South India: దక్షిణాది రాష్ట్రాలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాల విషయంలో ఉత్తరాది కంటే మెరుగ్గా ఉన్నాయా

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాది రాష్ట్రాలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాల విషయంలో ఉత్తరాది కంటే మెరుగ్గా ఉన్నట్లు డేటా చెబుతోంది. కానీ, దీని పరిణామాలెలా ఉంటాయి? ఇదే అంశాన్ని డేటా సైంటిస్ట్ నీలకంఠన్ బీబీసీ కోసం విశ్లేషించారు.
భారతదేశంలో ఒక బిడ్డ జన్మించారనుకుందాం.
ఆ బిడ్డ దక్షిణ భారతదేశంలో పుట్టారనుకుందాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న శిశు మరణాల రేటును దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూస్తే ఈ చిన్నారి పుట్టిన ఏడాదిలోనే మరణించే అవకాశాలు చాలా తక్కువ.
ఈ చిన్నారికి టీకాలు వేసే అవకాశముంది. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లి మరణించే అవకాశం కూడా చాలా తక్కువ.
చిన్నారికి ఆరోగ్య సేవలు, మెరుగైన పోషకాహారం లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
ఈ చిన్నారి తన ఐదవ పుట్టినరోజును జరుపుకోవచ్చు. అనారోగ్యం బారిన పడితే ఆస్పత్రి, వైద్య సదుపాయం లాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో ఆ చిన్నారి ఎక్కువ కాలం జీవించే అవకాశం కూడా ఉంది.
ఈ చిన్నారి స్కూలుకు కూడా వెళ్లి చదువు కొనసాగిస్తారు. కాలేజీకి కూడా వెళ్లొచ్చు. ఆర్థికావసరాల కోసం వ్యవసాయ పనులకు వెళ్లే అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. లేదా ఆమెకు ఎక్కువ వేతనం లభించే పని కూడా దొరకొచ్చు.
ఈ చిన్నారి పెరిగి పెద్దయి తక్కువ మంది పిల్లలను మాత్రమే కనొచ్చు.
ఈ పుట్టిన చిన్నారి తల్లిని మించి చదువుకుని మరింత ఆరోగ్యవంతంగా ఉండే అవకాశముంది. ఈమె ఎన్నికల్లో ఓటరుగా మరింత ప్రభావంతమైన పాత్ర కూడా పోషించే అవకాశముంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, దక్షిణ భారతదేశంలో పుట్టిన చిన్నారులు ఉత్తరాదిలో పుట్టిన వారి కంటే ఆరోగ్యవంతమైన, మెరుగైన, భద్రతతో కూడిన జీవితాన్ని గడుపుతూ సామాజికంగా ప్రభావవంతమైన పాత్రను పోషిస్తారు.
ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాల విషయంలో యూరప్‌కు సబ్ సహారా ఆఫ్రికాకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది.
కానీ, ఈ పరిస్థితి మొదటి నుంచి ఉన్నది కాదు.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినప్పుడు దేశ జనాభాలో పావు వంతు ఉన్న దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచీలలో అట్టడుగున ఉన్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో, దక్షిణాదిలో 5 రాష్ట్రాలయ్యాయి.
కానీ, 1980ల నాటికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే, దక్షిణాది రాష్ట్రాలు ప్రాథమిక రంగాల్లో మెరుగవడం మొదలైంది.
అప్పటి నుంచి ఈ పరిణామం మరింత పెరుగుతూ వస్తోంది.
ఇలా ఎందుకు జరిగిందనడానికి ఒక కచ్చితమైన సమాధానం చెప్పలేం.
దక్షిణాది రాష్ట్రాలకన్నిటికీ ప్రత్యేకమైన కథ ఉంది. కానీ, ఆయా రాష్ట్రాలు అమలు చేసిన నూతన విధానాల వల్ల అభివృద్ధి సాధ్యమైంది.
కొన్ని విధానాలు సానుకూల ఫలితాలనిచ్చాయి. కొన్ని విఫలమయ్యాయి. కొన్ని ఆర్థికంగా భారంగా మారాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానాలు ప్రజాస్వామ్య పరిశోధనశాలల్లా పని చేశాయి అని చాలా మంది భావించారు.

ఉదాహరణకు 1982లో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వల్ల స్కూలులో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి.
కేరళలో విద్య, ఆరోగ్య ప్రమాణాల మెరుగుదలకు రాజకీయ చైతన్యం, ఆ రాష్ట్రంలో ఉన్న వైవిధ్యమైన సంస్కృతి వల్ల సాధ్యమైందని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. బలమైన ప్రాంతీయ భావన కూడా ఈ పరిస్థితికి మరొక కారణమని ప్రేరణ సింగ్ అనే రాజకీయ శాస్త్రవేత్త అంటారు.
కానీ, దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయం కూడా ఆ రాష్ట్రాలకు మరొక కొత్త సమస్యను తెచ్చి పెట్టాయి.
ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉత్తరాదితో పోలిస్తే జనాభా తక్కువ. ఇక్కడ జనాభా పెరుగుదల కూడా తక్కువగానే ఉంది.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వచ్చే ఆదాయంతో పోల్చితే పన్ను ఆదాయంలో వాటా రూపంలో ఆయా రాష్ట్రాలకు తిరిగి వస్తున్న డబ్బు తక్కువని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ రాష్ట్రాల్లో తక్కువ జనాభా ఉండటంతో .. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నుల నుంచి వచ్చే ఆదాయం(జనాభా ఆధారంగా) వాటా తక్కువగా ఉంటోంది. అదే సమయంలో తలసరి ఆదాయం ఎక్కువ కావడంతో ఈ రాష్ట్రాల నుంచి చెల్లించే పన్ను ఎక్కువ ఉంటోంది.
దీంతో, ఇది ఈ రాష్ట్రాల అభివృద్ధి విజయానికి లభించే శిక్షలా ఉంటుంది.
తాజాగా అమలు చేసిన పన్నుల సంస్కరణలతో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారయిందని చాలామంది భావిస్తారు.
గతంలో రాష్ట్రాలన్నీ పరోక్ష పన్నుల ద్వారా వారి ఆదాయాన్ని పెంచుకుంటూ ఉండేవి. దీంతో, తమిళ నాడు లాంటి రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం లాంటి సొంత విధానాలను రూపొందించుకునేందుకు ఆర్థిక స్వాతంత్య్రం లభించేది.
కానీ, దేశమంతటినీ ఒకే మార్కెట్ కింద ఏకం చేసే ఉద్దేశంతో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ని ప్రవేశపెట్టడంతో రాష్ట్రాలు తమ సొంత ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో, రాష్ట్రాలు కేంద్రం చేసే ఆర్థిక బదిలీలపై ఎక్కువగా ఆధారపడటం మొదలయింది.

"పన్నులకు సంబంధించిన అన్ని అంశాలను రాష్ట్రాల చేతి నుంచి లాక్కుని, అందరినీ జీఎస్టీ పరిధిలోకి చేర్చి, రాష్ట్రాలు వారి రెవెన్యూ విధానాలను ఎలా నిర్ణయించుకుంటాయి?" అని తమిళనాడు ఆర్ధిక మంత్రి పి.త్యాగరాజన్ ప్రశ్నించారు.
"రాష్ట్రాలను మున్సిపాలిటీల మాదిరిగా మార్చేశారు" అని ఆరోపించారు.
దీంతో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఉదాహరణకు 2020లో జీఎస్టీ విషయంలో రాష్ట్రాలకు, దిల్లీకి మధ్య సుదీర్ఘమైన రాజకీయ పోరాటం జరిగింది. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసును వేస్తామని బెదిరించడంతో రాష్ట్రాలకు న్యాయపరంగా అందాల్సిన వాటాను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.
ఈ ఏడాది మొదట్లో ఇంధన ధరలను రాష్ట్రాలే తగ్గించుకోవచ్చు అని కేంద్రం చెప్పడంతో కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ విషయంలో గొడవ నడిచింది. ఈ విషయంలో చాలా దక్షిణాది రాష్ట్రాలు వెనుకడుగు వేశాయి.
ఇది అంత సులభంగా పరిష్కారాలు దొరికే సమస్య కాదు.
ఒక వైపు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల విషయంలో తమిళనాడులోని పౌరుల మాదిరిగా తమను కూడా చూడాలని భావించే ప్రజలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నారు. మరో వైపు తమిళనాడులో పౌరులు క్లిష్టమైన పన్ను వ్యవస్థ ద్వారా తమకు వెచ్చించుకోవాల్సిన ఖర్చును తగ్గించుకుని ఉత్తర్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ డబ్బు చేరుతోంది.
ఇది మాత్రమే కాదు. దేశం 2026లో నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాదికి మధ్య సంబంధాలు మరింత ఆందోళనకరంగా మారే అవకాశముంది.
దేశంలో మారుతున్న జనాభాకు ప్రాతినిధ్యం వహించేందుకు 1976లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీనిని బట్టీ చూస్తుంటే, ఆదాయం కోల్పోవడంతో పాటు సొంత విధానాల రూపకల్పనకు స్వతంత్రం లేకపోవడంతో సుభిక్షమైన దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో పార్లమెంటులో దొరికే సీట్లు తక్కువగా ఉండే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిథాలీ రాజ్: ‘క్రికెట్ కిట్ పట్టుకుని వెళ్తే.. హాకీ ప్లేయర్వా? అని అడిగేవారు’
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్.. 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












