కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంతో మంది విద్యార్థుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందంటే...

- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటకలోని ఉడుపిలో చెలరేగిన హిజాబ్ వివాదం గత పది నెలల్లో చాలామంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు వాళ్లు ఏం మాట్లాడాలన్నా భయపడుతున్నారు. పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని బెంగళూరుకు 400 కిమీ దూరంలో ఉన్న జంట నగరాలు ఉడుపి, మణిపాల్ ప్రధాన విద్యాకేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుంది.
అయితే, గత ఏడాది ఉడుపి జిల్లాలో హిజాబ్ వేసుకుని అమ్మాయిలు తరగతులకు హాజరు కాకుండా ఒక జూనియర్ కాలేజీ ఆంక్షలు విధించింది. ఆరుగురు అమ్మాయిలు ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. దాంతో, అక్కడ వివాదం చెలరేగింది. వెంటనే కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి ప్రతిఘటించారు. అప్పుడు నెలకొన్న ఉద్రిక్తతల జాడలు ఇప్పటికీ సూక్ష్మగా కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది జూలైలో ఆ జూనియర్ కాలేజీ విధించిన హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆ ఆరుగురు మహిళా విద్యార్థులు మౌనం వహించారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరినందున, దీని గురించి మాట్లాడవద్దని వారి తరపు లాయరు సూచించారు.

ఈ వివాదం సమాజాన్ని ఓ కుదుపు కుదిపేసింది. దీనివలన ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ఊహకందని విధంగా ప్రభావితమయ్యాయి.
చాలామంది విద్యార్థులు కాలేజీలు మరిపోయారు. హిజాబ్‌ను అనుమతించే కాలేజీలలో చేరారు. లేదా హిజాబ్ ధరించేందుకు వీలుగా ఊరే మారిపోయారు.
కొందరు చదువులు మానేశారు. మరికొందరు చదువుల కోసం, ఆర్థిక కారణాల వలన హిజాబ్ ధరించడం మానేశారు.
ఈ వివాదం వలన ఎంతోమంది ఆర్థికంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భావోద్వేగాల పరంగా కూడా ఇది చాలామందిని ప్రభావితం చేసింది.
"లేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేం ఏం మాట్లాడుదల్చుకోలేదు. మా అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్టుగా వెల్లడిస్తే భవిష్యత్తులో ఏ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు. మేం మా చదువుల మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నాం" అని ఒక మహిళా విద్యార్థి బీబీసీతో చెప్పారు. ఆమె పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.
"ఏదైనా మాట్లాడితే, అది వివాదంగా మారితే తమ సంఘంలో తమ పేరు చెడిపోతుందని కొందరు భయపడుతున్నారు. ముఖ్యంగా టీనేజర్లకు కత్తి మీద సాములా ఉంది. హిజాబ్ వదిలేస్తే తమ వర్గం ప్రజలే దుమ్మెత్తిపోస్తారు. అలాగే, ఇతరులు కూడా వేరే కారణాలతో వాళ్లకు మద్దతు ఇవ్వకపోవచ్చు" అని ఒక సామాజిక కార్యకర్త అన్నారు. ఈ వ్యక్తి కూడా పేరు బయటపెట్టడనికి ఇష్టపడలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సామాజిక సంబంధాలు
ఈ మొత్తం వ్యవహారం వెనకాల మారనివి కూడా కొన్ని ఉన్నాయి. హిజాబ్ వేసుకున్నా, వేసుకోకపోయినా కొన్ని స్నేహాలు మారకుండా స్థిరంగా ఉన్నాయి.
"నాకు చాలామంది హిందూ స్నేహితులు ఉన్నారు. వారంతా నాతో చాలా సన్నిహితంగా, ప్రేమగా ఉండేవారు. హిజాబ్ ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు తీసేయాలి మొదలైన విషయాల్లో నన్ను హెచ్చరించేవారు" అని డాక్టర్ జీ శంకర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థి అయ్షా రిఫా అబ్దుల్‌రౌఫ్ బీబీసీతో చెప్పారు.
అయ్షా రిఫా బాలికల పాఠశాలలోనే చదువుకున్నారు. ఎం.కాం కూడా మహిళా కాలేజీలోనే చదవాలని నిశ్చయించుకున్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పు తరువాత, ఆమె హిజాబ్‌ను విడిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే, పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సు కేవలం ఒక కాలేజీలోనే అందుబాటులో ఉంది. చదువుకోవాలంటే హిజాబ్ వదిలేయాలి.
మరొక డిగ్రీ విద్యార్థి కూడా తన స్నేహాలు మారలేదని చెప్పారు.
"నా వరకు విద్య కూడా చాలా ముఖ్యం. దాని కోసం కొంత త్యాగం తప్పదు. హిజాబ్ తీసేయడమే సరైనదని నేను భావించాను. మా స్నేహితులందరం కలిసి సెలవుల్లో టూరు వెళుతుంటాం. హిజాబ్ వేసుకున్నా, తీసేసినా వాళ్లల్లో ఏ మార్పూ లేదు. నాతో మామూలుగానే ఉన్నారు" అని ఆమె చెప్పారు. తన వివరాలు బయటపెడితే తన సొంత సమాజం నుంచి, ఇతరుల నుంచి నిరసనలు వస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, అందరివీ ఇంత హాయైన కథలు కావు.
"మేం కాలేజీ మారకుండా, అక్కడే చదువు కొనసాగించాం. ఈ వివాదం తరువాత అందరూ మాతో మాట్లాడడం మానేశారు. మాపట్ల చూపిన వివక్షకు నేను షాక్ అయ్యాను. మా హిందూ స్నేహితులు మమ్మల్ని దూరం పెట్టారు" అని ఒక విద్యార్థి బీబీసీతో చెప్పారు. తన పేరు బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆమె భయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక మూల్యం
హిజాబ్ వివాదం కొందరికి ఆర్థికంగా భారంగా మారింది. హిజాబ్ తీసివేయడానికి ఇష్టపడని విద్యార్థులు ఆర్థిక మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
"మేం ఆ సంవత్సరానికి కాలేజీ ఫీజు కట్టేశాం. పరీక్షలకు కూడా ఫీజు కట్టేసాం. ఇప్పుడు ఆ కాలేజీ నుంచి టీసీ తీసుకుని వేరే ఊర్లో వేరే కాలేజీకి మారడం వలన కట్టిన ఫీజంతా పోయింది" అని డిగ్రీ చదువుతున్న మరొక విద్యార్థి చెప్పారు.
"కొత్తగా చేరిన కాలేజీలో కూడా మొత్తం ఫీజు కట్టాల్సి వచ్చింది. కొత్త ఊరిలో ఇల్లు అద్దెకు తీసుకోవ్బాల్సి వచ్చింది. అది కూడా అదనపు ఖర్చు. ఫీజు గురించి కోర్టు మెట్లు ఎక్కాలనుకోలేదు. ఆ కాలేజీలో మేం కొన్నేళ్లు చదివాం. మాకు చదువు చెప్పిన టీచర్లకు, సంస్థకు ఇబ్బంది కలిగించడం మాకిష్టం లేదు. మా టీచర్లు మాకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పారు. ప్రిన్సిపాల్, టీచర్లు కూడా మమ్మల్ని హిజాబ్ వేసుకోకుండా కాలేజీకి రమ్మని సలహా ఇచ్చారు. కానీ, మేం కాలేజీ మారడానికే నిశ్చయించుకున్నాం. ఆర్థికంగా ఇది మా తల్లిదండ్రులకు భారమే. కానీ, తప్పలేదు. ఇన్నాళ్లు నేర్చుకున్నదంతా కోల్పోవాలి లేదా మా వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి చదువుకోవాలి. అందుకే మేం ఆ ఊరు వదిలి వెళ్లిపోయాం" అని ఆమె చెప్పారు.
మధ్య, ఎగువ తరగతి విద్యార్థుల కథలు అవి. దిగువ తరగతికి చెందిన ఒక ఆటో డ్రైవర్ కూతురి కథ మరొకటి ఉంది. ఆ అమ్మాయికి చదువుకోవాలని బలంగా ఉంది. కానీ, హిజాబ్ కూడా వేసుకోవాలి.
"హిజాబ్ వివాదం వలనే నేను మా కాలేజీ మారిపోయాను. మా కాలేజీలో ఏ గొడవలు జరుగలేదు. హైకోర్టు హిజాబ్‌ను నిషేధించినప్పుడు, మా కాలేజీలో కూడా దాన్ని అమలుచేశారు. వాట్సాప్‌లో మాకు సర్క్యులర్ రాగానే, నేను కాలేజీకి వెళ్లడం మానేశాను. ఫైనల్ పరీక్ష రాయలేదు. ఇంటర్నల్స్‌కు హాజరు కాలేదు. ఒక సంవత్సరం కోల్పోయాను. మళ్లీ డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాల్సి వచ్చింది" అని జైఫ్ నాజ్ అనే విద్యార్థి బీబీసీతో చెప్పారు. ప్రస్తుతం ఆమె సలిహత్ కాలేజీలో మొదటి సంవత్సరం బీకామ్ చదువుతున్నారు.
"జీ శంకర్ కాలేజీలో నేను కేవలం రూ. 3,000 ఫీజు కట్టాను. అది మళ్లీ రీఫండ్ చేశారు. ఇక్కడ రూ. 26,000 కట్టాల్సి వచింది. ఇందులో రూ. 11,000 ట్రాన్స్‌పోర్టుకే. ఈ కాలేజీ సిటీ నుంచి చాలా దూరం, కాబట్టి కచ్చితంగా కాలేజీ బస్సు ఎక్కి వెళ్లాలి. అయితే, కాలేజీ వాళ్లు మాకు 5 శాతం రాయితీ ఇచ్చారు. ఇన్స్టాల్‌మెంట్స్‌లో ఫీజు చెల్లించమని మినహాయింపు కూడా ఇచ్చారు" అని జైఫా చెప్పారు.
తాను అదృష్టవంతురాలినని జైఫా భావిస్తున్నారు. తన కాలేజీ నుంచి టీసీ తీసుకున్న 17 మంది విద్యార్థుల్లో చాలామంది వేరే కాలేజీల్లో చదువులు కొనసాగించారని చెప్పారు.
"ఒక ముగ్గురు, నలుగురు మాత్రం ఆ కాలేజీ విడిచిపెట్టలేదు. ఎందుకంటే ప్రయివేటు కాలేజీల్లో ఫీజు చెల్లించే స్తోమత వారికి లేదు" అని జైఫా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- PMBJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?
- ‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
- కేరళలో నరబలి వివాదం: 'మంత్రగాడి సలహాతో' ఇద్దరు మహిళలను హత్య చేసిన దంపతులు.. ఏం జరిగింది?
- దగ్గు మందు వివాదం: ఈ సిరప్ ఇండియా నుంచి గాంబియా వరకూ ఎలా వెళ్లింది?
- ఆ ఊర్లో రాత్రి ఏడు కాగానే గంట మోగుతుంది, అందరూ ఫోన్లు, టీవీలు ఆపేస్తారు, ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













