ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: టిక్‌టాక్ క్రియేటర్ల గమ్య స్థానం ఇదేనా?

టిక్‌టాక్ తరహాలో 15 సెకన్లలోపు నిడివి ఉండే వీడియోలను ఈ రీల్స్‌ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిక్‌టాక్ తరహాలో 15 సెకన్లలోపు నిడివి ఉండే వీడియోలను ఈ రీల్స్‌ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొచ్చు
    • రచయిత, అబినాష్ కంది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో టిక్‌టాక్ స్థానాన్ని భర్తీ చేసే రేసులోకి ఇన్‌స్టాగ్రామ్ కూడా దిగింది.

‌షార్ట్ వీడియోల షేరింగ్ కోసం ‘రీల్స్’ అనే ఓ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.

టిక్‌టాక్ తరహాలో 15 సెకన్లలోపు నిడివి ఉండే వీడియోలను ఈ రీల్స్‌ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొచ్చు.

టిక్‌టాక్‌ సహా 59 చైనీస్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత టిక్‌టాక్‌పై ఆధారపడ్డ లక్షల మంది క్రియేటర్లు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.

షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌ల కేటగిరిలో టిక్‌టాక్ స్థాయికి తగ్గ యాప్‌లు ఏవీ లేకపోవడంతో ఒక రకమైన శూన్యత ఏర్పడింది.

ఇదే సమయంలో చింగారీ, రొపోసో లాంటి దేశీయ షార్ట్ వీడియో షేరింగ్ సేవలు అందించే యాప్‌లు తెరపైకి వచ్చాయి. వాటికి వినియోగదారులు వేగంగా పెరుగుతూ వచ్చారు.

కానీ, సేవల నాణ్యత గురించి ఫిర్యాదులు వచ్చాయి.

ఒక్కసారిగా పెరిగిన వినియోగదారుల భారాన్ని తట్టుకుని, సంతృప్తికరంగా సేవలు అందించేందుకు ఆ యాప్‌లు శ్రమిస్తున్నాయి.

ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్ లాంటి ఓ పెద్ద యాప్ షార్ట్ వీడియో విభాగంలోకి అడుగుపెట్టడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి.

టిక్‌టాక్ క్రియేటర్లలో చాలా మందికి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిక్‌టాక్ క్రియేటర్లలో చాలా మందికి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలున్నాయి.

‘సరైన సమయంలో’

టిక్‌టాక్ క్రియేటర్లలో చాలా మందికి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలున్నాయి.

టిక్‌టాక్ స్థాయిలో కాకపోయినా, ఈ వేదికపైనా వారికి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.

పూర్తిగా ఓ కొత్త యాప్‌కు మారి, సున్నా నుంచి మొదలుపెట్టడం కన్నా... ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి వేదికపై ఆదరణ సంపాదించుకోవడం క్రియేటర్లకు తేలిక అవుతుంది.

టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి వస్తుందని తెలిశాక, తమను ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాలని కోరుతూ చాలా మంది క్రియేటర్లు వీడియోలు పెట్టారు.

ఇన్‌స్టాగ్రామ్ అత్యంత అనుకూలమైన సమయంలో రీల్స్ ఫీచర్ తెచ్చిందని టెక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ అభిప్రాయపడ్డారు.

‘‘ఇన్‌స్టాగ్రామ్‌కు ఇప్పటికే యువతలో విపరీతమైన ఆదరణ ఉంది. మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. టిక్‌టాక్‌ పట్ల ఉన్నట్లుగా జనాల్లో చులకన భావం లేదు. చాలా మంది టిక్‌టాక్ క్రియేటర్లుగా కన్నా ఇన్‌స్టాగ్రామ్ సెలెబ్రెటీలుగా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు. చాలా మంది క్రియేటర్లు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌కు మారిపోయారు. ఇప్పుడు ఈ ఫీచర్‌తో వారికి మరింత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి’’ అని అన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌కు యూజర్ బేస్ ఎక్కువ కాబట్టి, వీడియోలకు ఆదరణ కూడా ఎక్కువగా పొందొచ్చు.

దేశీయ యాప్‌ల పరిస్థితి ఏంటి?

టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత చింగారీ, రొపోసో లాంటి యాప్‌లకు ఆదరణ విపరీతంగా పెరిగింది.

చింగారీ యాప్‌కైతే గంటకు మూడు, నాలుగు లక్షల మంది చొప్పున వినియోగదారులు పెరుగుతూ పోయారు.‌

కొన్ని ఊరూ పేరూ తెలియని యాప్‌లకు కూడా ఆదరణ దక్కింది.

చైనా వ్యతిరేకత, స్వదేశీ సెంటిమెంట్ వీటికి బాగా కలిసివచ్చింది.

కానీ, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రంగప్రవేశంతో వీటికి గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయని శ్రీధర్ అన్నారు.

‘‘మానవవనరులు, మౌలికవసతుల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ ముందు ఈ దేశీయ యాప్‌లు సరితూగవు. యాప్ డిజైన్ పరంగా, సేవల నాణ్యత విషయంలో వినియోగదారులకు కచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ మెరుగైన ఎంపిక అవుతుంది. రీల్స్ ఫీచర్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ అకస్మాత్తుగా ఏమీ తేలేదు. ఇది వరకే వేరే దేశాల్లో పరీక్షించి, భారత వినియోగదారులకు ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చింది’’ అని ఆయన చెప్పారు.

‘స్వదేశీ’ మంత్రం ప్రభావం ఇకపై తగ్గిపోవచ్చని కూడా శ్రీధర్ అంటున్నారు.

‘‘చైనాతో ఉద్రిక్తతలు చల్లారాయి. ఆ వేడి కూడా కాస్త చల్లారింది. పైగా ఇన్‌స్టాగ్రామ్ చైనా యాప్ కాదు’’ అని అన్నారు.

‘‘కొత్త యాప్‌లవైపు వెళ్లాలనుకునే క్రియేటర్లకు ఆ యాప్‌లు ఎంతకాలం ఉంటాయోనన్న భయం కూడా ఉంటుంది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు సానుకూలమైన విషయం’’ అని శ్రీధర్ అభిప్రాయపడ్డారు.

"టిక్‌టాక్‌ భారత్‌లో ఎంత ఆదరణ సంపాదించుకుందో, అంత చెడ్డపేరు కూడా సంపాదించుకుంది"

ఫొటో సోర్స్, ISTOCK

ఫొటో క్యాప్షన్, "టిక్‌టాక్‌ భారత్‌లో ఎంత ఆదరణ సంపాదించుకుందో, అంత చెడ్డపేరు కూడా సంపాదించుకుంది"

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రతిష్ఠకు నష్టమా?

భారత్‌లో టిక్‌టాక్ చుట్టూ చాలా సార్లు వివాదాలు వచ్చాయి.

చైల్డ్ పోర్నగ్రఫీకి వేదికగా ఉందంటూ ఓసారి మద్రాస్ హైకోర్టు ఆ యాప్‌ను నిషేధించింది కూడా.

‘‘టిక్‌టాక్‌ భారత్‌లో ఎంత ఆదరణ సంపాదించుకుందో, అంత చెడ్డపేరు కూడా సంపాదించుకుంది. వీడియోల్లో అశ్లీలత, అభ్యంతరకర అంశాల గురించి చర్చలు జరిగాయి’’ అని శ్రీధర్ అన్నారు.

షార్ట్ వీడియోలకు వేదికగా మారిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ ప్రతిష్ఠ కూడా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించారు.

‘‘టిక్‌టాక్ తరహా కంటెంట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌ను బాగా మోడరేట్ చేస్తుంది. అశ్లీలతను, అభ్యంతరకర విషయాలు నియంత్రణలో పెట్టొచ్చు’’ అని శ్రీధర్ వివరించారు.

అంతిమంగా యాప్‌లకు కావాల్సింది వినియోగదారులని, కొన్ని నష్టాలున్నా వారిని ఆకట్టుకోవడంపైనే అవి దృష్టి పెడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘టిక్‌టాక్‌ భారత్ చాలా పెద్ద మార్కెట్ బేస్ సంపాదించుకుంది. కాస్త చెడ్డ పేరు వచ్చే అవకాశాలున్నాయన్న కారణంతో దాన్ని ఇన్‌స్టాగ్రామ్ కాదనుకోదు. ఆ చెడ్డపేరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడుతుంది’’ అని శ్రీధర్ అన్నారు.

రీల్స్‌ ఎలా వాడొచ్చు?

ఇన్‌స్టాగ్రామ్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎడమవైపు పైభాగంలో కెమెరా ఐకాన్ కనిపిస్తుంది.

దాన్ని టాప్ చేసినప్పుడు అడుగున లైవ్, స్టోరీ, రీల్స్ అని ఆప్షన్లు వస్తాయి.

ఇందులో రీల్స్‌ను ఎంపిక చేసుకోవాలి.

అడుగున మధ్యలో వీడియో రికార్డ్ చేసే బటన్ కనిపిస్తుంది.

ఎడమ వైపు మ్యూజిక్, ఎఫెక్ట్స్, వీడియో స్పీడ్, టైమర్ ఆప్షన్లు ఉంటాయి.

ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రెరీలోని మ్యూజిక్‌తో పాటు సొంతగా ఆడియో రికార్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

గరిష్ఠంగా 15 సెకన్ల నిడివి ఉన్న వీడియో చేయొచ్చు.

రికార్డ్ చేయడం పూర్తైన తర్వాత రీల్స్‌ను షేర్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

ఇలా చేసిన వీడియోలను ఫాలోవర్లతోపాటుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఎవరైనా చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)