HIV: 175 మంది పిల్లలకు ఈ వైరస్ ఎందుకు సోకింది, రక్తమార్పిడి సమయంలోనే పొరపాటు జరిగిందా?

ఫొటో సోర్స్, Family photo
- రచయిత, జిమ్ రీడ్
- హోదా, బీబీసీ న్యూస్
1980ల్లో రక్తానికి సంబంధించిన వ్యాధి హిమోఫీలియాతో బాధపడిన 175 మంది బ్రిటిష్ చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్లు బ్రిటన్ ఆర్కైవ్స్‌లోని ఒక డాక్యుమెంట్‌తో వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) చరిత్రలోనే దీన్ని అత్యంత దారుణమైన చికిత్సగా బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.
ఇది దాదాపు 36 ఏళ్ల క్రితం జరిగింది. 1986 అక్టోబరులో తన కుమారుడికి హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పిన రోజును లిండా ఎప్పటికీ మరచిపోలేదు.
బర్మింగ్‌హమ్ చిల్డ్రన్ హాస్పిటల్‌లోని కన్సల్టింగ్ రూమ్‌కు తన 16 ఏళ్ల కుమారుడు మైఖెల్‌తో కలిసి రావాలని ఆమెకు ఆ రోజు పిలుపు వచ్చింది.
చిన్నప్పుడే మైఖెల్‌కు హిమోఫీలియా సమస్య ఉంది. ఇది ఒకరమైన జన్యు రుగ్మత. దీని వల్ల రక్తం సరిగా గడ్డకట్టదు. ఫలితంగా ఏదైనా గాయాలు అయ్యేటప్పుడు రక్తం విపరీతంగా పోతుంటుంది.
మైఖెల్‌ను క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు చెబుతారని లిండా అనుకున్నారు.
‘‘అది సాధారణమైన పిలుపే అనుకున్నాను. నా భర్త కూడా బయట కారులోనే ఉండిపోయారు’’అని ఆమె చెప్పారు.
‘‘మైఖెల్ హెచ్‌ఐవీ పాజిటివ్ అని చెప్పారు. ఏదో చుట్టుపక్కల వాతావరణం గురించి మాట్లాడుతున్నంత తేలిగ్గా ఆయన ఈ భయంకరమైన విషయం చెప్పారు”అని ఆమె గుర్తుచేసుకున్నారు.
‘‘బయటకు వచ్చి కారులో కూర్చొని, నా భర్తకు ఆ విషయం చెప్పాను. మేం ఇంకేమీ మాట్లాడుకోలేదు. అలానే ఇంటికి వెళ్లిపోయాం. మాకు ఆ వార్త ఒక షాక్‌లా అనిపించింది’’అని ఆమె వివరించారు.

అన్ని పాజిటివ్‌లు ఎలా?
అప్పుడే ఎయిడ్స్ సంక్షోభం మొదలైంది. దీనికి కొన్ని నెలల ముందే ‘‘డోంట్ డై ఆఫ్ ఇగ్నోరెన్స్’’ పేరుతో ప్రభుత్వం టీవీల్లో ప్రత్యేక ప్రచారాలను కూడా నిర్వహించింది. బ్రిటన్‌లోని ప్రతి ఇంటి టీవీలోనూ ఈ ప్రకటన వచ్చేది.
ఈ వ్యాధిని చాలా చెడ్డదిగా, ప్రమాదకరమైనదిగా ప్రజలు చూసేవారు. అప్పట్లో ఎయిడ్స్ రోగులపై ఒకరమైన వివక్ష ఉండేది.
హ్యాంప్‌షైర్‌లో హిమోఫీలియాతో బాధపడుతున్న తొమ్మిదేళ్ల బాలుడు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, అతడు చదివే స్కూలు నుంచి డజన్ల మంది పిల్లలను తమ తల్లిదండ్రులు వేరే స్కూలుకు మార్చేశారు.
దీంతో మైఖెల్ కూడా తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియకూడదని భావించాడు.
‘‘తను అలానే జీవించాలని అనుకున్నాడు. ఆ నిజం తనతోపాటు ఉండాలని అనుకున్నాడు’’అని లిండా వివరించారు.
‘‘ఎప్పటికీ తన స్నేహితులు లేదా ఇతరులు ఎవ్వరికీ ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఎందుకంటే అంతా మామూలుగా ఉండాలని తను భావించాడు’’అని ఆమె చెప్పారు.

బ్రిటన్‌లో 1970, 1991 మధ్య రక్తానికి సంబంధించి వ్యాధులతో బాధపడిన 1,250 మందికి హెచ్‌ఐవీ సోకింది. రక్తం గడ్డకట్టడంలో ప్రధాన పాత్ర పోషించే ప్రోటీన్ ఫ్యాక్టర్-8ను శరీరానికి అందించే ఒక కొత్త చికిత్స నిర్వహించిన తర్వాత వీరు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.
ఈ పాజిటివ్ బాధితుల్లో దాదాపు 175 మంది పిల్లలు కూడా ఉన్నారని తాజాగా బయటపడిన బ్రిటన్ ఆర్కైవ్స్ పత్రాలు చెబుతున్నాయి. వీరికి హాస్పిటల్స్, స్కూల్స్, హిమోఫీలియా క్లినిక్స్‌లో ఎన్‌హెచ్ఎస్ డాక్టర్లు కొత్త చికిత్స అందించారు.
మరోవైపు ఈ కొత్త చికిత్స లేదా రక్త మార్పిడి వల్ల వేల మందికి ప్రమాదకర హెపటైటిస్-సీ ఇన్ఫెక్షన్ సోకింది. దీని వల్ల కాలేయం విఫలం కావడం, కాలేయ క్యాన్సర్ కూడా వారిని వెంటాడింది.
యాంటీ వైరల్ ఔషధాలు అందుబాటులోకి రాకముందే, ఆనాడు హెచ్‌ఐవీ సోకిన వారిలో సగం మంది ఎయిడ్స్‌కు సంబంధించిన వ్యాధులతో చనిపోయారు.

ఫొటో సోర్స్, family photo
కారణం ఏమిటి?
అప్పట్లో బ్రిటన్‌లో రక్తం శాంపిల్స్ సరిపడా ఉండేవి కాదు. నిజానికి ఆ ఫ్యాక్టర్-8 ప్రోటీన్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారు.
వేల మంది దాతల రక్తం నుంచి సేకరించి ప్లాస్మాను ఒకచోట కలిపి, దాని నుంచి అవసరానికి సరిపడా శాంపిల్స్ తీసుకునేవారు. ఒకవేళ ఎవరైనా ఒక దాతకు హెచ్‌ఐవీ ఉంటే, ఆ మొత్తం రక్తం ఆ వైరస్‌తో కలుషితం అయిపోతుంది.
అమెరికాలో రక్తం ఇచ్చేవారికి డబ్బులు ఇస్తామని ఔషధ సంస్థలు చెప్పేవి. హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉండే మత్తుమందులు వాడేవారు, ఖైదీల నుంచి రక్తం సేకరించేవి. అలా సేకరించిన ఒక శాంపిల్ నుంచి ఫ్యాక్టర్-8 ప్రోటీన్ బ్రిటన్‌కు తీసుకువచ్చారు.
1984లో మొదట బర్మింగ్హమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఎయిడ్స్‌పై ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి లిండాకు ఇప్పటికీ గుర్తుంది. బాధితులకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఆ ప్రజెంటేషన్‌లో చెప్పారు.
అయితే, ఎలా ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందో ఆమె కుటుంబానికి అప్పట్లో అవగాహన ఉండేది కాదు. ‘‘మైఖెల్‌కు ఏమీ కాదు’’అని ఒక నర్సు చెప్పిన సంగతి ఆమెకు ఇంకా గుర్తుంది.
ఆ తర్వాత కూడా అమెరికా నుంచి తీసుకొచ్చిన మందులతో మైఖెల్‌కు చికిత్స జరిగేది.
అయితే, టీనేజీ వయసు చివర్లో మైఖెల్‌కు ఆరోగ్య సమస్యలు రావడం మొదలైంది. రాత్రి విపరీతంగా చెమటలు పట్టడం, జ్వరం, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించేవి.
కానీ, జీవితాన్ని తను ఆస్వాదించేవాడు. బయటకు వెళ్లడం, సంగీతం వినడం, వెస్ట్ బ్రోంవిక్ ఫుట్‌బ్యాల్ క్లబ్ మ్యాచ్‌లకు వెళ్లడం ఇలా తనకు నచ్చిన పనులు తను చేసేవాడు.
‘‘వెంబ్లీలో ఒక పెద్ద మ్యాచ్ జరిగింది. కానీ, తన ఆరోగ్యం అసలు బాగోలేదు’’అని లిండా గుర్తు చేసుకున్నారు.
‘‘దీంతో మేం మా కారును అందంగా అలంకరించాం. దీనిలో అతణ్ని మ్యాచ్‌కు తీసుకెళ్లాం. అక్కడ తన స్నేహితులను తను కలిశాడు. తనకు ఎలా అనిపించిందో తెలియదు.. నిజంగా తనకు వెళ్లే శక్తి ఉంటే తనే స్వయంగా ఆ రోజు అక్కడకు వెళ్లేవాడేమో’’అని ఆమె చెప్పారు.
ఆ తర్వాత కాలంలో అతడి వ్యాధి నిరోధక శక్తి మరింత క్షీణించింది. క్రమంగా మైఖెల్ బరువు తగ్గిపోయాడు. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది. బాగా అలసిపోయేవాడు.
ఆ తర్వాత బర్మింగ్‌హమ్‌లోని హార్ట్‌ల్యాండ్స్ హాస్పిటల్‌కు అతడిని లిండా తీసుకెళ్లారు. అతడిని చూసుకోవడానికి లిండా ఉద్యోగం కూడా మానేశారు. చివరి నెలల్లో అతడి పక్కనే ఆమె ఉండేవారు.
‘‘అమ్మా.. నువ్వు ఎప్పటికీ ఆయావి కాకూడదు అనేవాడు. అసలు దాని గురించి ఆలోచించొద్దని చెప్పేదాన్ని. అంతకుమించి నేనేం చెప్పగలను’’అని లిండా వివరించారు.
ఆ తర్వాత హెచ్ఐవీ వల్ల మెనింజైటిస్, న్యుమోనియా మైఖెల్‌కు సోకాయి.
తన 26వ పుట్టిన రోజుకు వారం రోజుల ముందు, 26 మే, 1995లో మైఖెల్ మరణించారు.
మూడు దశాబ్దాల తర్వాత, ఈ వినాశకర చికిత్సపై సుదీర్ఘ కాలం కోర్టులో కొనసాగిన విచారణకు లిండా హాజరై తన వాంగ్మూలం సమర్పించారు.
1970, 80లలో ఈ ఇన్ఫెక్షన్‌కు గురైన పిల్లల తల్లిదండ్రులతోపాటు ఆమె కూడా కోర్టులో మాట్లాడారు.
‘‘అలా జరగడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇలాంటి తప్పులు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? అని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను’’అని ఆమె చెప్పారు.
‘‘అలాంటి వినాశకరమైన పొరపాట్లు ఎప్పుడూ జరగకూడదు. అసలు ఆనాడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఆ బాధిత కుటుంబాలకు మేం చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంది’’అని ఆరోగ్య విభాగం అధికార ప్రతినిధి చెప్పారు.
‘‘మేం విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాం. తర్వాత ఇచ్చే మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తాం’’అని ఆయన వివరించారు.
తన ఇంటి పేరును వెల్లడించొద్దని లిండా కోరారు
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














