణనలోకి తీసుకోదని, శారీరక దృఢత్వాన్నే చూస్తారని మేజర్ జనరల్ (రిటైర్డ్) శశి అస్థానా అన్నారు.
‘‘సైన్యంలో ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నియామకాలు జరుగుతున్నాయనుకుంటే, మీరు గఢ్వాలీ, కుమావునీ, ముస్లిం... ఇలా ఎవరైనా కావొచ్చు, ఏ రెజిమెంట్‌లోనైనా చేరొచ్చు. ప్రతిభ, శారీరక దృఢత్వం ఆధారంగానే ఎంపిక జరుగుతుంది’’ అని ఆయన అన్నారు.
భారత సైన్యంలోని చాలా రెజిమెంట్లలో ముస్లింలు ఉన్నారని, ప్రతి యుద్ధంలోనూ వాళ్లు అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారని అస్థానా చెప్పారు.
సోషల్ మీడియాలో ముస్లిం రెజిమెంట్ అంటూ ప్రచారమవుతున్న కట్టుకథల్లో 1965 యుద్ధం గురించి ప్రస్తావించారు. నిజానికి ఆ యుద్ధంలో క్వార్టర్‌మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్... పాకిస్తాన్‌కు చెందిన నాలుగుకు పైగా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశారు. ఆయనకు మరణానంతరం భారత సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర దక్కింది.
మొత్తంగా భారత సైన్యంలో స్వాతంత్ర్యానికి ముందు గానీ, తర్వాత గానీ 'ముస్లిం రెజిమెంట్' అనేదే లేదని, సోషల్ మీడియాలో దాని గురించి వ్యాపిస్తున్న వదంతులన్నీ కట్టుకథలని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం గుర్తించింది.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి)
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- భారత పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించనున్న టాటా ప్రాజెక్ట్స్... విమర్శకులు ఏమంటున్నారు?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- నరేంద్ర మోదీకి 70ఏళ్లు: ఆయన ముందున్న సవాళ్లు ఏమిటి? ప్రపంచం ఆయన్ను ఎలా చూస్తోంది?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- లౌంగీ బూయియా: బిహార్‌లో మరో మౌంటెయిన్ మ్యాన్... మూడు కిలోమీటర్ల కాలువను ఒక్కరే తవ్వేశారు
- పరకాలను దక్షిణాది జలియన్‌వాలాబాగ్ అని ఎందుకు అంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








