సుఖవ్యాధులు: లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎన్ని రకాలు, లక్షణాలేంటి, అవి ఎంత ప్రమాదం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా రోజుకు పది లక్షల మందికి పైగా ప్రజలు లైంగికంగా సంక్రమించే వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది.
మందులకు లేదా చికిత్సకు స్పందించకపోవడం STD (Sexually transmitted diseases)లు లేదా STI (Sexually transmitted infections) లతో వచ్చే ప్రధాన సమస్య అని, సుఖవ్యాధులను అదుపు చేయడానికి ఇదే పెద్ద అడ్డంకి అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
సుఖవ్యాధులు లైంగిక సామర్థ్యం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయని, సంతానలేమి, గర్భధారణలో సమస్యలు, క్యాన్సర్, హెచ్ఐవీ/ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
సుఖవ్యాధులు ఎలా సోకుతాయి?
యోని, మల ద్వారం, నోటి (ఓరల్) సెక్స్ ప్రక్రియల ద్వారా 30 కన్నా ఎక్కువ బ్యాక్టీరియాలు, వైరస్‌లు, పరాన్నజీవులు (ఫంగస్) ఒకరి నుంచి మరొకరికి చేరుతాయి.
కొన్ని రకాల సుఖవ్యాధులు తల్లి నుంచి బిడ్డకు సోకవచ్చు. గర్భం దాల్చినప్పుడు, కాన్పు సమయంలో లేదా తల్లి పాల ద్వారా సోకవచ్చు.
బ్యాక్టీరియా, ఫంగస్ వలన సోకిన సుఖవ్యాధులకు చికిత్స ఉంది. వైరల్ వ్యాధులకు చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రధానంగా ఎనిమిది రకాల వ్యాధికారకాల ద్వారా సుఖవ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి.
వీటిలో నాలుగు రకాల వ్యాధులకు చికిత్స ఉంది. అవి.. క్లమిడియా, గనోరియా, సిఫిలిస్, ట్రికోమోనియాసిస్.
మిగితా నాలుగు రకాల సుఖవ్యాధులకు చికిత్స లేదు. అవి.. హెపటైటిస్ బీ, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV లేదా హెర్పెస్ ), హెచ్ఐవీ (HIV), హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV). వీటి లక్షణాలను అదుపుచేసేందుకు వైద్యులు కొన్ని మందులు సూచిస్తారు.
మహిళలలో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి, పురుషులతో పురుషులు సంభోగించినప్పుడు మలద్వార క్యాన్సర్ సోకడానికి HPV ప్రధాన కారణం.
ఇవి కాకుండా, సెక్స్ ద్వారా సంక్రమించడానికి అవకాశం ఉన్న కొత్త వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు కొన్ని ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఉదాహరణకు, మంకీపాక్స్, షిగెల్లా సోనీ, నైసిరియా మెనింజైటిడిస్, ఎబోలా, జికా, నిర్లక్ష్యం చేసిన సుఖవ్యాధులు మళ్లీ తిరగబెట్టడం, లింఫోగ్రానులోమా వెనెరియం లాంటివి.
ఇవన్నీ కూడా సుఖవ్యాధుల నియంత్రణ, నివారణకు సవాళ్లుగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సుఖ వ్యాధులు, వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
క్లమిడియా
క్లమిడియా వ్యాధి క్లమిడియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఇది సాధారణంగా యువతలో కనిపించే సుఖవ్యాధి.
క్లమిడియా సోకినవారిలో 80 శాతానికి ఎటువంటి లక్షణాలు కనిపించవని, అందుకే రోగ నిర్థరణ, చికిత్స కష్టమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
దీనికి చికిత్స చేయించుకోకపోతే, బ్యాక్టీరియా జననేందియాల పైభాగాలకు పాకవచ్చు. ఇది పెల్విక్ ఇంఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ), సంతాలేమి, మహిళలలో ఎక్టోపిక్ ప్రెగ్నన్సీకి దారితీయవచ్చు.
క్లమిడియా తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. దీని వల్ల నవజాత శిశువులలో కండ్లకలకలు, క్లమిడియల్ న్యూమోనియా రావచ్చు.
క్లమిడియా ఉన్నవారికి గర్భాశయ నియోప్లాసియా, హెచ్ఐవీ సోకే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది ఐసీఎంఆర్ చెబుతోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుఖవ్యాధులు, వైరల్ STDలు క్రమంగా పెరుగుతున్నాయని, బ్యాక్టీరియా STDలలో ముఖ్యంగా క్లమిడియా ఎక్కువగా కనిపిస్తోందని, దీనిని గుర్తించి వెంటనే చికిత్స చేయించుకోవడం మేలని చేస్తుందని ఐసీఎంఆర్ సూచించింది.
అయితే, దేశంలో క్లమిడియా వ్యాధి సంక్రమణపై సరైన డాటా అందుబాటులో లేదని ఐసీఎంఆర్ తెలిపింది.
సాధారణ లక్షణాలు
- మహిళల్లో గర్భాశయ వాపు
- పురుషులలో మూత్రనాళం వాపు
- జననేంద్రియాల వద్ద ఇన్ఫెక్షన్లు
గనోరియా
గనోరియా వ్యాధి నైసిరియా గనోరియాయి లేదా గనోకాకస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఈ బ్యాక్టీరియా యోని లేదా పురుషాంగం నుంచి వెలువడే స్రవాలలో కనిపిస్తుంది.
ఇది మహిళలలో గర్భాశయ ముఖద్వారం, మలాశయం, కొన్నిసార్లు గొంతు, కళ్లను ప్రభావితం చేస్తుందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది
రక్షణ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం ద్వారా గనోరియా సులువుగా వ్యాపిస్తుంది. అలాగే, వైబ్రేటర్లు, సెక్స్ టాయ్స్‌ను శుభ్రపరచకుండా, కండోమ్ తొడగకుండా ఒకరిది ఒకరు వాడినా కూడా గనోరియా సోకుతుంది.
తల్లి నుంచి బిడ్డకు కూడా సోకవచ్చు. బిడ్డ పుట్టకముందే ఈ వ్యాధికి చికిత్స చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
లక్షణాలు:
- యోని లేదా పురుషాంగం నుంచి ముదురు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో వెలువడే స్రావాలు
- మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి
- స్త్రీలలో పీరియడ్స్ రాకుండానే రక్తస్రావం
కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.
మరికొందరికిి క్లమిడియా, గనోరియా రెండూ కలిపి సంక్రమించవచ్చని, దీనికి వెంటనే చికిత్స చేయించుకోకపోతే సమస్య తీవ్రమవుతుందని నేషనల్ హెల్త్ మిషన్ గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సిఫిలిస్
సిఫిలిస్ అనేది స్పిరోచెట్ బాక్టీరియం ట్రెపోనెమా పాలిడమ్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే లైంగిక సంక్రమణ వ్యాధి. ఇది తీవ్ర అనారోగ్యానికి, మరణాలకు దారితీయవచ్చని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది.
లైంగిక సంబంధాలు, చర్మంపై గాయాల నుంచి కారే స్రావాలు, రక్తమార్పిడి ద్వారా, తల్లి నుంచి బిడ్డకు సిఫిలిస్ సోకుతుంది.
సిఫిలిస్‌కు చికిత్స చేయించుకోకపోతే చాలా ఏళ్ల వరకు బాధిస్తుంది. ఇందులో దశలు కూడా ఉంటాయి.
మొదటి దశ - ప్రైమరీ సిఫిలిస్: ఈ దశలో లక్షణాలు పెద్దగా బయటకు కనిపించవు. కానీ, కొందరిలో జననేంద్రియాల దగ్గర వాపు, కొన్నిసార్లు నోటి చుట్టూ పొక్కులు, వాపు కనిపించవచ్చు. ఈ వాపు రెండు నుంచి ఆరు వారాల వరకు ఉంటుంది.
రెండవ దశ - సెకండరీ సిఫిలిస్: చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి మొదలైన లక్షణాలు కొన్ని వారాల వరకు కనిపిస్తాయి. ఆపై, ఈ లక్షణాలు మాయమైపోవచ్చు. లక్షణాలు లేకపోవడం లేదా బయటకు కనిపించని రహస్య లక్షణాలతో ఈ దశ కొన్నేళ్ల పాటు కొనసాగవచ్చు. తరువాత సిఫిలిస్ ప్రమాదకరమైన మూడవ దశకు చేరుకుంటుంది.
మూడవ దశ - టెర్షియరి సిఫిలిస్: చికిత్స చేయించుకోనివారిలో మూడొంతుల మంది ఈ మూడవ దశకు చేరుకుంటారు. ఈ దశలో శరీరానికి తీవ్ర హాని కలిగుతుంది.
కాబట్టి, ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, BSIP/GETTYIMAGES
ట్రికోమోనియాసిస్
ఈ వ్యాధి ట్రికోమోనియాసిస్ వజినాలిస్ అనే పరాన్నజీవి వలన సోకుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన ఒక నెలలోపే ట్రికోమోనియాసిస్ సంక్రమిస్తుంది. కానీ, సగం మందికి లక్షణాలు బయటపడకపోవచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
స్త్రీలలో లక్షణాలు:
- స్త్రీలలో అసాధారణ స్థాయిలో యోని స్రావాలు, ముదురు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో నురుగులా ఉండే స్రావాలు
- స్రావాల దుర్వాసన
- యోని చుట్టూ వాపు, దురద, మంట
- సెక్స్‌లో పాల్గొనేటప్పుడు, మూత్ర విసర్జనలో అసౌకర్యం, నొప్పి
పురుషులలో లక్షణాలు:
- స్కలనం, మూత విసర్జన సమయంలో నొప్పి
- తరచుగా మూత్ర విసర్జన
- పురుషాంగం నుంచి తెల్లటి పలుచటి స్రావాలు
- పురుషాంగం మొదట్లో ఎర్రబడడం, వాపు, దురద

ఫొటో సోర్స్, BSIP/GETTYIMAGES
హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV)
హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ దీన్నే జననేంద్రియ హెర్పెస్ అంటారు. యువతలో కనిపించే సాధారణ సుఖవ్యాధి.
ఇది వైరల్ వ్యాధి. యోని, మలద్వారం, ఓరల్ సెక్స్ ద్వారా సంక్రమిస్తుంది. దీర్ఘకాలం కొనసాగుతుంది. లక్షణాలు తగ్గిపోయినట్టు అనిపించినప్పటికీ మళ్లీ వస్తుంది.
ఈ ఇన్ఫెక్షన్‌కు రెండు రకాల హెర్పెస్‌లు కారణం.
1) హెర్పెస్ టైప్ 1- నోటి అల్సర్లను కలుగజేస్తుంది.
2) హెర్పెస్ టైప్ 2- జననేంద్రియాల వద్ద అల్సర్లు వస్తాయి.
చాలామందిలో ఈ హెర్పెస్ వైరస్ శరీరం లోపల ఉన్నా సరే, ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ, వారితో ఎవరైనా లైంగికంగా కలిస్తే వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంటుంది.
హెర్పెస్ టైప్ 1
జననాంగాల హెర్పెస్ ఇన్ఫెక్షన్ మొదటి సారి కలిగినపుడు దానిని ప్రాథమిక ఇన్ఫెక్షన్ ( ప్రైమరీ హెర్పెస్ ) అంటారు.
- జననేంద్రియాలు, మలద్వారం, తొడల దగ్గర చిన్న చిన్న పొక్కులు, అవి పగిలి రసి కారడం
- జనేంద్రియాల చుట్టూ మంట, దురద, జలదరింపు
- మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి
- స్త్రీలలో అసాధారణ యోని స్రావాలు, దుర్వాసన
వీటిలో ఏ లక్షణాలు కనిపించినా జననేంద్రియ హెర్పెస్‌గా అనుమానించి వెంటనే డాక్టరును సంప్రదించాలి. ఇది ప్రాథమిక ఇన్ఫెక్షన్ కావచ్చు.
జననేంద్రియాల చుట్టూ పొక్కులు బయటికి కనిపించడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. అంతకుముందు కొంత కాలం పాటు సెక్స్‌లో పాల్గొనకపోయినా, పొక్కులు కనిపించగానే డాక్టరును కలవడం మంచిదని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
హెర్పెస్ టైప్ - 2
ఇది వ్యాధి తగ్గిన కొన్నాళ్లకు మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే దశ.
- నరాల్లో నొప్పి
- చర్మం స్పర్శ కోల్పోవడం
- చర్మం మీద పుండ్లు, నీటి పొక్కులు
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. పొక్కుల నుంచి శాంపిల్ తీసుకుని పరీక్షిస్తారు. లేదా రక్తపరీక్ష చేసి ప్రాథమిక హెర్పెస్ వైరస్ దశా లేక హెర్పెస్ టైప్ -2 అన్నది నిర్థరిస్తారు.
హెర్పెస్ తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంది. అబార్షన్ లేదా గర్భంలోనే శిశువు చనిపోవడం, అవయవ లోపాలతో పుట్టడం, శిశువు చర్మం పైన, కంటిలోను కురుపులు రావచ్చు. కాన్పు సమయంలో బిడ్డకు నియోనాటల్ హెర్పెస్ సోకవచ్చు.
అందుకే గర్భం దాల్చకముందే పరీక్షలు చేయించుకుని, శిశువుకు సోకకుండా చికిత్స చేయించుకోవడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV)
హ్యూమన్ పాపిలోమావైరస్ అనేది చాలా సాధరణమైన వైరస్ గుంపు. ఇందులో 100కు పైగా రకాలు ఉన్నాయి. చాలామందికి ఈ వైరస్ ఎటువంటి ఇబ్బంది కలిగించదు కానీ, కొన్ని రకాల వైరస్ జననేంద్రియాల వద్ద పుండ్లు, క్యాన్సర్‌కు కారకం కావచ్చని ఎన్‌హెచ్‌ఎస్ చెబుతోంది.
హ్యూమన్ పాపిలోమావైరస్ చర్మంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
ఈ వ్యాధికి చాలామందిలో లక్షణాలు బయటపడవు కాబట్టి వైరస్ సోకలేదనుకునే ప్రమాదం ఉంది.
హ్యూమన్ పాపిలోమావైరస్ ప్రధానంగా స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అలాగే, మలద్వార క్యాన్సర్, యోని క్యాన్సర్ కూడా రావచ్చు.
సోకిందని తెలీదు కాబట్టి చాలా ఏళ్లుగా ఇది శరీరంలో ఉండవచ్చు.
ఈ వ్యాధికి రక్తపరీక్ష లేదు. గర్భాశయం, యోని పరీక్షల ద్వారా మాత్రమే దీన్ని గుర్తించగలరు.
ఇది వైరల్ వ్యాధి కాబట్టి, దీనికి శాశ్వత చికిత్స లేదు. లక్షణాలు కనిపించినప్పుడు వాటిని తగ్గించేందుకు డాక్టర్లు మందులు సూచిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
హెపటైటిస్ బీ
ఇది కూడా వీర్యం, యోని స్రావాలు, రక్తమార్పిడి ద్వారా సోకే వ్యాధి. తల్లినుంచి బిడ్డకు సోకవచ్చు.
ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హెపటైటిస్ బీ ఎక్కువగా ఉందని ఎన్‌హెస్ఎస్ చెబుతోంది.
హెపటైటిస్ బీ వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల ఈ వైరస్ సోకకుండా నివారించవచ్చు.
లక్షణాలు
- తీవ్ర జ్వరం
- అలసట
- కడుపు పైభాగంలో నొప్పి
- ఒంట్లో నలతగా ఉండడం
- చర్మంపై దద్దుర్లు
- పచ్చ కామెర్లు
హెపటైటిస్ బీ వైరస్ నెల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది. చాలామందిలో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఆరు నెలలు దాటినా లక్షణాలు కనిపిస్తుంటే క్రానిక్ హెపటైటిస్ బీ ఉందని అర్థం. ఇది కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
హెపటైటిస్ బీ వలన 2019లో ప్రపంచవ్యాప్తంగా 8,20,000 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది.
సుఖవ్యాధులపై అపోహలు
సుఖవ్యాధులు కేవలం లైంగిక చర్యల వలన, తల్లి నుంచి బిడ్డకు మాత్రమే సోకుతాయి.
ఈ కింది వాటి ద్వారా వ్యాపించవు.
- ముద్దు పెట్టుకోవడం
- కౌగలించుకోవడం
- కాఫీ, టీ కప్పులు, తినే కంచాలు షేర్ చేసుకోవడం
- టాయిలెట్ సీట్
సుఖవ్యాధుల నివారణ మార్గాలు
కండోమ్ వాడడం వలన చాలావరకు రక్షణ లభిస్తుందని, సుఖవ్యాధులు సోకకుండా నివారించవచ్చని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.
అయితే, జననేంద్రియాల దగ్గర పుండ్లు, పొక్కులు ఉంటే కండోమ్ కూడా కాపాడలేదు. వ్యాధి సంక్రమిస్తుంది.
రెండు రకాల సుఖవ్యాధులకు వ్యాక్సీన్ ఉంది. హెపటైటిస్ బీ, హ్యూమన్ పాపిలోమా వైరస్‌లకు వ్యాక్సీన్ ఉంది.
ఈ రెండు వ్యాక్సీన్ల వలన సుఖవ్యాధుల వ్యాప్తిని కొంతవరకు అడ్డుకోగలుగుతున్నామని, గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించడానికి హ్యూమన్ పాపిలోవైరస్ వ్యాక్సీన్ సహకరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
2020 నాటికి 111 దేశాల్లో ముఖ్యంగా ఎగువ, మధ్య ఆదాయ దేశాలలో సాధారణ వ్యాక్సీన్లతో పాటు హ్యూమన్ పాపిలోవైరస్ వ్యాక్సీన్ ఇచ్చే విధానం అమలులోకి వచ్చిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
జననేంద్రియ హెర్పెస్, హెచ్ఐవీలకు వ్యాక్సీన్లు కనుగొనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
పురుషులు స్వచ్ఛందంగా సున్తీ చేయించుకోవడం, భాగస్వాములిద్దరూ పరీక్షలు చేయించుకోవడం ద్వారా సుఖవ్యాధులు సోకకుండా నివారించవచ్చని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
'వీటి గురించి బయటకు చెప్పరు.. డాక్టరుకి చూపించుకోవడానికి సిగ్గుపడతారు'
సుఖవ్యాధుల విషయంలో ప్రధానమైన సమస్య అవగాహన లేకపోవడం, బయటికి చెప్పడానికిగానీ, డాక్టరుకి చూపించుకోవడానికి సిగ్గుపడతారని హైదరాబాదుకి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ కేవీ స్నేహలత చెప్పారు.
"ఈ వ్యాధి పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపు, న్యూనత కారణంగా చాలామంది బయటకి చెప్పరు. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లరు. ఇది చాలా పెద్ద సమస్య. అలాగే, చాలామందికి లైంగికంగా సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన లేదు. అంతే కాకుండా, భాగస్వామిని డాక్టరు దగ్గరికి తీసుకువెళ్లరు, పరీక్షలు చేయించరు. ఈ వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఇవే ప్రధాన కారణాలు" అని డాక్టర్ స్నేహలత అన్నారు.
కొన్ని రకాల వ్యాధులకు పూర్తి చికిత్స ఉందని, వ్యాధి సోకిన వెంటనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే వ్యాధి పూర్తిగా నయం చేయవచ్చని ఆమె చెప్పారు. కొన్ని రకాల వ్యాధులలో ఉదాహరణకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ముదరకుండా నిరోధించవచ్చని చెప్పారు.
"బ్యాక్టీరియా, ఫంగస్ వలన వచ్చే వ్యాధులకు చికిత్స ఉంది. జననేంద్రియాల దగ్గర పుండ్లు, దురద, మంట ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టరుని కలవాలి. ఒక్కోసారి కొంత కాలం వరకు లక్షణాలు బయటపడవు. ఒకరి కన్నా ఎక్కువమందితో లైంగిక సంబంధాలు ఉన్నవారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. లేదంటే వారికి తెలియకుండానే ఈ వ్యాధులను వ్యాప్తి చేస్తారు" అని ఆమె వివరించారు.
ఆడవారికి ఈ సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతాయని డాక్టర్ కేవీ స్నేహలత అన్నారు.
"లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఆడ, మగ తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. పురుషులకు సమాజంలో చాలా వెసులుబాట్లు ఉన్నాయి. కాబట్టి వారికి కొంత త్వరగా వైద్యులను సంప్రదించే అవకాశం ఉంటుంది. సకాలంలో చికిత్స అందుతుంది. కానీ, మహిళలకు అలా కాదు. వాళ్లు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచేలా బట్టలు వేసుకుంటారు. గాలి ఆడదు. మనదేశంలో అన్నిచోట్లా బాత్రూంలు అందుబాటులో ఉండవు. జనేంద్రియాలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకునే వీలు ఉండదు. గాలి ఆడక, ఆ భాగాల వద్ద పొడిబారకుండా తడిగా ఉంటే సమస్య మరింత ఉధృతమవుతుంది.
ఇది కాకుండా, వైరస్ ద్వారా సోకే సుఖవ్యాధులకు చికిత్స ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో పూర్తిగా నయం అయే అవకాశం ఉండదు. కానీ, లక్షణాలు తగ్గించుకునేందుకు మందులు ఉంటాయి.
ఆడవాళ్లకు గర్భాశయ సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే, సుఖవ్యాధులతో బాధపడుతున్న వారిలో హెచ్ఐవీ సోకే ప్రమాదం అత్యధికం" అని డాక్టర్ స్నేహలత వివరించారు.
లైంగికంగా సంక్రమించే వ్యాధుల నిర్థరణకు నేరుగా జననేంద్రియాలను పరీక్షించడం, వాటి నుంచి కారే స్రావాల రంగు, వాసనలను పరీక్షించడం, మైక్రోస్కోప్ ద్వారా చూసి పరీక్ష చేయడం, రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు చేస్తారని ఆమె చెప్పారు.
సుఖవ్యాధుకు రాకుండా నివారించాలంటే ఈ కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని డాక్టర్ స్నేహలత సూచించారు.
1. సురక్షితమైన శృంగారం, కండోమ్ వాడటం
2. అసాధారణ లైంగిక ప్రవర్తనలను నివారించడం
3. మల్టిపుల్ పార్ట్‌నర్స్‌తో సెక్స్ చేయకుండా ఉండడం
4. సెక్స్ ఎడ్యుకేషన్, సుఖవ్యాధుల పట్ల అవగాహన, సురక్షిత సెక్స్ పద్ధతులు తెలుసుకోవడం ముఖ్యం
5. జననేంద్రియాల పరిశుభ్రత గురించి అవగాహాన పెంపొందించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
'కండోమ్ వాడడం ఆడ, మగ ఇద్దరి బాధ్యత '
మహిళలలో సుఖవ్యాధులు బాధాకరం కావచ్చని హైదరాబాద్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ అన్నారు.
"సుఖవ్యాధులు బాధాకరంగా మారినప్పుడే ఆడవాళ్లు డాక్టర్ దగ్గరకి వస్తారు. చాలా ఎక్కువ వైట్ డిశార్జ్, దురద, చీము కారడం, అసాధరణంగా బ్లీడింగ్ అవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ దగ్గరకు వస్తారు. కొన్ని రకాల సుఖవ్యాధులు రక్తంలో ఉంటాయి. ఇవి రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవు కాబట్టి డాక్టర్ దగ్గరకు వెళ్ళరు. గర్భం దాల్చినప్పుడు లేదా కడుపు నొప్పి వస్తే అప్పుడు వైద్యులను సంప్రదిస్తారు. వీటితోనే చాలా ప్రమాదం. చాలా ఆలస్యంగా వీటిని గుర్తిస్తారు. అప్పటికే అవి బాగా ముదిరిపోయి ఉంటాయి. ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయి, కాలేయం పాడైపోయిన స్థితిలో ఉంటారు. క్లమిడియా, గానోరియా లాంటివి పెద్ద ప్రమాదం కాదు, వాటికి చికిత్స ఉంది. క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్లు మాత్రం ప్రాణాంతకం కావచ్చు" అని డాక్టర్ శైలజ వివరించారు.
మన సమాజంలో కండోమ్ గురించి ఇప్పటికీ అపోహలు ఉన్నాయని ఆమె అన్నారు.
"సాధారణంగా కండోమ్ తొడుక్కోవడం అనేది మగవాళ్ల చేతిలో పని అని, అది వాళ్లు నిర్ణయించుకోవాల్సిన విషయం అని ఆడవాళ్లు అనుకుంటారు. భర్తకి లేదా బాయ్‌ఫ్రెండుకి కండోమ్ పెట్టుకోమని చెప్పడానికి సిగ్గుపడతారు లేదా భయపడతారు. మరోవైపు, గర్భం రాకుండా చూసుకోవలసిన బాధ్యత మహిళలదేనని పురుషులు అనుకుంటారు. ప్రొఫెషనల్ సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్లేవాళ్లు కండోమ్ వాడడం ఆ స్త్రీల బాధ్యత అనుకుంటారు. అక్కడికి వెళ్లే పురుషులు చొరవ తీసుకోరు. సెక్స్ వర్కర్లు చెప్తే పెట్టుకుంటారు లేదంటే ఊరుకుంటారు. ఒక్కోసారి కండోమ్ వాడడానికి నిరకరించవచ్చు. అవగాహనలేమితో పాటు పై కారణాల వల్ల STDలు సైలెంట్‌గా వ్యాప్తి చెందుతున్నాయి.
ఇటీవల స్త్రీలకు కూడా గర్భనిరోధక తొడుగులు వచ్చాయి. సర్వైకల్ క్యాప్స్, ఫీమేల్ కండోమ్స్ వచ్చాయి. కానీ, అవి మేల్ కండోమ్స్ అంత ప్రభావంతంగా పనిచేయట్లేదు. వీటి గురించి చాలామందికి తెలీదు కూడా. పశ్చిమ దేశాలలో కండోమ్స్ అన్నిచోట్ల విరివిగా దొరుకుతాయి. మనదేశంలో అలా కాదు. మహిళలు షాపుకి వెళ్లి కండోమ్ కొని తెచ్చుకునే స్వేచ్ఛ, స్వభావం ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇవన్నీ కూడా STDల వ్యాప్తికి కారణాలే. పురుషులకు, మహిళలకు సమానంగా సుఖవ్యాధులు సోకుతాయి. పురుషులు కొంత స్వేచ్ఛగా పరీక్ష చేయించుకోగలుగుతారు. స్త్రీలు ఆర్థిక, సామాజిక కారణాల వలన పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రారు. నాటు వైద్యం వాడతారు. దాంతో వ్యాధి మరింత ముదిరిపోతుంది" అని డాక్టర్ శైలజ చెప్పారు.
మహిళల విషయంలో తల్లి నుంచి బిడ్డకు సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటామని శైలజ చెప్పారు.
"మా దగ్గరకు రెండు క్యాటగిరీ వ్యక్తులు వస్తారు. కొత్తగా పెళ్లయినవాళ్లు, గర్భం కోసం ప్రయత్నిస్తున్నవాళ్లు మొదటి క్యాటగిరీ. వీళ్లకు మేం ప్రధానంగా తల్లి నుంచి శిశువుకు సోకకుండా ఉండేందుకు మందులు, సలహాలు, సూచనలు ఇస్తాం. రెండవ వర్గం వారు, సుఖవ్యాధులు బాగా ముదిరిపోయి, ఆరోగ్యం దెబ్బతిన్నవాళ్లు. వీరికి చికిత్స ఏమీ ఉండదు. లక్షణాలు తగ్గడానికి మందులు, సూచనలు అందిస్తాం. డెర్మటాలజిస్టుల దగ్గరకి పంపిస్తాం. వైరల్ లోడ్ తగ్గించుకోమని, ప్లాన్ చేసి గర్భం దాల్చమని చెబుతాం. లేదా ఐవీఎఫ్ ద్వారా బిడ్డని కనమని సూచిస్తాం" అని డాక్టర్ శైలజ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంతమంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు?
డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం 37.4 కోట్ల ప్రజలు కొత్తగా సుఖవ్యాధుల బారినపడుతున్నారు. ముఖ్యంగా క్లమిడియా, గానోరియా, సిఫిలిస్, ట్రికోమోనియాసిస్, హెర్పస్ వంటి సుఖవ్యాధులకు గురవుతున్నారు.
2020లో 37.4 కోట్ల మంది పై నాలుగింట్లో కనీసం ఒకదాని బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. వారిలో క్లమిడియా సోకినవారు 12.9 కోట్లు, గనోరియా సోకినవారు 8.2 కోట్లు, సిఫిలిస్ సంక్రమించినవారు 71 లక్షలు, ట్రికోమోనియాసిస్ సోకినవారు 15.6 కోట్లు ఉన్నారు.
డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం, 2016లో ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది హెర్పెస్ వ్యాధి బారినపడ్డారు.
15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు వారిలో 50 కోట్లకు పైగా ప్రజలకు హెర్పెస్ ఉంది.
2016లో 30 కోట్ల మహిళలు హ్యూమన్ పాపిలోమావైరస్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ప్రపంచవ్యాప్యంగా 29.6 కోట్ల మంది క్రానిక్ హెపటైటిస్ బీ వ్యాధితో జీవిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్: కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
- డిజిటల్ పేమెంట్స్: ఫోన్‌పే, పేటీఎం వాడుతున్నారా? మీ ఖాతాలు వేరొకరికి చిక్కకుండా ఎలా జాగ్రత్తపడాలి?
- మీజిల్స్: తట్టు వ్యాధి తిరగబెడుతోందా? తెలుసుకోవాల్సిన 10 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














