పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్

ఫొటో సోర్స్, twitter/Pushpa
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
సుకుమార్ సినిమాలు ఎందుకు చూడాలి? ఎందుకంటే తను సమ్‌థింగ్ స్పెషల్ కాబట్టి.
అప్పటి వరకు చూసిన ప్రేమకథలు వేరు. ఆర్య వేరు. `నువ్వు నన్ను ప్రేమించక్కర్లేదు.. నా ప్రేమని ఫీల్ అయితే చాలు..` అంటూ కొత్తగా తన ప్రేమని వ్యక్తీకరించాడు కాబట్టి.
కమర్షియల్ కథల్లో తన లెక్కల్నీ, కెమిస్ట్రీనీ, ఫిజిక్స్ నీ మేళవించి చెప్పాడు కాబట్టి.
బటర్ ఫ్లై థియరీని కమర్షియల్ సినిమాల్లో లాక్కొచ్చాడు కాబట్టి. లాజిక్కులతో వాటిని ముడి వేశాడు కాబట్టి.
సుకుమార్ బ్రిలియన్స్ ప్రతి సినిమాలోనూ కనిపిస్తూనే ఉంటుంది. బాక్సాఫీసు దగ్గర నిలబడని.. `వన్ నేనొక్కడినే`లో కూడా తన మేధావితనాన్ని చూపించగలిగాడు. ఆ సినిమా ఇప్పటికీ ఓ వర్గానికి హాట్ ఫేవరెట్.

ఫొటో సోర్స్, Twitter/alluarjun
అల్లు అర్జున్ అయితే వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. తను పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. దర్శకుడి చేతిలో మట్టి ముద్దగా మారిపోతాడు. ఆ ముద్దతో ఎలాంటి బొమ్మ చేస్తావో నీ ఇష్టం అంటూ దర్శకుడికి సవాల్ విసురుతాడు కాబట్టి.
డాన్స్, స్టైల్.. వీటికి తనదైన నటన జోడించి, ఇంత క్రేజ్ తెచ్చుకుని ఐకాన్ స్టార్‌గా మారాడు. వీరిద్దరి కలయిక ఎలా ఉంటుందనడానికి `ఆర్య` ఓ ప్రత్యక్ష ఉదాహరణ. వారిద్దరి ప్రేమ.. సినిమాల్లో, బయటా కనిపిస్తూనే ఉంటుంది.
అందుకే సుకుమార్ `బన్నీపై నాకున్న ప్రేమనంతా `పుష్ప`లో చూపించేశా అని గర్వంగా చెప్పగలిగాడు. అందుకే ఆ సినిమాపై అన్ని ఆశలు, అంచనాలు.
పాన్ ఇండియా అనే కిరీటాన్ని మోసుకొచ్చింది పుష్ప. దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్ని మెప్పించాలంటే బలమైన కథ, కథనాలు ఉండి తీరాల్సిందే. అందుకే ఈ విషయంలో సుకుమార్ ప్రయోగాలు ఏమాత్రం చేయదలచుకోలేదు.
నేరుగా ఓ ఫక్తు కమర్షియల్ పాయింట్ ఎంచుకున్నాడు. జీరో నుంచి - డాన్‌గా మారిన ఓ కూలీకి వాణిజ్య సూత్రాల్ని మేళవించుకుంటూ వెళ్లిపోయాడు. అదెలా సాగిందంటే...
పుష్ఫ (అల్లు అర్జున్) ఓ కూలీ. డబ్బు సంపాదించడం తన ధ్యేయం. అందుకు ఓ బలమైన కారణం కూడా ఉంది. అందుకోసం అడ్డదారులు తొక్కుతాడు. చాలామందిని తొక్కుకుంటూ వెళ్తాడు. భుజ బలంతో పాటు బుద్ధి బలం కూడా తన పెట్టుబడులుగా మారతాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ ముఠాలో సభ్యుడిగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి, ఎర్రచందనం మాఫియానే తన గుప్పెట్లోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో చాలా సవాళ్లు, ఎంతోమంది ప్రత్యర్థులు. వాళ్లలో మంగళం శ్రీను (సునీల్) కీలకం. తన దందాని, ఆధిపత్యాన్ని సైతం సవాల్ చేసి, ఈ స్మగ్లింగ్ రంగంలో పుష్ప కింగ్ మేకర్‌గా ఎలా మారాడు? అనేదే పుష్ప - 1 ప్రధాన ఇతివృత్తం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారతీయ భాషల్లో వచ్చిన ఎన్ని గ్యాంగ్‌స్టర్ కథలు తీసుకున్నా ఇదే ఇతివృత్తం కనిపిస్తుంది. సుకుమార్ కూడా అదే తానులో ముక్కని ఎంచుకున్నాడు.
కానీ దాన్ని ఓ అందమైన వస్త్రంగా మార్చడానికి అల్లు అర్జున్, రష్మిక, దేవిశ్రీ ప్రసాద్‌లను ఎంచుకున్నాడు. ఆ క్రమంలో కొన్నిసార్లు మెప్పించాడు. ఇంకొన్నిసార్లు నిరుత్సాహపరిచాడు.
బన్నీలోని ఎనర్జీని, సుకుమార్‌లోని బ్రిలియన్సీని చూడడానికే `పుష్ప` థియేటర్లకు జనం వస్తారు. కానీ సుకుమార్ తనలోని ఆ మేధస్సుని దాచేసి, కేవలం బన్నీ స్నేహితుడిగా, బన్నీని తాను ఎలా చూడాలనుకుంటున్నాడో, అలా చూపించేసి - అంతవరకే సరిపెట్టాడు.
ఈ కథలో, కథనంలో ఎక్కడా సుకుమార్ తాలుకూ తెలివితేటలు చొప్పించలేదు. అది ఒక రకంగా ప్లస్ అయితే.. మరో రకంగా మైనస్‌గా మారింది.
ఎర్రచందనం అవసరం ఎలా ఏర్పడింది? దానికున్న డిమాండ్ ఏమిటి? ఏ రూపంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ అవుతోంది... అనే విషయాల్ని యానిమేషన్ రూపంలో చూపిస్తూ నేరుగా కథలోకి వెళ్లిపోయాడు సుకుమార్.
ఆ తరవాత పుష్పగా బన్నీ ఎంట్రీ. ఆ పాత్రని మెల్లమెల్లగా ప్రేక్షకులకు దగ్గర చేస్తూ వెళ్లిపోయాడు. దాక్కో.. దాక్కో మేక.. పాటతో పూర్తిగా బన్నీ ప్రేక్షకుడిని ఆవహించేస్తాడు.

ఫొటో సోర్స్, Twitter/adityamusic
ఓ సాధారణ కూలీ అంచలంచెలుగా ఎదిగే వైనం చూపిస్తూనే.. శ్రీవల్లీతో ప్రేమాయణం నడిపించాడు. సుకుమార్ ప్రేమకథలెప్పుడూ వినూత్నంగా, వినోదాత్మకంగా ఉంటాయి. ఈ ప్రేమకథలో వినోదం పుష్ప- శ్రీవల్లీల నుంచి కాకుండా.. పుష్ప - కేశవ మధ్య నడిపాడు దర్శకుడు.
`చూసిందా.. చూళ్లేదా` అనే పాయింట్ చుట్టూ.. నడిపిన సన్నివేశాలు, అక్కడ పలికిన సంభాషణలు బాగున్నాయి. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది అదే.
కాకపోతే... వంద రూపాయలిస్తే... పుష్పని చూసి నవ్వడానికీ, ఐదు వేలు ఇస్తే, ముద్దు పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టు కథానాయిక పాత్రని మలచడమే కాస్త అభ్యంతరకరంగా ఉంటుంది. పోనీ దాన్ని తరువాత దర్శకుడు జస్టిఫై చేసుకున్నాడు అనుకుందాం.
వ్యాన్‌లో పుష్ప-శ్రీవల్లీల మధ్య నడిపిన `చేయి` ఎపిసోడ్ అయితే కచ్చితంగా సుకుమార్ మార్క్ కాదు. సుకుమార్ ఇలా ఆలోచించడు అనుకున్నవాళ్లకు ఆ సన్నివేశం పంటికింద రాయిలా తగులుతుంది.
ఎలివేషన్ల విషయంలో దర్శకుడు శ్రద్ధ తీసుకున్నాడు. ముఖ్యంగా విశ్రాంతి కార్డు దగ్గర. మంగళం శ్రీను దగ్గరకొచ్చి.. పుష్ప తన హీరోయిజం చూపించే సన్నివేశం అభిమానులకు నచ్చేదే. పాటలు ఎలాగూ ఆదరణ పొందేశాయి. దానికి బన్నీ స్టైల్‌లో సిగ్నేచర్ స్టెప్పులు తోడయ్యాయి.
అవన్నీ... నీరసంగా `సాగుతున్న` కథకి జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ప్రత్యేక గీతం మాత్రం తుస్సుమంది. ఆ చీకట్లో, ఆ కెమెరా కదలికల్లో సమంతని చూద్దామనేలోపే పాట అయిపోతుంది.

ఫొటో సోర్స్, Twitter/iamRashmika
దర్శకుడు ఈ కథలో చాలామంది ప్రతినాయకులకు చోటిచ్చాడు. కానీ ఏ పాత్రనీ మనస్పూర్తిగా రాసుకోలేదేమో అనిపిస్తుంది. పుష్పకి ధీటుగా ఎదురొడ్డే ప్రతినాయక పాత్రే కనిపించదు. మంగళం శ్రీను పాత్రని గంభీరంగా పరిచయం చేసినా - ఆ తరవాత ఆ పాత్ర కూడా పుష్ప జోరు చూసి బేల మొహం వేస్తుంది.
పతాక సన్నివేశాల్లో ఫహద్ ఫాజిల్ వచ్చి పుష్పకి ధీటుగా నిలబడినట్టు కనిపించినా.. ఆ సీన్ కూడా అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తుంది.
అల్లు అర్జున్ తనలో ఉన్న వైవిధ్యాన్ని వెదుక్కోవడానికి, తనని తాను కొత్తగా చూసుకోవడానికి, చూపించడానికి తప్పకుండా పుష్పరాజ్ పాత్ర దోహదం చేస్తుంది. తన ఆహార్యం, భాష, నడక... ఇవన్నీ పూర్తిగా కొత్తగా ఉన్నాయి.
ఇప్పటి వరకూ తను చేసిన పాత్రలు ఒకవైపు.. ఈ పాత్ర మరోవైపు. చిత్తూరు యాసని పూర్తిగా అవగాహన చేసుకుని, పుష్పరాజ్ పాత్రని తనలో ఐక్యం చేసుకున్నాడు. స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఓ నటుడు... ఇలాంటి పాత్ర చేయడం, చివర్లో.. కేవలం లో దుస్తులతో కనిపించే సాహసం చేయడం నిజంగా అభినందించదగిన విషయం.

ఫొటో సోర్స్, Twitter/DirKrish
దేవిశ్రీ ప్రసాద్ అలవాటు ప్రకారం సుకుమార్‌కి మంచి బాణీలే ఇచ్చాడు. అయితే వాటిని తెరకెక్కించడంలో సుకుమార్ స్టైల్ మిస్సయ్యింది. ప్రతీ పాటలోనూ బన్నీ ఒకేలా కనిపించడం ఓ మైనస్.
సంభాషణల్లో పదును కనిపించింది. `ఏలెట్టి కెలకడానికి రాలేదు.. ఏలేయడానికి వచ్చా`, `బ్రాండ్ అనేది బట్టల్లో ఉండదు... బతకడంలో ఉంటుంది` అనే మాటలు హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాయి.
సుకుమార్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా రాసుకున్న కథ ఇదొక్కటేనేమో..? దాన్ని కూడా తన స్టైల్‌లో కాకుండా చాలా ఫ్లాట్‌గా చెప్పాడు. కథలో మలుపులు లేకపోవడం, ఉద్విగ్నభరిత సన్నివేశాలు తక్కువ అవ్వడంతో... పుష్పలో ఫైర్ తగ్గినట్టు కనిపిస్తుంది.
కమర్షియల్ సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకులంతా ఒకే ఫార్మెట్‌లో ఆలోచిస్తారని, దానికి సుకుమార్ సైతం అతీతుడు కాదని నిరూపించిన సినిమా పుష్ప. హీరోయిజాన్ని నమ్ముకుని తీసిన సినిమా ఇది. అభిమానులు ఆదరిస్తే ఇది నిజంగా పుష్పమే. లేదంటే నిష్పలమే.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి
- తబ్లీగీ జమాత్‌ను సౌదీ అరేబియా ఏ భయం కారణంగా నిషేధించింది?
- ఇద్దరు మహిళల యధార్ధ గాథ: ‘పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- జేమ్స్ వెబ్: విశ్వ రహస్యాలను వెలుగులోకి తెచ్చే టెలిస్కోప్ ఇదేనా
- ‘పెళ్లి తరువాత అమ్మాయి పేరు, ఇంటి పేరు మార్చాలా? అబ్బాయి పేరూ మారిస్తే’
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్‌ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- భీకర సుడిగాలికి ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









