కరణ్ థాపర్‌పై నరేంద్ర మోదీ పాత ‘పగ’ తీర్చుకుంటున్నారా?

2007లో ప్రముఖ పాత్రికేయులు కరణ్ థాపర్‌కు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయింది. మోదీ ఆ ఇంటర్వ్యూలో జవాబులు చెప్పకుండా మధ్యలోనే లేచి వెళ్లిపోవడమే దానికి కారణం.
బీబీసీ ప్రతినిధి రేహాన్ ఫజల్ ఆయనతో మాట్లాడి అసలు ఆ ఇంటర్వ్యూ రోజున ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా థాపర్.. ఆ రోజు తాను అడిగిన ఓ ప్రశ్నకు మోదీ ఎంతలా ఇబ్బంది పడి ఇంటర్వ్యూ మధ్యలో నుంచి వెళ్లిపోయారో వివరించారు. ఇప్పుడు థాపర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వొద్దని మోదీ తన మంత్రులు, పార్టీ నేతలకు కూడా ఎందుకు చెబుతారో వంటి పలు విషయాలను ఆయన వెల్లడించారు.
మోదీ తన ప్రశ్నలకు ఎప్పుడూ కోప్పడలేదనీ, కానీ దాటవేసే జవాబులు ఇచ్చేవారనీ కరణ్ చెప్పారు. ఆ రోజున కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఇంటర్వ్యూ జరిగిందని, వెంటనే మోదీ లేచి వెళ్లిపోయారని గుర్తుచేసుకున్నారు.
‘‘నాకు గుర్తున్నంత వరకూ నేను మోదీని అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే.. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా రెండోసారి జరిగే ఎన్నికలకు కేవలం ఆరు వారాలే గడువుంది. ఇండియా టుడే, రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లు మిమ్మల్ని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా గుర్తించాయి. కానీ వేలాది ముస్లింలు మిమ్మల్నో హంతకుడిగా చూస్తున్నారు. ఇప్పుడు మీ ముందు ఏదైనా ఇమేజ్ ప్రాబ్లం ఉందా?’ అని. దానికి మోదీ జవాబిస్తూ.. చాలా కొద్ది మందే తనని అలా చూస్తారనీ, ఎక్కువ శాతం మంది ఆ దృష్టితో చూడరనీ చెప్పారు.’’ అని కరణ్ వివరించారు.
థాపర్ మళ్లీ ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ, మోదీని ఆ దృష్టితో చూసే వారి సంఖ్య మరీ తక్కువేం కాదని అన్నారు. ‘సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మిమ్మల్ని ఆధునిక నీరోగా అభివర్ణించారు. చిన్నపిల్లలు, అమాయక మహిళల హత్యలు జరుగుతున్నప్పుడు ముఖాన్ని పక్కకు తిప్పుకున్న వ్యక్తిగా పేర్కొన్నారు కదా’ అని థాపర్ అన్నారు.

గుజరాత్‌లో నమోదైన 4500 కేసుల్లో 2600 కేసులను గుజరాత్ నుంచి బయటకు పంపించారని కూడా థాపర్ మోదీకి గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఇంకా అనేక విషయాలు ప్రస్తావించిందనీ, దీన్ని బట్టి చూస్తే మోదీని ఆ దృష్టితో చూసేవారి సంఖ్య మరీ తక్కువేం కాదని థాపర్ మరోసారి చెప్పారు.
దానికి మోదీ బదులిస్తూ, తనను హంతకుడిగా భావించేవారు కూడా సంతోషంగా ఉండాలని అన్నారు. ఆ తరవాత ఆయన థాపర్‌ను మంచినీళ్లు అడిగారు.
‘మంచినీళ్లు మోదీ పక్కనే ఉన్నాయి. మంచినీళ్లు కేవలం ఒక సాకేనని, మోదీ ఇంటర్వ్యూను ముగించాలని అనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఆ వెంటనే ఆయన మైక్ తీసేసి ఇంటర్వ్యూను ముగించేశారు’ అని థాపర్ గుర్తుచేశారు.
ఇంటర్వ్యూను మళ్లీ ప్రారంభించడానికి మోదీని ఒప్పించే ప్రయత్నం చేశాననీ, కానీ ఆయన దానికి అంగీకరించలేదనీ థాపర్ చెప్పారు.
‘ఇంటర్వ్యూ ఆపేశాక కూడా మోదీ నాతో బానే మాట్లాడారు. టీ, స్వీట్లు లాంటివి తెప్పించారు. కానీ ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వలేదు. దాదాపు గంటసేపు ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేశా. అయినా కుదరకపోవడంతో అక్కడి నుంచి వచ్చేశా’ అని థాపర్ అన్నారు.

మోదీకి 30సార్లు ఆ వీడియోను చూపించిన ప్రశాంత్
2014 ఎన్నికలకు మోదీ సన్నద్ధమయ్యే సమయంలో.. ఆ పాత ఇంటర్వ్యూను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మోదీకి కనీసం 20-30 సార్లు చూపించినట్లు తెలిసిందని థాపర్ చెప్పారు.
‘‘ప్రశాంత్ కిశోర్ మోదీకి ఆ వీడియోను కనీసం 20-30సార్లు చూపించారని, దాని ద్వారా క్లిష్టమైన సమయాల్లో నేర్పుగా వ్యవహరించి ఆ ప్రశ్నలను ఎదుర్కోవడం ఎలాగో మోదీకి నేర్పే ప్రయత్నం చేశారని నా మిత్రుడు, రాజకీయ నేత పవన్ వర్మ చెప్పారు. ప్రశాంత్ దీన్నో పాఠంగా ఉపయోగించాలని అనుకున్నారు. కానీ మోదీ దానికి జవాబిస్తూ.. ‘దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దీనికి బదులు తీర్చుకుంటాను’ అని అన్నారు’’ అంటూ కరణ్ వివరించారు.
అందుకే 2016 తరవాత బీజేపీకి చెందిన నేతలెవ్వరూ కరణ్ థాపర్‌తో మాట్లాడట్లేదని చాలామంది భావన. దీనిపై థాపర్ స్పందిస్తూ 2016 మధ్యలో నుంచి తనను బహిష్కరించడం మొదలుపెట్టారని చెప్పారు.

‘నేను చివరిగా 2017 జనవరిలో బీజేపీ నేత రామ్ మాధవ్ ఇంటర్వ్యూ తీసుకున్నా. నాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు కొందరు భాజపా మంత్రులు, నేతలు నాతో చెప్పారు. ఈ విషయాన్ని నేను నా పుస్తకంలో కూడా రాశాను’ అని థాపర్ అన్నారు.
‘అమిత్ షా, నృపేంద్ర మిశ్రా లాంటి చాలామంది భాజపా దిగ్గజాలను నేను కలిశా. కానీ నేను పక్షపాత ధోరణితో వ్యవహరిస్తానని, నన్ను కలవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని మోదీ వాళ్లతో అన్నారట’ అని థాపర్ చెప్పారు.
కానీ తాను పక్షపాత ధోరణితో ఉంటానన్న మాటల్ని థాపర్ ఒప్పుకోవట్లేదు. ఓ ప్రధాన మంత్రి ఏ పాత్రికేయుడినైనా బహిష్కరించడం సరికాదని ఆయన అంటున్నారు.
కరణ్ థాపర్ రచించిన తాజా పుస్తకం ‘డెవిల్స్ అడ్వకేట్: ది అన్టోల్డ్ స్టోరీ’ ఇటీవలే విడుదలైంది.
ఇవి కూడా చదవండి
- ఇక్కడ పచ్చళ్లు అంటూ పార్సిల్ చేతిలో పెడతారు.. అక్కడ విమానం దిగగానే జైల్లో పెడతారు!
- ‘తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి’ కానీ..
- ఇమ్రాన్ ఖాన్: పాకిస్తాన్ కొత్త ‘కెప్టెన్’ ఈయనేనా
- బైక్ అంబులెన్స్: రాదారిలేని కొండ కోనల్లో ఆపద్బంధువు
- హైపర్‌లూప్: గంటకు 457 కి.మీ. రికార్డు వేగంతో ప్రయాణం
- బిహార్: 'సంరక్షణ గృహంలో 29 మంది బాలికలపై అత్యాచారం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








