టిక్‌టాక్: చైనా - అమెరికా గొడవల్లో ఈ యాప్ ఎలా చిక్కుకుంది?

టిక్‌టాక్
    • రచయిత, జో టైడీ
    • హోదా, సైబర్ రిపోర్టర్

క్రేజీ వైరల్ డాన్స్‌లు, కామెడీ డైలాగులతో లిప్-సింక్‌లు.. ఈ రెండి కలయికతో టిక్‌టాప్‌ యువతకు మెచ్చిన ఓ టాప్ యాప్‌గా మారింది.

కానీ డోనల్డ్ ట్రంప్ అధ్యక్షతన గల అమెరికా, షి జిన్‌పింగ్ పాలనలోని చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తటంతో.. చైనాతో బలమైన సంబంధాలున్న ఈ యాప్ పలు దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటోంది.

ఇప్పటికే భారతదేశం ఈ యాప్‌ను నిషేధించగా.. అమెరికా, ఆస్ట్రేలియాలు కూడా నిషేధించే విషయాన్ని పరిశీలిస్తున్నాయి.

ఏమిటీ టిక్‌టాక్?

టిక్‌టాక్ అనేది ఒక ఫ్రీ యాప్. ఒక రకంగా యూట్యూబ్‌కు షార్ట్-ఫామ్ వంటిదని చెప్పొచ్చు. యూజర్లు ఒక నిమిషం వరకూ నిడివి గల వీడియోలను పోస్ట్ చేయొచ్చు. అందుకోసం యాప్‌లో ఉండే భారీ డాటాబేస్‌లోని పాటలు, ఫిల్టర్లనూ ఉపయోగించుకోవచ్చు.

యూజర్లు లిప్‌-సింక్ చేయటానికి కామెడీ క్లిప్‌లు, సినిమా డైలాగులు కూడా అందుబాటులో ఉంటాయి.

ఒక యూజర్‌కి 1,000 మందికన్నా ఫాలోయర్లు వచ్చారంటే.. వారు తమ అభిమానులకు లైవ్ బ్రాడ్‌కాస్ట్ కూడా చేయొచ్చు. అభిమానుల నుంచి డిజిటల్ గిఫ్ట్‌లు పొందొచ్చు. తర్వాత వాటిని డబ్బులుగా మార్చుకోవచ్చు.

ఒక యూజర్ ఫాలో అయ్యే వారి వీడియోలతో పాటు.. ఆ యూజర్ అంతకుముందు వీక్షించిన అంశాల ఆధారంగా కూడా కంటెంట్‌ను డిస్‌ప్లే చేస్తుందీ యాప్.

యూజర్ల మధ్య ప్రైవేట్ మెసేజ్‌లు పంపుకునే సౌకర్యమూ ఉంది.

టిక్‌టాక్
ఫొటో క్యాప్షన్, టిక్‌టాక్ డౌన్‌లోడ్లలో టాప్ టెన్ దేశాలివీ (నంబర్లు మిలియన్లలో - ఆధారం: సెన్సర్ టవర్)

ఇది ఎంత పెద్దది?

ఈ యాప్ 2019 ఆరంభం నుంచీ టాప్ డౌన్‌లోడ్ చార్ట్‌లలో దాదాపు అగ్రస్థాయిలోనే కనిపిస్తోంది.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌లు విధించటం వల్ల ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ కాలంలో టిక్‌టాక్ యాప్, దాని సోదర యాప్ డోయిన్ (చైనాలో లభ్యమవుతుంది)లను ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దాదాపు 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు.

టిక్‌టాక్ యాప్‌ను ఇప్పటివరకూ భారతదేశంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

అయితే దీని మీద భారత్ నిషేధం విధించటంతో ప్రస్తుతం చైనానే దీనికి అతి పెద్ద మార్కెట్. ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది.

బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫోర్బ్స్ కుబేరుల జాబితా ప్రకారం బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ చైనా కుబేరుల్లో పదో స్థానంలో ఉన్నారు

టిక్‌టాక్‌కు చైనాకు లింకేమిటి?

టిక్‌టాక్ మనుగడ మూడు విభిన్న యాప్‌ల రూపంలో మొదలైంది.

మొదటిది అమెరికాకు చెందిన మ్యూజికల్లీ (Musical.ly) అనే యాప్. దీనిని 2014లో ప్రారంభించారు. చైనాకు చెందిన టెక్ దిగ్గజం బైట్‌డ్యాన్స్ 2016లో డోయిన్ పేరుతో మ్యూజికల్లీ తరహా యాప్‌ను లాంచ్ చేసింది.

ఆ యాప్‌ను బైట్‌డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ దానికి పేరు పెట్టింది. అదే టిక్‌టాక్. 2018లో బైట్‌డ్యాన్స్ సంస్థ మ్యూజికల్లీ యాప్‌ను కొనుగోలు చేసింది. దానిని టిక్‌టాక్‌‌లో చేర్చింది.

అయితే చైనా సంస్థ యాజమాన్యం నుంచి ఈ యాప్‌ను దూరంగా ఉంచటానికి బైట్‌డ్యాన్స్ ప్రయత్నించింది. అందులో భాగంగా డిస్నీ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్‌ను టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించింది.

టిక్‌టాక్

ఫొటో సోర్స్, BYTEDANCE

ఫొటో క్యాప్షన్, చైనాలో ఆన్‌లైన్ న్యూస్ కోసం టోటియావోను చాలా అధికంగా ఉపయోగిస్తారు

టిక్‌టాక్ ఎంత డాటా సేకరిస్తుంది?

టిక్‌టాక్ తన యూజర్ల నుంచి భారీ మొత్తంలో డాటా సేకరిస్తుంది. అందులో ప్రధానాంశాలు:

  • ఏ వీడియోలను వీక్షించారు
  • ఏ వీడియోల మీద కామెంట్లు చేశారు
  • లొకేషన్ సమాచారం
  • ఫోన్ మోడల్
  • ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్
  • యూజర్లు టైప్ చేసేటపుడు కీలను ఏ వరుసలో నొక్కుతున్నారు

ఈ యాప్ సేకరించే డాటాకు సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి. యూజర్లు కాపీ, పేస్ట్ చేసే క్లిప్‌బోర్డులను యాప్ నిరంతరం చదువుతోందని ఇటీవల వెల్లడవటంతో డాటా సేకరణ మీద అభ్యంతరాలు తీవ్రమయ్యాయి.

అయితే.. రెడిట్, లింక్‌డిన్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ న్యూస్ యాప్ వంటి డజన్ల కొద్దీ ఇతర యాప్‌లు కూడా ఇదే రకంగా చేస్తున్నాయని వెల్లడైంది. దానివల్ల ప్రమాదకరమైనదేదో జరుగుతున్నట్లు కనిపించలేదు.

టిక్‌టాక్ సాధారణ డేటా సేకరణలో అధిక భాగాన్ని.. భారీగా డాటా సేకరించే ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ నెట్‌వర్క్‌లతో పోల్చవచ్చు. ఏదేమైనా.. టిక్‌టాక్ యాప్ మీద బ్రిటన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.

టిక్‌టాక్

ఫొటో సోర్స్, Getty Images

చైనా.. జనం మీద నిఘా పెట్టటానికి టిక్‌టాక్‌ను ఉపయోగించుకోగలదా?

టిక్‌టాక్ యూజర్ల డాటా చైనా కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళుతోందని.. కాబట్టి ఆ యూజర్లకు ముప్పు పొంచి ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయే ఆరోపించారు.

అయితే తమ యాప్ సేకరించే డాటా చైనా వెలుపల స్టోరవుతుందని టిక్‌టాక్ పదేపదే ఉద్ఘాటించింది.

''మేం చైనా ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉన్నామనే సూచన పూర్తిగా శుద్ధ తప్పు'' అని యూరప్‌, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాల్లో టిక్‌టాక్ పబ్లిక్ పాలసీ విభాగం అధిపతి థియో బెర్ట్రామ్ బీబీసీతో చెప్పారు.

కానీ.. హావావే విషయంలో లాగానే టిక్‌టాక్ విషయంలోని వాదనలు కూడా.. బైట్‌డ్యాన్స్‌ సంస్థను చైనా ప్రభుత్వం స్థానిక చట్టాల కింద విదేశీ యూజర్ల సమాచారం తమకు అప్పగించేలా చేస్తుందనే సైద్ధాంతిక అవకాశం మీద ఆధారపడినట్లు కనిపిస్తున్నాయి.

చైనాలోని 2017 జాతీయ భద్రత చట్టం ప్రకారం.. చైనాకు చెందిన ఏ సంస్థ కానీ, పౌరుడు కానీ.. ''ప్రభుత్వ నిఘా కృషికి మద్దతునివ్వటం, సాయపడటం, సహకరించటం'' తప్పనిసరి.

చైనా ప్రభుత్వం టిక్‌టాక్‌ను డాటా కోసం అడిగినట్లయితే.. ''మేం కచ్చితంగా నో చెప్తాం'' అని బెర్ట్రామ్ పేర్కొన్నారు.

కానీ.. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఆగ్రహం తెప్పించే విషయంలో బైట్‌డ్యాన్స్ జాగ్రత్తగానే ఉంటుంది.

ఈ సంస్థకు చెందిన భారీ ప్రజాదరణ గల న్యూస్ యాప్ టోటియావో.. ''అశ్లీల, అసభ్య సమాచారం (పోర్నోగ్రాఫిక్ అండ్ వల్గర్ కంటెంట్)''ను వ్యాపింప చేస్తోందని బీజింగ్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అనటంతో.. 2017లో 24 గంటల పాటు యాప్‌ను స్తంభింపజేశారని సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ ఒక కథనంలో వెల్లడించింది.

చైనా నిఘా సంస్థల ఉన్నతాధికారులు నేరుగా జారీ చేసిన ఆదేశాలను తిరస్కరిస్తే.. ఆ సంస్థ మొత్తం, దాని యాజమాన్యం పర్యవసానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు కూడా.

టిక్‌టాక్

ఫొటో సోర్స్, Getty Images

చైనా తన ప్రచారానికి టిక్‌టాక్‌ను వాడుకోగలదా?

ఈ యాప్‌కు సంబంధించిన మరో ఆందోళన.. సెన్సార్‌షిప్. కంటెంట్‌ మీద ఆంక్షలు విధించటం, జల్లెడ పట్టటం.

ప్రపంచంలో ఇంటర్నెట్ క్షేత్రంలో అత్యంత పరిమితులు, ఆంక్షలు ఉన్న దేశాల్లో చైనా ఒకటి. ఆ దేశపు గ్రేట్ ఫైర్‌వాల్.. తన పౌరులకు వెబ్‌లోని కొన్ని భాగాలు అందకుండా అడ్డుకుంటుందనేది జగద్విదితం.

టిక్‌టాక్ సిబ్బంది, ఆటోమేటెడ్ వ్యవస్థలు.. రాజకీయంగా సున్నితమైనవిగా భావించే కంటెంట్‌ను సెన్సార్ చేస్తూ నియంత్రణ నిబంధనలను అమలు చేసినట్లు గత ఏడాది గార్డియన్ వార్తా పత్రిక ఒక కథనంలో చెప్పింది.

అలా నిషేధించిన లేదా నియంత్రించిన కంటెంట్‌లో తియానాన్మెన్ స్క్వేర్ నిరసనల వీడియో దృశ్యాలు, టిబెట్ స్వాతంత్ర్య డిమాండ్లకు సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నట్లు పేర్కొంది.

పరిశీలనకు వచ్చిన వీడియోలను అనుమతించాలా లేదా అనే అంశం మీద చైనాలోని మోడరేటర్లదే తుది నిర్ణయమని టిక్‌టాక్ మాజీ ఉద్యోగులు ఆరుగురితో మాట్లాడి ప్రచురించిన వాషింగ్టన్ పోస్ట్ కథనం ఒకటి చెప్తోంది.

ఆ కథనంలో ప్రస్తావించిన మార్గదర్శకాలను ఆ తర్వాతి కాలంలో తొలగించామని బైట్‌డ్యాన్స్ వివరణనిచ్చింది.

కానీ.. ఈ సంస్థ నియంత్రణ సంస్కృతి ఇంకా చైనా ప్రభుత్వానికి అనుకూలంగా పక్షపాతపూరితంగానే ఉండవచ్చునని కొందరు వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)