‘కరోనావైరస్ చిన్న జలుబు మాత్రమే.. అందరం ఏదో ఒకరోజు చనిపోయేవాళ్లమే’ - బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో వివాదాస్పద వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, AFP
కరోనావైరస్ మహమ్మారి మొదలైనప్పటి నుంచీ బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బొల్సొనారో.. అది చాలా చిన్న సమస్యగా కొట్టిపారేస్తూ వస్తున్నారు. మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ఇప్పటివరకూ 16 లక్షల మందికి సోకి 65,000 మందిని బలితీసుకున్నా ఆయన అదే వైఖరితో ఉన్నారు.
బ్రెజిల్ ఆరోగ్యశాఖ అధికారులు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా కూడా దేశాధ్యక్షుడు బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. సామాజిక దూరం పాటించటం వంటి సిఫారసులను పదే పదే ఉల్లంఘించారు.
మితవాది అయిన బొల్సొనారో తనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని మంగళవారం నాడు మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఈ మహమ్మారి గురించి బ్రెజిల్ అధ్యక్షుడు ఇప్పటివరకూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో కొన్ని ఇవీ...
''అతిగా చెప్తున్నారు''
బొల్సొనారో మార్చి 9న అమెరికాలో పర్యటిస్తున్నపుడు.. కోవిడ్-19 తీవ్రతను మీడియా ''ఎక్కువచేసి చూపుతోంద''ని వ్యాఖ్యానించారు.
కొన్ని రోజుల తర్వాత.. అధ్యక్షుడితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన కొంత మంది అధికారులు సహా 20 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

ఫొటో సోర్స్, Reuters
''చిన్న జలుబు''
అనంతరం రెండు వారాలకు.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు లాక్‌డౌన్‌లలో ఉన్నపుడు.. స్కూళ్లు, వ్యాపారాలను మూసివేయటాన్ని బొల్సొనారో తప్పుపట్టారు.
ఈ వైరస్ 'కేవలం ఓ చిన్న ఫ్లూ' అని అభివర్ణించారు. అది తనకు సోకుతుందనే భయం తనకు లేదన్నారు.
''కత్తిపోటుకు గురైన నన్ను ఓ చిన్న ఫ్లూ పడగొట్టలేదు'' అని బొల్సొనారో వ్యాఖ్యానించారు. 2018లో అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై కత్తితో జరిగిన దాడిని ఇలా ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Reuters
‘‘మనల్నేమీ చేయదు’’
బ్రెజిల్ మీద ఈ మహమ్మారి పెద్దగా ప్రభావం చూపదని.. ఎందుకంటే ఇతర దేశాలతో పోలిస్తే తమ దేశంలో వృద్ధుల జనాభా తక్కువని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
''మనకన్నా యూరప్ జనం ముసలి వాళ్లు. మనకన్నా వేరే వాళ్లకే పెద్ద దెబ్బ తగులుతుంది'' అన్నారాయన.
జూలై 8వ తేదీ నాటికి.. బ్రెజిల్ కన్నా ఎక్కువ కేసులు, మరణాలు ఒక్క అమెరికాలో మాత్రమే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
'ఆస్పత్రుల్లో ఎంత మంది ఉన్నారో వీడియో తీయండి'
దేశంలోని ఆస్పత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఎంత మంది రోగులు ఉన్నారో కెమెరాలతో వెళ్లి వీడియోలు తీయాలని బొల్సొనారో జూన్ 12వ తేదీన తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటంతో బ్రెజిల్ ప్రజారోగ్య వ్యవస్థ తట్టుకోలేకపోతోందన్న వార్తలను ప్రశ్నిస్తూ ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
''ఏదో దారి చూసి లోపలికి వెళ్లి వీడియో తీయండి. ఆ బెడ్లు వాడుతున్నారో లేదో మనం చూపించాల్సిన అవసరముంది'' అని ఆయన ప్రత్యక్ష ప్రసారంలో పేర్కొన్నారు.
అధ్యక్షుడి పిలుపువల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని వైద్యాధికారులు విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘అందరం ఏదో ఒక రోజు చనిపోతాం’’
అయినప్పటికీ.. కేవలం ఆరోగ్యం బలహీనంగా ఉన్న వారిని మాత్రమే ఐసొలేట్ చేయాలని బొల్సొనారో వాదించారు.
సామాజిక దూరం నిబంధనలను పాటించకుండా పలు బహిరంగ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు.
''ఇది వాస్తవం. వైరస్ ఉంది. దానిని మనం ఎదుర్కోక తప్పదు. కానీ దానిని మగాడిలో ఎదుర్కోవాలి. పిల్లాడిలా కాదు. ఇది జీవితం. మనమందరం ఏదో ఒక రోజు చనిపోతాం'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, EPA
''అయితే ఏంటి?''
బ్రెజిల్‌లో కోవిడ్-19 మరణాల సంఖ్య ఏప్రిల్ నెలలో చైనాను దాటేశాయి.
అప్పుడు రోజువారీగా నమోదవుతున్న రికార్డు స్థాయి మరణాల గురించి ఏమంటారని ఒక విలేకరి అడిగినపుడు: ''అయితే ఏంటి? ఐ యాం సారీ. నన్ను ఏం చేయమంటారు. నేనేమైనా రక్షకుడినా? నేనేమీ అద్భుతాలు చేయలేను'' అని బొల్సొనారో స్పందించారు.
బొల్సొనారో మధ్య పేరు మెస్సియాస్. రక్షకుడు (మెస్సయ్య) అనే పదానికి పోర్చుగీసు పదం అది.
ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూను ఎవరైనా రికార్డు చేస్తున్నారా అని అడిగి.. కోవిడ్ మరణాల పట్ల తన విచారం వ్యక్తంచేశారాయన.
''వైరస్ వల్ల మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల విచారం వ్యక్తంచేస్తున్నా. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
''నేను నేరం చేస్తున్నా.. ఆతిథ్యం ఇస్తున్నా''
బ్రసీలియాలోని తన ఇంట్లో 30 మందికి ఆతిథ్యం ఇస్తున్నానని (బార్బిక్యూ) మే 7వ తేదీన బొల్సొనారో ప్రకటించారు. అప్పుడు దేశంలో 1,35,000కు పైగా కోవిడ్ కేసులు ఉన్నాయి. 9,000 మందికి పైగా చనిపోయారు.
''నేను నేరం చేస్తున్నా.. భోజనాలకు పిలిచి ఆతిథ్యం ఇస్తున్నా'' అని ఆయన పాత్రికేయులతో వ్యాఖ్యానించారు.
రెండు రోజుల తర్వాత ఆయన వెనుకడుగు వేసినట్లు కనిపించింది. బార్బిక్యూ మాట ఒక జోక్ అని చెప్పారు.
''జీవితం సాగిపోతుంది''
ఇప్పుడు తనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని వెల్లడించిన బొల్సొనారో.. ''అలసటగా, కొంత అసౌకర్యం, కొంచెం కండరాల నొప్పులు'' ఉన్నట్లు అనిపిస్తోందని మీడియాకు చెప్పారు.
అయితే ఉత్సాహంగానే కనిపించారు. తాను స్థిరంగా ఉండటం పెద్ద సవాలని పేర్కొన్నారు.
''కానీ మీరేమీ భయాందోళనలు వద్దు.. జీవితం సాగిపోతుంది'' అని వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








