జేమ్స్ వెబ్: అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోయిన అతి పెద్ద టెలిస్కోప్

జేమ్స్ వెబ్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, జొనాథన్ అమోస్
    • హోదా, సైన్స్ కరస్పాండెంట్

అంతరిక్ష పరిశోధనలో కనీ వినీ ఎరుగని అద్భుతాల్ని సాధించే అవకాశం ఉన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భూమి మీద నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి దూసుకుపోయింది. 1,000 కోట్ల డాలర్ల (దాదాపు 75,000 కోట్ల రూపాయలు) వ్యయంతో నాసా నిర్మించిన ఈ మెగా టెలిస్కోప్‌ను ఫ్రెంచి గయానాలోని కౌరో అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు.

ఆరియేన్ రాకెట్లో ఈ టెలిస్కోప్ ఆకాశంలోకి దూసుకుపోయింది.

నాసా ప్రయోగించిన ఈ రాకెట్ నిర్దేశిత కక్ష్యలో దూసుకుపోతున్న తీరు దాదాపు అరగంట సేపు కనిపించింది. కెన్యాలోని మాలింది గ్రౌండ్ యాంటెన్నా ఈ సిగ్నల్స్‌ను అందుకుని ప్రయోగం విజయవంతమైందని సూచించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అపోలో మూన్‌ మిషన్‌లోని ఆర్కిటెక్ట్‌లలో ఒకరైన జేమ్స్ వెబ్ పేరు పెట్టిన ఈ టెలిస్కోప్ అంతరిక్షంలోకి నిర్దిష్ట కక్ష్యలో విజయవంతంగా దూసుకుపోయింది.

హబుల్ టెలిస్కోప్ తరువాత అంతకు మించిన భారీ టెలిస్కోప్ ఇదే. అంతరిక్ష ప్రయోగంలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్న ఈ టెలిస్కోప్ ఖగోళ రహస్యాలెన్నింటినో వెల్లడి చేస్తుందని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, జేమ్స్ వెబ్: హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన టెలిస్కోప్‌

సూపర్ టెలిస్కోప్

విశ్వాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు, కాలంలో వెనక్కి వెళ్లి చూసేందుకు ఈ సూపర్ టెలిస్కోప్‌ను తయారుచేశారు.

1,350 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో తొలిసారిగా మిణుకుమన్న నక్షత్రాల కాంతిని ఈ టెలిస్కోప్ గుర్తించగలదని భావిస్తున్నారు.

"మనం ఇంకా అడగాలని అనుకోని ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటన్నింటికీ ఈ ప్రతిష్టాత్మకమైన భారీ టెలిస్కోప్ అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాం" అని డాక్టర్ అంబర్ నికోల్ స్ట్రాన్ వివరించారు.

డాక్టర్ స్ట్రాన్ నాసా గొరాడ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త (ఆస్ట్రోఫిజిసిస్ట్)గా, డిప్యుటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

"విశ్వంలో మనల్ని అబ్బురపరిచే ఎన్నో విషయాలకు ఈ టెలిస్కోప్ ద్వారాలు తెరుస్తుందనే నమ్మకం నాకు చాలా ఉత్సాహాన్నిస్తోంది."

అయితే, ఇది ఎలా పనిచేస్తుంది? తొలి పాలపుంతలను మనం ఎప్పుడు చూడగలుగుతాం?

జేమ్స్ వెబ్

ఫొటో సోర్స్, NASA

భారీ పరికరం

6.5 మీటర్ల వ్యాసం వద్ద కక్ష్యలోకి పంపే అతి పెద్ద ఖగోళ దర్పణాన్ని జేడబ్ల్యూఎస్‌టీ ఉపయోగించనుంది.

ఈ టెలిస్కోప్ ఎంత పెద్దదంటే స్పేస్‌లోకి వెళ్లాక పూర్తిగా మడతలన్నీ విప్పి సిద్ధం కావడానికి రెండు వారాలు పడుతుంది.

ఈ ప్రాజెక్ట్ అమెరికా, యూరోప్, కెనడా స్పేస్ సెంటర్ల జాయింట్ వెంచర్. దీని వ్యయం 10 బిలియన్ డాలర్లు (రూ. 7,43,27 కోట్లు).

'వెబ్' టెలిస్కోప్‌ను యూరోపియన్ ఏరియన్ 5 రాకెట్‌పై ఉంచి ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించనున్నారు.

స్పేస్‌లో రాకెట్ నుంచి వెబ్ వెలుపలికి వచ్చి, టేక్ ఆఫ్ చేసిన సుమారు 30 నిముషాల తరువాత.. అనుకున్న కాన్ఫిగరేషన్‌కు చేరుకోవాలంటే దాదాపు 344 కీలకమైన సెట్టింగులు చేసుకోవాల్సి ఉంటుంది.

స్పేస్‌లో అబ్జర్వింగ్ పాయింట్ చేరుకోవడానికి వెబ్ 30 రోజులు ప్రయాణం చేస్తుంది. ఈ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరలో ఉంది.

రోవర్

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH

తొలి చిత్రాలు ఎప్పుడు వస్తాయి?

వెబ్ టెలిస్కోప్ పూర్తిగా సిద్ధం కావడానికి, అది పంపించే తొలి చిత్రాలను చూడడానికి ఆరు నెలల సమయం పడుతుందని డాక్టర్ స్ట్రాన్ చెప్పారు.

"టెలిస్కోప్ స్పేస్‌లోకి చేరాక, దీని పరికరాలన్నింటినీ విప్పి సిద్ధం కావడానికి సమయం పడుతుంది. ఆ తరువాత, అది చల్లబడి, అద్దాలను వరుసలో పెట్టుకుని, ఒకదాని తరువాత ఒకటిగా పరికరాలను సిద్ధం చేసుకోవడానికి మరి కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి, దీన్నుంచి తొలి చిత్రాలు రావడానికి 2022 వేసవి (ఉత్తరార్థ గోళంలో) కావొచ్చు" అని ఆమె వివరించారు.

విశ్వం గురించి మన ఆలోచనా విధానాలను మార్చిన ముఖ్యమైన టెలిస్కోప్ 'హబుల్'.

దాన్ని మించిన సామర్థ్యం ఉన్న టెలిస్కోప్ వెబ్. విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాల గుట్టు విప్పబోతోంది.

మూడు దశాబ్దాల కాలంలో హబుల్ విశ్వానికి సంబంధించిన అతి ముఖ్యమైన చిత్రాలను అందించింది.

ఉదాహరణకు, విఖ్యాతమైన పిల్లర్ ఆఫ్ క్రియేషన్స్, హుబుల్ అల్ట్రా డీప్ ఫీల్డ్ అని పిలిచే సుమారు 10,000 గెలాక్సీల వీక్షణ.

హబుల్ మరో పది లేదా ఇరవై ఏళ్లు తన పనిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నారు.

కాగా, హబుల్ కన్నా గణనీయంగా మెరుగైన వెబ్‌ను దానికి వారసుగా భావిస్తున్నారు.

వెబ్ విశ్వాన్ని ప్రధానంగా ఇన్ఫ్రారెడ్‌ కటకాలతో చూస్తుంది. తద్వారా మనిషి కంటికి కనిపించని భాగాలను కూడా చూడగలుగుతుంది.

ఈ అంశంలో హబుల్ కన్నా మెరుగ్గా పనిచేస్తుంది. హబుల్ ఇన్ఫ్రారెడ్‌ సామార్థ్యానికి పరిమితి ఉంది.

అలాగే, హబుల్ కన్నా వెబ్‌కు పెద్ద అద్దాలు ఉన్నాయి. దానివల్ల కాలంలో మరింత వెనక్కు వెళ్లి చూడగలుగుతుంది.

హబుల్ భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలోనే ఉంది.

కానీ, వెబ్ భూమికి చాలా దూరంగా 15 లక్షల కిలోమీటర్ల దూరలో ఉంటుంది. అది చంద్రుడి కన్నా నాలుగు రెట్లు ఎక్కువ దూరం.

"భూమి చుట్టూ కక్ష్యలో 31 సంవత్సరాల కాలంలో హబుల్ ఏమేమి చేయగలిగిందో, దాని ఆధారంగా వెబ్‌ను నిర్మిస్తున్నారు" అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన డాక్టర్ ఆంటోనెల్లా నోటా చెప్పారు.

"2.4 మీటర్ల ప్రాధమిక అద్దంతో హబుల్ చిన్న టెలిస్కోపే అయినప్పటికీ, బింగ్ బ్యాంగ్ నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి చూసే అవకాశాన్ని ఇచ్చింది.

సెన్సివిటీలో 100 పెరుగుదలతో, వెబ్ ఈ కాలాన్ని మరింత వెనక్కి జరుపుతూ, విశ్వంలో తొలిసారిగా ప్రకాశించిన పాలపుంతల జాడ తెలుపగలదు."

జేమ్స్ వెబ్

ఫొటో సోర్స్, NASA

వెబ్ టెలిస్కోప్ ఏమేం చూడగలదు?

పొడవైన తరంగదైర్ఘ్యాలు ఉండడం వలన వెబ్ కాలచక్రం ప్రారంభ దశలను మరింత దగ్గరగా చూడగలదు. అలాగే, ప్రారంభ నక్షత్ర సముదాయాల కోసం అన్వేషిస్తుంది.

ఇవాల్టి కాలంలో నక్షత్రాలు, గ్రహాల వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన దుమ్ము మేఘాల లోతులను కూడా చూడగలదు.

వెబ్ ఆపరేషన్ ప్రారంభమయ్యాక మొదటి సంవత్సరం చూడగలిగే అంశాల జాబితాను శాస్త్రవేత్తలు ఇప్పటికే తయారుచేశారని డాక్టర్ స్ట్రాన్ తెలిపారు.

"ఇది ఖగోళ భౌతిక శాస్త్రం (ఆస్ట్రోఫిజిక్స్) విస్తృతిని పెంచుతుంది. ఇప్పటి సౌర వ్యవస్థలో గ్రహాలను అధ్యయనం చేయడం దగ్గర నుంచి 1,350 కోట్ల సంవత్సరాల క్రితం ప్రకాశించిన తొలి నక్షత్రాలను అన్వేషించడం వరకు అన్ని అంశాలపైనా పరిశోధన చేస్తుంది. ప్రధానంగా కాలం, విశ్వానికి సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తుంది."

జేమ్స్ వెబ్

ఫొటో సోర్స్, NASA

ఇతర గ్రహాలపై జీవం అన్వేషణ

గ్రహాలపై ఎలాంటి అణువులు ఉన్నాయో కూడా వెబ్ చూడగలదు కాబట్టి ఇతర గ్రహాలపై జీవం గుర్తులను శోధించడంలో సహాయపడుతుంది.

"అయితే, కచ్చితంగా సంకేతాలు దొరుకుతాయని చెప్పలేం. కానీ, భూమిపై కాకుండా పాలపుంతల్లోని గ్రహాలపై జీవాన్ని అన్వేషించడంలో ఇది పెద్ద ముందడుగు అని చెప్పడం మాత్రం అతిశయోక్తి కాదు" అని స్ట్రాన్ అన్నారు.

"ఈ టెలిస్కోప్‌పై చాలా ఆశలు ఉన్నాయి. విశ్వం గురించి మన జ్ఞానాన్ని విస్తరించడమే కాకుండా మన చుట్టూ ఉన్న అనేక అంశాలతో మనకు ఉన్న సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది."

"రాత్రి పూట ఆకాశాన్ని, నక్షత్రాలను చూస్తున్నప్పుడు వాటితో మనకు ఒక బంధం ఉందనిపిస్తుంది. ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాదు అనే భావన కలుగుతుంది" అని డాక్టర్ స్ట్రాన్ అన్నారు.

"కోట్ల సంవత్సరాల క్రితం నక్షత్ర ధూళి నుంచి పుట్టాం. మనకు విశ్వంతో అనుబంధం ఉంది. వెనక్కి తిరిగి చూసుకుని, జీవితాన్ని మరింత అర్థం చేసుకుంటూ, విశాల దృక్పథంతో చూడడం ముఖ్యమని భావిస్తున్నాను."

*ఈ నివేదిక కోసం లండన్‌లోని ఫే నర్స్ ఇంటర్వ్యూ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)