ప్రపంచ పటాన్ని మార్చిన మొక్క ఇది, చరిత్రలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Celso Roldan/Getty Images
- రచయిత, విటోరియా ట్రెవెర్సో
- హోదా, బీబీసీ ట్రావెల్
ఆండీస్ పర్వతాల్లో పుట్టిన ఆ చెట్టు బెరడు ఒకప్పుడు మలేరియాను పారదోలింది. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసింది. ఇప్పుడు ఆ చెట్టు ఉత్పత్తులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే 'మను నేషనల్ పార్క్' పెరూలోని నైరుతి ప్రాంతంలో ఆండీస్ పర్వతాలు, అమెజాన్ అడవులు కలుసుకునేచోట ఉంటుంది. ఇది ఈ భూమిపైనే అత్యంత జీవవైవిధ్యం ఉన్న ప్రాంతం. 1.5 మిలియన్ హెక్టార్లలో పొగమంచు ఆవరించి కనిపించే ఈ నేషనల్ పార్క్‌ను యునెస్కో నేచర్ రిజర్వ్ గా ప్రకటించింది. రకరకాల మొక్కలు, తీగలతో అల్లుకుపోయిన ఈ అటవీ ప్రాంతం మానవ దుర్భేద్యంగా ఉంటుంది.
ఈ మొక్క ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
మను నేషనల్ పార్క్: జీవవైవిధ్యానికి స్వర్గధామంలాంటి నేషనల్ పార్క్‌ను యునెస్కో నేషనల్ ప్రిజర్వ్ గా ప్రకటించింది. దాదాపు 5,000 రకాల మొక్కలకు ఇది నిలయం.
పోడోకార్పస్ నేషనల్ పార్క్, ఈక్వెడార్: అంతరించిపోతున్న ఈక్వెడార్ జాతీయ వృక్షం ఇక్కడే కనిపిస్తుంది. ఈ అడవుల్లోకి అడుగుపెట్టినప్పుడు, ఆండీస్ ప్రాంతానికి ప్రత్యేకమైన ఎలుగు బంటి కూడా ఇక్కడే దర్శనమిస్తుంది.
క్యుటెర్వో నేషనల్ పార్క్, పెరూ: పెరూలోనే అత్యంత ప్రాచీన రక్షిత ప్రాంతమైన ఈ నేషనల్ పార్క్ ప్రి-కొలంబియన్ కట్టడాల అవశేషాలకు నిలయం. ఇక్కడ 88రకాల ఆర్చిడ్స్ మొక్కలతోపాటు, పెరూ హైలాండ్స్‌లో క్లౌడ్‌ఫారెస్ట్‌కు ఇది ప్రసిద్ధి.
సెమిల్లా బెండిటా బొటానికల్ గార్డెన్, పెరూ: స్థానిక పర్యావరణవేత్తల సంరక్షణలో ఉన్న ఈ బొటానికల్ గార్డెన్‌లో 1300 రకాల స్థానిక జాతి మొక్కలు ఉన్నాయి. వీటిలో ఆర్చిడ్స్‌తోపాటు సించోనా మొక్కలు కూడా ఉంటాయి.

ఫొటో సోర్స్, RPBMedia/Getty Images
దట్టమైన రెయిన్ ఫారెస్ట్‌ను చీల్చుకుంటూ, నదులను దాటుతూ, ఆ అడవిలో నివసించే జాగ్వార్‌లను, ప్యూమాలను తప్పించుకుంటూ ముందుకు వెళితే అక్కడ ఒక అరుదైన చెట్టు కనిపిస్తుంది. అదే సించోనా అఫిసినాలిస్. 15మీటర్ల ఎత్తు, మందమైన బెరడుతో ఆ అడవుల్లో నిటారుగా నిలబడ్డ ఒక మణిలాగా కనిపిస్తుంది. ఆండీస్ పర్వత సానువుల్లో పెరిగే ఈ మొక్క చుట్టూ ఎన్నో కథలు అల్లుకుని ఉన్నాయి. అవి మనిషి జీవితాన్నే మార్చేసినట్లు చరిత్ర చెబుతోంది.
''ఇది అందరికీ తెలిసిన చెట్టు కాదు'' అంటారు పెరూ అమెజాన్ అటవీ ప్రాంతంలోని మాడ్రె-డి-డియోస్‌లో పుట్టి పెరిగిన నటాలే కేనలేస్. ''కానీ ఈ చెట్టు నుంచి తీసిన ఒక పదార్ధం మానవ చరిత్రలో లక్షలమంది ప్రాణాలను కాపాడింది'' అని అన్నారు నటాలే.
ఈ చెట్టు బెరడులో క్వినైన్ అనే పదార్ధం ఉంటుంది. ఆ పదార్ధంతోనే ప్రపంచంలో తొలిసారి యాంటి మలేరియా డ్రగ్‌ను తయారు చేశారని ఆమె చెప్పారు. కొన్ని వందలయేళ్ల కిందట ఆవిష్కృతమైన ఈ డ్రగ్‌ను అప్పట్లో అంతా స్వాగతించారు.
దోమకాటు ద్వారా శరీరంలోకి ప్రవేశించే క్రిముల కారణంగా వచ్చే మలేరియా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది ప్రాణాలను బలి తీసుకుంది. రోమన్ సామ్రాజ్యంలో 15 కోట్ల నుంచి 30 కోట్లమందిని ఈ వ్యాధి చంపేసింది. ఈ ఆధునిక 20 శతాబ్దంలో కూడా ప్రపంచంలో సగంమంది జనాభా ఈ వ్యాధి ప్రబలడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు.
మధ్యయుగాలలో 'మల్ అరియా' (చెడు గాలి) వ్యాధి గురించి అనేక అపోహలుండేవి. ఇది గాలి ద్వారా సోకుతుందని, రక్తం కక్కుకుని చనిపోవడం, అవయవాలు ఊడిపోవడం దగ్గర్నుంచి పుర్రెకు రంధ్రం పడుతుందనే వరకు రకరకాల అపోహలుండేవి. అయితే 17వ శతాబ్దంలో ఆండీస్ పర్వత అడవుల్లో ఈ వ్యాధికి ఒక మందు దొరికింది.

ఫొటో సోర్స్, Celso Roldan/Getty Images
ఇక్కడి జానపదుల నమ్మకం ప్రకారం 1631 సంవత్సరంలోనే క్వినైన్‌ను మలేరియాకు మందుగా గుర్తించారు. స్పెయిన్‌కు చెందిన సించోనా అనే పేరున్న యువరాణి పెరూకు చెందిన వైస్రాయ్‌ను వివాహమాడారు. ఆమె ఓసారి తీవ్రమైన చలి జ్వరంతో బాధపడ్డారు. ఆ రెండూ అప్పట్లో మలేరియా ప్రధాన లక్షణాలుగా చెప్పుకునేవారు. ఆమె ఆ జ్వరం నుంచి కోలుకుంటుందన్న ఆశలేనప్పటికీ, జెస్యూట్‌ల మతాధికారి ఇచ్చిన ఒక మిశ్రమాన్ని వైస్రాయ్ తన భార్యకు ఇచ్చారు.
ఆండీస్ అడవుల్లో లభించే ఒక మొక్క బెరడు నుంచి తీసిన పదార్ధం, గులాబీ రేకుల ద్రవం, మరికొన్ని ఎండిన మొక్కల నుంచి తీసిన ద్రావణాలతో ఈ మందును తయారు చేశారు. ఆశ్చర్యకరంగా ఈ ద్రవం తీసుకున్న తర్వాత యువరాణి జబ్బు నుంచి కోలుకున్నారు. యువరాణికి జరిగిన చికిత్సకు గుర్తుగా ఈ మొక్కకు సించోనా అని ఆమె పేరే పెట్టారు. ఇప్పుడు ఈ మొక్క పెరూ, ఈక్వెడార్ దేశాల జాతీయ వృక్షం.
అయితే చాలామంది చరిత్రకారులు ఈ కథను కల్పితమంటూ కొట్టిపారేశారు. కాకపోతే అందులో కొంతభాగం వాస్తవమేనని నమ్ముతారు. క్వినైన్ అనేది సించోనా మొక్క బెరడు నుంచి తీసిన ఆల్కలాయిడ్ పదార్ధం అన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ పదార్ధానికి మలేరియాకు కారణమైన బ్యాక్టీరియాను చంపగల శక్తి ఉందని గుర్తించారు. స్పెయిన్‌కు చెందిన క్రైస్తవ మతాధికారులైన జెస్యూట్‌లు ముందుగా గుర్తించినట్లు చెబుతారు. అయితే '' స్పెయిన్ దేశస్తులు ఇక్కడికి రాక ముందే క్వినైన్ గురించి పెరూ, ఈక్వెడార్, బొలీవియా ప్రాంతంలో నివసించే క్వెచా, క్యానరీ, చిము అనే తెగలకు చెందిన ప్రజలకు తెలుసు'' అన్నారు కేనలేస్.
''స్పెయిన్ జెస్యూట్స్‌కు ఈ చెట్టు బెరడును పరిచయం చేసింది వాళ్లే'' అని అంటారామె. జెస్యూట్స్ ఆ బెరడును ప్రాసెస్ చేసి సులభంగా జీర్ణం చేసుకోగల పౌడర్‌గా మార్చారు. దీన్నే జెస్యూట్ పౌడర్ అని కూడా పిలిచేవారు. దీని గురించి తెలిసిన తర్వాత మలేరియాకు అద్భుతమైన మందు దొరికిందని అప్పట్లో యూరోపియన్లు రాశారు. 1640నాటికి జెస్యూట్‌లు ఈ చెట్టు బెరడును యూరప్‌కు రవాణా చేయడానికి ప్రత్యేక ట్రేడ్ రూట్లను కూడా సిద్ధం చేశారు.

ఫొటో సోర్స్, ajiravan/Getty Images
ఫ్రాన్స్‌లో అప్పటి చక్రవర్తి పధ్నాల్గవ లూయికి జ్వరం వచ్చినప్పుడు ఈ మందును వాడారు. రోమ్‌లో పోప్ వ్యక్తిగత వైద్యుడు దీన్ని ప్రత్యేకంగా పరిశీలించి చూశారు. జెస్యూట్‌లు ఈ మందును ప్రజలకు ఉచితంగా పంచేవారు. అయితే ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఎక్కువగా ఉండే ఇంగ్లాండ్‌లో ఈ మందు మీద అనుమానాలు ఉత్పన్నమయ్యాయి.
ఈ పౌడర్ క్రైస్తవ మత పెద్దలను చంపడానికి ఉపయోగించే 'పాపల్ విషం' అంటూ కొందరు ఇంగ్లాండ్ వైద్యులు దీన్ని తిరస్కరించారు. జెస్యూట్ పౌడర్‌ను ఔషధంగా తీసుకోడానికి నిరాకరించిన ఆలివర్ క్రాంవెల్ చివరకు మలేరియా జ్వరంతో మరణించారు. అయితే 1677లో లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ తమ ఆసుపత్రులలో అధికారికంగా ఈ మందును పేషెంట్లకు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఈ సించోనా క్రేజ్ ఎంత వరకు వెళ్లిందంటే యూరోపియన్లు ఈ ఫీవర్ మొక్కను కనుక్కోడానికి ప్రత్యేకంగా మనుషులను నియమించుకున్నారు. వాటి బెరడును తీసి పెరూ నుంచి ఓడల ద్వారా యూరప్‌కు తరలించేవారు. ఈ బెరడుకు ఉన్న డిమాండ్‌ను గమనించాక, ఆండీస్ అడవులను స్పెయిన్ 'ప్రపంచ ఫార్మసీ'గా మార్చేసింది. అప్పటి నుంచే ఈ మొక్క అంతరించి పోవడం మొదలుపెట్టిందని కేనలేస్ అంటారు.

ఫొటో సోర్స్, Universal History Archive/Getty Images
19 శతాబ్దంలో తాము ఆక్రమించిన కాలనీల్లోని సైన్యం జ్వరాలతో బాధపడుతుండటంతో యూరోపియన్లకు ఈ మొక్క అవసరం బాగా పెరిగింది. ''ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడంలో ఈ క్వినైన్ మొక్కను సరఫరా చేయడం వ్యూహాత్మకంగా, ఒక కీలక ప్రయోజనంగా మారింది'' అని మలేరియా స్పెషలిస్ట్ డాక్టర్ రోహన్ దేబ్‌రాయ్ వ్యాఖ్యానించారు. దీంతో సించోనా ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువుగా మారింది.
''వలస రాజ్యాలలో పని చేసే ఐరోపా సైనికులు తరచూ మలేరియా జ్వరం బారిన పడేవాళ్లు'' అని దేబ్‌రాయ్ అన్నారు. '' జ్వరం నుంచి బైటపడి, యుద్ధాలలో గెలవడానికి క్వినైన్ వారికి బాగా ఉపయోగపడింది'' అని రాయ్ అంటారు.
సించోనా వల్ల ఇండోనేసియాలో డచ్‌వారు, అల్జీరియాలోని ఫ్రెంచ్‌వారు, ఇండియా, జమైకా, ఆగ్నేయాసియా, పశ్చిమ ఆఫ్రికాలలో బ్రిటీష్ వారు ఎక్కువగా ప్రయోజనం పొందగలిగారు. వలస కాలనీలో తమ సైన్యం వైద్య అవసరాల కు క్వినైన్‌ను దిగుమతి చేసుకోడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1848-1861 మధ్య కాలంలో ప్రతియేటా సుమారు 6.4 మిలియన్ యూరోల బడ్జెట్‌ను కేటాయించింది.
అందుకే బ్రిటీష్ వలస రాజ్య విస్తరణ గురించి చెప్పేటప్పుడు చరిత్రకారులు తరచూ క్వినైన్‌ను ప్రస్తావిస్తుంటారు.

ఫొటో సోర్స్, Dizzy/Getty Images
సించోనా మొక్కలో కేవలం బెరడు మాత్రమే పనికొచ్చే పదార్ధం కాదు. ఇది బాగా డిమాండ్ ఉన్న వస్తువు. ''సౌత్ అమెరికా మీద ఆధారపడకుండా, బ్రిటీష్ వారు సించోనా మొక్కను తమ వలస రాజ్యాల్లో పెంచే ప్రయత్నం చేశారు'' అని దేబ్‌రాయ్ అన్నారు. కానీ దానికి మంచి విత్తనాన్ని ఎన్నుకోవడం చాలా కష్టమైన పని. 23 రకాల సించోనా మొక్కల్లో ఒక్కో మొక్కల్లో ఒక్కోరకం క్వినైన్ లభిస్తుంది. ఏది బాగా ఉపయోగపడే సించోనా మొక్క అన్నది గుర్తించడంలో స్థానికులు యూరోపియన్లకు బాగా సహకరించారు.
1850ల నాటికి, బ్రిటీష్‌వారు దక్షిణ భారతదేశంలో ఈ మొక్కను పెంచడంలో సఫలమయ్యారు. అప్పట్లో ఈ ప్రాంతంలో మలేరియా సమస్య ఎక్కువగా ఉండేది. స్థానికంగా తయారైన క్వినైన్‌ను తమ సైనికులకు, అధికారులకు వైద్యంగా అందించేవారు బ్రిటీషర్లు. జిన్‌తో కలిపి తీసుకుంటే ఇది మరింత రుచిగా ఉంటుందని ప్రచారం జరిగింది. దీని ఆధారంగానే మొట్టమొదటి టానిక్ వాటర్ రూపుదిద్దుకుంది.
ఇప్పటికీ కొన్ని టానిక్కుల్లో కొద్దిపాటి క్వినైన్ ఉంటుంది. అయితే 'జస్ట్ ది టానిక్' పుస్తక సహ రచయిత కిమ్‌వాకర్ మాత్రం ఈ ఇది ఓ కల్పిత కథగా కొట్టిపారేశారు. ''అప్పట్లో వారి చేతికి ఏ ద్రవం అందుబాటులో ఉంటే అందులో కలుపుకుని తాగారు. అది బ్రాందీ కావచ్చు, రమ్ కావచ్చు, సారాయి కూడా కావచ్చు'' అని అన్నారామె.

ఫొటో సోర్స్, Hulton Deutsch/Getty Images
అయితే క్వినైన్ ఎక్కువసేపు శరీరంలో ఉండదని, దీన్ని టానిక్‌లాగా, లేదంటే జిన్నులో కలిపి తీసుకోవడం వల్ల మలేరియానివారణ సాధ్యంకాదని ష్లాజెనాఫ్ అంటారు. అయితే జిన్, టానిక్ సిద్ధాంతం విన్‌స్టన్ చర్చిల్‌లాంటి వాళ్లను కూడా నమ్మించగలిగింది. ఆయన ఒకానొక సందర్భంలో '' బ్రిటీష్ సామ్రాజ్యంలోని డాక్టర్లకన్నా ఇంగ్లీషువాళ్ల ప్రాణాలను, మెదళ్లను ఈ మందు ఎక్కువగా రక్షించింది'' అని ఆయన కామెంట్ చేశారు.
ఏదేమైనా అది జిన్ అయినా, టానిక్ అయినా చివరకు అది ఫీవర్ ట్రీ చుట్టూనే తిరిగింది. ఈ రోజుల్లో అమెరికా తయారీ పిస్కోసోర్‌ను పెరూలో బాగా పాపులరైన కాక్‌టైల్‌గా చెబుతారు. కానీ అందులో కూడా బాగా ఫేమస్ అయిన కాక్‌టెయిల్‌గా క్వినైన్ ఫ్లేవర్‌తో వచ్చే పిస్కో టానిక్‌ను చెప్పుకుంటారు. ఇది కాస్త చేదుగా ఉంటుంది. దీన్ని స్థానికంగా పండే పర్పుల్ కార్న్ 'మెయిజ్ మొరాడో'తో కలిపి పిస్కో మొరాడా అనే టానిక్‌లా తయారు చేస్తారు.
కంపారీ, పిమ్స్ లేదా ప్రెంచ్ సారాయి లిల్లెట్ (జేమ్స్ బాండ్ వెస్పర్ మార్టినిలో దీన్నే వాడతారు)లాంటి లిక్కర్లను రుచి చూసినప్పుడు అందులో క్వినైన్ టేస్ట్ కలుస్తుంది. స్కాట్‌లాండ్ ఫేవరేట్ నేషనల్ డ్రింక్ ఇర్న్-బ్రూలో కూడా ఇది ఉంటుంది. ఈ డ్రింక్ క్వీన్ ఎలిజబెత్‌కు అత్యంత ఇష్టమైనదిగా చెబుతారు. ఉత్తర అమెరికా కాలనీలలోని ఫ్రెంచ్ సైన్యాలకు అవసరమైన మంచి మలేరియా మందును తయారు చేయడంలో భాగంగా జిన్, డ్యుబొన్నెట్‌లాంటి మద్యం రకాలను కూడా ఫ్రెంచివారే రూపొందించారు.

ఫొటో సోర్స్, Christophel Fine Art
1970 తర్వాత ఆర్టెమిసిన్ అనే మందు రావడంతో క్వినైన్ వెనకబడిపోయింది. ఈ మందు మలేరియాకు అత్యంత ప్రభావవంతమైనదిగా గుర్తించారు. అయితే క్వినైన్‌కు సంబంధించిన చరిత్ర జ్జాపకాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇండోనేసియలోని బాన్‌డుంగ్‌ను''ప్యారిస్ ఆఫ్ జావా'' అని పిలుస్తారు. డచ్ వారు ఈ పోర్టును క్వినైన్ రవాణాకు కీలకమైన ప్రాంతంగా మార్చుకున్నారు. ఇప్పటికీ అక్కడ అనేక హోటళ్లు, బాల్ రూమ్స్, అందమైన కట్టడాలు కనిపిస్తాయి.
ఇండియాలోలాగే హాంకాంగ్, సియర్రాలియోన్, కెన్యా, శ్రీలంకల్లో స్థానికులు ఇంగ్లీషు ఎక్కువగా నేర్చుకోడానికి, మొరాకో, ట్యూనిషియా, అల్జీరియాల్లో ఫ్రెంచ్ భాష ఎక్కువగా ప్రాచుర్యం పొందటానికి క్వినైన్ రవాణాయే కారణం. స్పానిష్ భాషలో ''సెర్మాస్ మాలో క్యూలా క్వినా'' అనే నానుడి ఒకటి ఉంది. ఈ నానుడికి ''క్వినైన్‌కన్నా చేదు'' అని అర్ధం.
1850లనాటికి పెరూ, బొలీవియాలో క్వినైన్ ఎగుమతిలో గుత్తాధిపత్యాన్ని సాధించగలిగాయి. బొలీవియాలోని లాపాజ్ పట్టణంలో ప్రముఖ చర్చితోపాటు అనేక నిర్మాణాలు సించోనా బెరడు కారణంగా లభించిన సంపదతోనే నిర్మించగలిగారు. బొలీవియా సంపాదించే పన్నుల్లో 15శాతం సించోనా ఎగుమతుల నుంచే వస్తాయి.

ఫొటో సోర్స్, rchphoto/Getty Images
అయితే శతాబ్దాలుగా సించోనా మొక్క బెరడుకు డిమాండ్ కొనసాగుతుండటంతో ఇప్పుడు ఈ చెట్టు అది పుట్టిన ప్రాంతంలో అంతరించిపోతున్న మొక్కగా మారింది. 1805నాటి రికార్డుల ప్రకారం 25,000 సించోనా మొక్కలు ఈక్వెడార్ ఆండీస్ అడవుల్లో ఉండేవి. అదే ప్రాంతాన్ని ఇప్పుడు పోడోకార్పస్ నేషనల్ పార్క్ గా మార్చారు. ఇప్పుడు అందులో కేవలం 29 సించోనా చెట్లు ఉన్నాయి.
ఆండీస్ ప్రాంతంలో క్వినైన్ ఎక్కువగా ఉన్న సించోనా జాతులు అంతరించి పోవడంతో ఆ మొక్కల జన్యుక్రమం మారిపోయిందని కేనలేస్ అంటున్నారు. దీనివల్ల మలేరియాను తగ్గించే శక్తి కూడా వాటికి తగ్గిపోయిందని ఆమె చెబుతారు.
మనుషుల వల్ల ఈ మొక్కల జన్యువులలో వచ్చిన మార్పులను గుర్తించడమే ఇప్పుడు కేనలేస్ పరిశోధానాంశం. లండన్ సమీపంలోని కివ్‌లో ఉన్న రాయల్ బొటానికల్ గార్డెన్‌లో భద్రపరిచిన సించోనా మొక్కల బెరడులను ఆమె పరిశీలిస్తున్నారు. ''అతిగా సాగు చేయడం వల్ల కూడా సించోనా మొక్కల్లో క్వినైన్ శాతం తగ్గిపోయింది'' అన్నారు కేనలేస్.
ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో స్థానిక వృక్ష పరిరక్షణ సంస్థలు రంగంలోకి దిగాయి. సెమిల్లా బెండిటా అనే పర్యావరణ పరిరక్షణ సంస్థ పెరూ 200వ శతాబ్ది వేడుకలు జరగబోయే 2021 సంవత్సరంలో 2021 సించోనా విత్తనాలను నాటాలని నిర్ణయించింది. ష్లాజెనాఫ్‌లాంటి సైంటిస్టులు కూడా ఆండీస్ ప్రాంతంలో మళ్లీ జీవవైవిధ్యం కాపాడటానికి మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉందని అంటున్నారు.
''జీవవైవిధ్యం, మానవ ఆరోగ్యం కలిసి పనిచేయాల్సిన అవసరముందని క్వినైన్ గాథ మనకు చెబుతుంది'' అన్నారు ష్లాజెనాఫ్. మొక్కల నుంచి వచ్చే ఔషధాలను కొందరు ప్రత్యామ్నాయ ఔషధాలుగా భావిస్తుంటారు. కానీ మానవజాతి చరిత్రను మలుపుతిప్పిన కొన్ని మొక్కలకు మనం రుణపడి ఉండాలి'' అంటారు ష్లాజెనాఫ్.
ఇవి కూడా చదవండి:
- మలేరియా: దోమలపై దోమలతో యుద్ధం
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
- టైఫాయిడ్ వ్యాప్తికి కారణమైనందుకు 26 ఏళ్లపాటు ఓ దీవిలో మహిళ బందీ
- హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








