ఆంధ్రప్రదేశ్‌లోనే రాజ్యద్రోహం కేసులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
రాజ్యద్రోహం కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. 2021లో దేశం మొత్తమ్మీద 76 కేసులు నమోదైతే.. రాష్ట్రంలో అత్యధికంగా 29 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టం కింద ఇన్ని కేసులు నమోదు కావడానికి కారణం ఏమై ఉంటుందా? అని బీబీసీ తెలుగు పరిశీలించింది.
కనుమూరి రఘరామ కృష్ణం రాజు నిత్యం మీడియాలో నలిగే పేరు. 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన ఆయన.. తొలిదశలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా, విపక్ష తెలుగుదేశం నాయకులకు వ్యతిరేకంగా తీవ్రమైన పరిభాషలో విమర్శలు కురిపించేవారు.
అయితే, పార్టీ అధిష్టానంతో విభేదాలు వచ్చినప్పటినుంచి రివర్స్ గేర్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద తరచుగా అంతకంటే తీవ్రమైన భాషలో రఘరామ కృష్ణం రాజు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/RAGHURAMKRISHNAM RAJUU KANUMUR
నిరుడు మే 14న రాజ్యద్రోహం కేసుపెట్టి రఘరామ కృష్ణం రాజును అరెస్టు చేశారు. క్రైస్తవులకు, రెడ్లకు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారని, మతాలు కులాల పేర్లు పెట్టి వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు పెట్టారు.
ఐపీసీలోని సెక్షన్-124 ఏతో పాటు మత వైషమ్యాలను రెచ్చగొట్టే నేరం-153ఏ, హింసను ప్రేరేపించే నేరం-505బీ కింద కేసులు దాఖలు చేశారు.
అరెస్ట్ అయిన వారం తర్వాత మే 21న సుప్రీం కోర్టులో బెయిల్ లభించడంతో ఆయన విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఇదే కేసులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా సంస్థలను కూడా నిందితుల జాబితాలో చేర్చారు.
అరెస్ట్ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన గాయాలపై సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన వైద్యుల బృందం నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు కూడా ఆయనకు కొన్ని గాయాలయ్యాయని నిర్ధారించింది.

ఇదేం కొత్త కాదు..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టడం ఇదేమీ కొత్తకాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం అగ్రనాయకత్వంలో మెజారిటీ నాయకులు కేసులు ఎదుర్కొంటున్నారు. కానీ సొంత పార్టీ ఎంపీ మీదే రాజ్యద్రోహం కేసు పెట్టడంతోపాటు లాకప్‌లో కొట్టారని వార్తలు రావడం మాత్రం కేసుల పరంపరలో పతాకస్థాయి అని చెప్పుకోవచ్చు.
జగన్ మద్దతుదారులు, వ్యతిరేకులు అని చీలిపోయిన సమాజంలో మీడియాలో కూడా ఆ ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ-5 మీడియా సంస్థలను ఎల్లో మీడియాగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి జగన్ తరచు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అధికార నాయకులు ఆ మీడియా ప్రతినిధులను విలేఖరుల సమావేశాల నుంచి బయటకు పంపిస్తుంటారు కూడా. మరోవైపు టీడీపీ నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో సాక్షి విలేఖరుల పట్ల ఇలాగే వ్యవహరిస్తుంటారు.

రాజ్యద్రోహం కేసులో రఘరామ కృష్ణం రాజుతోపాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానళ్లపై కూడా కేసులు మోపిన తీరు ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న పోలరైజ్డ్ పొలిటికల్ వాతావరణానికి అద్దం పడతాయి.

"రాజ్యద్రోహంతోపాటు అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం(యుఏపిఏ), జాతీయ భద్రత చట్టం.. లాంటి కీలక చట్టాలను సామాన్యుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్నారు. జామీను కూడా ఇవ్వడానికి వీల్లేని కేసులు పెడుతున్నారు. ఉరి వేసే నేరాల తరువాత తీవ్రమైన నేరాల జాబితాలో రాజ్యద్రోహం మొదటిది. 2014 తరువాత పెట్టిన రాజ్యద్రోహం కేసులలో 96 శాతం కేసులను అధికార పార్టీ నాయకులను విమర్శించినందుకే పెట్టినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ కేసుల్లో కనీసం ప్రాథమిక సాక్ష్యాలు కూడా ఏమైనా ఉన్నాయో లేదో తెలియదు. దర్యాప్తు చేస్తున్నాం, ఆధారాలు దొరకగానే సమర్పిస్తాం అని మాత్రం కోర్టులకు పోలీసులు విన్నవిస్తుంటారు" అని సమాచార కమిషన్ మాజీ సభ్యులు లా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL
మావోయిజం లేదంటూనే విపరీతంగా కేసులు
ఈ కేసు కాకుండా రాష్ట్రంలో మిగిలిన రాజ్యద్రోహ కేసులన్నీ వామపక్ష మిలిటెన్సీకి సంబంధమైన కేసులే. మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారు అంటూ రకరకాల ఆరోపణలు మోపుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పెట్టిన కేసులు వీటిలో ఉన్నాయి. వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా వీటిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఉదాహరణకు వరలక్ష్మి ప్రొద్దుటూరులో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె విప్లవ రచయితల సంఘంలో సభ్యురాలు. ప్రజా సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారు. నిరుడు మార్చి 31న ఎన్‌ఐఏ ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించింది. అదే సమయంలో రాష్ట్రంలోని పలుచోట్ల పలువురు ప్రజాసంఘాల కార్యకర్తల ఇళ్లలో సోదాలు జరిగాయి. రాజ్యద్రోహంతో పాటు చాలా కేసులు చాలా మందిపై దాఖలు చేశారు.
మావోయిస్టలకు సహకరిస్తూ రాజ్యద్రోహానికి పాల్పడుతున్నారనేది సెడిషన్ కేసులకు మూలం. కొందరిపై రాజ్యద్రోహంతో పాటు తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కేసు కూడా దాఖలు చేశారు. ఈ కేసుల్లో కొందరికి బెయిల్ వచ్చింది. మరికొందరు ఇంకా జైళ్లలోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
ప్రజల తరపున గొంతెత్తే వారిపై కేసులు పెట్టి, వేధించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని వరలక్ష్మి బీబీసీ తెలుగుతో అన్నారు. మావోయిస్టు పార్టీలో చేరికకు సహకరిస్తున్నామనేది తమపై మోపిన అభియోగమని, అది పూర్తిగా నిరాధారమని ఆమె చెప్పుకొచ్చారు.
ఆంధ్రలో మావోయిజం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని పాలకులతోపాటు పోలీస్ అధికారులు ఓ వైపు ప్రకటిస్తూ ఉండగా.. మరోవైపు మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో ఇన్ని రాజ్యద్రోహం కేసులు ఎన్‌ఐఏ పెట్టడం ఆసక్తి కలిగించే విషయం.
2021 ఆగష్టులో నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా- ఆంధ్రప్రదేశ్‌లో మావోయిజం పూర్తిగా తగ్గుముఖం పట్టిందన్నారు. ఏవోబీలో భూమి సమస్యలు పరిష్కారం కావడం, విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజనుల నుంచి మావోయిస్టులకు సహకారం కనిపించడం లేదని, దీన్ని పూర్తిగా అదుపు చేయగలిగామని ఆయన చెప్పారు.
మావోయిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిన దశలో ఉందని ప్రస్తుత డీజీపీ రాజేందర్ రెడ్డి కూడా అన్నారు.
"ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు నియంత్రించాం. స్థానికుల నుంచి కూడా వారికి సహకారం లేదు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు ఏవోబీలో ఉనికి చాటుకునే యత్నాలు చేస్తున్నారు తప్ప.. ఏపీలో వామపక్ష తీవ్రవాదం తుడిచిపెట్టుకుపోయే దశలో ఉంది"అని మే 22న రాజేందర్ రెడ్డి అన్నారు.
స్వయంగా పోలీస్ బాసులే ఒకరి వెంట ఒకరు మావోయిజం తుడిచిపెట్టుకుపోతోందని చెప్తూ ఉంటే దేశంలోనే అత్యధికంగా రాజ్యద్రోహం కేసులు మావోయిస్టు సానుభూతి పరుల మీద పెట్టడం సమన్వయం కుదరని అంశం.
నచ్చని భావజాలం ఉంటే వేధింపులు: పౌరహక్కుల నేతలు
రాజ్యద్రోహం, యూఏపీఏ పేరుతో నిరాధారమైన ఆరోపణలు మోపి, అరెస్టుల చేస్తున్నారని పౌర హక్కుల సంఘం నాయకుడు చిలుక చంద్రశేఖర్ అన్నారు. ఇటీవల ఏపీలో నమోదయిన కేసులను గమనిస్తే ఇది స్పష్టమవుతుందన్నది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ప్రజాసంఘాల కార్యక్రమాలను అడ్డుకునే యత్నం జరుగుతోంది. అందుకే తీవ్రమైన కేసులతో వేధిస్తున్నారు. కేసుల్లో ప్రస్తావిస్తున్న అంశాలు కూడా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. గత ఏడాది నమోదయిన వాటిలో విశాఖ ఏజన్సీలో ఎక్కువ కేసులున్నాయి. అందులో ముంచింగిపుట్టు, పెదబయలు కేసులతో పాటుగా పిడుగురాళ్ల కేసు కూడా ఉంది. మేం నిర్వహించిన సమావేశానికి హాజరయ్యి ప్రభావితమయిన వ్యక్తి.. మావోయిస్టుల్లో చేరారన్నది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అభియోగం. దానికి ఆధారాలుండవు. అలానే పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా మావోయిస్టులతో కొందరు ప్రజాసంఘాల కార్యకర్తలు సమావేశమయ్యారంటూ కేసు పెట్టారు. ఇలాంటి కేసులతో ప్రజా సంఘాలను అడ్డుకోవడమే లక్ష్యంగా భావిస్తున్నాం"అని ఆయన వివరించారు.
విచారణ జరిగి శిక్షలు పడేవి అతితక్కువ అని, ఊరికే వేధించడానికే ఈ కేసులు పెడతారనేది ఎక్కువ మంది కార్యకర్తల అభిప్రాయం.
రాజ్యద్రోహం, యూఏపీఏల కింద చాలా మందిని నిర్బంధిస్తున్నారని విశాఖపట్నానికి చెందిన సీనియర్ న్యాయవాది కే ఎస్ చలం అన్నారు.
"విశాఖలో ఏజెన్సీ ప్రాంతం, ఏవోబీలోని ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా పెడుతున్నారు. ఇప్పటికీ రాజ్యద్రోహం కేసుల్లో 24 మంది జైలులో ఉన్నారు. వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. ఎన్ఐఏ విచారణ చేసిన కేసుల్లో ఆధారాలు లేకుండానే అరెస్టులు చేస్తున్నారు. ఒక పెదబయలు కేసులో ఇటీవల 150 మంది మీద పెట్టారు. ఇలాంటివి చాలా ఉన్నాయి"అని ఆయన వివరించారు.
ఏపీకి సంబంధించి 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఒక్క రాజ్యద్రోహం కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇక 2014, 16, 18ల్లో మాత్రం ఒక్కో కేసు చొప్పున నమోదయ్యింది. అంటే 2014 నుంచి 2020 వరకూ ఏడేళ్లలో కేవలం మూడు కేసులు మాత్రం ఈ సెక్షన్ కింద నమోదయ్యాయి. అవి కూడా మావోయిస్టు మద్దతుదారుల పేరుతో మాత్రమే రిజిస్టర్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కాలం చెల్లిన చట్టమా!
రాజ్యద్రోహం అనేది బ్రిటిష్ వారు స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడానికి ఉపయోగించిన చట్టమని, దాన్ని తీసేయకుండా రాజకీయ ప్రత్యర్థులను, భావజాల ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రభుత్వాలు వాడుకోవడం అన్యాయమని కొందరు న్యాయవాదులు, లీగల్ యాక్టివిస్టులు చెపుతున్నారు.
"దేశంలో రాచరికం లేదు. ఇక రాజ్యద్రోహం ఏమిటీ అనే ప్రశ్న చాలాకాలంగా ఉంది. అయినా గానీ ప్రజాస్వామ్యవాదులను, ప్రశ్నించే వారిని ప్రభుత్వం రాజ్యద్రోహులుగా కేసులు పెడుతోంది. ఎన్ఐఏతో కేంద్రం, సీఐడీతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులకు అత్యుత్సాహం చూపుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రభుత్వాన్ని నిలదీయడం పౌరుడి బాధ్యత. ఆ పనిచేస్తున్న వారిని దేశభక్తులుగా, దేశాభివృద్ధికి తోడ్పడే వారిగా చూడాలి. కానీ దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్ అంటూ ముద్రలు వేసి జైల్లో పెట్టడం తగదు" అని ఎపి బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు వ్యాఖ్యానించారు.
వివాదాస్పదంగా ఉన్న ఈ చట్టాన్ని పునస్సమీక్ష చేయాలని ఈ ఏడాది మే 11న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆదేశించారు. సమీక్ష పూర్తయ్యేవరకూ ఈ చట్టం అమలును నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు.
సంబంధిత సెక్షన 124ఏ కింద కేసులు నమోదు చేసే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఈ సెక్షన్ కింద కేసులు ఎదుర్కోంటూ ఆరు నెలలుగా జైళ్లలో ఉన్నవారు బెయిల్ పొందొచ్చు అని కూడా చెప్పారు. బాల్ ఇపుడు సుప్రీం కోర్టులో ఉంది.
ఇవి కూడా చదవండి:
- 269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని సోవియట్ యూనియన్ పొరపాటున కూల్చినప్పుడు..
- హైటిజం: ఎత్తుగా ఉన్నవారికే ప్రమోషన్లు వస్తాయా, జాబ్‌లో ఎదగాలంటే ఎంత ఎత్తు ఉండాలి?
- నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












