Anti Conversion Bill: బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
'ప్రార్థనల కోసం చర్చికి వెళ్లాను. కానీ, అక్కడ హిందువుల భక్తి గీతాలు వినిపిస్తున్నాయ్. అక్కడ కూర్చున్న కొందరు భక్తి గీతాలు పాడుతూ పెద్దగా కేకలు వేస్తున్నారు.'
అక్టోబరు నెలలో ఒక ఆదివారం తనకు ఎదురైన అనుభవాన్ని పాస్టర్ సోము అవరాధి బీబీసీతో పంచుకున్నారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలోని ఒక చర్చిలో ఆయన పని చేస్తున్నారు. చర్చిల్లో హిందువుల భజనలను చూడగానే పోలీసులకు కాల్ చేశానని ఆయన చెబుతున్నారు.
కానీ పాస్టర్ సోము, ఒక హిందువును బలవంతంగా క్రైస్తవునిగా మారుస్తున్నట్లు అక్కడికి వచ్చిన పోలీసులకు హిందువులు ఫిర్యాదు చేశారు. దీంతో పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 రోజులు జైలులో ఉన్న తరువాత ఆయనకు బెయిలు దొరికింది.
ఇటీవల కాలంలో కర్ణాటకలో మత ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. మత మార్పిడుల పేరిట తమ మీద దాడులకు పాల్పడతారేమోనని అక్కడి క్రైస్తవులు భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'క్రైస్తవుల మీద పెరుగుతున్న దాడులు'
మత మార్పిడులను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాలను తీసుకొస్తామంటూ ఈ ఏడాది అక్టోబరులో బీజేపీ ప్రకటించింది. నాటి నుంచి తమపై దాడులు పెరిగాయని క్రైస్తవులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి-నవంబరు మధ్య క్రైస్తవుల మీద దాడులు లేదా బెదిరింపులకు సంబంధించి 39 ఘటనలు చోటు చేసుకున్నట్లు 'ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా' తన నివేదికలో తెలిపింది .
రైట్ వింగ్ హిందుత్వ గ్రూపులు పాస్టర్ల మీద దాడి చేయడం, తమ మత విశ్వాసాలను పాటించకుండా వారిని అడ్డుకోవడం వంటి ఘటనలు ఇందులో ఉన్నాయని పేర్కొంది.
బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్లు జైలు
మత మార్పిడులను అడ్డుకునేందుకు రూపొందిస్తున్న బిల్లులు చాలా క్రూరమైనవని కొందరు విమర్శిస్తున్నారు. బలవంతంగా లేదా మోసపూరితంగా మతం మార్చడం లేదా పెళ్లి చేసినట్లు రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. మతం మారిన వారికి ప్రభుత్వ పథకాలను నిలిపివేసే అవకాశం కూడా ఉంటుంది.
మతం మారాలి అనుకునే వాళ్లు రెండు నెలల ముందుగానే అధికారులకు చెప్పాలి. ఎందుకు మతం మారుతున్నారు? కారణాలు ఏమిటి? వంటి అంశాలపై అధికారులు విచారిస్తారు. ఆ తరువాతే తుది నిర్ణయం తీసుకుంటారు.
ఈ కొత్త బిల్లు వల్ల హిందుత్వ శక్తులు తమను మరింతగా టార్గెట్ చేస్తాయని క్రైస్తవులు ఆందోళన చెందుతున్నారు. ఈ బిల్లుగానీ చట్టంగా మారితే, తాము మరింత అణచివేతను, కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెంగళూరు ఆర్చిబిషప్ పీటర్ మచాడో బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL
ఉత్తర్‌ప్రదేశ్ బాటలో...
పోయిన ఏడాది బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ మత మార్పిడులు, మతాంతర వివాహాలపై కఠిన చట్టం తీసుకొచ్చింది. ముస్లిం అబ్బాయిలు పెళ్లి పేరుతో హిందువుల అమ్మాయిలను ఇస్లాంలోకి మారుస్తున్నారనేది హిందుత్వవాదుల ఆరోపణ. దీనినే వారు 'లవ్ జిహాద్' అంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి బలవంతపు మత మార్పిడుల పేరుతో 100కు పైగా కేసులు నమోదయ్యాయని ఈ ఏడాది నవంబరులో 'ది ప్రింట్' అనే న్యూస్ వెబ్‌సైట్ రిపోర్ట్ వెల్లడించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 'లవ్ జిహాద్' చట్టాలు తీసుకురావడానికి ముందు ఏం జరిగిందో కర్ణాటకలోనూ అదే జరుగుతోందని ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా (ఈఎఫ్‌ఐ) జనరల్ సెక్రటరీ రెవరెండ్ విజయేశ్ లాల్ ఆరోపించారు.
'ముందు ఒక వర్గాన్ని కించపరుస్తారు. వారి మీద దాడులు చేస్తారు. మత మార్పిళ్ల పేరిట తప్పుడు ఆరోపణలకు దిగుతారు. ఆ తరువాత చట్టాలు తీసుకొస్తారు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం' అని ఆయన అన్నారు. ఈఎఫ్‌ఐ కింద దేశవ్యాప్తంగా 65 వేల చర్చీలున్నాయి.
కర్ణాటకలో మొదట కొన్ని ప్రాంతాల్లో మొదలైన దాడులు ఆ తరువాత 21 జిల్లాలకు పాకాయి. 40 ఏళ్లుగా తాను ఇక్కడ ఉంటున్నానని ఎన్నడూ లేనిది ఇప్పుడే మత మార్పిడులు చేస్తున్నారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని రెవరెండ్ థామస్.టి ప్రశ్నిస్తున్నారు. హిందుత్వ గ్రూపులు దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రార్థనా సమావేశాలు నిర్వహించొద్దంటూ నవంబరులో పోలీసులు అనధికారికంగా తమకు చెప్పినట్లు థామస్ తెలిపారు.
జాగ్రత్తగా ఉండాలంటూ క్రైస్తవమత బోధకులను ఆయా పోలీసు స్టేషన్లు సూచించిన మాట వాస్తవమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి బీబీసీతో అన్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధానమంటూ లేదని ఆ అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'ముస్లింలు ఎందుకు భయపడటం లేదు?'
కొత్త బిల్లును చూసి క్రైస్తవులు మాత్రమే ఎందుకు కంగారు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ ప్రశ్నిస్తున్నారు. పాస్టర్ సోముకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు ఆయనే నేతృత్వం వహించారు. ముస్లింలు, జైనులు, సిక్కులు వంటి ఇతర మైనారిటీలు ఎందుకు ఈ బిల్లును చూసి భయపడటం లేదని అరవింద్ అడుగుతున్నారు. బలవంతంగా మత మార్పిళ్లు చేయాలనుకునేవారే ఈ బిల్లును చూసి భయపడుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
కానీ తమపై జరుగుతున్న దాడులు, బిల్లు చుట్టూ నడుస్తున్న చర్చలను చూస్తే క్రైస్తవులనే లక్ష్యంగా చేసుకున్నట్లుగా స్పష్టమవుతోందని ఆర్చిబిషప్ మచాడో ఆరోపిస్తున్నారు.
అయితే ప్రజలను చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోకూడదని సామాజిక విశ్లేషకుడు, రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌జీ వాంబట్కెరీ అన్నారు. సమస్య ఉందని చెప్పి దాడులు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
ఎప్పటి నుంచో నలుగుతున్న మత మార్పిళ్లు
భారత్‌లో మత మార్పిడులు అనేది ఎప్పటి నుంచో వివాదంగా ఉంటూ వస్తోంది. మిషనరీలు హిందువులకు డబ్బు లేదా ఇతర ప్రయోజనాలను ఆశగా చూపి వారిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని హిందుత్వవాదులు ఎంతో కాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఆరోపణలను క్రైస్తవ మిషనరీలు కొట్టిపడేస్తున్నాయి.
చారిత్రకంగా చూసినప్పుడు హిందూ వర్ణవ్యవస్థలో అత్యంత దిగువన ఉండే దళితులు ఎక్కువగా క్రైస్తవమతంలోకి మారుతూ వచ్చారు. ఒకప్పుడు అంటరాని వాళ్లుగా వివక్షను ఎదుర్కొన్న వీళ్లకు రక్షణగా ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. అయినా దళితులపై దాడులు జరగడమో లేక వారి పట్ల వివక్ష చూపుతున్న ఘటనలు తరచుగా నమోదవుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- రూ. 5,500 కోట్ల పరిహారం ఇచ్చి ఆరో భార్యతో విడాకులు
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













