భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలకు నేటితో నాలుగేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?

భీమా కోరేగావ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగి నేటితో నాలుగేళ్లు. ఈ కేసులో ఇప్పటివరకూ 16మంది ఉద్యమకారులు, కవులు, లాయర్లను పోలీసులు నిర్బంధించారు. అరెస్ట్ అయిన వారిలో ఆనంద్ తెల్తుంబ్డే, గౌతమ్ నవలఖా, వరవరరావు, స్టాన్ స్వామి, సుధా భరద్వాజ్, వెర్నన్ గోంజాల్వెజ్ తదితరులు ఉన్నారు.
భీమా కోరేగావ్ హింస దేశంలో సామాజిక, రాజకీయ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించింది.
పుణె పోలీసుల ప్రాథమిక విచారణ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - ఎన్ఐఏ)కు అప్పగించింది.
అక్టోబర్ రెండవ వారంలో ఈ కేసుకు సంబంధించిన 10,000 పేజీల చార్జ్‌షీట్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది.
ఇంతకు ముందు ఎవరెవరిని అరెస్ట్ చేశారు
భీమా కోరేగావ్ కేసులో భాగంగా కొందరు ప్రముఖులను పోలీసులు అరెస్టు చేశారు. అసలు వారిని ఎందుకు అరెస్టు చేశారు? వారిపై ఎలాంటి ఆరోపణలు మోపారు? అసలు ఈ అరెస్టులు ఎలా మొదలయ్యాయి?
31 డిసెంబర్ 2017: పుణేలోని చారిత్రాత్మక శనివార్‌వాడాలో '‘ఎల్గార్ పరిషత్'’ సమావేశం జరిగింది. ఇందులో ప్రకాష్ అంబేడ్కర్, జిగ్నేష్ మేవానీ, ఉమర్ ఖాలిద్, సోనీ సోరీ, బీజీ కోల్సే పాటిల్ తో సహా పలువురు పాల్గొన్నారు.
1 జనవరి 2018:పుణే జిల్లాలోని భీమా కోరేగావ్‌లో హింస జరిగింది. అక్కడి యుద్ధ స్మారకం వద్ద వేలాది మంది దళితులు గుమిగూడారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి, మరాఠాలకు మధ్య జరిగిన పోరాటానికి గుర్తుగా అక్కడ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. అప్పుడు అక్కడ హింస చెలరేగింది. రాళ్లు విసిరారు. కొన్ని వాహనాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి. ఒక వ్యక్తి మరణించారు.
2 జనవరి 2018: పింప్రి పోలీస్ స్టేషన్లో హిందుత్వ మతవాదులు శంభాజీ భీడే, మిలింద్ ఏక్బోటేతో సహా మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం పుణే గ్రామీణ పోలీసులకు అప్పగించారు.
8 జనవరి 2018:శనివార్‌వాడాలో ఎల్గార్ పరిషత్ కు సంబంధించిన వ్యక్తులు ఇచ్చిన ప్రసంగాలవల్లే ఆ మర్నాడు హింసలు చెలరేగాయని తుషార్ దాంగుడే అనే వ్యక్తి పుణేలోని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే తరువాతి నెలల్లో దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు.
భీమా కోరేగావ్ కేసులో రెండు వేరు వేరు సమయాల్లో అరెస్టులు జరగడం వలన పోలీసులు ఈ కేసులో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్, పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్, మొబైల్ ఫోన్ లాంటి సాధనాల ద్వారా లభ్యమైన సమాచారం ఆధారంగా ఛార్జిషీట్లు తయారు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో పోలీసులు మొదటి చార్జ్‌షీట్ నమోదు చేసిన తరువాత, 2019 ఫిబ్రవరి 21న ఒక అనుబంధ చార్జ్‌షీట్‌ను ఫైల్ చేసారు.
2018 మే 17న యూఏపీఏ చట్టం ఐపీసీ 13, 16, 18, 18బీ, 20, 39, 40 సెక్షన్ల కింద పూణె పోలీసులు ఈ కేసు నమోదు చేసారు.
ఎన్ఐఏ కూడా 2020 జనవరి 24న..భారతీయ శిక్షా స్మృతిలోని 153ఏ, 505(1)(బి), 117, 34 సెక్షన్ల కింద, యూఏపీఏలోని 13, 16, 18, 18బి, 20, 39 సెక్షన్ల కింద ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
మొత్తం దేశాన్ని కదిలించిన ఈ సంఘటన, పలువురి అరెస్టుల తరువాత ఏఏ మలుపులు తీసుకుంది? ఏం జరిగింది?
ఎన్ఐఏ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అన్ని చార్జ్‌షీట్లు దాఖలు చేసినట్టేనా? న్యాయ విచారణ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? భీమా కోరేగావ్ హింసకు కారణం ఎవరు? దోషులకు కనిపెట్టడంలో దర్యాప్తు సంస్థలు ఎంతవరకు విజయం సాధించాయి?
ఈ వివరాలన్నిటినీ ఈ కథనంలో పరిశీలిద్దాం..
ఇందులో ఎవరి పాత్ర ఎంత? పోలీసుల ఛార్జిషీట్ ఏం చెప్తోంది?
సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్, మహేష్ రౌత్ అరెస్ట్‌ల విషయంలో దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం...
కబీర్ కళా మంచ్ క్రియాశీల సభ్యుడు సుధీర్ ధావలేను నిషిద్ధ మావోయిస్టు పార్టీకి చెందిన తమ సభ్యులు రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్ ద్వారా సంప్రదించారు. కబీర్ కళా వేదిక పేరు మీద ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని వాళ్లు అడిగారు. భీమా కోరేగావ్ 200 వార్షికోత్సవ సందర్భంగా దళిత సంస్థలన్నిటినీ ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోనా విల్సన్, సుధీర్ ధావలే, పరారీలో ఉన్న కామ్రేడ్ ఎమ్ ఉరఫ్ మిలింద్ తేల్‌తుంబ్డే, ప్రకాష్ ఉరఫ్ రితుపర్ణ్ గోస్వామిలతో కలిసి ఒక కుట్ర పన్నారు. దాని ప్రకారం 2018 జనవరి 1 న భీమా కోరేగావ్‌లో సుధీర్ దావలే, హర్షాలీ పోత్దార్‌తో సహా కబీర్ కళా వేదిక సభ్యులు అంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారు. డిసెంబర్ 31 న వారంతా ఎల్గర్ పరిషత్ ద్వారా పాటలు పాడుతూ నినాదాలు చేసారు. వీధి నాటకాలు ప్రదర్శించారు. ఈ కారణంగా శాంతిభద్రతలకు భంగం కలిగిందని, హింసలు చెలరేగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.
దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల బ్రాహ్మణవాద భావజాలంతో దళితులు అసంతృప్తిగా ఉన్నారని, ఆ అభద్రతా భావాన్ని ఆసరాగా చేసుకుని దళితులందరినీ సంఘటితం చేయ్యాలని పథకం పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికోసం నిషిద్ధ మావోయిస్టు పార్టీ, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్ సహాయంతో డబ్బులు సమకూర్చింది. ఒక ప్రముఖ సీపీఐ మావోయిస్టు కమిటీ సభ్యుడు 2017 జూలై, ఆగస్టులలో ధావలేకు డబ్బులు సమకూర్చారు.
ఈస్ట్రన్ రీజనల్ బ్యూరో (ఈఆర్‌బీ) సమావేశంలో నిర్ణయించినట్లుగా సీపీఐ మావోయిస్టు పథకాన్ని అమలుపరచడమే ఎల్గార్ పరిషత్ ముఖ్య ఉద్దేశ్యమని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగా పరారీలో ఉన్న కామ్రేడ్ మంగ్లూ, కామేడ్ దీపూ 2017 నవంబర్-డిసెంబర్‌ల్లో ధావలేతో కలిసి పనిచేసారు. మహారాష్ట్రలోని పలు దళిత సంఘాల మద్దతు సేకరించారు.

గాడ్లింగ్, సేన్, ధావలేలకు మహేష్ రౌత్ ద్వారా ఐదు లక్షల రూపాయలు అందినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, ఈ డబ్బును నిషిద్ధ సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిందని పోలీసులు చెబుతున్నారు.మహేష్ రౌత్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను గెరిల్లా పోరాటంలో శిక్షణ కోసం అడవులకు పంపించారని చెబుతున్నారు. రితుపర్ణ గోస్వామి, షోమా సేన్‌కు రాసిన లేఖలో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. నిషిద్ధ మావోయిస్టు పార్టీలో రౌత్ క్రియాశీల సభ్యుడని, పార్టీలో కొత్తవారిని చేర్పించడం అతని పని అని చెబుతున్నారు.
రోనా విల్సన్, గాడ్లింగ్ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ల ద్వారా తూర్పు ప్రాంతీయ బ్యూరో సీపీఐ మావోయిస్టు సమావేశం వివరాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశం 2015 డిసంబర్‌లో జరిగిందని, ఆ సమావేశంలో దళితులను, మహిళలను, మైనారిటీలను ఏకం చెయ్యాలని నిర్ణయించినట్టు పోలీసులు చెబుతున్నారు.
రోనా విల్సన్ కంప్యూటర్ నుంచీ 'ప్రస్తుత సవాళ్లు-మన పని ' అనే శీర్షికతో ఒక కరపత్రం పోలీసులకు లభించింది. దీన్ని సీపీఐ మావోయిస్టు సభ్యులందరికీ పంచారు. ఈ కరపత్రం 16 వ పేజీలో మన కార్యకలాపాలన్నీ భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని రాసి ఉంది. వీరి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఎల్గార్ పరిషత్ సహాయం తీసుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
నిషేధిత పార్టీ సభ్యుడు, ఈఆర్‌బీ సెక్రటరీ కిషన్‌దా అలియాస్ ప్రశాంత్ బోస్‌తో కలిసి ప్రధానమంత్రి హత్యకు, దేశంలో యుద్ధానికి కుట్ర పన్నారని పోలీసులు రోనా విల్సన్‌పై ఆరోపణలు నమోదు చేశారు.
నిందితులు భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థనే తారుమారుచేసే లక్ష్యంతో సీపీఐ మావోయిస్టులు పన్నిన భారీ కుట్రను అమలు చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తేల్చారు.
అనుబంధ చార్జిషీట్
వరవరరావు, సుధా భరద్వాజ్, వెర్నన్ గోంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా అరెస్ట్ తర్వాత ఈ చార్జిషీట్‌ను దాఖలు చేశారు,.
రోనా విల్సన్, పరారీలో ఉన్న నిందితుడు కిషన్‌దా అలియాస్ ప్రశాంత్ బోస్‌తో కలిసి వరవరరావు ఆయుధాలు, మందుగుండు కొనుగోళ్లకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
సీపీఐ మావోయిస్టు సీనియర్ నేత అయిన వరవరరావు నిషేధిత సంస్థ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దానితోపాటు నేపాల్ మావోయిస్టు నేత వసంత్‌తో వరవరరావు ఆయుధాల ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. నిధులు సేకరించి, వాటిని మిగతా నిందితుల దగ్గరకు చేర్చారని కూడా ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.
పరారై, అజ్ఞాతంలో ఉన్న తమ సహచరులకు వరవరరావు, గాడ్లింగ్ పోలీసులు, భద్రతా బలగాల కదలికల గురించి సమాచారం ఇచ్చేవారని, దానివల్ల ఎన్నో హింసాత్మక దాడులు జరిగాయని, ఎంతో ప్రాణనష్టం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్ కూడా సీపీఐ మావోయిస్టు సభ్యులే. వారు యువకులను తమలో చేర్చుకునేవారు. నిషేధిత సంస్థ భావజాలాన్ని ప్రచారం చేసేవారు.
గొంజాల్వెజ్‌ను ఇంతకు ముందు కూడా ఆర్మ్స్ యాక్ట్, ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. ముంబయి కాలా చౌకీ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఒక కేసు నమోదైంది. ఒక కేసులో ఆయన శిక్ష కూడా అనుభవించారు. గొంజాల్వెజ్ కూడా యాక్టివ్ మావోయిస్టు కార్యకర్తేనని పోలీసులు చెబుతున్నారు.
అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్(ఐఏపీఎల్) సీపీఐ మావోయిస్టులకు చెందిన సంఘమే అని పోలీసులు ఆరోపిస్తున్నారు. సుధా భరద్వాజ్, గాడ్లింగ్ ఆ సంఘంలో సభ్యులని, సీపీఐ మావోయిస్టు సభ్యులు వారికి ఆర్థిక సాయం అందిస్తారని అంటున్నారు.
వరవరరావు రివల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్(ఆర్డీఎఫ్) అధ్యక్షుడని, అది నిషేధిత మావోయిస్టు సంస్థ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని చార్జిషీటులో చెప్పారు. సీపీఐ మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఆయన ఎన్నో సమావేశాలు, సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేశారని తెలిపారు. వరవరరావు, సోమా సేన్, మహేష్ రౌత్, పరారీలో ఉన్న రితూపర్ణ గోస్వామి హైదరాబాద్ ఆర్డీఎఫ్ వార్షిక సదస్సులో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం పర్సిక్యూటెడ్ ప్రిజనర్స్ సాలిడేటరీ కమిటీ(పీపీఎస్‌సీ) కూడా సీపీఐ మావోయిస్టు సంస్థలో భాగమే. పీపీఎస్‌సీకి వరవరరావు ద్వారా సీపీఐ మావోయిస్టు సభ్యులు నిధులు అందించేవారని, సుధా భరద్వాజ్ పీపీఎస్‌సీలో కీలక సభ్యులని పోలీసులు చెబుతున్నారు.
ఎన్ఐఏ సమర్పించిన 10వేల పేజీల చార్జ్‌షీట్
సోషల్ యాక్టివిస్ట్ గౌతమ్ నవలఖాకు కశ్మీరీ వేర్పాటువాదులు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, మావోయిస్టు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్ పేర్కొంది.
ఈ చార్జ్‌షీట్ ప్రకారం...కశ్మీరీ అమెరికన్ కౌన్సిల్‌లో ప్రసంగించడానికిగానూ 2010-11లో నవలఖా మూడుసార్లు అమెరికా వెళ్లారు. 2011లో గులాబ్ నబీ ఫాయీని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అరెస్ట్ చేసిన తరువాత ఫాయీ తరపు న్యాయవాదికి నవలఖా లేఖ రాసారు.
నవలఖాను పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కొందరు అధికారులకు ఫాయీ పరిచయం చేసారని కూడా ఈ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
నవలఖానుంచీ స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైస్‌ల ద్వారా ఆయనకు మావోయిస్టులు, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని రుజువయ్యిందని తెలిపారు.
దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబు తన విద్యార్థులకు మావోయిస్ట్ భావజాలాన్ని బోధిస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది.
అంతేకాకుండా, మిలటరీ అఫైర్స్ కేసీఎం (ఎంసీ) ఇంఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ సెక్రెటరీ పైఖోబా మైటీతో హనీబాబుకు సంబంధాలున్నాయని ఎన్ఐఏ తెలిపింది. జైలు నుంచి విడుదలైన సీపీఐ (మావోయిస్ట్) క్యాడర్ కోసం కూడా ఆయన నిధులు సేకరించారని ఆరోపించింది. వీటికి సంబంధించిన అభ్యతరకరమైన ఈమెయిల్స్ హనీ బాబు అకౌంట్‌లో దొరికాయని ఎన్ఐఏ తెలిపింది.
విదేశీ జర్నలిస్టులకు, సీపీఐ (మావోయిస్ట్) సభ్యులకు మధ్య సమావేశం ఏర్పాటు చేసారని, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో ఉన్న నిషిద్ధ రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్‌తో కలిసి పనిచేసారని ఆరోపించింది.
కబీర్ కాలా మంచ్‌కు చెందిన సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్, జ్యోతి జగ్తాప్..ముగ్గురూ శిక్షణ పొందిన సీపీఐ (మావోయిస్ట్) సభ్యులని ఎన్ఐఏ ఆరోపించింది.
భీమా కోరేగావ్ శౌర్య ప్రేరణా అభియాన్ సమన్వయకర్తలలో ఆనంద్ తెల్తుంబ్డే ఒకరని, 2017 డిసెంబర్ 31న శనివార్ వాడాలో ఆయన కూడా ఉన్నారని ఎన్ఐఏ చార్జ్‌షీట్ పేర్కొంది.
బెయిల్ పిటీషన్ పెట్టుకున్న నిందితులు
గౌతం నవలఖా ముంబై హై కోర్టుకు బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ బెయిల్‌పై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
భీమా కోరేగా కేసులో అరెస్టయినవారితో జైలు అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని తరచూ ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మేరకు, 2020 డిసెంబర్‌లో ముంబై హై కోర్టు, తలోజా జైలు అధికారులను మందలించింది. నవలఖాకి కొత్త కళ్ళజోడు అందించడానికి నిరాకరించిన జైలు అధికారులను ఉద్దేశిస్తూ.. నిర్బంధంలో ఉన్న వారిపట్ల మానవత్వంతో ప్రవర్తించాలని సూచించింది.
వరవరరావు
2020 డిసెంబర్ 21న ముంబై హై కోర్టులో వరవరరావు పెట్టుకున్న బెయిల్ పిటీషన్ విచారణ జరిగింది. అనారోగ్య కారణాలవలన ఆయనకు బెయిల్ మంజురు చేయవలసిందిగా ఆయన భార్య హేమలత రావు కోరారు.
నవంబర్‌లో కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే వరవరావును ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకీ దిగజారుతుండడంతో చికిత్సకోసం బెయిల్ ఇవ్వవలసిందిగా కోరుతూ పిటీషన్ పెట్టుకున్నారు.
ఆయన బెయిల్‌పై తరువాతి విచారణ 2021 జనవరి 7న జరగనుంది.
వరవరరావు ఆరోగ్యంగానే ఉన్నారని, తిరిగి జైలుకు పంపవచ్చునని ఎన్ఐఏ హై కోర్టుకు తెలిపింది.
అయితే, ఫిబ్రవరి 22న షరతులపై ఆయనకు బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.
స్టాన్ స్వామి
అక్టోబర్ మొదటివారంలో ఎన్ఐఏ స్టాన్ స్వామిని అరెస్ట్ చేసింది. ఆయనకు నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపించింది.
స్వామి ఈ ఆరోపణలన్నిటినీ ఖండించారు.
కొద్ది రోజుల క్రితం స్టాన్ స్వామికి స్ట్రా ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న స్టాన్ స్వామి నీళ్లు తాగడానికి స్ట్రా లేదా సిప్పర్ కావాలని అడిగారు. అందుకు జైలు అధికారులు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించి తలోజా జైలుకు సిప్పర్లను పంపించారు. ఇది జరిగిన మూడు వారాల తరువాత ఆయనకు స్ట్రా ఇచ్చేందుకు జైలు అధికారులు అంగీకరించారు.
2021 మే నెలలో కోవిడ్ సోకడంతో ఆయన్ను జైలు నుంచి ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
తర్వాత జూలై 7న గుండెపోటుతో ఆయన మరణించారు.
"తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడలేదు" అని ముంబైలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ డిసౌజా ప్రకటించారు. సోమవారం జూలై 7న మధ్యాహ్నం 1.30 గంటలకు స్టాన్ స్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సుధా భరద్వాజ్
సుధా భరద్వాజ్‌ను బైకుల్లా మహిళా జైల్లో నిర్బంధించారు. జైల్లో చదువుకునేందుకు పుస్తకాలు, వార్తాపత్రికలు కావాలని ఆమె కోరారు.
జైలు అధికారులు తన క్లైంట్స్‌కు పుస్తకాలు, వార్తాపత్రికలను అందించడానికి నిరాకరిస్తున్నారని సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, హనీ బాబు తరఫు న్యాయవాది చందాని చావ్లా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ఒక అవిడవిట్ పెట్టమని కోర్టు లాయర్లకు సూచించింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 12న ఉంటుంది.
2018లో సుధా భరద్వాజ్‌ను అరెస్ట్ చేసారు. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్ 60 సార్లు విచారణకు వచ్చినా కానీ ఒక్కసారి కూడా పరిగణించలేదని లాయర్ నిషాల్ సింగ్ రాథోడ్ తెలిపారు. 40 సందర్భాలలో పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరచలేదని రాథోడ్ తెలిపారు.
భద్రతా కారణాల వలన ఆమెకు కోర్టుకు తీసుకు రాలేకపోయామని పోలీసులు తెలిపారు.
భీమా కోరేగావ్ ప్రాముఖ్యత
1818లో భీమా కోరేగావ్‌లో పేష్వాల నేతృత్వంలో మరాఠాలకు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో మహర్ సైనికులు బ్రిటిష్ వారివైపు నిలిచి మారాఠాలతో పోరాడారు. మహర్ సైనిక బలం సహాయంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పేష్వాలను ఓడించింది.
వీర మహర్ సైనికుల గుర్తుగా భీమా కోరేగావ్‌తో ఒక విజయ స్తంభాన్ని నిలిపారు. దీనిపై ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మహర్ సైనికుల పేర్లను చెక్కారు. ప్రతీ ఏడాదీ జనవరి 1నాడు వేలమంది దళితులు ఇక్కడ గుమికూడి వీర మరణం పొందిన మహర్ సైనికులకు గౌరవ వందనాలు అర్పిస్తారు.
భీమా కోరెగావ్ హింసాకాండలో పోలీసులు దేశవ్యాప్తంగా చాలామందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొంతమంది స్కాలర్లు, కొంతమంది లాయర్లు, రచయతలు-కవులు, కొందరు మానవ హక్కులు లేదా దళిత హక్కుల కార్యకర్తలు ఉన్నారు. వీరంతా తమ తమ రంగాల్లో ప్రముఖులు. వీరిలో కొందరు ప్రజల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ప్రసిద్ధి చెందారు.

సుధీర్ ధావలే
సుధీర్ ధావలే మహారాష్ట్రలోని ప్రముఖ సామాజిక కార్యకర్త, కవి. ఆయన మరాఠీలో విద్రోహీ పేరుతో ఒక పత్రిక ప్రచురిస్తున్నారు. అది దళిత హక్కుల కోసం గళం వినిపిస్తోంది. 2011లో ఆయనను దేశద్రోహం ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. ఆయనపై ఒక తీవ్రవాద సంస్థలో సభ్యుడుగా ఉన్నాడనే ఆరోపణలు చేశారు. తర్వాత కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. ఆ సమయంలో ఆయనకు ప్రస్తుతం భీమా కోరెగావ్ కేసులో నిందితుడుగా ఉన్న సురేంద్ర గాడ్లింగ్ లాయరుగా ఉన్నారు.
సురేంద్ర గాడ్లింగ్

సురేంద్ర గాడ్లింగ్ నాగపూర్‌లో ఉంటారు. వృత్తిపరంగా లాయరైన ఆయన మానవ హక్కులకు సంబంధించిన కేసులు వాదించేవారు. ఆయన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి కూడా. ఆయన దళిత కార్యకర్త కూడా. చాలా ఉద్యమాలలో ఉన్నారు. ఒక లాయర్‌గా ఆయన యూఏపీఏ, అంతకు ముందు పాత ఉగ్రవాద నిరోధక చట్టాలు టాడా, పోటా నిందితుల కేసులు వాదించేవారు. ఈయన మావోయిస్టులతో సంబంధాలున్నాయని అరెస్టు చేసిన దిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు కూడా లాయర్‌గా ఉన్నారు. సాయిబాబాను గడ్చిరోలీ కోర్టు దోషిగా తేల్చింది. వీల్ చెయిర్‌లో ఉండే వికలాంగ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు.
రోనా విల్సన్

జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్న విల్సన్ దిల్లీలో ఉంటారు. రాజకీయ బంధీల విడుదల కోసం ఉద్యమం చేస్తున్నారు. ఈ రంగంలో చాలా ఏళ్లుగా చురుగ్గా ఉన్న కార్యకర్తల్లో ఆయన ఒకరు. కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్(సీఆర్పీపీ)లో ఆయన సభ్యుడు కూడా. జీఎన్ సాయిబాబాను విడుదల చేయించాలని కూడా ఆయన ఉద్యమం నడుపుతున్నారు. రాజకీయంగా, సైద్ధాంతికపరంగా చురుగ్గా ఉన్న కార్యకర్తల అరెస్టులను విల్సన్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
షోమా సేన్

షోమా సేన్ ఇంగ్లిష్ ప్రొఫెసర్. ఆమె నాగపూర్ ఆర్‌టీఎం యూనివర్సిటీలో ఇంగ్లిష్ డిపార్టుమెంట్ హెడ్‌గా ఉన్నారు. భీమా కోరెగావ్ హింసలో ఆమె కూడా ఉన్నారనే ఆరోపణలతో పోలీసులు ఆమెను నాగపూర్‌లో అరెస్ట్ చేశారు. ఆమె మహిళలు, ఆదివాసీలు, దళితుల హక్కులపై వ్యాసాలు రాస్తున్నారు. ఆమె ఆర్టికల్స్ ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి. ఆమె కమిటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ సభ్యురాలు కూడా. మానవహక్కుల రంగంలో పనిచేస్తున్న చాలా సంస్థలతో షోమాకు సంబంధాలు ఉన్నాయి. ఈశాన్యం నుంచి బస్తర్ వరకూ, అత్యాచార బాధిత మహిళలు, రాజకీయ బందీల సమస్యలను ఆమె లేవనెత్తుతున్నారు. వారికి చట్టపరమైన సాయం కూడా అందించారు..
మహేష్ రౌత్

భీమా కోరెగావ్ కేసులో అరెస్ట్ అయిన వారిలో మహేష్ రౌత్ అత్యంత పిన్న వయస్కుడు. ఆయన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు చెందినవారు. మహేష్ ముంబయిలోని ప్రముఖ సంస్థ-టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చదివారు. ఆయన గ్రామీణాభివృద్ధి నిపుణులు. ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద ఫెలోషిప్ కూడా పొందారు. ఆయన గడ్చిరోలి గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామసభలతో కలిసి పనిచేసేవారు. గడ్చిరోలి మహారాష్ట్రలో ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఒక ప్రాంతం. అది మావోయిస్టు హింసకు ప్రభావితం అవుతోంది. ఆయన జల్, జంగల్, జమీన్(నీరు, నేల, భూమి) హక్కులకు సంబంధించిన ఉద్యమాల్లో కూడా చురుగ్గా ఉన్నారు.
వరవరరావు

వరవరరావు ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తెలుగు కవిగా సుపరిచితులు. ఆయన దాదాపు 15 కవితా సంకలనాలు ప్రచురితం అయ్యాయి. వాటిని చాలా భాషల్లో అనువదించారు కూడా. ఆయన రచనలు, కవితల వల్ల వరవరరావును కొందరు మావోయిస్టు సానుభూతిపరుడుగా కూడా చెబుతారు. ఆయనను దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలున్న వామపక్ష కార్యకర్తగా భావిస్తారు . వరవరరావును ఇంతకు ముందు కూడా చాలాసార్లు అరెస్టు చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య జరిగిన చర్చల్లో కూడా మధ్యవర్తిత్వం చేశారు.
ఈ కేసులో అరెస్టయి రెండేళ్లుగా విచారణ ఖైదీగా ఉన్న విరసం నేత వరవరరావును అనారోగ్యం పాలుకవడంతో.. చికిత్స కోసం 15 రోజుల పాటు నానావతి ఆస్పత్రిలో చేర్పించాలని బాంబే హైకోర్టు నవంబరు 18న ఆదేశించింది. చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా చెప్పింది.
ఆస్పత్రిలో వరవరావును ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రి నియమనిబంధనల మేరకు సందర్శించటానికి కూడా హైకోర్టు అనుమతించింది.
వెర్నన్ గొంజాల్వెజ్

ముంబయిలో నివసించే గొంజాల్వెజ్ మెట్రో సిటీలోని చాలా కాలేజీల్లో బోధించారు. ఆయన గత కొన్నేళ్లుగా ప్రముఖ పత్రికలు-మ్యాగజైన్లకు రాస్తున్నారు. ఆయన్ను 2007లో మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని, పేలుడు పదార్థాలు ఉంచుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన అన్‌లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అంటే యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు. ముంబయిలోని ఒక కోర్టు ఆయనకు యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ కింద దోషిగా ఖరారు చేసింది. ఆరేళ్ల జైలు శిక్ష తర్వాత ఆయనను చాలా ఆరోపణల్లో నిర్దోషిగా తేల్చారు.
అరుణ్ ఫెరీరా

ఫెరీరా ముంబయిలో నివసిస్తున్న మానవ హక్కుల లాయర్. ఆయన మానవ హక్కులకు సంబంధించిన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అరుణ్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ అంటే సీపీఆర్ సభ్యులుగా కూడా ఉన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ లో కూడా ఆయన ఉన్నారు. ముంబయిలోని మురికివాడల్లో నివసించే ప్రజల పునరావాసం కోసం ఫెరీరా ఉద్యమాలు నడిపారు. 2007లో ఆయన్ను పోలీసులు యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు. ఆయనపై మావోయిస్టు అనే ఆరోపణలు మోపారు. 2014లో అరుణ్ అన్ని ఆరోపణల నుంచి విముక్తి పొందారు. తర్వాత జైల్లో తను గడిపిన రోజులపై అరుణ్ ఫెరీరా ఒక పుస్తకం రాశారు. జైలుశిక్ష అనుభవిస్తూనే లా చేశారు.
సుధా భరద్వాజ్

సుధా భరద్వాజ్ ప్రముఖ మానవహక్కుల కార్యకర్త. కార్మిక నేత, లాయర్. చాలా ఏళ్ల వరకూ విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన సుధా భరద్వాజ్ గత మూడు దశాబ్దాలుగా ఆదివాసీ ఆధిపత్య ప్రాంతాల్లో సామాజిక సేవ చేస్తున్నారు. లాయరుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, ఆదివాసీల కేసులు వాదిస్తుంటారు. అందుకే ఆమెను ప్రభుత్వ విరోధిగా, మావోయిస్టు సానుభూతిపరురాలుగా చెబుతున్నారు. సుధా భరద్వాజ్ ప్రముఖ పౌర హక్కుల సంస్థ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సెక్రటరీ కూడా.
ఈ కేసులో అరెస్టైన సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు డిసెంబరు 1న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది.
తాను డిఫాల్ట్ బెయిల్‌కు అర్హురాలినని పేర్కొంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.
బెయిల్ షరతులపై నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేక కోర్టుకు బాంబే హైకోర్టు ఆదేశించింది. అనంతరం డిసెంబరు 8న సుధా భరద్వాజ్‌కు ప్రత్యేక కోర్టు బెయిల్ జారీ చేసింది.
2018లో భీమా కోరేగావ్ కేసులో సుధా భరద్వాజ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పలుమార్లు విచారణకు వచ్చినా కోర్టు పరిగణించలేదు.

పుణె పోలీసులు రచయిత-జర్నలిస్ట్ గౌతమ్ నవలఖా, సామాజిక అంశాల్లో స్కాలర్ ఆనంద్ తెల్తుంబ్డే పేరును 2018 ఆగస్టు 22న మిగతా నిందితులతోపాటూ ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. దానిని వారు కోర్టులో సవాలు చేయడంతో తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటం నడిచింది. పుణె పోలీసులు తర్వాత ఎన్ఐఏ వారి ముందస్తు బెయిల్ దరఖాస్తును సవాలు చేసింది. కానీ ఇద్దరినీ కస్టడీలోకి తీసుకోలేకపోయింది. సుప్రీంకోర్టు ఈ ఇద్దరి అరెస్టుపై స్టే విధించింది. 2019 ఏప్రిల్ 8న కోర్టు నవలఖా, తెల్తుంబ్డే బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. దీంతో ఇద్దరూ ఎన్ఐఏకు లొంగిపోయారు. నవలఖా, తెల్తుంబ్డే ఎన్ఐఏ సమక్షంలో 2019 ఏప్రిల్ 14న లొంగిపోయారు.
వీరిద్దరూ నిషేధిత సీపీఐ మావోయిస్టుల భారీ కుట్రలో భాగం అయ్యారని పోలీసులు ఆరోపణలు చేశారు. వారికి బెయిల్ ఇవ్వకూడదంటూ కోర్టులో ఇదే వాదనలు వినిపించారు. పోలీసుల వివరాల ప్రకారం నవలఖా నిషేధిత సంస్థలో కీలక పాత్ర పోషించేవారు. ప్రజలను చేర్చడం, వారికి డబ్బులు ఇవ్వడం, పథకాలు రచించడంలో ఆయన చురుగ్గా ఉన్నారని, దేశవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లి దేశవ్యతిరేక కార్యకలాపాలు చేసేలా కార్యకర్తలను రెచ్చగొట్టాడని నవలఖా దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువుల ద్వారా తెలిసిందని పోలీసులు అంటున్నారు.
ఆనంద్ తెల్తుంబ్డేపై నిషేధిత సంస్థకు ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సభలు-సెమినార్లలో ఆయన పాల్గొనేవారని, అక్కడ నిషేధిత సంస్థల సిద్ధాంతాలను ప్రచార చేసేవారని పోలీసులు చెబుతున్నారు. మిగతా నిందితుల దగ్గర నుంచి కామ్రేడ్ ఆనంద్ ప్రస్తావన ఉన్న వస్తువులు చాలా దొరికాయని అంటున్నారు. ఆనంద్ తెల్తుంబ్డే పాత్ర చాలా స్పష్యంగా తెలుస్తోందని, ఆయన స్టడీ సర్కిల్ ద్వారా ద్వేషాలు రెచ్చగొట్టేవారని, నిషేధిత సంస్థల నుంచి నిధులు పొందేవారని కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు ఆనంద్ తెల్తుంబ్డేను 2019 ఫిబ్రవరి 1న అరెస్ట్ చేశారు. ఎందుకంటే పుణె సెషన్స్ కోర్ట్ ఆయన బెయిల్ దరఖాస్తు తోసిపుచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఆయన అరెస్టుపై స్టే విధించడంతో ఆ తర్వాత రోజే ఆయన్ను వదిలేయాల్సి వచ్చింది.
గౌతమ్ నవలఖా

గౌతమ్ నవలఖా ఒక ప్రముఖ ఉద్యమకారుడు. ఆయన రచయిత కూడా. దిల్లీలో నివసిస్తున్న గౌతమ్ నవలఖా వామపక్ష, అతివాద ఉద్యమాలపై చాలా రాశారు. ఆయన ప్రభుత్వ అభ్యర్థనపై కిడ్నాపైన పోలీసులను మావోయిస్టుల నుంచి విడిపించడానికి జరిగిన చర్చల్లో మధ్యవర్తి పాత్ర పోషించారు. ఆయన పౌర హక్కుల కార్యకర్తగా కూడా చాలా ఉద్యమాలలో పాలు పంచుకున్నారు.
ఆనంద్ తెల్తుంబ్డే

ఆనంద్ తెల్తుంబ్డే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మేధావి, స్కాలర్, రచయిత కూడా. ఆయన చాలా పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. ఆయన ఇంజనీర్. ఐఐఎం, అహ్మదాబాద్‌లో కూడా చదివారు. ఆయన భారత పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. కానీ ఆయన తర్వాత టీచింగ్ ఎంచుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన చాలా పత్రికలకు పరిమితంగా రాసేవారు. కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్(సీపీడీఆర్) సభ్యులుగా తెల్తుంబ్డే చాలా ఉద్యమాలలో పాల్గొన్నారు.
హనీ బాబు ఎం.టీ

భీమా కోరెగావ్ కేసులో అరెస్టైన వారిలో 12వ వ్యక్తి హనీబాబు. ఆయన దిల్లీ విశ్వవిద్లాయంలో ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్. ఆయన లింగ్విస్టిక్స్ అంటే భాషా విజ్ఞానంలో కూడా చాలా ఆసక్తి ఉండేది. దిల్లీ యూనివర్సిటీ వెబ్‌సైట్ వివరాల ప్రకారం భాషా రాజకీయాల్లో సమాజ శాస్త్రంలో కూడా చాలా ఆసక్తి చూపించేవారు. ఆయనను జులై 28న దిల్లీలో అరెస్ట్ చేశారు. ఆయనపై నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. భీమా కోరెగావ్ హింసలో నిషేధిత సంస్థ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ హనీ బాబు ఎల్గార్ పరిషత్ నిర్వహించివారితో సంబంధాలు ఉన్నాయని, తమ దగ్గర గానిని నిరూపించే ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకున్న కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను విడుదల కోసం చేస్తున్న ప్రచారంలో హనీబాబు కూడా ఉన్నారు. హనీబాబు భార్య కూడా దిల్లీ విశ్వవిద్యాలయం మిరండా హౌస్ కాలేజ్‌లో బోధిస్తున్నారు. హనీ బాబు గురించి తెలిసిన సహచర ప్రొఫెసర్లు ఆయన చాలా పాపులర్ అని, ఆయన లెక్చర్ వినడానికి విద్యార్థులు భారీగా హాజరవుతారని చెప్పారు. హనీ బాబు కులతత్వం, దళితుల సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్నారు.
ప్రభుత్వం మారేకొద్దీ మారుతున్న దర్యాప్తు సంస్థలు
పుణె విశ్రామ్‌బాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన కొన్ని నెలల్లోనే పుణె పోలీసులు 23 మందిలో 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పుణె పోలీసులు ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేశారు. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 21న ఒక అనుబంధ చార్జిషీటు కూడా ఫైల్ చేశారు.
2018 జనవరి 8న ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2018 మే 17న పుణె పోలీసులు అందులో యూఏపీఏ సెక్షన్ 13, 16, 18, 18బి, 20, 38, 39, 40 జోడించారు.
ఎన్ఐఏ కూడా 2020 జనవరి 24న ఎఫ్ఐఆర్ నమోదు చేసంది. అందులో ఐపీసీ సెక్షన్ 153A, 505(1)(B), 117, 34 పెట్టింది. దానితోపాటూ యూఏపీఏ 13, 16, 18, 18B, 20, 39 సెక్షన్లు కూడా జోడించింది.

ఆ సమయంలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఉమ్మడి ప్రభుత్వం ఉండేది. 2019 అక్టోబర్‌లో నాటకీయ ఘటనల తర్వాత అతిపెద్ద పార్టీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చింది. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
2019 డిసెంబర్ 22న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఒక మీడియా సమావేశంలో ఎల్గార్ పరిషత్ కేసులో పుణె పోలీసుల దర్యాప్తు అనుమానాస్పదంగా ఉంది, దేశద్రోహం ఆరోపణలతో కార్యకర్తలను జైల్లో పెట్టడం సరికాదు. ప్రజాస్వామ్యంలో అన్ని రకాల భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది. పుణె పోలీసుల చర్యలు తప్పుడు, ప్రతీకార భావనలకు ప్రేరితం. కొంతమంది అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేశారు" అన్నారు. ఈ ప్రకటన lవివాదాస్పదమైంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పోలీసుల చర్యలు సరైనవేనని అన్నారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే 2020 జనవరిలో కేంద్ర హోం శాఖ ఈ కేసును పుణె పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఏఎన్ఐ)కి అప్పగించాలని ఆదేశించింది. శరద్ పవార్ పార్టీ ఎన్సీపీకి సంబంధించిన మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంచారు, ఇది రాజ్యాంగవిరుద్ధం అన్నారు.
కేసు చేతిలోకి రావడంతో ఎన్ఐఏ ముంబయిలో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో 11 నిందితులు, మరికొందరి పేర్లు ఉన్నాయి. ఎన్ఐఏ ఈ కేసులో భారత చట్టాల్లోని మిగతా సెక్షన్లతోపాటూ యూఏపీఏ కూడా పెట్టింది. ఈ కేసులో ఎన్ఐఏ 124(ఎ) అంటే దేశద్రోహం సెక్షన్లు పెట్టలేదు.
ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవలఖా, హనీ బాబు, సాగర్ గోర్ఖె, రమేశ్ గైచోర్, జ్యోతి జగ్తాప్, స్టాన్ స్వామి, మిలింద్ తేల్తుంబ్దేలపై అభియోగాలు మోపుతూ మొత్తంగా ఎనిమిది మందిపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్ నమోదుచేసిందని ఆల్‌ఇండియా రేడియో 2020 అక్టోబర్ 9వ తేదీన వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.
భీమా కోరెగావ్ న్యాయ విచారణ కమిషన్
జనవరి 1న భీమా కోరెగావ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెలరేగిన హింస తర్వాత దేశవ్యాప్తంగా దానిపై వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. విషయం వేడెక్కడంతో హింస ఎలా మొదలైంది అనేది దర్యాప్తు కోసం ఒక న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎన్నో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వేరు వేరు వ్యక్తులను బాధ్యులుగా చెప్పాయి. ఈలోపు రూరల్ పోలీస్, పుణె సిటీ పోలీసులు రెండు వేరు వేరు దిశల్లో దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర అప్పటి దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 9న హింసపై దర్యాప్తునకు ఇద్దరు సభ్యుల జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. కోల్‌కతా హైకోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ జేఎన్ పటేల్ ఈ కమిటీకి అధ్యక్షుడుగా ఉన్నారు.

ఈ కమిటీ నాలుగు నెలల్లో తన రిపోర్ట్ అందించాలి. కానీ ఇప్పటివరకూ నాలుగు సార్లు ఈ కమిటీ పదవీకాలాన్ని పెంచారు. ఫైనల్ రిపోర్టు ఇంకా రాలేదు. నాలుగోసారి దీని పదవీకాలాన్ని 2020 ఏప్రిల్ 4 వరకూ పెంచారు. కానీ, కరోనా వల్ల లాక్‌డౌన్ మొదలయ్యింది. రెండున్నరేళ్ల క్రితం నాలుగు నెలల్లోనే తన రిపోర్ట్ సమర్పించాల్సిన ఆ కమిటీ ఇప్పుడు దానికి ఆరు నెలల సమయం పొడిగించాలని కోరింది.
ఇప్పటివరకూ 29 మంది సాక్ష్యులు కమిటీకి తమ వాంగ్మూలం ఇచ్చారు. కమిటీ ఎదుట హాజరవ్వాలని మరో 50 మంది సాక్ష్యులు సమన్లు పంపిస్తారని భావిస్తున్నారు. కమిటీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌ను కూడా సాక్షిగా పిలిపించింది. ఇంతకు ముందు పవార్ కమిటీకి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. దీనితోపాటూ కమిటీకి దాదాపు 500 అఫిడవిట్లు అందాయి. వాటిని చాలామంది, ప్రభుత్వ అధికారులు, సంస్థలు దాఖలు చేశాయి.
హిందుత్వ కార్యకర్తలు
పుణె సిటీ పోలీసులు ఒకవైపు భీమా కోరెగావ్ హింస వెనుక వామపక్ష కార్యకర్తల హస్తం ఉందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తుంటే, మరోవైపు రూరల్ పోలీసులు మాత్రం 2018 జనవరి 1న జరిగిన హింస వెనుక చాలా మంది హిందుత్వ నేతల పాత్ర ఉందనే ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నారు.
హిందుత్వ నేతలు భీమా కోరెగావ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాలను హింసకు రెచ్చగొట్టారని జనవరి 2న పింప్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మిలింద్ ఏక్బోటే, శంభాజీ భిడే అనే హిందుత్వ నేతలు జనాలకు నాయకత్వం వహించారని, జనవరి 1న దళిత సంస్థల కార్యక్రమంలో వారు హింసను సృష్టించారని అనితా సాల్వే ఫిర్యాదు చేశారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన మహిళ ఘటనాస్థలంలో తాను ఉన్నానని చెప్పారు. ఇద్దరు నిందితులను తను కళ్లారా చూశానని ఆమె చెప్పారు. శౌర్య దినోత్సవంలో పాల్గొనేందుకు తన స్నేహితురాలు అంజనతో కలిసి తను అక్కడికి వెళ్లానని ఆమె చెప్పారు. అప్పుడు తన ఫ్రెండ్ షికర్‌పూర్ టోల్ ప్లాజా దాటి సనాసవాడీ చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న జనం రాళ్లు రువ్వడం, నిప్పు పెట్టడం ప్రారంభించారని తెలిపారు.

ఎఫ్ఐఆర్‌లో వారిలో చాలా మంది దగ్గర ఆయుధాలు ఉన్నాయని, వారు జనాలను కొడుతున్నారని చెప్పారు. శంభాజీ భిడేను శివాజీనగర్ ఫౌండేషన్ అధ్యక్షుడుగా, మిలింద్ ఏక్బోటేను హిందూ జనజాగరణ్ సమితి చీఫ్ అని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు. వారితోపాటూ ఉన్నత వర్గాల వారు ఉన్నట్లు చెబుతున్నారు. సెషన్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్ మిలింద్ ఏక్బోటే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, పుణె పోలీసులు ఆయన్ను 2018 మార్చి 14న అరెస్ట్ చేశారు. ఏక్బోటేపై అల్లర్లు, హింసకు పాల్పడడంతో పాటూ చాలా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పుణె కోర్ట్ 2018 ఏప్రిల్ 4న అనితా సాల్వే ఫిర్యాదుతో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది. కానీ షికార్‌పూర్ పోలీసుల ఒక ఫిర్యాదుతో ఆయన్ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. హింస జరగడానికి ముందు ఏక్బోటే తన మద్దతుదారులకు కొన్ని పాంప్లెట్లు పంచారని షికార్‌పూర్ పోలీసులు చెబుతున్నారు.

ఏప్రిల్ 19న పుణె సెషన్స్ కోర్ట్ ఆయనకు బెయిల్ ఇచ్చింది. మరో నిందితుడు శంభాజీ భిడే 2018 జనవరి 1న భీమా కోరెగావ్‌లో ఉండి, ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చినా ఆయన్ను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదు. చాలా సంస్థలు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. న్యాయస్థానం తలుపు కూడా తట్టాయి. ఆ కేసులో పోలీసులు ఇప్పటివరకూ చార్జిషీటు కూడా ఫైల్ చేయలేదు. పైన ప్రస్తావించిన రెండు ఎఫ్ఐఆర్‌లతో పాటూ భీమా కోరెగావ్ హింసపై పుణె పోలీసుల అధికార పరిధిలో మొత్తం 30 కేసులు నమోదై ఉన్నాయి.
ఏక్బోటే, భిడే ఎవరు
పుణె హిందుత్వవాద కార్యకర్త మిలింద్ ఏక్బోటే తన భావజాలం వల్ల చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన సమస్త హిందూ అగాఢీ పేరుతో ఒక సంస్థను నడుపుతున్నారు. ఆయన చాలాకాలం నుంచీ గోరక్షా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రతాప్‌గఢ్ కోటలో ఉన్న మొఘల్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ సమాధిని తొలగించాలని తీవ్ర ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత నుంచి సతారా జిల్లాలోక రాకుండా ఆయనపై నిషేధం విధించారు.
ఆయన వేలైంటైన్స్ డే జరుపుకోవడంపై వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఆయన రాజకీయంగా కూడా చురుగ్గా ఉంటారు. హిందూ మహాసభ, శివసేన, బీజేపీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. 85 ఏళ్ల ఈ హిందుత్వ కార్యకర్త పశ్చిమ మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతానికి చెందినవారు.
ఆయన శివప్రతిష్ఠాన్ హిందుస్థాన్ పేరుతో ఒక సంస్థ నడుపుతున్నారు. ఆయన హిందుత్వ గురించి మాట్లాడ్డానికి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆయన మొదట్లో రాష్ట్రీయ స్వయం సేవక్‌లో ఉండేవారు. కానీ తర్వాత శివప్రతిష్ఠాన్ స్థాపించడానికి ఆర్ఎస్ఎస్‌తో విడిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మిగతా నేతలతో ఆయన సాన్నిహిత్యం అందరికీ తెలిసిన విషయమే.
భిడే తన ప్రకటనలతో, తన కార్యకలాపాలతో వివాదాల్లో ఉంటూ వచ్చారు. 2008వో 2009లో ఆయనపై ఎన్నో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వాటిలో సాంగ్లీలో అల్లర్లు రెచ్చగొట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ భీమా కోరెగావ్ ఘటనకు ఆరు నెలల ముందే ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలూ తొలగించినట్లు ఒకసారి ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
రిపోర్టర్:,మయూరేశ్ కొన్నూర్
ఇల్లస్ట్రేషన్స్: పునీత్బర్నాల, గోపాల్ శూన్య
ఇమేజెస్: గెట్టీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజేశ్ ప్రియదర్శి
ప్రొడక్షన్: షాదాబ్నజ్మీ
ఇవి కూడా చదవండి:
- లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్... అదనపు భారం వేయలేదంటున్న ప్రభుత్వం
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














