భారత్-చైనా వివాదం: హాట్‌లైన్ అంటే ఏంటి? దీనిని ఉపయోగించే అధికారం ఎవరిది?

పాన్మున్జామ్ గ్రామంలో గల ఉత్తర కొరియా హాట్‌లైన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, హాట్‌లైన్ అంటే ఇలా ఉంటుంది. పాన్మున్జామ్ గ్రామంలో గల ఉత్తర కొరియా హాట్‌లైన్ ఇది. దక్షిణ కొరియాకు సందేశాలు పంపించేందుకు, స్వీకరించేందుకు దీనిని ఉపయోగిస్తుంటారు (పాత చిత్రం)
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్-చైనా విదేశాంగ మంత్రుల రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు.

జూన్‌లో గల్వాన్‌ లోయలో ఘర్షణ తర్వాత ఇరు దేశాల విదేశాంగ మంత్రులకూ ఇది మొదటి సమావేశం. గత నాలుగేళ్లలో ఎల్ఏసీ దగ్గర ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటం ఇదే మొదటిసారి. గడిచిన 45 ఏళ్లలో కూడా రెండు దేశాల సంబంధాల్లో ఇలాంటి ఘర్షణాత్మక వాతావరణం ఎప్పుడూ జరగలేదు.

ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఈ సమావేశంలో ఇరు దేశాలూ అంగీకారానికి వచ్చాయి. ఐదు అంశాల ప్రాతిపదికగా చర్యలు తీసుకోవాలని తీర్మానించాయి.

సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా కొన్నిస్థాయిల్లో చర్చలు అప్పుడప్పుడూ ఆగిపోయినా, ఒక మార్గంలో మాత్రం అవి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అవే హాట్‌లైన్ చర్చలు.

భారత్, చైనా సరిహద్దు వివాదం

ఫొటో సోర్స్, Getty Images

హాట్‌లైన్ అంటే

ఉద్రిక్త పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య హాట్‌లైన్‌లో చర్చలు జరిగాయనే వార్తలు మనం తరచూ వార్తాపత్రికల్లో చూస్తూనే ఉంటాం. అంతమాత్రాన సరిహద్దుల్లో శాంతి నెలకొన్నప్పుడు ఈ హాట్‌లైన్ చర్చలు ఆగిపోతాయని కాదు.

నిజానికి హాట్‌లైన్ అంటే, రెండు దేశాల సైనికుల మధ్య ఒక ‘వన్ టూ వన్ కమ్యూనికేషన్’ సాధనం. సాధారణ భాషలో చెప్పాలంటే దీనిని ‘కాన్ఫిడెన్స్ బిల్డింగ్’ పద్ధతిగా చూస్తారు. దీని ద్వారా ఇరుదేశాల సరిహద్దుల్లో మోహరించిన సైనిక దళాలు పరస్పరం సంప్రదింపులు జరుపుతాయి.

భారత్‌లో ఇలాంటి వ్యవస్థను డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) పర్యవేక్షిస్తుంది. దీని నుంచి సందేశాలు పంపించడానికి నిర్ధారిత విధానాలు ఉంటాయి.

లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) వినోద్ భాటియా భారత్‌లో డీజీఎంఓగా పనిచేశారు. బీబీసీతో మాట్లాడిన ఆయన ఈ హాట్‌లైన్ పనిచేసే విధానం గురించి వివరంగా చెప్పారు.

ప్రస్తుతం భారత్-చైనా మధ్య ఎల్ఏసీ సరిహద్దులో ఐదు చోట్ల హాట్‌లైన్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.

  • తూర్పు లద్దాఖ్ సరిహద్దు దగ్గర దౌలత్ బేగ్ ఓల్డీ, స్పాంగూర్‌లో హాట్‌లైన్‌లు ఉన్నాయి.
  • సిక్కిం సరిహద్దుల్లో నాథూలా దగ్గర ఒక హాట్‌లైన్ ఉంది.
  • అరుణాచల్ ప్రదేశ్‌లోని బుమ్లా పాస్, తిబూట్ దగ్గర రెండు హాట్‌లైన్స్ ఉన్నాయి.
భారత్, చైనా సరిహద్దు వివాదం

ఫొటో సోర్స్, YAWAR NAZIR/GETTY IMAGES

హాట్‌లైన్ ఉపయోగం

హాట్‌లైన్ పేరు వినగానే ఇది ఒక ఫోన్‌లైన్ అని, దీని ద్వారా సరిహద్దుల్లో ఉన్న రెండుదేశాల సైనికులు పరస్పరం సంప్రదిపులు జరుపుతూ ఉంటారని మనకు అర్థమవుతుంది.

దీనికోసం అధికారులకు డ్యూటీలు వేస్తుంటారు. హాట్‌లైన్ రింగ్ రాగానే..ఆ ఫోన్ సరిహద్దుకు అవతలి దేశం నుంచి వచ్చిందనే విషయం అక్కడ ఉన్న సైనికులకు తెలిసి పోతుంది. దాని ద్వారా అవతలివైపు ఉన్న వారికి ఒక మెసేజ్ పంపిస్తారు.

అవతలి వైపు ఉన్నవారు ఆ సందేశానికి సమాధానం ఇచ్చేటపుడు తమవైపు ఉన్న హాట్‌లైన్ ఉపయోగిస్తారు.

భారత్‌లో హాట్‌లైన్ ద్వారా సందేశాలు పంపించడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఎల్ఏసీలో మోహరించిన సైనిక దళ కమాండర్‌కు మాత్రమే అధికారం ఉంటుంది.

హాట్‌లైన్‌లో ఎలాంటి సందేశాలు పంపించవచ్చు అనే దానికి ఇటీవలే అరుణాచల్‌ ప్రదేశ్ సరిహద్దుల్లో ఒక ఉదాహరణ కనిపించింది. అప్పటి నుంచీ మీడియాలో హాట్‌లైన్ గురించి చర్చ మొదలైంది.

భారత సరిహద్దుల నుంచి చైనా సైన్యం ఐదుగురు భారతీయులను కిడ్నాప్ చేసిందని గత ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల నుంచి వార్తలు వచ్చాయి. ఒక జర్నలిస్ట్ దీనిపై ట్విటర్‌లో కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు “భారత సైన్యం చైనా ఆర్మీకి హాట్‌లైన్‌లో సందేశం పంపించింది. దానికి సమాధానం కోసం వేచి చూస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు.

తర్వాత ఆ ఐదుగురు భారతీయుల ఆచూకీ కనుగొన్న చైనా సైన్యం, వారిని భారత్‌కు అప్పగించింది. చాలాసార్లు సరిహద్దుల్లో పెంపుడు జంతువులు గల్లంతైనపుడు కూడా ఇదే జరుగుతుంటుంది.

అలాంటి సమయాల్లో హాట్‌లైన్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఎత్తైన గోడలు, కంచెలతో లేదు. దాంతో, జంతువులు, అప్పుడప్పుడూ స్థానికులు పొరపాటున సరిహద్దు దాటి అవతలివైపు వెళ్లిపోతుంటారు.

అలా ఏదైనా జరిగిందనే సమాచారం వచ్చినపుడు, సరిహద్దులకు అవతలివైపు ఉన్న వారితో హాట్‌లైన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తుంటారు.

సరిహద్దుల్లో శాంతి నెలకొన్న సమయంలో ఈ హాట్‌లైన్ సేవలు మరింత కీలకం అవుతాయని లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా చెప్పారు. బోర్డర్ మేనేజ్‌మెంట్ కోసం ఇవి చాలా అవసరం అన్నారు.

భారత్, చైనా సరిహద్దు వివాదం

ఫొటో సోర్స్, Reuters

డిస్ఎంగేజ్‌మెంట్ అంటే

హాట్‌లైన్‌కు మరో ప్రాధాన్యం కూడా ఉంది. సరిహద్దుల్లో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేయడంలో ఇది చాలా కీలకం. పరస్పర సమస్యలు పరిష్కరించుకోడానికి అప్పుడప్పుడూ ఇరుదేశాల సైనికుల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరుగుతుంటుంది. ఆ సమావేశం ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు జరగాలి అనేది తరచూ హాట్‌లైన్‌ ద్వారా మాట్లాడుకుని నిర్ణయిస్తారు.

చాలాసార్లు సరిహద్దుల్లో తీవ్రంగా మంచు కురుస్తుంటుంది. దాంతో, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. లేదంటే ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేసే అధికారులు వేరే పనుల్లో బిజీగా ఉంటారు. అలా, మీటింగ్ రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారు ఆ వివరాలు హాట్‌లైన్ ద్వారా అవతలి వారికి చేరవేస్తుంటారు.

ఫ్లాగ్ మీటింగ్ కోసం చైనా, భారత్‌లో ‌ఎల్ఏసీకి రెండువైపులా నిర్ధారిత పాయింట్‌లు ఉన్నాయి.

మరి ఈ హాట్‌లైన్‌లో డిస్ఎంగేజ్‌మెంట్ , డీ-ఎస్కలేషన్ గురించి కూడా చర్చించవచ్చా?

“ఆ రెండు విషయాలూ ముఖాముఖి మాత్రమే మాట్లాడుకుంటారు. ఈ హాట్‌లైన్‌లో అలాంటి సమావేశాలను ముందే నిర్ణయిస్తారు” అని లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా చెప్పారు.

డిస్ఎంగేజ్‌మెంట్ అంటే ఏంటో ఆయన వివరించారు. సరిహద్దుల్లో ఒక ఫ్లాష్ పాయింట్‌లో ఇరుదేశాల సైన్యం తలపడినప్పుడు, ఆ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కు తీసుకెళ్లడాన్ని డిస్ఎంగేజ్‌మెంట్ అంటారని తెలిపారు.

“నిజానికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)కు రెండువైపులా ఇరుదేశాల సైనికులు పెట్రోలింగ్ చేస్తుంటారు. ఏ సైన్యమైనా మరో దేశం సరిహద్దులోకి ప్రవేశించినపుడు, వారిని ముందే హెచ్చరిస్తారు. చాలాసార్లు సైనికులు తమ తప్పు తెలుసుకుని వెనక్కు వెళ్తారు. కానీ, కొన్నిసార్లు సైన్యం వెనక్కు తగ్గకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది” అన్నారు.

భారత్, చైనా సరిహద్దు వివాదం

ఫొటో సోర్స్, SOPA IMAGES

డీ-ఎస్కలేషన్ అంటే ఏంటి?

ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగినప్పుడు కూడా చర్చలు జరుగుతునాయి. ఉదాహరణకు మే నుంచి తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నాయి. అలాంటప్పుడు ఫ్లాగ్ మీటింగ్ ద్వారా డిస్ఎంగేజ్‌మెంట్ గురించి చర్చలు జరుగుతాయి. ఆ సమావేశాలను హాట్‌లైన్‌లో మాట్లాడి నిర్ణయిస్తారు.

డీ-ఎస్కలేషన్ అంటే ఒక ప్రాంతంలో ఎక్కువమంది సైనికులను మోహరించకుండా చూడడం. ఎల్ఏసీ దగ్గర ఉద్రిక్తతలు ఎక్కువకాలం కొనసాగితే, ఎలాంటి అత్యవసర స్థితినైనా ఎదుర్కోడానికి భారత్-చైనా రెండూ తమ సైనికుల సంఖ్యను భారీగా పెంచేస్తాయి. దానిని తగ్గించడమే డీ-ఎస్కలేషన్.

“రెండు దేశాల అంగీకారంతోనే ఈ డి-ఎస్కలేషన్ జరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలకూ పరస్పర సంబంధం ఉంటుంది” అని లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా చెబుతున్నారు.

“సరిహద్దుల్లో డిస్ఎంగేజ్‌మెంట్, డీ-ఎస్కలేషన్ జరిగినప్పుడు, చివరి ప్రక్రియ మొదలవుతుంది. అదే డీ-ఇండక్షన్. అంటే సైనికులు తిరిగి తాము అంతకు ముందున్న స్థావరాలకు వెళ్లిపోవడం” అని భాటియా వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)