RSS Mohan Bhagwat: జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఇక్బాల్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత దేశానికి సమగ్ర జనాభా విధానం అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మతం ఆధారంగా జనాభా 'అసమతుల్యత'(Imbalance) అనే అంశాన్ని విస్మరించరాదని భగవత్ వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం జనాభాలో అసమతుల్యత భౌగోళికంగా కూడా మార్పులకు కారణమవుతుంది.
దసరా సందర్భంగా నాగ్‌పూర్‌లో భగవత్ ప్రసంగిస్తూ, జనాభా అసమతుల్యత కారణంగా భారతదేశం తీవ్ర పరిణామాలను చవిచూసిందని అన్నారు. మతాల ప్రాతిపదికన జనాభాలో అసమతుల్యత 1947లో భారతదేశ విభజనకు కారణమైందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తూర్పు తైమూర్, దక్షిణ సూడాన్, కొసావో దేశాలను కూడా ఉదాహరణగా చూపించారు. జనాభాలో అసమతుల్యత వల్లే ఈ కొత్త దేశాలు ఏర్పడ్డాయన్నారు.
జనన రేటుతో పాటు, బలవంతపు మతమార్పిడులు, దేశంలోకి అక్రమ వలసలను కూడా ఆయన ప్రస్తావించారు.
భగవత్ తన ప్రసంగంలో నేరుగా ఏ మతాన్ని పేర్కొనలేదు. అయితే సంఘ్ లేదా బీజేపీ నాయకులు జనాభా నియంత్రణ లేదా మత మార్పిడి గురించి మాట్లాడినప్పుడల్లా, వారు ముస్లింలు, క్రైస్తవుల గురించే మాట్లాడతారన్న అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రకటనలలో వైరుధ్యాలు
గత కొద్దికాలంగా బీజేపీ, సంఘ్ నేతలు జనాభా గురించి మాట్లాడుతున్నారు. అయితే, వారి ప్రకటనల్లో వైరుధ్యం కనిపిస్తోంది.
గత సంవత్సరం (2021) జూలైలో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, "మోదీ ప్రభుత్వం భారతదేశంలో జనాభాను నియంత్రించడానికి మాత్రమే కృషి చేస్తోంది. ఇందుకోసం జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టింది. ఇది పూర్తిగా స్వచ్ఛందం. కుటుంబ నియంత్రణ కోసం ప్రజలకు అనేక ఆప్షన్లను ఇది అందిస్తుంది. 'ఇద్దరు పిల్లల పాలసీ' లేదా మరే ఇతర విధానాన్ని తీసుకురావాలని మోదీ ప్రభుత్వం భావించడం లేదు'' అని చెప్పారు.
ఆయన ప్రకటన చేసి ఏడాది కూడా కాలేదు. ఈ ఏడాది (2022) మేలో మోదీ ప్రభుత్వంలోని మరో మంత్రి జనాభా నియంత్రణ చట్టం గురించి మాట్లాడారు.
జనాభా నియంత్రణకు త్వరలో చట్టం తీసుకువస్తామని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ రాయ్‌పూర్‌లో చెప్పారు.
జనాభా నియంత్రణ చట్టం గురించి విలేఖరులు ఆయనను ప్రశ్నించినప్పుడు" దీనిని ఇది త్వరలో తీసుకువస్తాం, కంగారుపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకున్నాం. మిగిలినవి కూడా వస్తాయి'' అన్నారు.
మంత్రి ప్రకటన వెలువడిన నాలుగైదు నెలల తర్వాత తాజాగా జనాభా నియంత్రణకు సంబంధించి సంఘ్ చీఫ్ ప్రకటన వెలువడింది.

భారతదేశంలో మతం ఆధారంగా జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో జనాభా 120 కోట్లు. వీరిలో హిందువులు 80 శాతం ఉండగా, ముస్లింలు 14.2 శాతం ఉన్నారు. క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కలిసి ఆరు శాతం.
- 2011లో దాదాపు 30,000 మంది భారతీయులు తాము నాస్తికులమని చెప్పారు.
- దేశంలోని ఆరు ప్రధాన మతాలలో దేనికీ చెందినవారం కాదని 80 లక్షలమంది చెప్పారు.
- ఇవి కాకుండా, 83 వేర్వేరు చిన్న మత సమూహాలు ఉన్నాయి. వీటిని పాటించేవారు కనీసం 100 మంది ఉన్నారు.
- ప్రతి నెలా దాదాపు పది లక్షల మంది కొత్త వ్యక్తులు భారతదేశంలో పుట్టుకొస్తున్నారు. ఈ రేటు ఇలాగే కొనసాగితే, 2030లో భారతదేశం చైనాను అధిగమించి, అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుంది.
(మూలం: 2011 జనాభా లెక్కలు, ప్యూ రీసెర్చ్ సెంటర్)


ఫొటో సోర్స్, Getty Images
డీఎన్ఏ ఒకటే అయితే, అసమతుల్యత ఎక్కడ: ఒవైసీ
భగవత్ ప్రసంగంపై హైదరాబాద్ లోక్ సభ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.
హిందువులు, ముస్లింల డీఎన్‌ఏ ఒక్కటేనని భగవత్ గతంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. తాజాగా భగవత్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. 'హిందువు, ముస్లింల డీఎన్‌ఏ ఒకటే అయినప్పుడు అసమతుల్యత అనే మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి?'' అని ఆయన ప్రశ్నించారు.
''ఇప్పటికే రీప్లేస్‌మెంట్ రేటు సాధించినందున జనాభా నియంత్రణ అవసరం లేదు. వృద్ధులు, నిరుద్యోగ యువత పెద్దలకు సహాయం చేయలేని జనాభా పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ముస్లింల సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోంది'' అని ఒవైసీ అన్నారు.
"మోహన్ (భగవత్)కి ఇది వార్షిక ద్వేషపూరిత ప్రసంగం. జనాభా అసమతుల్యత భయం ప్రపంచవ్యాప్తంగా మారణహోమం మరియు జాతి హింసకు దారితీసింది" అని ఒవైసీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భగవత్ ప్రసంగాన్ని స్వాగతించిన ఖురేషి
ఇటీవల ఐదుగురు సభ్యుల ముస్లింల బృందం మోహన్ భగవత్‌ను కలిసింది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై. ఖురేషీ, దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, భారత ఆర్మీ మాజీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా (రిటైర్డ్), సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ షాహిద్ సిద్ధిఖీ, వ్యాపారవేత్త సాద్ షెర్వానీలు ఈ ఐదుగురు.
మోహన్ భగవత్ ప్రసంగాన్ని స్వాగతించిన ఎస్.వై.ఖురేషి, ఆయన చాలా బాగా మాట్లాడారని అన్నారు.
ఖురేషి ఇటీవల ఇదే అంశంపై ఒక పుస్తకం కూడా రాశారు-'ది పాపులేషన్ మిత్: ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా' అన్నది ఆ పుస్తకం పేరు. భగవత్‌తో భేటీ సందర్భంగా ఖురేషి ఈ పుస్తకాన్ని ఆయనకు ఇచ్చారు.
''భగవత్ ముస్లింల గురించి మాట్లాడలేదు. రాజకీయ అధికారం కోసం ముస్లింలు ఉద్దేశపూర్వకంగా జనాభాను పెంచుతున్నారని అనలేదు. జనాభా కారణంగా విద్య, సేవలు, ఆదాయాలలో సమతౌల్యం గురించి మాట్లాడారు. ప్రతి సమాజంలో, ప్రతి మతానికి చెందినవారు కుటుంబ నియంత్రణను పాటించాలి అన్నది ఆయన చెప్పదలుచుకున్న విషయం'' అని ఖురేషి అన్నారు.
భగవత్‌ను కలిసిన సమయంలో మేం మాట్లాడినదానికీ, భగవత్ ప్రసంగానికి తేడా లేదని ఖురేషి అన్నారు.
అదే నిజమైతే, జనాభా విధానాన్ని అమలు చేయడం గురించి భగవత్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఖురేషిని ప్రశ్నించినప్పుడు, "భగవత్ జనాభా నియంత్రణ చట్టం గురించి కాకుండా జనాభా విధానం గురించి మాట్లాడారు. విద్య, ఆరోగ్య సేవలను అందించడం, పేదరికాన్ని నిర్మూలించడం దీని ఉద్దేశం'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, కొన్ని నెలల కిందట బీబీసీ ప్రతినిధి సరోజ్ సింగ్‌తో ఖురేషి ఇదే అంశంపై మాట్లాడారు. "భారతదేశానికి జనాభా నియంత్రణపై 30 సంవత్సరాల కిందట చట్టం అవసరం ఉండేది, ఈ రోజు లేదు. డిమాండ్-సరఫరాలో అంతరాన్ని చూస్తే, జనాభా నియంత్రణకు ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరం లేదని అర్ధమవుతుంది'' అని ఖురేషి అన్నారు.
మోహన్ భగవత్‌ను కలిసిన వారిలో ఒకరైన జర్నలిస్ట్ షాహిద్ సిద్ధిఖీ కూడా తాజాగా భగవత్ చేసిన ప్రసంగాన్ని స్వాగతించారు.
"పెరుగుతున్న జనాభా పట్ల మోహన్ భగవత్ ఆందోళనను నేను అభినందిస్తున్నాను. అయితే, ఈ రోజు భారతదేశ జనాభా సమతుల్యంగా ఉందని, అసమతుల్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను" అని బీబీసీతో అన్నారు.
కానీ, షాహిద్ సిద్ధిఖీ కొన్ని విషయాలలో మోహన్ భగవత్‌తో విభేదించారు. "ఆయన ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే భారతదేశంలో కొసావో లాంటి పరిస్థితి వచ్చే ప్రశ్నే లేదు. భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య జనాభా పెరుగుదల రేటులో వ్యత్యాసం దాదాపు కనుమరుగవుతోంది" అని సిద్దఖీ అన్నారు.
మోహన్ భగవత్ తన ప్రసంగంలో జనాభా నియంత్రణ గురించి కాక, జనాభా విధానాన్ని ప్రస్తావించి ఉండవచ్చు. అయితే, మోహన్ భగవత్ లేదా బీజేపీ నాయకులు ఎవరైనా జనాభా విస్ఫోటనం గురించి మాట్లాడితే, దానికి రాజకీయంగా అర్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
"భారతదేశంలో జనాభా పెరుగుదల గురించిన అతి పెద్ద దురభిప్రాయం ఏమిటంటే, ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారు. వారి కారణంగా జనాభా మరింత పెరుగుతోంది. అయితే ఇది పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉంది" అని ఖురేషి అన్నారు.
మోహన్ భగవత్ తన ప్రకటనకు మద్ధతుగా ఎటువంటి గణాంకాలు ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
గణాంకాలు మరో విధంగా ఉన్నాయి
భారతదేశంలో 2021లో జనాభా గణన జరగలేదు. కాబట్టి అధికారిక గణాంకాలన్నీ 2011 జనాభా లెక్కలు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నుండి వచ్చినవి.
ఏ రాష్ట్రంలోనైనా సంతానోత్పత్తి రేటు, కుటుంబ నియంత్రణ, మరణాల రేటు, తల్లి పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన తాజా డేటాను అందించడానికి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహిస్తుంటారు.
అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ సెప్టెంబర్ 2021లో భారతదేశంలోని వివిధ మతాల జనాభాకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. అయితే, వారి అధ్యయనానికి ప్రధాన మూలం జనాభా లెక్కలు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటాయే.
అయితే, ఏ అధికారిక లెక్కలు తీసుకున్నా..ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులను అధిగమించలేరనేది స్పష్టమవుతోంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు కూడా భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు ప్రతి దశాబ్దానికి తగ్గుతోందని చూపిస్తున్నాయి.
సంతానోత్పత్తి రేటు కూడా తగ్గుతోంది, ఇది అన్ని మతాల ప్రజలలో జరుగుతోందని తేలింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం, జాతీయ స్థాయిలో భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1 శాతం నుంచి తగ్గుతూ, రీప్లేస్‌మెంట్ నిష్పత్తికన్నా తక్కువగా ఉంది.
ఒక దేశంలో జనాభా విస్ఫోటనం ఉందా లేదా అనేది గుర్తించేందుకు నిపుణులకు ప్రధానమైన ఆధారం సంతానోత్పత్తి రేటు.
రీప్లేస్‌మెంట్ నిష్పత్తి 2.1 అంటే, ఇద్దరు పిల్లలను కనడం ద్వారా వంశం ఒక తరం నుండి మరో తరానికి కొనసాగుతుంది. (పాయింట్ ఒకటి ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు చిన్న వయస్సులోనే చనిపోతారు.)
రీప్లేస్‌మెంట్ రేట్ రెండు కన్నా తగ్గడం ఆందోళకలిగించే అంశమని, ప్రస్తుతం ఇది 2.1గా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ఎస్.వై ఖురేషి అన్నారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చివరి ఐదు నివేదికల డేటా ప్రకారం హిందువులు, ముస్లింల మధ్య పిల్లలను కనే అంతరం ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ లేదు. 1991-92 సంవత్సరంలో 1.1గా ఉన్న ఈ వ్యత్యాసం ఈసారి 0.3కి తగ్గింది. ముస్లిం మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులను ఎక్కువగా అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. గర్భనిరోధక పద్ధతులకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది, అవి నెరవేరడం లేదు.
గత రెండు దశాబ్దాల్లో హిందువుల సంతానోత్పత్తి రేటు 30 శాతం తగ్గగా, ముస్లింలలో 35 శాతం ఉంది. హిందువుల కంటే ముస్లింలలో జనాభా పెరుగుదల రేటుకన్నా తగ్గుదల ఎక్కువగా ఉంది. 2030 సంవత్సరం నాటికి హిందువులు, ముస్లింల మధ్య సంతానోత్పత్తి రేటు దాదాపు సమానంగా ఉంటుందని నమ్ముతారు.
ప్యూ రీసెర్చ్ సెంటర్ 2021 నివేదిక ప్రకారం, 1992 నుండి 2015 వరకు ముస్లింలలో సంతానోత్పత్తి రేటు 4.4 నుండి 2.6 కి తగ్గింది, హిందువులలో ఇది 3.3 నుండి 2.1 కి తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా పాలసీ
మోహన్ భగవత్ తన ప్రసంగంలో చైనా గురించి కూడా ప్రస్తావించారు. ''మన పొరుగు దేశమైన చైనాలో ముసలివాళ్ల సంఖ్య పెరుగుతోంది. సింగిల్ చైల్డ్ పాలసీ వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని, ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఓకే చెప్పారు. కానీ, పరిస్థితి మెరుగుపడటం లేదు'' అన్నారు.
అయితే జనాభా బాగా తగ్గిపోతే సమాజం, భాష కూడా కనుమరుగవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనా 'వన్ చైల్డ్ పాలసీ' ప్రపంచంలోని అతిపెద్ద కుటుంబ నియంత్రణ కార్యక్రమాలలో ఒకటి. ఈ విధానం 1979 సంవత్సరంలో ప్రారంభమైంది. సుమారు 30 సంవత్సరాల పాటు కొనసాగింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, 2000లో చైనా సంతానోత్పత్తి రేటు 2.81 నుండి 1.51కి పడిపోయింది ఇది చైనా లేబర్ మార్కెట్‌పై పెద్ద ప్రభావాన్ని చూపింది.
దీంతో చైనా ప్రభుత్వం తన విధానాన్ని పునరాలోచించవలసి వచ్చింది.
అందువల్ల, భారతదేశానికి సమగ్ర జనాభా విధానం అవసరమని మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ ఆయన చెబుతున్న, లేదా సూచించే కారణాల ఆధారంగా, భారతదేశానికి ప్రస్తుతం జనాభా నియంత్రణ చట్టం అవసరం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














