కరోనావైరస్‌ భారత్‌లో చాయ్‌ కల్చర్‌ను చంపేస్తుందా?

టీ తాగుతున్న మహిళ

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో అత్యధికంగా టీ పొడిని తయారు చేసే దేశాలలో భారత్‌ రెండోది
    • రచయిత, అపేక్ష భతేజా
    • హోదా, బీబీసీ వర్క్ లైఫ్

భారతదేశంలో ప్రతి నగరం, పట్టణం, గ్రామంలోనూ పని ప్రదేశాల పక్కనే టీ కొట్లు, బడ్డీ కొట్లు ఉంటాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఆఫీసు క్యాంటీన్‌లో టీ అందుబాటులో ఉన్నప్పటికీ రోడ్డుపక్కన ఉండే బండి దగ్గరికి వెళ్లి టీ తాగడం చాలా సహజం.

ఉద్యోగులు, శ్రమజీవులు సేదదీరడానికి, కాసేపు కబుర్లాడుకోవడానికి హిందీలో టప్రీస్‌ అని పిలిచే ఈ టీ స్టాళ్లు కేంద్రాలుగా పనిచేసేవి. మరి ఇప్పుడు వాటికి మనుగడ ఉందా?

కరోనా వైరస్‌ దేశాన్ని చుట్టేయడానికి ముందు, మామూలుగా అయితే దిల్లీలో మధ్యాహ్నం పూట, చాలామంది ఉద్యోగులు ఆఫీసుల నుంచి టీ అంగళ్ల వైపు కదులుతారు. సమోసానో, బజ్జీనో నములుకుంటూ వేడివేడి టీ చప్పరించాలని చూస్తారు. ఆఫీసుల్లో పని చేసేవాళ్లు అలా మిత్రులతో కలిసి బయటకు వచ్చి కాస్త మసాలా దట్టించిన అల్లం లేదంటే ఇలాచీ చాయ్‌ని ఆస్వాదించడం సర్వసాధారణంగా కనిపించే దృశ్యం. ఆఫీసులో పనిచేసి అలసిపోయి చిన్న విరామం తీసుకుందామనుకునే ఉద్యోగులకు ఈ టీ అంగళ్లు విలాస కేంద్రాల్లాంటివి. వ్యక్తిగత జీవితం నుంచి బాస్‌ల అరాచకాల వరకు ఇక్కడ రకరకాల చర్చలు జరుగుతాయి.

కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడానికి మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మూడు నెలల లాక్‌డౌన్‌ మొదలైంది. చాలా దేశాల్లాగే ఇండియాలో కూడా ఆఫీసులు మూతపడ్డాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆఫీసుల ముందు కనిపించే చిన్నచిన్న టీ దుకాణాలు, షాపులు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలను ఒక్కో రాష్ట్రం సడలించుకుంటూ వచ్చింది. అయితే ఎక్కడో ఒకటీ అరా తప్పా చాలా చాయ్‌ బండ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. చాలా సంస్థలు వర్క్‌ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యతనివ్వడం, ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గడం, వచ్చినవాళ్లు కూడా కరోనా భయంతో సోషల్‌ డిస్టెన్స్‌ అంటూ దూరదూరంగా ఉంటుండటంతో ఈ టీస్టాళ్లకు గిరాకీ లేకుండా పోయింది.

చాయ్‌ భారతీయుల జీవన విధానంలో భాగం. చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా టీ పొడిని ఉత్పత్తి చేసేది భారతదేశమే. దేశంలో 80శాతం టీ ఇళ్లలోనే తయారవుతుందని టీ బోర్డ్ ఆఫ్‌ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 88శాతం ఇళ్లల్లో టీ చేసుకుని తాగుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోగలిగే రెడీ టు డ్రింక్‌ పానీయం టీయే. కాఫీకన్నా ఎక్కువమంది టీకే ప్రాధాన్యమిస్తారు.

రోడ్డు పక్కన టీ కొట్లు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, చాయ్‌ బండ్లు, చిరుతిళ్ల వ్యాపారాలు ఏ భారతీయ నగరంలో చూసినా కనిపిస్తాయి

సంప్రదాయంగా మారిన టీ అలవాటు

ఢిల్లీకి సమీపంలోని గుర్‌గ్రామ్‌లో ఓ హెల్త్‌ కేర్‌ కంపెనీకి జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న అర్జున్‌ కిశోర్‌ టీ, సిగరెట్ల కోసం రోజుకు ఐదుసార్లు బ్రేక్‌ తీసుకుంటారు. తాను పనిచేసే కంపెనీ పక్కనున్న వీధిలో చాలామంది చిరు వ్యాపారులు రకరకాల తినుబండారాలతో సిద్ధంగా ఉంటారు. బ్రేక్‌ కోసం వచ్చిన తనలాంటి ఉద్యోగులు అక్కడ నిత్యం కనిపిస్తుంటారు.

''నేను ఈ మధ్యనే కొత్త ఉద్యోగంలో జాయిన్‌ అయ్యాను. ఇక్కడి వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే ఇదే మంచి ప్రదేశం'' అన్నారు కిశోర్‌. "ఇక్కడ అనేక రకాల ముచ్చట్లు సాగుతాయి. పని ఒత్తిడి నుంచి బాసులతో చేదు అనుభవాల వరకు ఇక్కడ రకరకాల చర్చలు నడుస్తాయి. చాలాసార్లు వ్యక్తిగత విషయాలపై కూడా ఇక్కడ మాట్లాడుకుంటారు'' అన్నారు కిశోర్‌

చిన్నచిన్న విరామాల వల్ల పని చేసేవారిలో ఉత్సాహం రెట్టింపవుతుంది అంటారు ఢిల్లీకి చెందిన థెరపిస్ట్‌ డాక్టర్‌ మైత్రి చంద్‌. "బయటకు అడుగుపెడితే వాతావరణం మారిపోతుంది. కాంక్రీట్ బిల్డింగ్‌లు, అద్దాల కిటికీల నుంచి ఆరు బయటకు వస్తారు. సూర్యరశ్మి నేరుగా శరీరాన్ని తాకుతుంది. అప్పుడప్పుడు ఇలా బైటికి రావడం, తిరిగి పనిలోకి వెళ్లడం విధిగా చేయాలి'' అని అన్నారు మైత్రిచంద్‌. ఇలాంటి బ్రేక్స్‌ వల్ల మనుషుల మధ్య కొత్త స్నేహ బంధాలు కూడా ఏర్పడతాయని, పని చేసే ప్రదేశంలో స్నేహితులు ఎక్కువమంది ఉంటే ఉత్పాదక కూడా పెరగుతుందని పరిశోధనలు చెబుతున్నట్లు ఆమె వివరించారు. పక్కనున్న వారితో మాట్లాడుకుంటూ పని చేస్తుంటే తాము ఒంటరివారమన్న భావన ఉద్యోగుల్లో కలగదని మైత్రి చంద్‌ చెబుతున్నారు.

"అమెరికన్లు, యూరోపియన్లతో పోలిస్తే పబ్లిక్‌ ప్లేస్‌ అన్న మాటకు భారత్‌లో భిన్నమైన అర్ధం ఉంది'' అంటారు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సామాజికవేత్త అరుల్‌ కాణి. అక్కడ మతపరమైన ప్రదేశాలలో ఎక్కువగా ఆహారపదార్ధాల గురించి చర్చ జరుగుతుందని ఆమె అంటారు. అందుకు భిన్నంగా "భారత్‌లో పబ్లిక్ స్పేస్‌లు సమానత్వానికి పునాది వేస్తాయి. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. ఈ టీషాపుల దగ్గర ప్రతిరోజు కొత్తకొత్త స్నేహాలు, బంధాలు ఏర్పడతాయి. అది ఉద్యోగులు పని చేసే ఆఫీసుల దగ్గర కావచ్చు, యూనివర్సిటీ క్యాంపస్‌ల దగ్గర కావచ్చు, సమోసా నములుకుంటూ టీ తాగుతూ అనేక రాజకీయాలను మాట్లాడుకుంటారు'' అన్నారు అరుల్‌.

టీ తాగుతున్న మహిళ

ఫొటో సోర్స్, Alamy

పుణెలో రీసెర్చ్‌ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న జుహీ దేశాయ్‌ లెమన్‌ టీ తాగడానికి తాప్రి అని పిలిచే టీ అంగడి దగ్గర ఆగుతారు. అక్కడ వారు తినడానికి తమ ఇద్దరికీ సరిపోయే సైజులో ఉండే 'మస్కా' అనే బన్‌ను షేర్‌ చేసుకుంటారు. "మేం ఇలా రిలాక్సవుతాం'' అన్నారు జుహీదేశాయ్‌. " మేం పని చేసేచోట అన్ని విషయాలు మాట్లాడుకోలేం. నా కొలీగ్‌ నాకు జూనియర్‌. అందుకే ఇలా టీ తాగుతూ ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకుంటాం'' అన్నారామె.

భారత్‌లోని చాలా కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగుల మధ్య స్థాయిభేదాలు ఉంటాయి. ఉద్యోగులు తమ మేనేజర్‌తో ఆఫీసులో స్వేచ్ఛగా మాట్లాడలేరు. 2019లో జరిపిన సర్వేలో ఉద్యోగులు తమ సామర్ధ్యం మేరకు పని చేయలేక బలహీనపడిపోవడానికి ఇలాంటి పరిస్థితులతోపాటు అధిక పనిగంటలు, వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌ లేకపోవడం కూడా కారణాలని తేలింది. ఆఫీసు లోపలా,బయటా తమ జీవితం గురించి ఆలోచించుకోడానికి ఇలాంటి టీ స్టాళ్లు సరైన ప్రదేశాలు అనుకోవచ్చు.

మనుగడ ప్రశ్నార్ధకం

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ తదనంతర పరిణామాలు వీధి వ్యాపారుల వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. టీ అంగళ్లు నడుపుకునే వారి మీద ఇది మరీ ఎక్కువగా ఉంది. మొదటిసారి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు నగరాల నుంచి భారీ ఎత్తున వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వీరిలో రోజు కూలీలు, వీధి వ్యాపారులు, నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లల్లో పని చేసేవాళ్లు ఇలా ఇందులో రకాల వారు ఉన్నారు. వీరంతా భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల వారే. ఏదో ఒక ఉపాధి దొరక్కపోతుందా అని పొట్ట చేతబట్టుకుని నగరాలకు వచ్చిన వారే. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజారవాణా వ్యవస్థ బంద్‌ కావడంతో వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన తిరిగి సొంతూళ్లకు బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలకు ఇదో పెద్ద కష్టంగా మారింది. కొందరు ఇళ్లకు కూడా చేరలేక మార్గ మధ్యంలోనే మరణించారు.

మొదటిసారి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు చాలామంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు వెళ్లిపోయారు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, మొదటిసారి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు చాలామంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు వెళ్లిపోయారు

వీధుల్లో చిరుతిళ్లు అమ్ముకుని బతికే వాళ్లలో ఎక్కువమంది పేద రాష్ట్రాలైన రాజస్థాన్‌, బిహార్‌, ఒడిశా, ఉత్తర్‌ ప్రదేశ్‌ల నుంచే వచ్చారని చెబుతారు దిల్లీ ఫుడ్‌వాక్స్‌ పేరుతో ఫుడ్‌ టూరిజం సంస్థను నడుపుతున్న అనుభవ్‌ సప్రా. ఆయన కంపెనీ పాత దిల్లీలో మంచి ఆహారం దొరికే ప్రదేశాలలో గైడెడ్‌ టూర్లు నిర్వహిస్తుంది. "పాత దిల్లీలో వీధుల్లో ఆహార పదార్ధాలు అమ్ముకుని బతికే చాలామంది బిహార్‌ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లలో చాలామంది తమ రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఇప్పుడిక్కడ ఆ వ్యాపారం చేసేవారే లేరు'' అని అనుభవ్‌ వివరించారు.

గురుగ్రామ్‌లో టీ టిఫిన్లు అమ్ముకుని బతికే కిశోర్‌ చౌధరిని లాక్‌డౌన్‌ కాలంలో షాపు తెరవనీయ లేదు. తన పక్కన షాపులు నడిపే చాలామంది ఊళ్లకు వెళ్లిపోయారు. నెలకు దాదాపు రూ.30,000 వరకు సంపాదించే ఆయన వద్దకు రోజూ సుమారు 500మంది కస్టమర్లు వచ్చేవారు. వివిధ ఆఫీసులు ఉన్న ఆ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఆయన తన షాపును నడుపుతారు. మొదటి దశ లాక్‌డౌన్‌ సడలించాక ఆయన మళ్లీ తన షాపును తెరిచారు. కానీ ఒకరిద్దరుకంటే ఎక్కవమంది ఆ షాపువైపు చూడలేదు. ఇక దుకాణం నడపలేక మళ్లీ మూసేశారు కిశోర్‌ చౌధరి.

మూతపడిన షాపులు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, వ్యాపారాలు మూతపడటంతో దేశవ్యాప్తంగా అనేకమంది ఆర్ధిక దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది

పశ్చిమ దిల్లీలో టీ దుకాణం నడుపుకునే పవన్‌ కుమార్‌ పరిస్థితి కూడా ఇదే. ఆయన కస్టమర్లు ఎవరూ ఇప్పుడు ఆ షాపు దగ్గరకు రావడం లేదు. ఎవరో ఒకరిద్దరు కొంటున్నారు. బయట రూ.10 పెట్టి టీ కొనుక్కుని తాగలేని రిక్షాపుల్లర్లు, ఆటో, ట్రక్‌ డ్రైవర్లు మాత్రమే ఆయన దగ్గరకు వస్తున్నారు.

మరి కరోనా ఎఫెక్ట్‌ తో ఈ టీ అంగళ్ల పని అయిపోయినట్లేనా? కాదంటారు అనుభవ్‌ సప్రా. బతుకుదెరువు లేక సొంత ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు, వ్యాపారులు తిరిగి ఈ ప్రాంతానికి వస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. "ఇదేమీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కాదు. అవసరం'' అంటారు సప్రా. వెళ్లిపోయినవారిలో చాలామందికి వారి ఊళ్లలో ఉపాధి దొరకడం లేదని చెబుతున్నారాయన.

మారుతున్న దృశ్యం

భారత్‌లో టీ స్టాల్‌ కల్చర్‌ తిరిగి గాడిన పడుతుంది. నగరాన్ని వదిలేసి వెళ్లిపోయిన వ్యాపారులు యథావిధంగా వ్యాపారాలు మొదలు పెడతారు. " మాస్క్‌ ధరించడం గురించి శానిటైజర్లు వాడటం గురించి మేం వారికి శిక్షణ ఇచ్చాం. అలాగే డిజిటల్ పేమెంట్స్, డిస్పోజబుల్‌ కప్పుల వాడకం గురించి కూడా వారికి అవగాహన కల్పించాం'' అని వివరించారు అనుభవ్‌ సప్రా.

వీధి వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు మొదలు పెట్టడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని నేషనల్ అసోసియేషన్‌ ఫర్‌ స్ట్రీట్‌ వెండర్స్‌ ఆఫ్‌ ఇండియా భావిస్తోంది. అలాగే వారు తమ వ్యాపారంలో తిరిగి పుంజుకోవడానికి ఒక్కొక్కరికీ రూ.10,000 రుణంగా ఇవ్వాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ నిర్ణయించింది. "చిన్న మొత్తాలను ఎక్కువ వడ్డీకి ( ఒక్కోసారి అది రోజుకు 1% చొప్పున అంటే నెలకు 400% వడ్డీ వరకు వెళుతుంది) అప్పు తీసుకుని వారు వ్యాపారాలు చేస్తుంటారు'' అని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

కరోనా వైరస్‌ కారణంగా ఇంకా ఇలాంటి దుష్పరిణామాలు చాలా ఉంటాయని సామాజికవేత్త కాణి భావిస్తున్నారు. ఆమె అభిప్రాయం ప్రకారం ఇంతకు ముందులాగా టీస్టాళ్ల ముందు జనం గుమిగూడరు. ఒకవేళ వెళ్లినా చిన్నచిన్న చర్చలతోనే దాన్ని ముగిస్తారని ఆమె అంటున్నారు. వీటితోపాటు ముఖానికి మాస్క్‌ కారణంగా చాయ్‌, సిగరెట్‌ బ్రేక్‌లకు అవకాశాలు తగ్గుతాయని ఆమె అంటారు. "పని చేసే ప్రదేశాలలో కూడా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంతకు ముందు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పనితో నేరుగా సంబంధం లేని వ్యక్తులతో ఈ టీ అంగళ్ల దగ్గర చర్చలు జరిపేవాళ్లు. పని ప్రదేశాలలో మార్పుల కారణంగా ఇప్పుడు ఇది కూడా కష్టంగా మారుతుంది'' అని కాణి అభిప్రాయపడ్డారు.

గాజు గ్లాసుల్లో టీ

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, స్నేహితులతో కాలిసి పాలు, మసాల కలిపిన చాయ్‌ సేవించడం ఇండియన్‌ ఆఫీస్‌ కల్చర్‌లో భాగంగా మారింది

అయితే డాక్టర్‌ మైత్రి చంద్‌ మాత్రం ఆశావహంగా ఉన్నారు. భారతీయులు సృజనశీలురు. దీనికి ఏదో ఒక సృజనాత్మక పరిష్కారం కనుక్కొంటారని ఆమె అభిప్రాయపడుతున్నారు. 2016లో ప్రధానమంత్రి నకిలీ నోట్లు, పన్నుల ఎగవేతలను అడ్డుకోడానికి, డిజిటల్‌ కరెన్సీని ప్రోత్సహించడానికి నోట్ల రద్దు ప్రకటించినప్పుడు మొదట దెబ్బతిన్నది చిన్న వ్యాపారులే. కానీ ఆ దెబ్బ నుంచి కోలుకుని వారు కూడా డిజిటల్‌ కరెన్సీవైపు మళ్లారని మైత్రి చంద్‌ గుర్తు చేశారు.

ఆఫీస్‌ కల్చర్‌లో మానవ సంబంధాలను కలపడంలో టీ అంగళ్లు కీలకమైన పాత్ర పోషించాయి. అందుకే ఈ టీస్టాల్ కల్చర్‌ మళ్లీ జీవం పోసుకుంటుందని అంతా భావిస్తున్నారు. స్నేహితులు, సహోద్యోగులతో కలిసి టీ స్టాల్స్‌ దగ్గర వేడివేడి చాయ్‌ను ఆస్వాదించే రోజు మళ్లీ రావడం ఖాయమని ఆశావహంగా ఉన్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)