ఏపీజే అబ్దుల్ కలాం: ఈ మిసైల్ మ్యాన్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకంటారు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రజల అత్యంత ప్రియమైన రాష్ట్రపతిగా మన్ననలందుకున్న ఏపీజే అబ్దుల్ కలాం 1931లో అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు.
భారత మాజీ ప్రధాని ఇందర్‌కుమార్ గుజ్రాల్ తన ప్రభుత్వం పడిపోకపోయినా, బలహీన ప్రధాని అని బీజేపీతో పదేపదే అనిపించుకుని విసిగి పోయి, దేశభద్రతకు తాను ఎంత ప్రాధాన్యమిస్తానో నిరూపించుకోవాలని భావించారు.
అందులో భాగంగానే మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాంకు భారతరత్నను ప్రదానం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 1952లో సి.వి.రామన్ తర్వాత మరో సైంటిస్టును ఈ అవార్డు వరించలేదు.
1998 మార్చి1న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారతరత్న అవార్డు ప్రదానం కార్యక్రమంలో అబ్దుల్ కలాం భయపడుతూ కనిపించారు. ఆయన తన నీలి రంగు టైని పదేపదే తాకుతూ ఉన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times
కలాం అటువంటి అధికారిక సందర్భాలలో కాస్త చిరాకుగా ఉంటారు. తన సాదాసీదా దుస్తులు కాకుండా సూటు బూటు వేసుకోవడం ఆయనకు ఇష్టముండదు. లెదర్ షూస్ కాకుండా స్పోర్ట్స్ షూ ధరించడానికి ఆయన ఆసక్తి చూపిస్తారు.
భారతరత్న అవార్డు స్వీకరించాక ఆయన్ను అభినందించిన వారిలో అటల్ బిహారీ వాజ్‌పేయి ఒకరు.
ఎస్‌ఎల్‌వి-3 పరీక్ష సక్సెస్ తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీశ్‌ధావన్‌ను, ఆయన బృందాన్ని ఆహ్వానించినప్పుడు కలాం కూడా వచ్చారు. 1980 ఆగస్టులో వాజ్‌పేయి, కలాం తొలి సమావేశం జరిగింది.
కలాంకు ఆహ్వానం వచ్చినప్పుడు ఆయన భయపడి పోయారు. "నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి'' అని సతీశ్‌ధావన్‌ను అడిగారు కలాం. అప్పుడు "మీరు ఇప్పటికే విజయం అనే సూట్ ధరించి ఉన్నారు. కాబట్టి వచ్చేయండి'' అని సతీశ్ ధావన్ అన్నారు.

ఫొటో సోర్స్, Pallava Bagla
ప్రఖ్యాత జర్నలిస్ట్ రాజ్‌చెంగప్ప తన 'వెపన్స్ ఆఫ్ పీస్' పుస్తకంలో "ఈ సమావేశం సందర్భంగా ఇందిరాగాంధీ అబ్దుల్ కలాంను అటల్ బిహారీ వాజ్‌పేయికి పరిచయం చేయగా, వాజ్‌పేయి ఆయనకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండానే పరిచయం చేసుకున్నారు.
అప్పుడు ఇందిరాగాంధీ వాజ్‌పేయివైపు చూసి " కానీ అటల్జీ కలాం ముస్లిం'' అన్నారు. అప్పుడు వాజ్‌పేయి "అవును ముందు ఆయన భారతీయుడు, గొప్ప శాస్త్రవేత్త కూడా '' అన్నారు.
రెండోసారి ప్రధాని అయిన 18 రోజుల తరువాత తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కలాంను ఆహ్వానించారు వాజ్‌పేయి. కలాం అప్పుడు అంగీకరించినట్లయితే వాజ్‌పేయికి సమర్థుడైన మంత్రి లభించడమే కాకుండా, బిజెపి ప్రభుత్వం తాము ముస్లింలను విస్మరించలేదన్న సందేశం పంపి ఉండేది.
వాజ్‌పేయి ప్రతిపాదనపై కలాం రోజంతా ఆలోచించారు. కానీ మరుసటి రోజు వాజ్‌పేయిని కలిసి ఈ పదవిని సున్నితంగా తిరస్కరించారు. "రక్షణ పరిశోధన, అణుపరీక్ష కార్యక్రమం చివరి దశలో ఉంది. ఆ బాధ్యతలు నిర్వహించడం కూడా దేశానికి సేవ చేసినట్లే'' అని ఆయన అన్నారు. రెండు నెలల తర్వాత పోఖ్రాన్‌లో అణు పరీక్ష జరిగింది. ఆయన మంత్రి పదవిని ఎందుకు అంగీకరించలేదో అప్పుడు స్పష్టమైంది.

ఫొటో సోర్స్, PRAKASH SINGH
ప్రధానమంత్రి కార్యాలయం మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది, మీరు వెంటనే ఆఫీసుకు రండి అని 2002 జూన్ 10న అణ్ణా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ కళానిధి ఏపీజే అబ్దుల్‌కలాంకు సందేశం పంపారు.
వెంటనే వీసీ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు కాసేపటికి ఫోన్ వచ్చింది.
ప్రధాని వాజ్‌పేయి లైన్‌లోకి వచ్చి "కలాం సాహెబ్, మీరు దేశానికి రాష్ట్రపతి కావాలి'' అన్నారు.
కలాం వాజ్‌పేయికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆఫర్‌ను పరిశీలించడానికి నాకు గంట సమయం కావాలని అడిగారు.
"మీరు టైమ్ తీసుకోండి. కానీ మీ నుంచి అవును అనే సమాధానం రావాలి , కాదు అని కాదు'' అన్నారు వాజ్‌పేయి.
సాయంత్రానికి ఎన్డీఏ కన్వీనర్ జార్జ్ ఫెర్నాండెజ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం మాయావతి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి కలాం అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
డాక్టర్ కలాం ఢిల్లీ వచ్చినప్పుడు రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, JOEL NITO
ఏషియాడ్ విలేజ్‌లోని డీఆర్‌డీఓ గెస్ట్‌హౌస్‌లో ఉండాలని కలాం నిర్ణయించుకున్నారు.
2002 జూన్18న వాజ్‌పేయి, ఆయన క్యాబినెట్ సహచరుల సమక్షంలో కలాం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కలాం దరఖాస్తు ఫారం నింపుతుండగా " మీరు కూడా నాలాగే వర్జిన్'' అని వాజ్‌పేయి ఆయనతో చమత్కరించారు.
కలాం వెంటనే సమాధానమిస్తూ "నేను వర్జిన్‌నే కాదు, బ్రహ్మచారిని కూడా'' అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కలాం సూట్ కథ
అధ్యక్షుడైన తరువాత ఎలాంటి దుస్తులు ధరించాలన్నది కలాం పెద్ద సమస్య.
కొన్నేళ్లుగా నీలిరంగు చొక్కా, స్పోర్ట్స్ బూట్లు ధరించిన కలాం, రాష్ట్రపతిగా వాటిని ధరించలేకపోయారు.
అనేకమంది అధ్యక్షులకు సూట్లు కుట్టిన రాష్ట్రపతి భవన్ దర్జీ ఆయనకు కూడా కొలతలు తీసుకున్నారు.
కలాం జీవిత చరిత్ర రచయిత, సహోద్యోగి అరుణ్ తివారీ తన 'ఎపిజె అబ్దుల్ కలాం- ఎ లైఫ్' అనే పుస్తకంలో "కొద్దిరోజుల తరువాత కలాం కోసం కుట్టిన నాలుగు కొత్త బంద్‌గలా సూట్లను దర్జీ తీసుకువచ్చారు. కొద్దినిమిషాల్లోనే ఆయన తన దుస్తులను మార్చేసుకున్నారు. కానీ ఆయన సంతోషంగా లేరు.
"నేను ఇందులో ఊపిరి తీసుకోలేక పోతున్నాను. ఏమైనా మార్పుకు అవకాశం ఉందా'' అని అడిగారని వెల్లడించారు.
దర్జీ ఇబ్బందుల్లో పడిపోయారు. అప్పుడు కలాం మెడ దగ్గర కొంచెం కత్తిరించండని ఆయనకు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ తరహా సూట్‌ను కలాం సూట్ అని పిలవడం మొదలు పెట్టారు.
టై ధరించడం పట్ల కలాం విముఖత చూపేవారు. తాబేలులాంటి సూట్‌కు టైతో ఇంకా ఊపిరి ఆడదని ఆయన అనేవారు.
"ఒకసారి ఆయన తన టైతో కళ్లద్దాలు తుడుచుకోవడం నేను చూశాను. అలా చేయకూడదని నేను ఆయనకు చెప్పాను. కానీ ఈ టైతో ఎలాంటి ఉపయోగం లేదు. ఇందుకైనా ఉపయోగపడనీయండి అన్నారు'' అని అరుణ్ తివారీ వెల్లడించారు.

ఫొటో సోర్స్, House of kalam
నిష్టగా ఉదయం ప్రార్ధనలు
ఎంత బిజీగా ఉన్నప్పటికీ కలాం తన కోసం కొంత సమయం కేటాయించుకునే వారు. రుద్రవీణను వాయించడం ఆయనకు ఎంతో ఇష్టం.
"ఆయనకు నడక అంటే కూడా ఎంతో ఇష్టం. అది కూడా ఉదయం పదిగంటలకు, మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు కాసేపు నడిచేవారు. ఉదయం పదిన్నరకు అల్పాహారం తీసుకునేవారు.
సాయంత్రం నాలుగున్నరకు భోజనం చేసేవారు. మళ్లీ రాత్రి 12 గంటలకు తినేవారు'' అని కలాంకు ప్రెస్ సెక్రటరీగా పని చేసిన ఎస్.ఎం.ఖాన్ నాతో అన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times
"డాక్టర్ కలాం ముస్లిం మతంతోపాటు హిందూ మత ప్రార్ధనలు కూడా చేసేవారు. ఆయన ఖురాన్, భగవద్గీతలను చదివేవారు. తిరువళ్లువర్ బోధనలతో కూడిన 'తిరుక్కురళ్' పుస్తకాన్ని తమిళంలో చదివేవారు. పూర్తి శాఖాహారి, మద్యం ముట్టుకునేవారు కాదు. ఆయన బస చేసేచోట శాఖాహారాన్ని మాత్రమే వడ్డించాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. హిజ్ ఎక్సలెన్స్ అని పిలిపించుకోవడం ఆయనకు అసలు ఇష్టం ఉండేది కాదు'' అని ఖాన్ వివరించారు.
కొందరు ఆయన్ను కాషాయవాది అని విమర్శించేవారు. ప్రతి ముస్లిం ఆయనలాగా ఉండాలని, అలా ఉండని వారిని తప్పుబట్టవచ్చని సందేశం ఇచ్చేందుకు కాషాయవాదులు ఆయన్ను ఎంపిక చేసుకున్నారని కొందరు వాదించేవారు.
కామన్ సివిల్ కోడ్‌కు రాష్ట్రపతిగా కలాం మద్దతు ఇచ్చినప్పుడు విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సత్యసాయి బాబాను కలవడాన్ని వామపక్ష పార్టీలు, మేధావులు తప్పుబట్టారు. శాస్త్రీయ ఆలోచనను సమర్థించే వ్యక్తి అలా చేయడం కరెక్టు కాదని వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
కుటుంబం కోసం రాష్ట్రపతి భవన్‌కు అద్దె చెల్లించిన కలాం
తాను ఎంతగానో ప్రేమించే అన్న ముత్తు మరైకాయర్‌ను తనతోపాటు రాష్ట్రపతి భవన్‌లో ఉండాలని కలాం ఎప్పుడూ అడగలేదు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని సోదరుడి మనవడు గులాం మొయినుద్దీన్ ఢిల్లీలో మునిర్కాలో ఒక అద్దె గదిలో నివసించేవారు.
2006 మే నెలలో కలాం తన కుటుంబంలోని 52మందిని ఢిల్లీకి ఆహ్వానించారు. వారంతా రాష్ట్రపతి భవన్‌లో 8 రోజులు బస చేశారు. " కలాం తన జేబు నుంచి వారి ఖర్చులను భరించారు. ఒక కప్పు టీని కూడా లెక్కించారు.
వారంతా అజ్మీర్‌కు బస్సులో వెళ్లగా, ఆ బస్సు ఛార్జీలను కూడా కలాం భరించారు. ఆయన కుటుంబం వెళ్లిపోయిన తర్వాత కలాం రాష్ట్రపతి భవన్‌కు రూ.352,000 చెక్కును రాష్ట్రపతి భవన్ కార్యాలయానికి పంపారు'' అని కలాంకు సెక్రటరీగా పని చేసిన పీఎం నాయర్ నాతో అన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times
2005 డిసెంబర్‌లో ఆయన సోదరుడు ఏపీజే ముత్తు మరైకాయర్, ఆయన కుమార్తె నజీమా, మనవడు హజ్ యాత్రకు వెళ్లారు. సౌదీ అరేబియాలోని భారత రాయబారి ఈ విషయం తెలుసుకుని, వారికి అన్ని రకాల సాయం చేస్తానని రాష్ట్రపతికి తెలిపారు. కానీ కలాం "నా 90 ఏళ్ల సోదరుడు ఏ ప్రభుత్వ ఏర్పాట్లు లేకుండా సాధారణ యాత్రికుడిలాగా హజ్ చేయడానికి అనుమతించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను'' అని అన్నారు.

ఫొటో సోర్స్, House of Kalam
అనాథాశ్రమానికి ఇఫ్తార్ విందు సొమ్ము
కలాం సెక్రటరీ నాయర్ నాకు మరో ఆసక్తికరమైన కథను చెప్పారు. "2002 నవంబర్‌లో ఒకసారి కలాం నన్ను పిలిచి ఇఫ్తార్ విందు ఎందుకు నిర్వహించాలో చెప్పు అన్నారు. ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కలేయించారు. సుమారు రూ. పాతిక లక్షలవుతందని తేలింది."మనం ఈ డబ్బును అనాథాశ్రమనికి ఎందుకు ఇవ్వకూడదు? ఈ డబ్బు వృథా కాకుండా చూడమని నాకు చెప్పారు'' అని నాయర్ వెల్లడించారు.
"రాష్ట్రపతిభవన్ నుంచి పిండి వంటలు, పప్పులు, దుప్పట్లు, స్వెట్టర్లను 28 అనాథాశ్రమాలకు పంపించారు. ఇది ఇక్కడితో ఆగలేదు.
ఆయన మళ్లీ నన్ను పిలిచి ఇప్పుడు మీరు చేసిన ఖర్చంతా ప్రభుత్వానిదని, నా దగ్గరున్న ఒక లక్ష రూపాయలు కూడా ఇస్తాను. వాటిని కూడా ఇలాగే అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టండి అని నన్ను కోరారు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దన్నారు'' అని నాయర్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, STR
రాజకీయాలతో సంబంధం లేని అధ్యక్షుడు
కలాం బహుశా భారతదేశపు మొదటి రాజకీయేతర అధ్యక్షుడు. ఆయనకు పోటీగా ఉన్న ఒకే ఒక్కవ్యక్తి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్. కానీ రాధాకృష్ణన్ కొన్నాళ్లు సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా పని చేశారు.
మే 22 అర్ధరాత్రి రష్యా పర్యటనలో ఉన్నప్పుడు కూడా బీహార్‌లో రాష్ట్రపతి పాలనకు ఆయన ఆమోదం తెలపడాన్నిబట్టి చూస్తే ఆయన రాజకీయ అనుభవం లేదన్న విషయం స్పష్టమవుతుంది.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ లేకపోవడంతో, గవర్నర్ బుటాసింగ్ వేరే ఆప్షన్లను పరిశీలించకుండా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు.
కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతి సంతకం కోసం మాస్కోకు ఫ్యాక్స్ చేసింది. కలాం ఈ సిఫారసుపై రాత్రి ఒకటిన్నర గంటలకు సంతకం చేశారు.
కానీ ఐదు నెలల తరువాత సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వును రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీంతో యూపీయే సర్కారు, రాష్ట్రపతి భవన్ ప్రతిష్టలు దెబ్బతిన్నాయి.
కలాం తన 'ఎ జర్నీ త్రూ ది ఛాలెంజెస్' పుస్తకంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తావించారు, సుప్రీంకోర్టు తీర్పుతో తాను ఎంతగానో బాధపడ్డానని, రాజీనామా చేయాలని కూడా అనుకున్నానని చెప్పారు. కానీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒప్పుకోలేదు.

ఫొటో సోర్స్, Hindustan Times
నెమలికి కణితి ఆపరేషన్
డాక్టర్ కలాంలో మానవీయ విలువలు ఎక్కువ. ఒకసారి చలికాలంలో రాష్ట్రపతి భవన్‌లో తోటలో నడుస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ క్యాబిన్‌లో ఏసీ వ్యవస్థ లేదని, కఠినమైన శీతాకాలంలో కూడా సెక్యూరిటీ గార్డులకు చలిపుట్టనంతగా వేడి ఉందని ఆయన గమనించారు. సంబంధిత అధికారులను పిలిచి శీతాకాలంలో గార్డు క్యాబిన్లో హీటర్, ఎండాకాలంలో ఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.
ఎస్.ఎమ్.ఖాన్ మరో ఉదంతాన్ని వివరించారు. "ఒకసారి మొఘల్ గార్డెన్‌లో నడుస్తుండగా, ఒక నెమలి నోరు తెరవలేకపోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే రాష్ట్రపతి భవన్ వెటర్నరీ డాక్టర్ సుధీర్ కుమార్‌ను పిలిచి నెమలికి ఆరోగ్య పరీక్షలు చేయమని కోరారు. ఈ పరీక్షల్లో నెమలి నోటిలో కణితి ఉందని, అందుకే నోరు తెరవలేకపోతోందని తేలింది. కలాం ఆదేశాలతో డాక్టర్ సుధీర్ నెమలికి శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. కొన్ని రోజులు ఐసీయూలో ఉంచి, తర్వాత దాన్ని మొఘల్ గార్డెన్‌లో వదిలి పెట్టారు.

ఫొటో సోర్స్, TCHANDROU NITANGA
టాంజానియా చిన్నారులకు ఉచిత ఆపరేషన్
2005 అక్టోబర్ 15, తన 74వ పుట్టిన రోజున కలాం హైదరాబాద్‌లో ఉన్నారు. కేర్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న టాంజానియాకు చెందిన కొంతమంది పిల్లలను కలవడంతో తన దినచర్యను ప్రారంభించారు. అక్కడ ఉన్న ప్రతి చిన్నారిని పలకరించి వారికి చాక్లెట్లు పంచి పెట్టారు.
అప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే, ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారిని వదిలేసి ఆయన పిల్లలకు ఇస్తున్న ప్రాథాన్యతను చూసి అంతా ఆశ్చర్యపోయారు.
"2000 సెప్టెంబర్‌లో కలాం టాంజానియా సందర్శించినప్పుడు, పుట్టుకతోనే గుండెజబ్బుతో బాధపడుతున్న పిల్లలు చికిత్స అందక చనిపోతున్నారని కలాం తెలుసుకున్నారు.
అక్కడి నుండి వచ్చాక ఈ పిల్లలను, వారి తల్లులను దారుస్సలాం నుండి హైదరాబాద్‌కు తీసుకు రావడానికి ఏదో ఒక విధంగా ఉచిత ఏర్పాట్లు చేయాలని, అప్పటి ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.తులసీదాస్‌తో మాట్లాడాలని ఆయన నన్ను కోరారు. ఇందుకు తులసీ దాస్ కూడా అంగీకరించారు. కేర్ హాస్పిటల్ హెడ్ డాక్టర్ సోమరాజు, హార్ట్ సర్జన్ డాక్టర్ మన్నం గోపీచంద్ వారికి ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకొచ్చారు.
ఈ పిల్లలను గుర్తించడానికి టాంజానియాలో భారత హైకమిషనర్ దారుస్సలాం వెళ్లారు. 24మంది పిల్లలు, వారి తల్లులను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. 50మంది ఉండటానికి, తినడానికి కేర్ ఫౌండేషన్ ఉచిత ఏర్పాట్లు చేసింది. వీరంతా హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని సురక్షితంగా టాంజానియాకు వెళ్లిపోయారు'' అని అరుణ్ తివారి మరో ఉదంతాన్ని వివరించారు.

ఫొటో సోర్స్, The India Today Group
శ్యామ్ మానెక్‌షాను కలిసిన కలాం
తన పదవీ కాలం ముగిసేనాటికి 1971 వార్ ఫీల్డ్ మార్షల్ మానెక్‌షాను కలవాలని కలాం కోరుకునేవారు. చివరకు 2007 ఫిబ్రవరిలో ఆయన్ను కలుసుకోడానికి ఊటీ వెళ్లారు.
అయితే ఆయనకు ఫీల్డ్ మార్షల్ బిరుదు మాత్రమే ఇచ్చారని, ఇతర సౌకర్యాలు ఇవ్వలేదని గుర్తించారు. తిరిగి ఢిల్లీ వచ్చాక ఆయన కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. ఫీల్డ్ మార్షల్ మానెక్‌షాతోపాటు, మార్షల్ అర్జున్‌సింగ్‌కు వారు పదవి విరమణ చేసినప్పటి నుంచి ఉన్న బకాయిలన్నీ చెల్లించే ఏర్పాటు చేశారు కలాం.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంతో మంది విద్యార్థుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందంటే...
- Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుగుడు ఏంటి?
- ప్రశ్న పత్రంలో ఇస్లాంను దూషించారంటూ టీజే జోసెఫ్ చేయి నరికారు, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎలా ఉన్నారు?
- PMBJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











