వరవరరావు: భీమా కోరేగావ్ కేసు ఎక్కడిదాక వచ్చింది?

వరవరరావు

ఫొటో సోర్స్, Facebook/Bhasker Koorapati

మావోయిస్టులతో కలిసి ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే అభియోగాలతో విరసం (విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి దాదాపు అయిదు నెలలు అవుతోంది.

మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవర రావుతో పాటు, మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లను పుణే పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు.

అయితే, తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో కొన్నాళ్ల పాటు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం గౌతమ్ నవలాఖాకు నిర్బంధం నుంచి కోర్టు విముక్తి కల్పించగా, నవంబర్‌‌లో మిగతా నలుగురిని పోలీసులు మళ్లీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఫిబ్రవరిలో దళిత ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్తుంబ్డేను కూడా పోలీసులు అరెస్టు చేయగా, ఆ అరెస్టు అక్రమం అంటూ ఆయన్ను పుణె కోర్టు విడుదల చేసింది.

మావోయిస్టులతో వారికి సంబంధాలున్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు దొరికినందునే వారిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్రేనని, ప్రశ్నించే గొంతును నొక్కడమేనని ఆరోపించాయి.

మరోవైపు, ఈ కేసు విచారణను కొనసాగిస్తూనే తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఇటీవల వరవర రావు భార్య హేమలత భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

వరవరరావు అరెస్ట్

ఫొటో సోర్స్, virasam

''ఆయన వయసు 79 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనను అబద్ధపు కేసులో జైలు పాలు చేశారు. న్యాయ విచారణా క్రమపు విధివిధానాలను నేను ఎంతమాత్రమూ ప్రశ్నించడం లేదు. న్యాయ విచారణ యథాతథంగా కొనసాగనివ్వండి. కానీ, ఎలాంటి నేరచరిత్ర లేని వృద్ధుడిని, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని మరొక దఫా జైలు నిర్బంధానికీ, వేధింపులకూ గురి చేయడం సబబు కాదని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను'' అని ఆమె తన లేఖలో రాశారు.

''వరవరరావును భీమా కోరేగాం హింసాకాండ కేసులో ఒక నిందితునిగా చూపారు. ఆ కేసును ఆ తర్వాత ఒక నేరపూరిత కుట్ర కేసుగా, ఆ తర్వాత చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం వర్తించే కేసుగా మారుస్తూ వచ్చారు.

భీమా కోరేగాం హింసాకాండకు నిజంగా కారకులైన వారి మీద ఇప్పటి వరకూ ఏ చర్యలూ లేకపోగా, దానితో ఎటువంటి సంబంధం లేని వరవరరావు, తదితరుల మీద ఆ కేసు బనాయించారు. నా భర్తను ఆ కేసులో ఇరికించడం కేవలం ఆయన స్వరం బైట వినిపించకుండా చేయడానికేనని నాకు అనుమానంగా ఉంది'' అని హేమలత అన్నారు.

"ఈ కేసు వెనుక ఉన్న దురుద్దేశాలనూ, కేసు తయారుచేసిన అక్రమ పద్ధతినీ పరిశీలించవలసిందిగా, న్యాయ విచారణను ఆపకుండానే వరవరరావును మానవతా దృష్టితో తక్షణమే విడుదల చేయమని ఆదేశించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను'' అని ప్రధాన న్యాయమూర్తిని కోరారు.

వరవరరావు విడుదల కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి హేమలత రాసిన బహిరంగ లేఖకు పలువురు మేధావులు మద్దతు తెలిపారు

ఫొటో సోర్స్, virasam

ఫొటో క్యాప్షన్, వరవరరావు విడుదల కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి హేమలత రాసిన బహిరంగ లేఖకు పలువురు మేధావులు మద్దతు తెలిపారు

ఈ కేసుకు సంబంధించి.. పుణెకు చెందిన దర్యాప్తు అధికారి శివాజీ పవార్ గురువారం బీబీసీతో మాట్లాడారు.

చార్జిషీట్ దాఖలు చేశామని, ప్రస్తుతం వరవరరావు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు.

మార్చి 25న ఆయన బెయిల్ అప్లికేషన్ అందిందని.. అది ప్రాసెస్‌లో ఉందన్నారు.

వరవరరావు, హేమలత

ఫొటో సోర్స్, Facebook/Kranthi Tekula

అసలేం జరిగింది? అభియోగాలు ఏంటి?

మహారాష్ట్రలోని బీమా కోరెగావ్ వద్ద గతేడాది జనవరిలో అల్లర్లు జరిగాయి. హింస చెలరేగింది. ఎల్గార్ పరిషత్ పేరుతో దళిత మేధావులు, వామపక్ష కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారంటూ పోలీసులు ఐదుగురు కార్యకర్తలను 2018 జూన్‌లో అరెస్టు చేశారు.

దళిత సైనికులు బ్రిటీషర్లతో కలిసి పీష్వారాజుల సైన్యంపై పోరాడి విజయం సాధించిన ఘట్టానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఎల్గార్ పరిషత్ పేరుతో కొందరు దళిత, వామపక్ష కార్యకర్తలు ఆ కార్యక్రమం నిర్వహించారు.

ఆ తర్వాత చెలరేగిన హింసకు కారకులంటూ హక్కుల కార్యకర్తలు రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, సుధీంధ్ర గాండ్లింగ్, ప్రొఫెసర్ షోమాసేన్, మహేశ్ రౌత్ లను అరెస్ట్ చేశారు.

దిల్లీ కేంద్రంగా పనిచేసే రోనా విల్సన్ దగ్గర మావోయిస్టులు రాసిన లేఖ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్రపన్నారని.. ఆ వివరాలు ఈ లేఖలో ఉన్నాయని వెల్లడించారు.

వారందరికీ మావోయిస్టులతో సంబంధాలున్నాయిని పేర్కొన్నారు. మావోయిస్టులు రాసినట్టుగా చెపుతున్న ఒక లేఖను వారు ఆధారంగా చూపించారు.

రాజీవ్ గాంధీ తరహాలో మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు ఆ లేఖలో ఉందని, వరవరరావు ఆ కుట్రకు ఆర్థిక సాయం చేస్తారని ఆ లేఖలో పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లకు కూడా ఆ కుట్రతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే, ఆ లేఖ పోలీసుల కల్పితమని వరవరరావు ఆరోపించారు. అనేక హక్కుల సంఘాలు, రచయితల సంఘాలతో పాటు సంజయ్ నిరుపమ్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఉత్తరం కల్పితమని విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)