ఎయిడ్స్‌పై అవగాహన మహిళల్లోనే అధికం- ప్రెస్ రివ్యూ

ఎయిడ్స్‌పై అవగాహన HIV AIDS

ఫొటో సోర్స్, Getty Images

ఎయిడ్స్‌ వ్యాధిపై పురుషులతో పోల్చితే మహిళల్లోనే అవగాహన పెరుగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడయ్యిందని నమస్తే తెలంగాణ రాసింది.

నాలుగేండ్ల కిందటితో పోల్చితే ప్రస్తుతం ఎయిడ్స్‌పై మహిళలు అవగాహన పెంచుకోగా, పురుషుల్లో క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. తెలంగాణతో పాటు దేశంలోని మెజార్టీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నిరోధ్‌ వాడకం వల్ల కలిగే ఉపయోగాల్లోనూ మహిళల్లో అవగాహన పెరిగింది. ఈ విషయంలోనూ పురుషుల్లో అవగాహన తగ్గుతున్నది. ఇలా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో అసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 15-49 మధ్య వయస్కుల వివరాలతో ఈ సర్వేను రూపొందించింది. ఎయిడ్స్‌పై మహిళలకు, పురుషులకు ఏ మేరకు అవగాహన ఉన్నది? నిరోధ్‌ వాడకం వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సోకే తీవ్రతను తగ్గించవచ్చనే అంశంపై ఎంత మేరకు అవగాహన ఉన్నదనే అంశాలపై సర్వేలో పరిశీలన చేశారు.

ఎయిడ్స్‌పై అవగాహనను తెలంగాణలో పరిశీలిస్తే.. 2015-16లో 29.5 శాతం మంది మహిళలకు అవగాహన ఉంటే, 2019-20లో అది 30.7 శాతానికి పెరిగింది. అంటే నాలుగేండ్లలో 1.2 శాతం మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన పెరిగింది. పురుషుల విషయానికొస్తే 2015-16లో 50.1 శాతం మందికి అవగాహన ఉంటే, 2019-20కి వచ్చే సరికి 30.5 శాతానికి పడిపోయింది. నాలుగేండ్లలో ఏకంగా 19.6 శాతం మందికి ఎయిడ్స్‌పై అవగాహన తగ్గడం గమనార్హం. ఇక నిరోధ్‌ వాడకం వల్ల ఎయిడ్స్‌ బారిన పడకుండా రక్షించుకోవచ్చు అనే దానిపై అవగాహనను పరిశీలిస్తే.. 2015-16లో 59.1 శాతం మహిళలకు అవగాహన ఉంటే, 2019-20కి వచ్చే సరికి అది 68.9 శాతానికి పెరిగింది. పురుషుల విషయంలో 2015-16లో 81.5 శాతం మందికి దీనిపై అవగాహన ఉంటే, 2019-20కి వచ్చేసరికి 75.3 శాతానికి తగ్గడం గమనార్హం.

గ్రామాల్లో తక్కువ.. పట్టణాల్లో ఎక్కువ

గ్రామాలతో పోల్చితే పట్టణ మహిళలు, పురుషుల్లో ఎక్కువ అవగాహన ఉన్నది. అన్ని రాష్ర్టాల్లోనూ ఇలాగే ఉన్నది. తెలంగాణలో ఎయిడ్స్‌పై గ్రామీణ మహిళల్లో 26.9 శాతం మందికి అవగాహన ఉంటే పట్టణ ప్రాంతంలో 36.9 శాతం మందికి ఉన్నది. పు రుషుల విషయంలో గ్రామా ల్లో 28.9 శాతం మందికి ఉంటే, పట్టణాల్లో 33 శాతం మందికి అవగాహన ఉన్నది. ఇక నిరోధ్‌ వాడకంపై గ్రామీణ మహిళల్లో 65.4 శాతం మందికి అవగాహన ఉంటే, పట్టణాల్లో 74.7 శాతం మందికి ఉన్నదని నమస్తే తెలంగాణ వివరించింది.

తెలంగాణ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

'గోల్డెన్ అవర్‌'లోపే క్షతగాత్రులకు చికిత్స అందేలా చర్యలు...తెలంగాణ పోలీసు శాఖ

రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. ‘గోల్డెన్‌ అవర్‌’లోపే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేస్తోందని ఈనాడు తన కథనంలో పేర్కొంది.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అధికారులు ఈ అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే కనీసం నాల్గో వంతు మరణాలను తగ్గించవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 15 వేల ప్రమాదాలు సంభవించగా.. అందులో 5,157 మంది మృత్యువాత పడ్డారు. 11,380 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సత్వర చికిత్స చేయించి మరణాలను తగ్గించాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట ఎంతో విలువైంది. దీన్నే ‘గోల్డెన్‌ అవర్‌’గా పిలుస్తారు. ప్రమాద బాధితులకు ఈ సమయంలో మెరుగైన చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకునే పోలీసులు అంబులెన్సుని పిలిపించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తుంటారు. చాలా సందర్భాల్లో క్షతగాత్రులు ఆసుపత్రికి వెళ్లే సరికి అక్కడ అత్యవసర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు, సామగ్రి ఉండదు. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులూ అందుబాటులో ఉండరు. ఇలా.. అనేక కారణాల వలన మొదటి గంట(గోల్డెన్‌ అవర్‌) వృథా అవుతుంది. ఇది క్షతగాత్రుల ప్రాణాల మీదకు తెస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసు అధికారులు ఈ జాప్యాన్ని నివారించి క్షతగాత్రులకు సత్వర చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడటానికి సాంకేతిక సాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ కోణంలో ఈ కింది చరలు చేపట్టారని ఈ కథనంలో తెలిపారు.

*గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటంలో భాగంగా టీఎస్‌ కాప్‌ యాప్‌లో అదనపు ఫీచర్‌ను జోడించారు. ఇందులో ఆసుపత్రులు, అంబులెన్సులను జియోట్యాగింగ్‌ చేశారు.

* ప్రమాద సమాచారం తెలియగానే.. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న అంబులెన్సులు, ఆసుపత్రుల వివరాలు టీఎస్‌ కాప్‌ యాప్‌లో కనిపిస్తాయి. దాని ప్రకారం దగ్గర్లో ఉన్న అంబులెన్సును వెంటనే పిలిపించడంతోపాటు సమీప ఆసుపత్రికి ఫోన్‌ చేసి ఒక్క నిమిషం కూడా ఆలస్యం జరగకుండా అత్యవసర చికిత్సకు అన్నీ సిద్ధం చేయాలని సూచిస్తారు.

* క్షతగాత్రులు ఆసుపత్రికి చేరుకోగానే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స ప్రారంభిస్తారు.

* ప్రస్తుతం హైవే పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న 60 వాహనాలకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. క్రమంగా అన్ని వాహనాల్లోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

హత్య ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అనంతపురంలో 19 యేళ్ల అమ్మాయి దారుణ హత్య

ఓ యువతిని హత్య చేసి.. ఆ తర్వాత తగలబెట్టేందుకు ప్రయత్నించిన ఘటన అనంతపురం జిల్లా బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగిందని సాక్షి ఒక కథనంలో పేర్కొంది.

పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురం పట్టణంలోని అశోక్‌ నగర్‌లో నివాసముంటున్న లష్మి, కుల్లాయప్ప దంపతుల కుమార్తె స్నేహలత(19) ధర్మవరంలోని ఎస్‌బీఐలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది. గుత్తి రాజేష్, కార్తీక్‌ అనే యువకులు ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతుండేవారు. చెడు వ్యసనాలకు బానిస అయిన రాజేష్కు స్నేహలత దూరంగా ఉండేది. దీంతో ఆమెపై రాజేష్‌ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజేష్‌ మంగళవారం స్నేహలతను తన బైక్‌ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్‌ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడు.

బుధవారం ఉదయం కొందరు రైతులు బడన్నపల్లి సమీపంలోని పొలంలో యువతి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి వద్ద లభ్యమైన ఆధారాలతో యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ బిడ్డను డిగ్రీ చదుతున్నప్పటి నుంచి కార్తీక్, రాజేష్‌ అనే యువకులు ప్రేమ పేరుతో వేధించేవారని.. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కూతురిని చివరకు ఇలా చేశారంటూ స్నేహలత తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరైంది. రాజేష్తో పాటు కార్తీక్‌ కూడా ఈ ఘటన వెనుక ఉన్నాడని.. వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఘటనా స్థలిని డీఎస్పీ రమాకాంత్, సీఐ చిన్న పెద్దయ్య, ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు పరిశీలించి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. యువతి అదృశ్యం విషయం తెలియగానే వన్‌ టౌన్‌ పోలీసులు అప్రమత్తమై.. ధర్మవరం పోలీసులకు సమాచారమిచ్చారని.. రాత్రంతా ధర్మవరం, పరిసరాల్లో గాలింపు జరిపారని వివరించారు. కాగా, రాజేష్, కార్తీక్‌ వేధిస్తున్నట్లు గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపారు.

స్నేహలత హత్య కేసును త్వరితగతిన ఛేదిస్తామని ఎస్పీ బి.సత్యయేసు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గుత్తి రాజేష్‌ అనే వ్యక్తి స్నేహలతను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతనితో పాటు మరో అనుమానితుడు కార్తీక్‌ కూడా ఉన్నట్లు తెలియడంతో విచారణ చేస్తున్నామని చెప్పారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామని.. కార్తీక్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని.. వీలైనంత వేగంగా చార్జ్షీట్‌ దాఖలు చేస్తామని చెప్పారని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)