కరోనావైరస్: జపాన్‌లో ఐదు నెలల్లో 1,000 లోపే కోవిడ్ మరణాలు... ఇంత తక్కువగా ఉండటం వెనుక మిస్టరీ ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రూపెర్ట్ వింగ్ ఫెల్డ్ హేస్
- హోదా, బీబీసీ ప్రతినిధి, టోక్యో
జపాన్‌లో కోవిడ్ మరణాలు ఎక్కువగా ఎందుకు లేవు అంటే.. జపనీయుల అలవాట్లు మొదలుకుని వాళ్లకు గల రోగ నిరోధక శక్తి వరకు.. అనేక సిద్ధాంతాలు చర్చల్లో వినిపిస్తున్నాయి.
జపాన్‌తో పాటు, దక్షిణ కొరియా, తైవాన్, హాంగ్‌కాంగ్, వియత్నాంలలో కూడా కోవిడ్ మరణాల శాతం చాలా తక్కువగా ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ టోక్యోలో బహుశా కోవిడ్ వల్ల 1,000 మరణాలు చోటు చేసుకున్నా కూడా ఈ సంవత్సరం మొదట్లో జపాన్‌లో మరణాల సంఖ్య సాధారణ స్థాయి కన్నా తక్కువగానే ఉన్నాయి.
జపాన్‌లో వైరస్‌ను నియంత్రించడానికి గట్టి చర్యలేమీ తీసుకోకపోయినప్పటికీ మరణాలు తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
జపాన్‌లో ఏం జరిగింది?
ఫిబ్రవరిలో వుహాన్‌లో వైరస్ తీవ్రంగా విజృంభించిన సమయంలో ప్రపంచంలో చాలా దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు సరిహద్దులు మూసేశాయి. కానీ జపాన్ మాత్రం తమ సరిహద్దులను తెరిచే ఉంచింది.
వైరస్ ముఖ్యంగా వృద్దులకు సోకుతుందని, సమూహాలలో వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయం వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలోనే తెలిసింది. జపాన్ జనాభాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే దేశంలోని నగరాలలో కూడా జనాభా కిక్కిరిసి ఉంటారు.
ఒక్క గ్రేటర్ టోక్యోలోనే 3 కోట్ల 70 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు కిక్కిరిసిన రైళ్లలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
కరోనావైరస్ నియంత్రణకు పెద్ద సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాలను కూడా జపాన్ పాటించలేదు. ఇప్పటికి కూడా కేవలం 3,48,000 మందికి మాత్రమే పిసిఆర్ పరీక్షలు చేసింది. అంటే జపాన్ జనాభాలో కేవలం 0. 27 శాతం మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
యూరోప్ దేశాలలోలా జపాన్‌లో కఠినమైన లాక్‌డౌన్ కూడా విధించలేదు. ఏప్రిల్ మొదట్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించింది. కానీ, ఇంటి దగ్గరే ఉండటాన్ని ప్రజల ఇష్టానికి వదిలేసింది. అత్యవసర సేవలు కాని వ్యాపారాలను మూసివేయాలని చెప్పింది. కానీ, అది పాటించని వారికి జరిమానాలేవీ లేవు.
కోవిడ్ నియంత్రణకు న్యూజీలాండ్, వియత్నాం లాంటి దేశాలు, సరిహద్దులను మూసేసి, కఠినమైన లాక్‌డౌన్‌లు విధించి, అత్యధిక స్థాయిలో పరీక్షలు నిర్వహించి, కఠినమైన క్వారంటైన్ విధానాలు పాటించడం లాంటి చర్యలు అవలంబించాయి. ఇలాంటి చర్యలేవీ జపాన్ చేయలేదు.
జపాన్‌లో మొదటి కోవిడ్ కేసు నమోదై ఐదు నెలలైంది. అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 20,000 లోపే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 1,000 కన్నా తక్కువ మరణాలు చోటు చేసుకున్నాయి. ఎమర్జెన్సీని సడలించారు. జన జీవనం వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.
జపాన్ ఇప్పటి వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టిందనడానికి కొన్ని శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి.
టెలికాం దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ తమ 40,000 మంది ఉద్యోగులకు యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించగా, అందులో కేవలం 0. 24 శాతం మందికే వైరస్ సోకినట్లు తెలిసింది. టోక్యోలో 8,000 మందికి రాండమ్ టెస్టులు నిర్వహించగా వైరస్ పెద్దగా ఎవరికీ సోకలేదని నిర్ధరణ అయింది. టోక్యోలో కేవలం 0. 1 శాతం మందికి పాజిటివ్ అని తేలింది.
జపాన్ ప్రధాని షింజో ఏబ్ ఎమర్జెన్సీని సడలిస్తూ, ఇతర దేశాలు జపాన్ మోడల్ చూసి నేర్చుకోవాలని గర్వంగా చెప్పుకున్నారు.

ఈ విషయంలో జపాన్‌కు ఏదైనా విశిష్టత ఉందా?
జపాన్ ఉప ప్రధాని తారో అసో అయితే మరో అడుగు ముందుకు వెళ్లి, జపాన్ ప్రజల అత్యున్నత నాణ్యత కారణంగానే వైరస్ ప్రభావం లేదని ప్రకటించుకున్నారు. ఇతర దేశాల నాయకులు.. జపాన్ విజయం గురించి వివరించాలని తనను సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
"మీ దేశానికి మా దేశానికి మధ్య ‘మిండో’ (ప్రజల స్థాయి) భిన్నంగా ఉందని వారితో చెప్పాను. దాంతో వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు” అని ఆయన పేర్కొన్నారు.
జపాన్ జాత్యహంకారాన్ని, సాంస్కృతిక ఛాందసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చాలా మంది ఖండించారు.
అయితే.. జపాన్ ప్రజలపై కోవిడ్ ప్రభావం చూపకపోవడానికి ఏదో తెలియని కారణం ‘ఫ్యాక్టర్ ఎక్స్’ ఉందని కొంత మంది శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారు.
జపనీయులు ఒకరినొకరు కలిసినప్పుడు కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లాంటివి చేయకపోవడం, భౌతిక దూరం పాటించడం లాంటి సామాజిక విలువలు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సంబంధం ఉండొచ్చు కానీ.. ఈ సందేహానికి అదే సమాధానమని ఎవరూ భావించటం లేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
జపాన్ కి ప్రత్యేకమైన రోగ నిరోధక శక్తి ఉందా?
జపాన్‌లో రోగులు కోవిడ్‌కి ప్రభావితమవుతున్న తీరు చూస్తుంటే జపాన్‌లో ముందే కోవిడ్ తరహా వైరస్ వచ్చి ఉంటుందని టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ తత్సుహికో కొదమ అన్నారు. కోవిడ్ లాంటి మరేదైనా వైరస్ వలన ఇక్కడి ప్రజలకు రోగ నిరోధక శక్తి ముందే వచ్చి ఉంటుందని ఆయన అంటున్నారు.
"వైరస్ మానవ శరీరంలో ప్రవేశించినప్పుడు, శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి యాంటీ బాడీస్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి వైరస్ మీద దాడి చేసి పోరాడతాయి” అన్నారు.
“శరీరంలో ఐజీఎం, ఐజీజీ అనే రెండు రకాల యాంటీ బాడీలు ఉంటాయి. ఇవి పని చేసే తీరుని బట్టి ఎవరైనా వైరస్‌కి గురయ్యారా లేదా అనేది తెలుసుకోవచ్చు” అని పేర్కొన్నారు.
‘‘కొత్త రకం వైరస్ ఇన్ఫెక్షన్ సోకితే ఐజీఎం ముందు స్పందిస్తుంది. ఐజీజీ నెమ్మదిగా స్పందిస్తుంది. అదే వైరస్ గనక ముందుగానే సోకి ఉంటే ఐజీజీ స్పందించే తీరు వేగంగా ఉంటుంది. జపాన్‌లో రోగులకు పరీక్షలు నిర్వహించినప్పుడు మేం ఆశ్చర్యానికి గురయ్యాం. ఐజీజీ సత్వరమే స్పందించింది. ఐజీఎం స్పందన ఆలస్యంగా వచ్చింది” అని ఆయన వివరించారు.
దీనిని బట్టి ఇలాంటి వైరస్‌కి వీరు ఇంతకు ముందే గురై ఉంటారని ఆయన భావిస్తున్నారు.
గతంలో సార్స్ తరహా వైరస్ జపాన్’లో మాత్రమే కాకుండా చైనా, దక్షిణ కొరియా, తైవాన్, హాంగ్ కాంగ్, సౌత్ ఈస్ట్ ఆసియాలలో రావడం వలన ఈ దేశాలలో కోవిడ్ మరణాలు తక్కువగా ఉండి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ వాదన పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముందే వచ్చిన సదరు వైరస్ ఆసియాకు మాత్రమే పరిమితమై ఎలా ఉందో అర్ధం కావటం లేదని, లండన్ కింగ్స్ కాలేజీలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ కెంజి షిబుయ అన్నారు.
రోగ నిరోధక శక్తి వివిధ ప్రాంతాల వారి మధ్యలో వ్యత్యాసాలు ఉండటం సహజమేనని ఆయన పేర్కొన్నారు. కానీ, మరణాల సంఖ్య తక్కువ ఉండటం పట్ల అర్ధం కాని ‘ఫ్యాక్టర్ ఎక్స్’ గురించి మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కోవిడ్ వ్యాప్తిని అరికట్టిన చాలా దేశాలు, కోవిడ్ ఎక్కువ మందికి వ్యాపించకుండా సత్వర చర్యలు తీసుకున్నాయని అన్నారు.
జపాన్ ప్రజలు 1919 లో ఫ్లూ వచ్చినప్పటి నుంచి , అంటే గత 100 సంవత్సరాల నుంచి మాస్కులు ధరించడానికి అలవాటుపడ్డారు. సాధారణ జలుబు, దగ్గుకి కూడా చుట్టూ ఉన్న వారికి అది వ్యాపించకుండా మాస్కులు ధరిస్తారు.
"మాస్క్ రక్షణ కలిగించడం మాత్రమే కాకుండా పక్కనున్నవారికి కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది” అని హాంగ్ కాంగ్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ స్కూల్ డైరెక్టర్ కీజి ఫుకుడా చెప్పారు.
1950 లలో జపాన్ మీద టీబీ వ్యాధి విజృంభించినప్పుడు కూడా జపాన్ ప్రజా ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా పని చేసింది.
జపాన్ వేగంగా మహమ్మారి లక్షణాలను గుర్తించింది.
జపాన్‌లో వైరస్ డేటా ప్రకారం, ఇన్ఫెక్షన్ కొన్ని ఒకే లాంటి ప్రాంతాలలో ఉందని గుర్తించినట్లు క్యోటో యూనివర్సిటీలో పరిశోధకుడు డాక్టర్ కజువాకి జిందాయి చెప్పారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?


ఫొటో సోర్స్, Getty Images
"వైరస్ సోకిన వారిలో చాలా మంది సంగీత కార్యక్రమాలకు హాజరు కావడం, కరోకేలలో పాడటం. క్లబ్, బార్లు, జిమ్‌లకు వెళ్లడం లాంటివి చేసినట్లు తెలిసింది” అని పేర్కొన్నారు.
సార్స్ కోవిడ్ సోకిన వారిలో 80 శాతం మంది నుంచి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందలేదని ఒక అధ్యయనం పేర్కొంది. దీంతో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రచారం ప్రారంభించింది.
గాలి వెలుతురు లేని ప్రదేశాలలో ఉండవద్దని, గుంపులలో, సమూహాలలో ఉండవద్దని, దగ్గరగా ఉండి సంభాషించుకోవద్దని ప్రచారం చేసింది. ఈ ప్రచారం పని చేసి ఉంటుందని జిందాయి అన్నారు.
కానీ, మార్చ్ మధ్యలో జపాన్‌లో కూడా కేసుల సంఖ్య పెరిగింది. అదృష్టవశాత్తూ అవి స్థాయికి మించి పెరగలేదు. సరైన సమయంలో స్పందించడమే జపాన్ చేసిన తెలివైన పనని ప్రొఫెసర్ షిబుయ అన్నారు.
ఏప్రిల్ 7వ తేదీన జపాన్‌లో ఎమర్జెన్సీ విధించారు. ఇది జరగకపోయి ఉండి ఉంటే, జపాన్‌లో కూడా న్యూయార్క్, లండన్‌లో లాంటి పరిస్థితులే చూసి ఉండే వారమని అన్నారు.
హృద్రోగాలు, ఊబకాయం, డయాబెటిస్ లాంటి లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ సోకితే హాస్పిటల్‌లో చేరే అవకాశం ఆరు రెట్లు ఎక్కువగా ఉందని, 12 రెట్లు మరణించే ప్రమాదం ఉందని అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది.
జపాన్‌లో హృద్రోగులు, ఊబకాయుల శాతం మిగిలిన అభివృద్ధి చెందిన దేశాల కన్నా తక్కువ ఉంది. కానీ, ఇదొక్కటే కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కారణమని చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ నుంచి మిగిలిన దేశాలు నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్నా ఉందా?
జపాన్ కఠినమైన లాక్ డౌన్ విధించకుండా కోవిడ్ వ్యాప్తిని అదుపులో పెట్టగలిగింది. ఇదే అందరికీ వర్తిస్తుందా అనే అంశం పై ఒక స్పష్టత లేదు.
ఫ్యాక్టర్ ఎక్స్ అనేది ఏమి లేదు. జపాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపగలిగింది.
ప్రజలని ఇంటి వద్దనే ఉండమని ప్రభుత్వం నిర్బంధించక పోయినా, ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు.
వైరస్ సోకిన వారు ఇతరులతో కలవకుండా చూడటానికి ప్రజల సహకారం అవసరమని ప్రొఫెసర్ ఫుకుడా అన్నారు.
పబ్లిక్ స్థలాలు, సమూహాలకు దూరంగా ఉండమని, మాస్క్లు ధరించమని, చేతులు శుభ్రపరుచుకోమని, ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ప్రజలు ప్రభుత్వం చేసిన సూచనలను పాటించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- చైనా, బ్రిటన్ మధ్య ‘హాంకాంగ్’ చిచ్చు... ప్రపంచ క్రమం మారిపోతుందా?
- నాగాలాండ్, మిజోరంలలో కుక్క మాంసాన్ని ఇప్పుడే ఎందుకు నిషేధించారు?
- సూర్యుడి కన్నా 25 లక్షల రెట్ల పెద్దదైన రాకాసి నక్షత్రం.. రాత్రికి రాత్రి రాలిపోయిందా?
- ప్రపంచ పటాన్ని మార్చిన మొక్క ఇది - ఎలా మార్చింది.. చరిత్రలో ఏం జరిగింది?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








